Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 5-6

సంగీత నాయకునికి: పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన

యెహోవా, నా మాటలు ఆలకించుము.
    నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నదాన్ని వినుము.
నా రాజా, నా దేవా
    నా ప్రార్థన ఆలకించుము.
యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను.
    సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను.
మరి నీవు నా ప్రార్థనలు వింటావు.

యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడవు,
    చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.
గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు.
    ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.
అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
    ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.

యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు.
    యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.
యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు.
    కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము.
నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో
    అది నాకు తేటగా చూపించుము.
ఆ మనుష్యులు సత్యం చెప్పరు.
    వాళ్లు జనాన్ని నాశనం చేయకోరుతారు.
వారి నోళ్ళు ఖాళీ సమాధుల్లా ఉన్నాయి.
    ఆ మనుష్యులు ఇతరులకు చక్కని మాటలు చెబుతారు. కాని వాళ్లను చిక్కుల్లో పెట్టుటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు.
10 దేవా! వారిని శిక్షించుము.
    వారి ఉచ్చులలో వారినే పట్టుబడనిమ్ము.
ఆ మనుష్యులు నీకు విరోధంగా తిరిగారు
    కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము.
11 అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము.
    ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము.
12 యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే
    అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.

సంగీత నాయకునికి: అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన

యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.
    కోపగించి నన్ను శిక్షించవద్దు.
యెహోవా, నా మీద దయ ఉంచుము.
    నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
    నా శరీరం మొత్తం వణకుతోంది.
యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.
    నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.
    సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.

యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను.
    నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది.
నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి.
    నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.
    ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది.
    ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి.

చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!
    ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.

10 నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు.
    వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.

కీర్తనలు. 10-11

10 యెహోవా, నీవెందుకు అంత దూరంగా ఉంటావు?
    కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు.
గర్విష్ఠులు, దుష్టులు వారి దుష్ట పథకాలు వేస్తారు.
    మరియు పేద ప్రజలను వారు బాధిస్తారు.
దుష్టులు వారికి కావలసిన వాటిని గూర్చి అతిశయపడతారు.
    లోభులు యెహోవాను దూషిస్తారు. ఈ విధంగా దుష్టులు యెహోవాను ద్వేషిస్తున్నట్టు వ్యక్తం చేస్తారు.
ఆ దుర్మార్గులు చాలా గర్విష్ఠులు కనుక దేవున్ని అనుసరించరు.
    వాళ్లు తమ పాపిష్టి పథకాలన్నీ తయారు చేస్తారు. పైగా దేవుడే లేడు అన్నట్టు వారు ప్రవర్తిస్తారు.
ఆ దుర్మార్గులు ఎల్లప్పుడూ వంకర పనులే చేస్తుంటారు.
    కనీసం నీ చట్టాలను, వివేకవంతమైన నీ ఉపదేశాలను కూడా వారు పట్టించుకోరు.
    దేవుని శత్రువులు ఆయన బోధనలను నిర్లక్ష్యం చేస్తారు.
వాళ్లకు కీడు ఎన్నటికీ జరగదని ఆ మనుష్యులు తలుస్తారు.
    “మాకు ఎన్నడూ కష్ట సమయాలు ఉండవు” అని వారు అంటారు.
ఆ మనుష్యులు ఎల్లప్పుడూ దూషిస్తారు. ఇతరుల విషయంలో వారు ఎల్లప్పుడూ చెడు సంగతులే చెబుతారు.
    దుష్టకార్యాలు చేసేందుకే వారు ఎల్లప్పుడూ పథకం వేస్తుంటారు.
ఆ మనుష్యులు రహస్య స్థలాల్లో దాగుకొని ప్రజలను పట్టుకొనేందుకు కనిపెడతారు.
    ప్రజలను బాధించుటకు వారికోసం చూస్తూ దాగుకుంటారు.
    నిర్దోషులను వారు చంపుతారు.
తినవలసిన జంతువులను పట్టుకోవటానికి ప్రయత్నించే సింహాలవలె వారుంటారు.
    ఆ దుర్మార్గులు, పేదల మీద దాడిచేస్తారు. దుష్టులు వేసే ఉచ్చులలో పేదలు చిక్కుకొంటారు.
10 పేదలను, బాధపడేవారిని,
    ఆ దుష్టులు మరల, మరల బాధిస్తారు.
11 అందుచేత ఆ పేదలు ఈ సంగతులను ఇలా ఆలోచించటం మొదలు పెడ్తారు: “దేవుడు మమ్ముల్ని మరచిపోయాడు!
    దేవుడు మానుండి శాశ్వతంగా విముఖుడయ్యాడు!
    మాకు ఏమి జరుగుతుందో దేవుడు చూడటం లేదు!”

12 యెహోవా, లేచి ఏదైనా చేయుము!
    దేవా, దుష్టులను శిక్షించుము!
    పేదలను మాత్రం మరువకుము!

13 దుష్టులు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు?
    ఎందుకంటే దేవుడు వారిని శిక్షించడు అనుకొంటారు గనుక.
14 యెహోవా, దుర్మార్గులు చేసే కృ-రమైన చెడ్డ సంగతులను నీవు నిజంగా చూస్తున్నావు.
    నీవు వాటిని చూచి వాటి విషయమై ఏదో ఒకటి చేయుము.
ఎన్నో కష్టాలతో ప్రజలు నీ దగ్గరకు సహాయం కోసం వస్తారు.
    యెహోవా, తల్లి దండ్రులు లేని పిల్లలకు సహాయం చేసే వాడివి నీవే. కనుక వారికి సహాయం చేయుము.

15 యెహోవా, దుర్మార్గులను నాశనం చేయుము.
16 యెహోవా నిరంతరం రాజైయున్నాడు.
    ఆ ప్రజలు ఆయన దేశంలోనుండి నశించెదరు గాక!
17 యెహోవా, పేదలు కోరుకొనే వాటిని గూర్చి నీవు విన్నావు.
    నీవు వారిని ప్రోత్సాహ పరచెదవు. వారి ప్రార్థనలు ఆలకించెదవు.
18 యెహోవా, అనాథ పిల్లలను కాపాడుము. దుఃఖంలో ఉన్న వారిని ఇంకా ఎక్కువ కష్టాలు పడనీయకుము.
    దుర్మార్గులు ఇక్కడ ఉండకుండుటకు చాలా భయపడేటట్టుగా చేయుము.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

11 నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు?
    “పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు!

వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు.
    వారి బాణాలను వారు గురి చూస్తారు.
    మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు.
నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది?
    అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు?

యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు.
    యెహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు.
మరియు జరిగే ప్రతీది యెహోవా చూస్తున్నాడు.
    మనుష్యులు మంచివాళ్లో, చెడ్డవాళ్లో చూసేందుకు యెహోవా కళ్లు ప్రజలను నిశితంగా చూస్తాయి.
యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు.
    కృ-రమైన ఆ మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు.
    ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే.
అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు.
    మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.

సంఖ్యాకాండము 35:1-3

లేవీ వారి పట్టణాలు

35 యెహోవా మోషేతో ఇలా మాట్లాడాడు: ఇది మోయాబులో యొర్దాను లోయలో, యొర్దాను నది దగ్గర, యెరికో అవతల జరిగింది. యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలు వారి భాగంలోనుంచి కొన్ని పట్టణాలను లేవీ వారికి ఇవ్వవలెనని వారితో చెప్పుము. ఆ పట్టణాలను, వాటి చుట్టూ ఉండే పచ్చిక బయళ్లను ఇశ్రాయేలు ప్రజలు లేవీ వారికి ఇవ్వవలెను. లేవీయులు ఆ పట్టణాల్లో నివసించగలుగుతారు. వారి పశువులు, వారికి ఉన్న జంతువులు అన్నీ ఆ పట్టణాల చుట్టూ ఉండే పచ్చిక బయళ్లలో మేత మేయగలుగుతాయి.

సంఖ్యాకాండము 35:9-15

తర్వాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 10 “ప్రజలతో ఈ సంగతులు చెప్పుము. మీరు యొర్దాను నది దాటి కనాను దేశంలో ప్రవేశిస్తారు. 11 ఆశ్రయ పురాలుగా పట్టణాలను మీరు ఏర్పాటుచేయాలి. ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ మరో వ్యక్తిని చంపేస్తే, అప్పుడు అతడు భద్రత కోసం ఆ పట్టణాల్లో ఒకదానికి పారిపోవచ్చును. 12 చనిపోయిన మనిషి కుటుంబంనుండి, దెబ్బకు దెబ్బతీయాలని చూచే వారి బారినుండి అతడు క్షేమంగా ఉంటాడు. అతనికి న్యాయస్థానంలో తీర్పు జరిగేంతవరకు అతడు క్షేమంగా ఉంటాడు. 13 ఆశ్రయపురాలు ఆరు ఉంటాయి. 14 ఆ పట్టణాల్లో మూడు యొర్దాను నదికి తూర్పువైపున ఉంటాయి. ఆ పట్టణాల్లో మూడు యొర్దాను నదికి పశ్చిమాన కనాను దేశంలో ఉంటాయి. 15 ఇశ్రాయేలు పౌరులకు, విదేశీయులకు, యాత్రికులకు ఆ పట్టణాలు క్షేమమైన స్థలాలుగా ఉంటాయి. వారిలో ఎవరైనా సరే మరొకర్ని ప్రమాదవశాత్తూ చంపేస్తే వారు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోగలుగుతారు.

సంఖ్యాకాండము 35:30-34

30 “సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే హంతకుడు హంతకునిగా చంపబడాలి. ఒకే ఒక్క సాక్షి ఉంటే ఏ వ్యక్తినీ చంపకూడదు.

31 “ఒక్క వ్యక్తి హంతకుడైతే, అతడ్ని చంపి వేయాలి. డబ్బు తీసుకుని ఈ శిక్షను మార్చవద్దు. ఆ హంతకుడు తప్పక చంపబడాలి.

32 “ఒక వ్యక్తి మరొకర్ని చంపి, ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోతే, వాడిని ఇంటికి పోనిచ్చేందుకు డబ్బు తీసుకోవద్దు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ పట్టణంలోనే ఉండాలి.

33 “నిరపరాధుల రక్తంతో మీ దేశాన్ని నాశనం కానివ్వవద్దు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేస్తే, ఆ నేరానికి ఒకే శిక్ష. అది ఆ హంతకుడు చంపబడటమే. ఆ నేరంనుండి దేశాన్ని మరే శిక్షకూడ విమోచించదు. 34 నేనే యెహోవాను. నేను మీ దేశంలో ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తాను. ఆ దేశంలో నేను నివసిస్తాను గనుక నిర్దోషుల రక్తంతో దానిని పాడు చేయవద్దు.”

రోమీయులకు 8:31-39

క్రీస్తు యేసులో దేవుని ప్రేమ

31 మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? 32 మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? 33 దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. 34 ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా? 36 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము,
    మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.”(A)

37 ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. 38 చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని 39 ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.

మత్తయి 23:13-26

13 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్షతప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశించక పోవటమేకాకుండా, ప్రవేశించటానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతున్నారు. 14 [a]

15 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు, మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల ఇళ్లు దోస్తారు. ఇతర్లు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు.

16 “గ్రుడ్డి మార్గదర్శకులారా! మీకు శిక్ష తప్పదు. దేవాలంయపై ఒట్టు పెట్టుకొంటే నష్టం లేదుకాని, ‘దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 17 మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా?

18 “అంతేకాక, ‘బలిపీఠంపై ఒట్టుపెట్టుకొంటే నష్టంలేదు కాని, దాని మీదనున్న కానుకపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 19 అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? 20 అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకొంటే, దానిపై ఉన్న వాటి మీద కూడా ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 21 అదే విధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకొంటే, దాని మీద, అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 22 అదే విధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకొంటే అక్కడున్న సింహాసనం మీదా, ఆ సింహాసనంపై కూర్చొన్న వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్టే గదా!

23 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది. 24 గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు.

25 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి. 26 పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International