Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 1-4

మొదటి భాగం

(కీర్తనలు 1–41)

ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
    అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
    అతడు పాపులవలె జీవించనప్పుడు,
    దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
    ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
    సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
    అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.

అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
    వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
    ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
    చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.

యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?
    ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?
యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,
    వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.
“దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.
    మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.

కాని నా ప్రభువు, పరలోకంలో ఉన్న రాజు
    ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు:
    “రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను.
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.”
    మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.

యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను!
    మరియు నీవు నా కుమారుడివి.
నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.
    భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!
ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు
    ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”

10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.
    పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి[a]
    మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు.
యెహోవాయందు విశ్వాసం ఉంచేవారు సంతోషిస్తారు.
    కాని ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన

యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు
    అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు.
చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.

అయితే, యెహోవా, నీవు నాకు కేడెము.
    నీవే నా అతిశయం.
    యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా[b] చేస్తావు.
యెహోవాకు నేను ప్రార్థిస్తాను.
    ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు!

నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును.
    ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!
వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును.
    కాని ఆ శత్రువులకు నేను భయపడను.

యెహోవా, లెమ్ము[c]
    నా దేవా, వచ్చి నన్ను రక్షించుము!
నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి,
    వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు.

యెహోవా తన ప్రజలను రక్షించగలడు.
    యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.

సంగీత నాయకునికి: తంతి వాద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.

నా మంచి దేవా, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇమ్ము.
    నా ప్రార్థన ఆలకించి, నా యెడల దయ చూపించుము!
    ఎప్పుడైనా నాకు కష్టాలు వస్తే, వాటిని తొలగించుము.[d]

ప్రజలారా, ఎన్నాళ్లు మీరు నన్నుగూర్చి చెడ్డమాటలు చెబుతారు?
    ప్రజలారా, మీరు నన్ను గూర్చి చెప్పుటకు కొత్త అబద్ధాలకోసం చూస్తూనే ఉంటారు. అలాంటి అబద్ధాలు చెప్పటం అంటే మీకు ఇష్టం.

యెహోవా తన మంచి ప్రజల మొర వింటాడని మీకు తెలుసు.
    నేను యెహోవాను ప్రార్థించినప్పుడు, ఆయన నా ప్రార్థన వింటాడు.
మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు కోప్పడవచ్చు.
    కాని పాపం చేయవద్దు. మీరు పడకకు వెళ్లినప్పుడు ఆ విషయాలను గూర్చి ఆలోచించండి, అప్పుడు విశ్రాంతి తీసుకోండి.
దేవునికి మంచి బలులు అర్పించండి.
    మరి యెహోవాయందు విశ్వాసం ఉంచండి.

“దేవుని మంచితనాన్ని మనకు ఎవరు చూపిస్తారు?
    యెహోవా! ప్రకాశించే నీ ముఖాన్ని మమ్ముల్ని చూడనిమ్ము.” అని చాలామంది ప్రజలు అంటారు.
యెహోవా, నీవు నన్ను చాలా సంతోషపెట్టావు. ధాన్యం, ద్రాక్షారసం మాకు విస్తారంగా ఉన్నందుచేత పంట కోత సమయంలో సంబరపడే దానికంటే ఇప్పుడు మేము ఎక్కువ సంతోషంగా ఉన్నాము.
నేను పడకకు వెళ్లి, ప్రశాంతంగా నిద్రపోతాను.
    ఎందుకంటె యెహోవా, నీవే నన్ను భద్రంగా నిద్ర పుచ్చుతావు గనుక.

కీర్తనలు. 7

యెహోవాకు దావీదు పాడిన కీర్తన. బెన్యామీను వంశానికి చెందిన కీషు కుమారుడైన సౌలును గూర్చినది ఈ పాట.

యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ముకొన్నాను.
    నన్ను తరుముతున్న మనుష్యుల బారినుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము.
నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను.
    నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు.

యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు.
నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు.
    నా స్నేహితుని శత్రువులకు నేను సహాయం చేయలేదు.
కాని నేను అలా చేసియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము.
    నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద త్రొక్కనిమ్ము.
    మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము.

యెహోవా, లెమ్ము. నీ కోపాన్ని చూపెట్టుము.
    నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి విరోధంగా పోరాడుము.
    లేచి న్యాయంకోసం వాదించుము.
జనాలను నీ చుట్టూ ప్రోగుచేసి,
    వారి మీద పైనుండి పరిపాలించుము.
ప్రజలకు తీర్పు తీర్చుము. యెహోవా, నాకు తీర్పు తీర్చుము.
    నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము.
    నేను నిర్దోషిని అని రుజువు చేయుము.
చెడ్డవాళ్లను శిక్షించి
    మంచివాళ్లకు సహాయం చేయుము.
దేవా, నీవు మంచివాడవు,
    మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు.

10 నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు.
    కనుక దేవుడు నన్ను కాపాడుతాడు.
11 దేవుడు మంచి న్యాయమూర్తి,
    మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు.
12 దేవుడు ఒక నిర్ణయం చేస్తే
    ఆయన తన మనస్సు మార్చుకోడు.
13 ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది.

14 కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు.
    అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు.
15 వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు.
    అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు.
16 వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు.
    ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు.
    అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు.

17 యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను.
మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను.

సంఖ్యాకాండము 32:1-6

యొర్దాను నది తూర్పున ఇశ్రాయేలు వంశాలు

32 రూబేను, గాదు వంశాలకు చాల విస్తారంగా పశువులు ఉన్నాయి. యాజెరు, గిలాదు ప్రదేశాన్ని ఆ ప్రజలు చూశారు. ఈ ప్రదేశం వారి పశువులకు బాగున్నట్టు వారికి కనబడింది. కనుక రూబేను, గాదు వంశాల వారు మోషే దగ్గరకు వచ్చారు. మోషేతో, యాజకుడైన ఎలియాజరుతో, ప్రజా నాయకులతో వారు మాట్లాడారు. 3-4 వారు ఇలా చెప్పారు: “మీ సేవకులమైన మాకు చాల విస్తారంగా పశువులు ఉన్నాయి. మేము ఏ దేశంతో పోరాడామో అది పశువులకు మంచి ప్రదేశం. (అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షెబాం, నెబో, బెయోను ఈ ప్రాంతంలో ఉన్నాయి.) మీకు ఇష్టమైతే ఈ ప్రాంతాన్ని మాకు ఇవ్వవలెనని మేము కోరుతున్నాము. యొర్దాను నది ఆవలి వైపునకు మమ్మల్ని తీసుకొని వెళ్లొద్దు.”

రూబేను, గాదు వంశాల ప్రజలతో మోషే అన్నాడు: “మీరు మీ సోదరులను యుద్ధానికి వెళ్లనిచ్చి, మీరేమో ఇక్కడ స్థిరపడతారా?

సంఖ్యాకాండము 32:16-27

16 కానీ రూబేను, మరియు గాదు వంశాల ప్రజలు మోషే దగ్గరకు వెళ్లారు. వారు మోషేకు ఈ విధంగా చెప్పారు: “ఇక్కడ మేము మా పిల్లలకు పట్టణాలు కట్టుకుంటాము. మరియు మేము ఇక్కడ మందలకు కావలసిన దొడ్లు కట్టుకుంటాము. 17 ఇశ్రాయేలీయులను వారివారి స్థలాలకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధానికి సిద్ధపడి సాగిపోతాము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయంచేత ప్రాకారంగల పట్టణాలలో సురక్షితంగా నివాసము వుండనియ్యండి. 18 ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగిరాము. 19 యొర్దాను నదికి పశ్చిమదిక్కునవున్న ఏ భూమినీ మేము తీసుకోము. యొర్దాను నదికి తూర్పు దిక్కున వున్న భూమే మాకు రావలసిన వారసత్వం.”

20 కనుక మోషే వారితో ఇలా చెప్పాడు: “మీరు వీటన్నింటినీ జరిగిస్తే, అప్పుడు ఈ దేశం మీది అవుతుంది. కానీ మీ సైనికులు మాత్రం యెహోవాకు ముందు యుద్ధానికి వెళ్లాలి. 21 మీ సైనికులు యొర్దాను నది దాటి, శత్రువు ఈ దేశాన్ని వదలి వెళ్లేటట్టుచేయాలి. 22 ఈ దేశాన్ని వశం చేసుకునేందుకు యెహోవా మనందరికీ సహాయం చేసిన తర్వాత, మీరు తిరిగి ఇంటికి వెళ్లవచ్చును. అప్పుడు యెహోవా గాని, ఇశ్రాయేలీయులు గాని మిమ్మల్ని దోషులుగా ఎంచరు. అప్పుడు యెహోవా మిమ్మల్ని ఈ దేశాన్ని తీసుకోనిస్తాడు. 23 కానీ మీరు ఇలా చేయకపోతే, మీరు యెహోవా దృష్టిలో పాపం చేసినట్టే. మరియు మీ పాపం కోసం మీరు శిక్ష పొందుతారని గట్టిగా తెలుసుకోండి. 24 మీ పిల్లల కోసం పట్టణాలు, మీ జంతువుల కోసం కొట్టాలు కట్టుకోండి. అయితే, మీరు మీ ప్రమాణం ప్రకారం తప్పక చేయాలి.”

25 అప్పుడు గాదు, రూబేను వంశాల నాయకులు మోషేతో ఇలా చెప్పారు: “మేము నీ సేవకులం, నీవు మా యజమానివి. కనుక నీవు ఏమి చెబితే అది మేము చేస్తాము. 26 మా భార్యలు, పిల్లలు, మా పశువులు గిలాదు పట్టణాల్లోనే ఉంటారు. 27 కానీ, నీ సేవకులమైన మేము మాత్రం యొర్దాను నది దాటుతాము. అయితే మా యజమాని చెప్పినట్టు మేము యెహోవా ముందర యుద్ధానికి ముందడుగువేస్తాం.”

రోమీయులకు 8:26-30

26 అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. 27 ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు.

28 దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. 29 దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. 30 దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు.

మత్తయి 23:1-12

యేసు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని విమర్శించటం

(మార్కు 12:38-40; లూకా 11:37-52; 20:45-47)

23 ఆ తర్వాత యేసు ప్రజలతో, తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “శాస్త్రులు, పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చునివున్నారు. అందువల్ల వాళ్ళు చెప్పినది విధేయతతో చెయ్యండి. కాని వాళ్ళు బోధించినవి వాళ్ళే ఆచరించరు కనుక వాళ్ళు చేసేవి చెయ్యకండి. వాళ్ళు బరువైన మూటలు కట్టి ప్రజల భుజాలపై పెడతారు. కాని వాళ్ళు మాత్రం ఆ బరువు మొయ్యటానికి తమ వేలు కూడా కదలించరు.

“పెద్ద దేవుని వాక్యములు వ్రాసి పెట్టుకొన్న సంచులను కట్టుకొని, వెడల్పాటి అంచులుగల వస్త్రాలు ధరించి చేసే ప్రతిపని ప్రజలు చూడాలని చేస్తారు. విందుల్లో, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని ఆక్రమించటానికి చూస్తారు. సంతల్లో, ప్రజలు తమకు నమస్కరించాలని, తమను రబ్బీ అని పిలవాలని ఆశిస్తారు.

“మీకందరికి బోధకుడు ఒకడే! మీరంతా సోదరులు. కనుక మిమ్మల్ని రబ్బీ అని పిలువనీయకండి. ప్రపంచంలో ఎవ్వర్నీ ‘తండ్రి!’ అని సంబోధించకండి. మీ అందరికి తండ్రి ఒక్కడే. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు. 10 అదే కాకుండా మిమ్మల్ని ‘గురువు!’ అని పిలువ నియ్యకండి. మీకు ఒకే గురువు ఉన్నాడు. ఆయనే ‘క్రీస్తు.’ 11 మీలో గొప్ప వాడు మీ సేవకునిగా ఉండాలి. 12 ఎందుకంటే గొప్పలు చెప్పుకొనేవాణ్ణి దేవుడు అణచి వేస్తాడు. అణకువతో ఉన్న వాణ్ణి దేవుడు గొప్పవానిగా చేస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International