Book of Common Prayer
33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు.
నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు.
34 సారవంతమైన భూమిని పనికిమాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు.
ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే.
35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు.
ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు.
36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు.
ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు.
37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు.
వారికి మంచి పంట వచ్చింది.
38 దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుంబాలు పెద్దవయ్యాయి.
వారికి ఎన్నెన్నో పశువులు ఉన్నాయి.
39 విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు
చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి.
40 దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు.
బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు.
41 అయితే, అప్పుడు దేవుడు ఆ పేద ప్రజలను వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు.
ఇప్పుడు వారి కుటుంబాలు గొర్రెల మందల్లా పెద్దవిగా ఉన్నాయి.
42 మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు.
కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు.
43 ఒక వ్యక్తి తెలివిగలవాడైతే ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు.
ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.
దావీదు స్తుతి కీర్తన
108 దేవా, నా హృదయం, నా ఆత్మ నిశ్చలముగాఉన్నాయి.
నేను పాడుటకు, స్తుతి కీర్తనలు
వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.
2 స్వర మండలములారా, సితారలారా,
మనం సూర్యున్ని[a] మేల్కొలుపుదాం
3 యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము.
ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.
4 యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది.
నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.
5 దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము!
సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.
6 దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము.
నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.
7 యెహోవా తన ఆలయము నుండి[b] మాట్లాడి యిలా చెప్పాడు,
“యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను.
(ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను)
నా ప్రజలకు షెకెమును ఇస్తాను.
వారికి సుక్కోతులోయను ఇస్తాను.
8 గిలాదు, మనష్షే నావి.
ఎఫ్రాయిము నా శిరస్త్రాణం.
యూదా నా రాజదండం.
9 మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం.
ఎదోము నా చెప్పులు మోసే బానిస.
ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”
10 శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు?
ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?
11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో
నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?
12 దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము
మనుష్యులు మాకు సహాయం చేయలేరు!
13 దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు.
దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.
33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
3 ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
4 దేవుని మాట సత్యం!
ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
5 నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
ఇశ్రాయేలీయులను ఎదోము ఆటంకపర్చుట
14 మోషే కాదేషులో ఉన్నప్పుడు, కొందరు మనుష్యులను ఎదోము రాజు దగ్గరకి పంపి ఈలాగు చెప్పమన్నాడు. ఆ సందేశం ఇది:
“మీ సోదరులైన ఇశ్రాయేలీయులు మీతో చెప్పేది ఏమంటే: మాకు కలిగిన కష్టాలన్నీ నీకు తెలుసు. 15 చాల సంవత్సరాల క్రిందట మా పూర్వీకులు ఈజిప్టు వెళ్లారు. చాల సంవత్సరాలు మేము అక్కడ జీవించాము. ఈజిప్టు ప్రజలు మా యెడల కృ-రంగా ఉండిరి. 16 అయితే మేము యెహోవాను సహాయం అడిగాము. యెహోవా మా మొర విని, మాకు సహాయం చేసేందుకు ఒక దేవదూతను పంపించాడు. యెహోవా మమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
“ఇదిగో ఇప్పుడు మేము నీ దేశ సరిహద్దు అయిన కాదేషులో ఉన్నాము. 17 దయచేసి నీ దేశంలో నుంచి మమ్మల్ని ప్రయాణం చేయనివ్వు. పొలాల్లోనుంచి, ద్రాక్షా తోటల్లోనుంచి మేము నడువము. మీ బావుల్లో దేనినుండి మేము నీళ్లు తాగము. రాజమార్గంలో మాత్రమే మేము ప్రయాణం చేస్తాము. ఆ మార్గంనుండి కుడికి గాని ఎడమకు గాని మేము తొలగము. మీ దేశం దాటిపోయేంత వరకు మేము రాజ మార్గాననే వెళ్తాము.”
18 అయితే ఎదోము రాజు, “మీరు మా దేశంలోనుండి ప్రయాణం చేయగూడదు. మా దేశంలోనుండి ప్రయాణం చేయటానికి మీరు ప్రయత్నిస్తే, మేము వచ్చి కత్తులతో మీతో పోరాడుతాము” అని జవాబిచ్చాడు.
19 ఇశ్రాయేలు ప్రజలు, “మేము రహదారి వెంబడే ప్రయాణం చేస్తాము. మా పశువులు మీ నీళ్లు ఏమైనా తాగితే, దానికి మేము వెల చెల్లిస్తాము. మేము మీ దేశంలోనుంచి నడుస్తాము, అంతే. అంతేగాని, దాన్ని మేము తీసుకోము” అని జవాబిచ్చారు.
20 అయితే, “మేము మిమ్మల్ని మా దేశంలోంచి పోనియ్యము” అని ఎదోము జవాబిచ్చాడు.
అప్పుడు ఎదోము రాజు బలంగల విస్తార సైన్యాన్ని సమకూర్చుకొని, ఇశ్రాయేలు ప్రజలతో పోరాడటానికి వారి మీదికి వెళ్లాడు. 21 ఇశ్రాయేలు ప్రజలను తన దేశంగుండా వెళ్లనిచ్చేందుకు ఎదోము రాజు నిరాకరించాడు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కు తిరిగి మరో మార్గంగుండా వెళ్లిపోయారు.
అహరోను మరణం
22 ఇశ్రాయేలు ప్రజలంతా కాదేషు నుండి హోరు కొండకు ప్రయాణం చేసారు. 23 హోరు కొండ ఎదోము సరిహద్దుకు దగ్గర్లో ఉంది. మోషే, అహరోనులతో యెహోవా చెప్పాడు, 24 “అహరోను తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశంలో అతడు ప్రవేశించడు. మోషే, అహరోనూ, మీరు మెరీబా జలాల దగ్గర నేను మీకు ఇచ్చిన ఆజ్ఞకు పూర్తిగా విధేయులు కాలేదుగనుక నేను మీతో ఇలా చెబుతున్నాను:
25 “అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు కొండమీదికి తీసుకుని రా. 26 అహరోను ప్రత్యేక దుస్తులు అతని దగ్గరనుండి తీసుకుని, అతని కుమారుడైన ఎలియాజరుకు వాటిని తొడిగించు. అహరోను కొండమీద మరణిస్తాడు. అతడు తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు.”
27 యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. మోషే, అహరోను, ఎలియాజరు హోరు కొండ శిఖరం మీదికు వెళ్లారు. వారు వెళ్లటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు. 28 అహరోను వస్త్రాలన్నీ తీసి అతని కుమారుడైన ఎలియాజరు మీద వేసాడు మోషే. అప్పుడు అహరోను ఆ కొండ శిఖరం మీద చనిపోయాడు. మోషే, ఎలియాజరు కొండ దిగి క్రిందికి వచ్చారు. 29 అప్పుడు అహరోను చనిపోయినట్టు ప్రజలంతా తెలుసుకొన్నారు. కనుక ఇశ్రాయేలులో ప్రతి వ్యక్తి 30 రోజులపాటు సంతాపపడ్డాడు.
పాపం విషయంలో మరణించాము గాని క్రీస్తులో బ్రతికినాము
6 దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? 2 ఎన్నటికి కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించినవారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకొంటూ ఎట్లా ఉండగలము? 3 బాప్తిస్మము పొందిన మన మందరము క్రీస్తు యేసులో ఐక్యత పొందాము. ఈ బాప్తిస్మము ద్వారా ఆయన మరణంలో కూడా భాగం పంచుకొన్నామని మీకు తెలియదా? 4 ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం.
5 మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్ధానములో కూడా మనం ఐక్యం కాగలం. 6 మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు. 7 ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు.
8 మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. 9 దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు. 10 పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు. 11 అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి.
యేసు యెరూషలేము ప్రవేశించటం
(మార్కు 11:1-11; లూకా 19:28-38; యోహాను 12:12-19)
21 యేసు, ఆయన శిష్యులు యెరూషలేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో యిద్దర్ని ఆ గ్రామానికి పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: 2 “గ్రామంలోకి వెళ్ళండి అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడుతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. 3 ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు అవి కావాలి; వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు’ అని చెప్పండి.”
4 దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది:
5 “‘గాడిదనెక్కి వినయంగా
నీ రాజు వస్తున్నాడు చూడు!
బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు!’
అని సీయోను కుమారితో చెప్పండి.”(A)
6 శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేసారు. 7 గాడిదను, గాడిద పిల్లను తీసుకు వచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు. 8 అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు. 9 ఆయనకు ముందు, వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేసారు.
“దావీదు కుమారునికి హోసన్నా!
‘ప్రభువు పేరిట వస్తున్నవాడు ధన్యుడు!’(B)
మహోన్నతమైన స్థలములో హోసన్నా!”
10 యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది, “ఈయనెవరు?” అని ప్రజలు ప్రశ్నించారు.
11 “ఈయన యేసు, గలిలయలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త!” అని ఆయన వెంటనున్న వాళ్ళే సమాధానం చెప్పారు.
© 1997 Bible League International