Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:97-120

మేమ్

97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
    దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
    జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
    ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
    కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
    ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
    కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
    అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.

నూన్

105 యెహోవా, నీ వాక్యాలు
    నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
    నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
    దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
    కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
    కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
    అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
    నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.

సామెహ్

113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
    నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
114 నన్ను దాచిపెట్టి, కాపాడుము.
    యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము.
    నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
    నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను.
    నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
    ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
    కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
120 యెహోవా, నీవంటే నాకు భయం,
    నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.

కీర్తనలు. 81-82

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.

81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
    ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
సంగీతం ప్రారంభించండి.
    గిలక తప్పెట వాయించండి.
    స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
    పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
    ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
    దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
    నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
    తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
    నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”

“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
    ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
    ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
    మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
    నేను దానిని నింపుతాను.

11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
    ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
    ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14     అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
    ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
    అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
    తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”

ఆసాపు స్తుతి కీర్తన.

82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
    ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
    దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.

“అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
    న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
    దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.

“ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
    వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
    వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
నేను (దేవుడు) మీతో చెప్పాను,
    “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
    ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”

దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
    దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.

సంఖ్యాకాండము 11:24-35

24 కనుక మోషే ప్రజలతో మాట్లాడటానికి బయటకు వెళ్లాడు. యెహోవా చెప్పినది మోషే వారితో చెప్పాడు. అప్పుడు మోషే 70 మంది పెద్దలను సమావేశ పరచాడు. గుడారం చుట్టూ నిలబడమని మోషే వారితో చెప్పాడు. 25 అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చి, మోషేతో మాట్లాడాడు. మోషే మీద ఉన్న దేవుని ఆత్మను ఆ 70 మంది పెద్దల మీద ఉంచాడు యెహోవా.[a] ఆత్మ వారిమీదికి దిగిరాగానే వారు ప్రవచించటం మొదలు పెట్టారు. అయితే ఈ ఒక్కసారి మాత్రమే ఆ మనుష్యులు ఇలా చేసారు.

26 ఎల్దాదు, మేదాదు అనే అద్దరు పెద్దలు బయట గుడారం దగ్గరకు వెళ్లలేదు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి గాని వారు వారి గుడారంలోనే ఉండిపోయారు. కానీ దేవుని ఆత్మ వారిమీదకి కూడ వచ్చినందుచేత, వారుకూడ వారి గుడారంలోనే ప్రవచించటం మొదలుపెట్టారు. 27 ఒక యువకుడు పరుగెత్తి వెళ్లి మోషేతో చెప్పాడు. “ఎల్దాదు, మేదాదు గుడారంలోనే ప్రవచిస్తున్నారు” అని అతడు చెప్పాడు.

28 అయితే నూను కుమారుడైన యెహోషువ “అయ్యా మోషే, నీవు వారిని ఆపివేయాలి” అని మోషేతో చెప్పాడు. (యెహోషువ చిన్నతనం నుండి మోషేకు సహాయకుడుగా ఉన్నాడు.)

29 కాని మోషే, “ఇప్పుడు నేను నాయకుడ్ని కానని ప్రజలు తలుస్తారేమోనని నీవు భయపడుతున్నావా? యెహోవా ప్రజలు అందరూ ప్రవచిస్తే బాగుటుందని నా ఆశ. వారందరి మీద యెహోవా తన ఆత్మను ఉంచితే బాగుండునని నా ఆశ” అని బదులు చెప్పాడు. 30 అప్పుడు మోషే, ఇశ్రాయేలు నాయకులు అంతా తిరిగి గుడారాలకు వెళ్లిపోయారు.

పూరేళ్లు వచ్చాయి

31 అప్పుడు యెహోవా సముద్రం నుండి గొప్పగాలి వీచేటట్టుగా చేసాడు. ఆ గాలి పూరేళ్లను ఆ ప్రాంతంలోకి విసిరాయి. వారి నివాసాల చుట్టూరా పూరేళ్లు ఎగిరాయి. నేల అంతా పూరేళ్లతో నిండి పోయేటన్ని ఉన్నాయి అవి. నేలమీద మూడు అడుగుల ఎత్తుగా పూరేళ్లు నిండిపోయాయి. ఒక మనిషి ఒక రోజున నడువగలిగినంత దూరం అన్ని దిశల్లో పూరేళ్లు ఉన్నాయి. 32 ప్రజలు బయటకు వెళ్లి ఆ రాత్రి పగలు అంతా పూరేళ్లను ఏరుకొన్నారు. ఆ మర్నాడు అంతా వారు పూరేళ్లు పోగుచేసుకొన్నారు. తక్కువ కూర్చుకొన్నవాడు నూరు తూములుకన్నా ఎక్కువ పూరేళ్లను పోగుచేసుకున్నాడు. తర్వాత ప్రజలు ఆ పూరేళ్లను వారి గుడారాల చుట్టూ ఎండటానికి ఎండలో పరిచారు.

33 ప్రజలు మాంసం తినటం మొదలుపెట్టారు కాని యెహోవాకు చాల కోపం వచ్చింది. ఆ మాంసం ఇంకా వారి నోటిలో ఉండగానే, ప్రజలు దానిని తినటంముగించక ముందే ఆ ప్రజలకు భయంకరమైన రోగం వచ్చేటట్టు చేసాడు యెహోవా. అనేకులు అక్కడే మరణించినందువల్ల అక్కడే పాతిపెట్టబడ్డారు. 34 కనుక ప్రజలు ఆ చోటుకు కిబ్రోత్ హత్తావా[b] అని పేరు పెట్టారు. గొప్ప భోజనం కోసం బలీయమైన కోరికగల వారందరినీ అక్కడ పాతిపెట్టినందువల్ల వారు ఆ చోటుకు ఆ పేరు పెట్టారు.

35 కిబ్రోత్ హత్తావా నుండి ప్రయాణం చేసి ప్రజలు హజేరోతు చేరి అక్కడ నివసించారు.

రోమీయులకు 1:28-2:11

28 పైగా వాళ్ళు దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని లెక్కచెయ్యలేదు. కనుక దేవుడు వాళ్ళను వాళ్ళ నీచ బుద్ధికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు చెయ్యరాని పనులు చేసారు. 29 అన్యాయం, దుష్టత్వం, దురాశ, దుర్నీతి, ద్వేషం, హత్య, పోరాటం, మోసం, అసూయ అనే గుణాలు వాళ్ళలో సంపూర్ణంగా నిండిపోయాయి. వాళ్ళు వృథాగా మాట్లాడుతూ, 30 ఇతర్లను నిందిస్తూ, దేవుణ్ణి ద్వేషిస్తూ, ఇతర్లపై దౌర్జన్యం చూపుతూ, గర్విస్తూ, బడాయిలు చెప్పుకొంటూ జీవిస్తూ ఉంటారు. దుర్మార్గపు పనులు చెయ్యటానికి రకరకలా మార్గాలు కనిపెడ్తూ ఉంటారు. అంతేకాక తమ తల్లిదండ్రుల పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తూ ఉంటారు. 31 వాళ్ళలో తెలివిలేదు. విశ్వాసము లేదు, హృదయము లేదు, కనికరం లేదు. 32 దేవుని నీతి నియమములకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేసేవాళ్ళకు మరణ శిక్ష తప్పదని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండటమే కాకుండా ఆ పనులు చేసేవాళ్ళను మెచ్చుకొంటూ ఉంటారు.

దేవుని తీర్పు

ఇతర్లపై తీర్పు చెప్పే నీవు, ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏవిషయాల్లో నీవు ఇతర్లపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవుకూడా చేస్తున్నావు. అందువల్ల నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు. దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నవాళ్ళకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు. మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? లేక, నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారుమనస్సు పొందాలని దేవుడు నీపై దయచూపాడు. ఈ విషయం నీకు తెలియదా?

కాని, నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకొంటున్నావు. ఆరోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమౌతుంది. ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు.(A) కొందరు ఎప్పుడూ మంచిపనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే దేవుడు అనంత జీవాన్నిస్తాడు. మరికొందరు సత్యాన్ని తృణీకరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటివాళ్ళపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు. చెడును చేసిన ప్రతి మనిషికి కష్టాలు, దుఃఖాలు సంభవిస్తాయి. అవి యూదులకు, తర్వాత ఇతరులకు కూడా సంభవిస్తాయి. 10 మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు కూడా లభిస్తాయి. 11 దేవుడు పక్షపాతం చూపడు.

మత్తయి 18:1-9

దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?

(మార్కు 9:33-37; లూకా 9:46-48)

18 ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “మరి దేవుని రాజ్యంలో అందరి కన్నా గొప్ప వాడెవరు?” అని అడిగారు.

యేసు ఒక చిన్న పిల్లవాణ్ణి దగ్గరకు రమ్మని పిలిచి అతణ్ణి వాళ్ళ మధ్య నిలుచోబెట్టి ఈ విధంగా అన్నాడు: “ఇది సత్యం. మీరు మారి, మీ హృదయాల్లో చిన్న పిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్ప వానిగా పరిగణింపబడతాడు.

“అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట స్వాగతమిచ్చిన వాణ్ణి నాకు స్వాగతమిచ్చిన వానిగా నేను పరిగణిస్తాను.

పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం

(మార్కు 9:42-48; లూకా 17:1-2)

“కాని నన్ను విశ్వసించే ఈ చిన్న పిల్లల్లో ఎవరైనా పాపం చేయటానికి కారకుడవటం కన్నా, మెడకు తిరుగటి రాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడటం మేలు. ప్రపంచంలోని మానవుల్ని చూచినప్పుడు విచారం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేత పాపం చేయించే సంగతులు అలాంటివి. అవి జరుగక తప్పదు. కాని ఎవడు అలాంటివి జరిగిస్తాడో వాని స్థితి భయంకరమైనది.

“మీ కాలుగాని లేక మీ చేయిగాని మీ పాపానికి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. కాళ్ళు చేతులు ఉండి నరకంలో శాశ్వతమైన మంటల్లో పడటం కన్నా, కుంటి వానిగా లేక వికలాంగునిగా జీవం పొందటం మేలు. ఇక మీ కన్ను మీ పాపానికి కారణమైతే దాన్ని పీకిపారవేయండి. రెండు కళ్ళుండి నరకంలోని మంటల్లో పడటం కన్నా ఒక కన్నుతో జీవంలో ప్రవేశించి జీవించటం మేలు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International