Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 80

సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
    యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
    వచ్చి మమ్మల్ని రక్షించుము.
దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
    మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
    మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
    నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
    మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
    నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.

గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
    ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
    నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
“ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
    దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
    దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11     దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
    ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
    అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
    పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
    నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
    నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.

17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
    నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
    అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
    నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.

కీర్తనలు. 77

సంగీత నాయకునికి: యెదూతూను రాగం. ఆసాపు కీర్తన.

77 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను.
    దేవా, నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను.
    రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను.
    నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.
నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు,
    నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.
నీవు నన్ను నిద్రపోనియ్యవు.
    నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలవరపడి పోయాను.
గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను.
    చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను.
    నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.
“మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా?
    ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?
దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా?
    ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?
కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా?
    ఆయన జాలి కోపంగా మార్చబడిందా” అని నాకు అనిపిస్తుంది.

10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా?
    అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.

11 యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
    దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను.
    ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం.
    దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.
14 నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి.
    నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు.
    యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.

16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి.
    లోతైన జలాలు భయంతో కంపించాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి.
    ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి.
    అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి.
    మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది.
    భూమి కంపించి వణికింది.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు.
    కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు
    మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.

కీర్తనలు. 79

ఆసాపు స్తుతి కీర్తన.

79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
    ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
    యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
    అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
    మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
    మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
    బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
    నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
    వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
    త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
    నీవు మాకు ఎంతో అవసరం.
మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
    నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
    నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
10 “మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?”
    అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు.
దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము.
    నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.
11 దయచేసి, ఖైదీల మూల్గులు వినుము!
    దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము.
12 దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము.
    ఆ ప్రజలు నిన్ను అవమానించిన సమయాలనుబట్టి వారిని శిక్షించుము.
13 మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం.
    మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము.
    దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.

సంఖ్యాకాండము 9:15-23

మేఘం—అగ్ని స్థంబాలు

15 పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) నిలబెట్టిన రోజున ఒక మేఘం దానిమీద నిలిచింది. రాత్రి పూట ఆ మేఘం అగ్నిలా కనబడింది. 16 ఆ మేఘం రాత్రి అంతా పవిత్ర గుడారం మీదే నిలిచి ఉంది. 17 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నుండి కదలినప్పుడు ఇశ్రాయేలీయులు దానిని వెంబడించారు. ఆ మేఘం ఆగిపోయినప్పుడు, అక్కడే ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకొన్నారు. 18 ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా సాగిపొమ్మని యెహోవా ఆజ్ఞాపించాడు అలాగే వారు గుడారాలు వేసే స్థలం విషయంకూడా. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇదే. మేఘం పవిత్రగుడారం మీద నిలిచి ఉండగా, ప్రజలు ఆ చోటనే నివాసం కొనసాగించారు. 19 కొన్నిసార్లు చాలకాలంగా పవిత్ర గుడారంమీదనే ఆ మేఘం నిలిచిపోయేది. ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయులై ముందుకు కదల్లేదు. 20 కొన్నిసార్లు కొద్ది రోజులవరకు మాత్రమే మేఘం పవిత్ర గుడారంమీద నిలిచేది. ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. మేఘం కదిలినప్పుడు వారు ఆ మేఘాన్ని వెంబడించారు. 21 కొన్నిసార్లు ఆ మేఘము రాత్రి మాత్రమే నిలిచి ఉండేది. ఆ మర్నాడు మేఘము కదలగానే, ప్రజలుకూడా వారి సామగ్రి కూర్చుకొని వెంబడించారు. పగలుకాని రాత్రికాని మేఘము కదిలితే అప్పుడు ప్రజలుకూడా బయల్దేరారు. 22 రెండు రోజులుకానీ, ఒక నెలకానీ, ఒక సంవత్సరంకానీ ఆ మేఘము పవిత్ర గుడారంమీద నిలిచిన ప్రజలు యెహోవాకు విధేయులవుతూనే ఉన్నారు. తర్వాత మేఘము తన స్థానంనుండి లేచి బయల్దేరితే, ప్రజలు కూడ బయల్దేరారు. 23 కనుక ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. యెహోవా వారికి చూపించిన చోట వారు గుడారాలు వేసారు. మరల బయల్దేరమని యెహోవా ఆజ్ఞాపించగానే వారు బయల్దేరారు, మేఘాన్ని వెంబడించారు. యెహోవా ఆజ్ఞకు ప్రజలు లోబడ్డారు. ఇది మోషే ద్వారా ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ.

సంఖ్యాకాండము 10:29-36

29 మిద్యానీ వాడగు రెవూయేలు కుమారుడు హోబాబు. (రెవూయేలు మోషేకు మామ.) “దేవుడు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి మేము ప్రయాణం చేస్తున్నాము. కనుక మాతో రమ్ము. మేము నీకు మేలు చేస్తాము. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా మంచివాటిని వాగ్దానం చేసాడు” అని హోబాబుతో మోషే చెప్పాడు.

30 “నేను మీతో రాను, నేను నా సొంతదేశానికి, నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లిపోతాను” అని హోబాబు జవాబిచ్చాడు.

31 అప్పుడు మోషే, “దయచేసి మమ్మల్ని విడువకు. అరణ్యంగూర్చి మాకంటె నీకే ఎక్కువ తెలుసు. నీవు మాకు మార్గదర్శిగా ఉండొచ్చు. 32 నీవు మాతో వస్తే, యెహోవా మాకు ఇచ్చే మంచివాటన్నింటిలో మేము నీకు భాగం ఇస్తాము” అని చెప్పాడు.

33 కనుక హోబాబు ఒప్పుకొన్నాడు. యెహోవా పర్వతం దగ్గరనుండి వారు ప్రయాణం మొదలు బెట్టారు. పురుషులు యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను పట్టుకొని ప్రజల ముందు నడిచారు. వారు స్థలం కోసం వెదుకుతూ, మూడు రోజులపాటు పవిత్ర పెట్టెను మోసారు. 34 యెహోవా మేఘం ప్రతిరోజూ వారిమీద ఉంది. ప్రతి ఉదయం వారు తమ స్థలం విడిచిపెట్టినప్పుడు, వారిని నడిపించేందుకు మేఘం అక్కడ ఉండేది:

35 ప్రజలు ప్రయాణం మొదలు బెట్టి, పవిత్రపెట్టె వారితో పాటు వెడలగానే, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు:

“యెహోవా, లెమ్ము
    నీ శత్రువులు అన్ని దిక్కుల్లో పారిపోదురు గాక:
    నీకు వ్యతిరేకంగా ఉన్న మనుష్యులు నీ ఎదుట నుండి పారిపోదురుగాక,”

36 పవిత్ర పెట్టెను, దాని స్థలంలో దాన్ని ఉంచి నప్పుడు, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు,

“యెహోవా, లక్షలాదిమంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రమ్ము.”

రోమీయులకు 1:1-15

యేసు క్రీస్తు సేవకుడైన పౌలు నుండి:

దేవుడు తన అపొస్తలునిగా[a] పని చేయటానికి రమ్మని నన్ను పిలిచినాడు. దేవుని సువార్తను ప్రకటించటానికి నన్ను ప్రత్యేకించినాడు. దేవుడు ఈ సువార్తను తన ప్రవక్తలతో వ్రాయించి పవిత్ర లేఖనముల ద్వారా ఇంతకు క్రితమే తెలియచేసాడు. ఈ సువార్త దేవుని కుమారుడును మన ప్రభువును అయిన యేసు క్రీస్తును గురించి. ఆయన దావీదు వంశంలో మానవునిగా జన్మించాడు. పవిత్రమైన దేవుని ఆత్మ ఆయన్ని తన శక్తితో బ్రతికించి, ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారుడని నిరూపించినాడు.

ఆయన ద్వారా నేను దేవుని దయను పొంది ఆయన కోసం అపొస్తలుడనయ్యాను. ప్రజలందరు సువార్తను విశ్వసించి దాన్ని అనుసరించాలని దేవుని ఉద్దేశ్యం. యేసు క్రీస్తుకు చెందిన వారవుటకు పిలువబడినవాళ్ళలో మీరు కూడా ఉన్నారు.

అందువల్ల రోము పట్టణంలో ఉన్న మీ అందరికీ వ్రాయుటమేమనగా మీరు దేవునికి ప్రియమైనవాళ్ళు. ఆయన మిమ్మల్ని తన ప్రజగా ఉండటానికి పిలిచాడు.

మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహాన్ని ప్రసాదించి మీలో శాంతి కలుగుజేయునుగాక!

రోము నగరాన్ని దర్శించాలని అభిలాష

మీ విశ్వాసాన్ని గురించి ప్రపంచానికంతా తెలిసింది. కనుక నన్ను ముందు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు అర్పించనివ్వండి. నేను దేవుని కుమారుని సువార్తను ప్రకటించి మనస్ఫూర్తిగా ఆయన సేవ చేస్తున్నాను. 10 నేను ప్రార్థనలు చేసినప్పుడెల్లా విడువకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొంటున్నాను. దానికి ఆ దేవుడే సాక్షి. చివరకు ఇప్పుడైనా నేను మీ దగ్గరకు రావటానికి దైవేచ్ఛవల్ల మార్గం ఏర్పడాలని ప్రార్థిస్తున్నాను. 11 మీకు ఆధ్యాత్మిక శక్తి కలిగేటట్లు ఆత్మీయవరాన్ని అందించాలని మీ దగ్గరకు రావాలనుకొంటున్నాను. 12 అంటే మీరూ, నేనూ మనలోవున్న విశ్వాసం ద్వారా పరస్పరం ప్రోత్సాహపరచుకోవాలని ఆశిస్తున్నాను.

13 సోదరులారా! నేను, మిగతా యూదులుకానివాళ్ళనుండి ఫలం పొందినట్లే మీనుండి కూడా ఫలం పొందాలని, మీ దగ్గరకు రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కాని ఇప్పటి వరకు ఆటంకాలు కలిగాయి. ఈ విషయం మీరు గ్రహించాలని నా కోరిక.

14 గ్రీకులకు, గ్రీకులు కానివాళ్ళకు, జ్ఞానులకు, అజ్ఞానులకు బోధించవలసిన కర్తవ్యం నాది. 15 అందుకే రోము నగరంలో ఉన్న మీకు కూడా సువార్త ప్రకటించాలని అనుకొంటున్నాను.

మత్తయి 17:14-21

యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం

(మార్కు 9:14-29; లూకా 9:37-43)

14 వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి, 15 “ప్రభూ! నా కుమారునిపై దయ చూపండి. అతడు మూర్ఛ రోగంతో చాలా బాధపడ్తున్నాడు. మాటి మాటికి నిప్పుల్లో పడ్తూ ఉంటాడు. 16 అతణ్ణి నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకు వచ్చాను. కాని వాళ్ళతనికి నయం చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.

17 అప్పుడు యేసు, “మూర్ఖులైన ఈ తరానికి చెందిన మీలో విశ్వాసం లేదు. మీకు సక్రమమైన ఆలోచనలు రావు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మీ పట్ల సహనం వహించాలి. ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకు రండి” అని అన్నాడు. 18 యేసు ఆ దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో ఆ బాలునికి నయమైపోయింది.

19 శిష్యులు ఆ తర్వాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేక పోయాము?” అని అడిగారు.

20 యేసు, “మీలో దృఢవిశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేక పొయ్యారు. కాని ఇది సత్యం. 21 మీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ కొండతో ‘అక్కడికి వెళ్ళు’ అని అంటే వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఉండదు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International