Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 70-71

సంగీత నాయకునికి: ప్రజలు జ్ఞాపకం చేసికొనేందుకు సహాయంగా దావీదు కీర్తన.

70 దేవా, నన్ను రక్షించుము.
    దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
    వారిని నిరాశపరచుము.
    వారిని అవమానించుము.
మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు.
    వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ.
మనుష్యులు నన్ను హేళన చేసారు.
    వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ.
నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను.
నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.

నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
    దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము.
దేవా, నన్ను తప్పించగలవాడవు నీవు ఒక్కడవు మాత్రమే.
    ఆలస్యం చేయవద్దు!

71 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
    కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.
నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు.
    నా మాట వినుము. నన్ను రక్షించుము.
భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము.
    నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము.
నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
నా ప్రభువా, నీవే నా నిరీక్షణ.
    నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.
నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను.
    నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు.
    నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.
ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను.
    ఎందుకంటే నీవే నా బలానికి ఆధారం.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను.
కనుక నేను ముసలివాడినని నన్ను త్రోసివేయకుము.
    నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి పెట్టకుము.
10 నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు.
    ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను చంపుటకు పథకం వేసారు.
11 “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టుకోండి.
    అతనికి ఎవరూ సహాయం చేయరు” అని నా శత్రువులు అంటున్నారు.
12 దేవా, నన్ను విడిచిపెట్టకుము.
    దేవా, త్వరపడుము! వచ్చి నన్ను రక్షించుము.
13 నా శత్రువులను ఓడించుము.
    వారిని పూర్తిగా నాశనం చేయుము.
వారు నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్నారు.
    వారు సిగ్గు, అవమానం అనుభవిస్తారని నా నిరీక్షణ.
14 అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను.
    నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను.
15 నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబుతాను.
    నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబుతాను.
    లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు.
16 యెహోవా, నా ప్రభూ, నీ గొప్పతనాన్ని గూర్చి నేను చెబుతాను.
    నిన్ను గూర్చి నీ మంచితనం గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను.
17 దేవా, నేను చిన్నవానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు.
    నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబుతూనే ఉన్నాను.
18 దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు.
    నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి క్రొత్త తరానికీ నేను చెబుతాను.
19 దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది.
    దేవా, నీవంటి దేవుడు మరొకడు లేడు.
    నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు.
20 నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు.
    కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు.
    భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు.
21 ఇదివరకటి కంటె గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము.
    నన్ను ఆదరిస్తూనే ఉండుము.
22     స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను.
    నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను.
23 నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది.
    నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను.
24 అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది.
    నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు.

కీర్తనలు. 74

ఆసాపు ధ్యాన గీతం.

74 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా?
    నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా?
చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో.
    నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందినవాళ్లం.
నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకొనుము.
దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము.
    శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము.

శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు.
    యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు.
శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను
    నరికే మనుష్యుల్లా ఉన్నారు.
ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా,
    నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు.
దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు.
    వారు నీ ఆలయాన్ని నేలమట్టంగా కూల్చివేశారు.
    ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్మించబడింది.
శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు.
    దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు.
మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము.
    ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు.
    ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు.
10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు?
    నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా?
11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శిక్షించావు?
    నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు.
12 దేవా, చాల కాలంగా నీవే మా రాజువు.
    నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు.
13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు.
14 మకరపు తలను నీవు చితుకగొట్టావు.
    దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు.
15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు.
    మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు.
16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు.
    సూర్యుని, చంద్రుని నీవే చేశావు.
17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు.
    వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు.
18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను అవమానించాడని జ్ఞాపకం చేసుకో.
    ఆ తెలివితక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు.
19 దేవా, ఆ అడవి మృగాలను నీ పావురాన్ని[a] తీసుకోనివ్వకుము.
    నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచిపోకుము.
20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనుము.
    ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది.
21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది.
    వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము.
    నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
22 దేవా, లేచి పోరాడుము.
    ఆ తెలివితక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకొనుము.
23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము.
    ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు.

ప్రసంగి 11:1-8

భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కో

11 నీవెక్కడకి వెళ్లినా అక్కడ మంచి పనులు చెయ్యి. కొంతకాలం గడిచాక నీ మంచి పనులనే విత్తనాలు మొలకలెత్తి పంట రూపంలో నీకు తిరిగి వస్తాయి.[a]

నీకున్నది వేర్వేరు వాటిమీద పొదుపు చెయ్యి.[b] ప్రపంచంలో ఏమి చెడుగులు సంభవించనున్నాయో నీకు తెలియదు.

(నీవు ఖచ్చితంగా తెలుసుకోగలిగిన విషయాలు కొన్ని వున్నాయి.) మేఘాలు నీళ్లతో నిండివుంటే, అవి నేలపై వర్షిస్తాయి. చెట్టు నేలపైన కూలితే కూలినది ఉత్తరానికైనా, దక్షిణానికైనా అది పడ్డచోటునే వుంటుంది.

(అయితే, కొన్ని విషయాలు నీవు ఖచ్చితంగా తెలుసుకోలేవు. అలాంటప్పుడు, నీవు సాహసించి ఏదో ఒకటి చెయ్యాలి.) మంచి వాతావరణం పరిస్థితులకోసం ఎదురు చూసేవాడు ఎన్నడూ తన విత్తనాలు చల్లలేడు. ప్రతి మేఘమూ వర్షించేస్తుందని భయపడేవాడు తన పంట కుప్పలు ఎన్నడూ నూర్చుకోలేడు.

గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు. బిడ్డ తన తల్లి గర్భంలో ఎలా పెరుగుతుందో నీకు తెలియదు. అలాగే, దేవుడు యేమి చేస్తాడో నీకు తెలియదు, కాని, అన్నీ జరిపించేది ఆయనే.

అందుకని, ప్రొద్దుటే నాట్లు వెయ్యడం మొదలెట్టు. సాయంత్రమయ్యేదాకా పని చాలించకు. ఎందుకంటే, ఏవి నిన్ను సంపన్నుని చేస్తాయో నీకు తెలియదు. ఏమో, నీ పనులు అన్నీ జయప్రదమవుతాయేమో.

బ్రతికి ఉండటం మంచిది! సూర్యకాంతి కళ్లకి యింపు గొలుపుతుంది. నీవు ఎంత కాలం జీవించినా, నీ జీవితంలో ప్రతి ఒక్క రోజునూ అనుభవించు. అయితే, ఏదో ఒక రోజున నీవు మరణించక తప్పదని గుర్తుంచుకో. నీ జీవిత కాలంకంటె, నీ మరణానంతర కాలం చాలా ఎక్కువ. నీవు మరణించాక, నీవు చెయ్యగలిగినది శూన్యం, ఏమీ ఉండదు.

గలతీయులకు 5:16-24

పరిశుద్ధాత్మ మరియు మానవ స్వభావం

16 కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు. 17 ఎందుకంటే మానవ స్వభావము పరిశుద్ధాత్మ కోరుకొంటున్నదానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. తద్వారా మీరు చెయ్యాలనుకుంటున్నదాన్ని చెయ్యలేకపోతున్నారు. 18 కాని పరిశుద్ధాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం మిమ్మల్ని బంధించదు.

19 మానవ స్వభావం యొక్క పనులు మనకు బాగా తెలుసు. అవేవనగా వ్యభిచారము, అపవిత్రత, కామము, 20 విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు, 21 అసూయ, త్రాగుబోతుతనము, కామకేళీలు మొదలగునవి. వీటిని గురించి నేనిదివరకే వారించాను. మళ్ళీ వారిస్తున్నాను. ఈ విధంగా జీవించేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. 22 కాని పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, 23 వినయం, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు. 24 యేసుక్రీస్తుకు చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు.

మత్తయి 16:13-20

యేసే క్రీస్తు

(మార్కు 8:27-30; లూకా 9:18-21)

13 యేసు ఫిలిప్పు స్థాపించిన కైసరయ పట్టణ ప్రాంతానికి వచ్చాక తన శిష్యులతో, “మనుష్య కుమారుణ్ణి గురించి ప్రజలేమనుకుంటున్నారు?” అని అడిగాడు.

14 వాళ్ళు, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నారు. కొందరు ఏలీయా అంటున్నారు. కొందరు యిర్మీయా అంటున్నారు. మరి కొందరు ప్రవక్తల్లో ఒకడై ఉండవచ్చని అంటున్నారు” అని అన్నారు.

15 యేసు, “కాని మీ విషయమేమిటి? నేనెవరని మీరనుకొంటున్నారు?” అని వాళ్ళనడిగాడు.

16 సీమోను పేతురు, “నీవు క్రీస్తువు! సజీవుడైన దేవుని కుమారుడవు!” అని అన్నాడు.

17 యేసు సమాధానం చెబుతూ, “యోనా కుమారుడా! ఓ! సీమోనూ, నీవు ధన్యుడవు! ఈ విషయాన్ని నీకు మానవుడు చెప్పలేదు. పరలోకంలో వున్న నా తండ్రి చెప్పాడు. 18 నీవు పేతురువని నేను చెబుతున్నా. ఈ బండ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. మృత్యులోకపు శక్తులు సంఘాన్ని ఓడించలేవు. 19 దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు నేను నీకిస్తాను. ఈ ప్రపంచంలో నీవు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో కూడా నిరాకరిస్తాను. ఈ ప్రవంచంలో నీవు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో కూడా అంగీకరిస్తాను” అని అన్నాడు.

20 ఆ తర్వాత, తాను క్రీస్తు అన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International