Book of Common Prayer
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
2 నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
3 ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
వారు యెహోవాను నమ్ముకొంటారు.
4 ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
5 యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.
6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
7 అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
9 మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.
12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.
లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు.
నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి.
నేను వాటిని తప్పించుకోలేను.
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి.
నేను ధైర్యాన్ని కోల్పోయాను.
13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము.
త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము.
ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.
వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.
“యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.
17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని.
యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము.
నాకు సహాయం చేయుము.
నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.
సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.
54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
2 దేవా, నా ప్రార్థనను,
నేను చెప్పే సంగతులను ఆలకించుము.
3 పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.
4 చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
5 తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.
6 దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
7 నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.
51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
నా పాపాలన్నీ తుడిచివేయుము.
2 దేవా, నా దోషం అంతా తీసివేయుము.
నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
3 నేను పాపం చేశానని నాకు తెలుసు.
నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
4 తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
5 నేను పాపంలో పుట్టాను.
పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
6 దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
7 హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
8 నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
9 నా పాపాలను చూడకుము!
వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15 నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.
18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.
వాగ్దానం చేయుటలో జాగ్రత్తగా వుండండి
5 దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మూఢ జనం మాదిరిగా బలులు ఇవ్వడం కంటె (దైవవాణిని) వినడం మేలు. మూఢులు తరచు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకి తమ పనులు చెడ్డవని కూడా తెలియదు. 2 దేవునికి మీరు మొక్కులు మొక్కేటప్పుడు మీరు జాగ్రత్తగా వహించండి. దేవునికి మీ సమర్పణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆవేశంలో తొందరపడి నోరుజారకండి. దేవుడు పైన పరలోకంలో ఉన్నాడు, మీరు క్రింద భూమిమీద వున్నారు. అందుకని దేవునికి వేడుకొనుట కొద్దిగా మాత్రమే మీరు చెయ్యండి. (ఈ కింది లోకోక్తి లోని వాస్తవాన్ని గమనించండి)
3 అధిక వ్యాకుల మనస్కులు పీడకలలు కంటారు,
బుద్ధిహీనులు అతిగా వాగుతారు.
4 దేవునికి నీవేదైనా మొక్కకుంటే, దాన్ని చెల్లించు. నీవు మొక్కుకున్నదాన్ని చెల్లించడంలో ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల విషయంలో దేవుడు ప్రసన్నుడు కాడు. దేవునికి ఇస్తానన్నదాన్ని నీవాయనకు ఇవ్వు. 5 ఏదైనా వాగ్దానం చేసి దాన్ని చేయలేక పోవడం కంటె, అసలేమి మొక్కుకోక పోవడమే మేలు. 6 అందుకని, నీ మాటలు పాపకారణం కాకుండా చూసుకో. “నేను అన్న మాట అర్థం అది కాదు!” అని నీ యాజకుడితో చెప్పబోకు.[a] నీవాపని చేస్తే, దేవునికి నీ మాటల పట్ల కోపం రావచ్చు, నీవు శ్రమించి సాధించిన దాన్నంతటినీ నాశనం చెయ్యవచ్చు. 7 నీ పనికిమాలిన స్వప్నాలు, బింకాలు (నీకు హాని కలిగించకుండా) చూసుకో. నీవు దేవుని పట్ల భక్తి కలిగి ఉండు.
ధర్మశాస్త్రము, వాగ్దానము
15 సోదరులారా! ఇక మన నిత్యజీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకొంటాను. అంగీకరించిన ఒడంబడికను మనం రద్దు చెయ్యలేము, లేక మార్చలేము. ఈ విషయం కూడా అలాంటిదే. 16 అబ్రాహాముకు, అతని వారసునికి దేవుడు వాగ్దానం చేసాడు.[a] కాని ధర్మశాస్త్రంలో, “వారసులకు” అని వ్రాయబడలేదు. కాని “అనేకులు” అని అర్థం రాకుండా “ఒకనికి” అనే అర్థం వచ్చేటట్లు వ్రాయబడి ఉంది. ఆయనే క్రీస్తు. 17 నేను చెప్పేది ఏమిటంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టబడిన ధర్మశాస్త్రం గతంలో దేవుడు చేసిన ఒడంబడికను ప్రక్కకు త్రోసి ఆయన చేసిన వాగ్దానాన్ని రద్దు చెయ్యలేదు.
18 అయితే వారసత్వం ధర్మశాస్త్రంపై ఆధారపడలేక అది వాగ్దానంపై ఆధారపడి వుందన్న మాట. ఆ రీతిగా దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం ద్వారా అబ్రాహాముకు యిచ్చాడు.
19 మరి అలాగైతే ధర్మశాస్త్రం ఉండటంలో ఉద్దేశ్యమేమిటి? పాపాన్ని ఎత్తి చూపటమే దాని ఉద్దేశ్యం. వాగ్దానం చెయ్యబడిన అబ్రాహాము వంశీయుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అందజేయబడింది. 20 కాని వాగ్దానం విషయంలో దేవుడు ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి.
మోషే ధర్మశాస్త్రం యెక్క ఉద్దేశ్యం
21 మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్ధమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్నిచ్చే శక్తి ఉండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్ళం. 22 కాని లేఖనాల్లో, “ప్రపంచం పాపాల్లో చిక్కుకు పోయింది.” అని వ్రాయబడి ఉంది. ఇలా ఎందుకైందంటే యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చెయ్యబడిన వరము విశ్వాసం ఉన్నవాళ్ళకే యివ్వబడుతుంది.
యేసు నీళ్ళపై నడవటం
(మార్కు 6:45-52; యోహాను 6:16-21)
22 ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్ళకు పంపాలని ఆయన ఉద్దేశం. 23 ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. సాయంకాలం అయింది. అయినా ఆయనొక్కడే అక్కడ ఉండిపోయాడు. 24 పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. ఎదురు గాలి వీయటం వల్ల అలలు ఆ పడవను కొడ్తూ ఉన్నాయి.
25 రాత్రి నాలుగోఝామున యేసు నీళ్ళ మీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. 26 ఆయన నీళ్ళపై నడవటం చూసి శిష్యులు, “దయ్యం” అంటూ భయంతో పెద్దకేక పెట్టారు.
27 యేసు వెంటనే, “నేనే! ధైర్యంగా ఉండండి! భయపడకండి!” అని అన్నాడు.
28 పేతురు, “ప్రభూ మీరైతే, నీళ్ళ మీద నడుస్తూ నన్ను మీదగ్గరకు రానివ్వండి!” అని అన్నాడు.
29 “రా” అని యేసు అన్నాడు.
అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు. 30 కాని గాలి వీయటం గమనించి భయపడి నీళ్ళలో మునుగుతూ, “ప్రభూ, నన్ను రక్షించండి!” అని కేక వేశాడు.
31 యేసు వెంటనే తన చేయి జాపి అతణ్ణి పట్టుకొని, “నీలో దృఢవిశ్వాసం లేదు! ఎందుకు సందేహించావు?” అని ప్రశ్నించాడు.
32 వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. 33 పడవలోవున్న వాళ్ళు యేసుకు మ్రొక్కుతూ, “మీరు నిజంగా దేవుని కుమారుడు!” అని అన్నారు.
యేసు రోగులనేకులను నయం చేయటం
(మార్కు 6:53-56)
34 వాళ్ళు సరస్సు దాటి గెన్నేసరెతు ఒడ్డును చేరుకున్నారు. 35 ఆ గ్రామం వాళ్ళు యేసును గుర్తించి చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళందరికి కబురు పెట్టారు. ప్రజలు రోగాలతో ఉన్న వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చి. 36 “వాళ్ళను మీ అంగీ అంచునైనా తాకనివ్వండి” అని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన వాళ్ళకందరికి నయమైపోయింది.
© 1997 Bible League International