Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 118

118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యాజకులారా, మీరు చెప్పండి.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.

నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
    యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను.
    నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
యెహోవా నా సహాయకుడు;
    నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
మనుష్యులను నమ్ముకొనుటకంటే
    యెహోవాను నమ్ముట మేలు.
మీ నాయకులను నమ్ముకొనుట కంటే
    యెహోవాను నమ్ముకొనుట మేలు.

10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.

13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
    కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
    యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.

17 నేను జీవిస్తాను! కాని మరణించను.
    మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
    కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
    నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
    ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
    మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
    అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
    ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!

25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
    దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26     యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”

యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
    బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”

28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
    నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

కీర్తనలు. 145

దావీదు ప్రార్థన.

145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
    నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
    ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
    ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
    నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
    యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.

యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
    యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా, అందరి యెడలా మంచివాడు.
    దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
    నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
    నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
    మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
    నీవు శాశ్వతంగా పాలిస్తావు.

14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
    కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
    సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
    జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
    యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
    యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
    యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
    మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
    దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
    ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!

ద్వితీయోపదేశకాండము 16:9-12

వారాల పండుగ (పెంతెకొస్తు)

“మీరు పంట కోయటం మొదలు పెట్టినప్పటి నుండి ఏడు వారాలు లెక్క కట్టాలి. 10 అప్పుడు మీ దేవుడైన యెహోవాకు వారాల పండుగను మీరు జరుపుకోవాలి. ఒక స్వేచ్ఛార్పణ తీసుకొని రావటంతో దీనిని జరుపుకోండి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడో ఆలోచించి, మీరు ఎంత యివ్వాలి అనేది నిర్ణయించండి. 11 యెహోవా తన ప్రత్యేక ఆలయంగా ఏర్పచుకొనే చోటుకు వెళ్లండి. అక్కడ మీరూ, మీ ప్రజలూ కలిసి అక్కడ మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా గడపండి. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ సేవకులు, మీ ప్రజలందరినీ మీతో బాటు తీసుకొని వెళ్లండి. అంతే కాదు, మీ పట్టణాలలో నివసించే లేవీయులను, విదేశీయులను, తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవలను కూడ తీసుకొని వెళ్లండి. 12 మీరు ఈజిప్టులో బానిసలు అని మరచిపోవద్దు. ఈ ఆజ్ఞలకు మీరు తప్పక విధేయులు కావాలి.

అపొస్తలుల కార్యములు 4:18-21

18 వాళ్ళను మళ్ళీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు. 19 కాని పేతురు, యోహాను వాళ్ళకు సమాధానం చెబుతూ, “మీరు చెప్పింది చెయ్యాలో, లేక దేవుడు చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో మీలో మీరు నిర్ణయించుకోండి. 20 ఎందుకంటే మేము చూసినదాన్ని, విన్నదాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా వుండలేము” అని అన్నారు.

21 వాళ్ళు పేతురును, యోహానును యింకా కొంచెం భయపెట్టి వదిలేసారు.

అపొస్తలుల కార్యములు 4:23-33

విశ్వాసుల ప్రార్థన

23 విడుదలయ్యాక పేతురు, యోహాను తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధానయాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు. 24 ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు: “మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. 25 నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన దావీదు నోటినుండి యిలా పలికించావు:

‘జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి?
ప్రజలెందుకు వృథాగా పన్నాగాలు పన్నుతున్నారు?

26 ‘రాజులు, పాలకులు కలిసి ప్రభువును,
    ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు?’(A)

27 హేరోదు మరియు పొంతి పిలాతు ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు. 28 ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు. 29 ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు! 30 యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!”

31 వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవసందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.

విశ్వాసుల ఐకమత్యం

32 విశ్వాసుల మనస్సు, ఆత్మ ఒకే విధంగా ఉండేవి. ఎవ్వరూ “ఇది నాది” అని అనకుండా తమకున్న వాటిని ఇతర్లతో పంచుకొనేవాళ్ళు. 33 దైవికమైన శక్తితో అపొస్తలులు ప్రభువు బ్రతికి వచ్చాడని రుజువు చేసారు. దేవుని అనుగ్రహం వాళ్ళందరిపై సంపూర్ణంగా ఉంది.

యోహాను 4:19-26

19 ఆమె, “అయ్యా! మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు. 20 మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు. కాని మీ యూదులు, ‘మేము పూజించవలసింది యిక్కడ కాదు, యెరూషలేములో పూజించాలి’ అని అంటున్నారు” అని అన్నది.

21 యేసు, “నన్ను నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది. 22 మీ సమరయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాదిస్తారు. రక్షణ యూదుల నుండి రానున్నది కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. 23 నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా. ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురు చుస్తున్నాడు. 24 దేవుడు ఆత్మ అయివున్నాడు. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని అన్నాడు.

25 ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు” అని అన్నది.

26 యేసు, “నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే!” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International