Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 66-67

సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.

66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
    స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
    దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
    నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
    అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
    ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
    అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
    సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
    ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
    భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
    అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
    కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
    నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15     నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
    నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
    నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.

16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
    దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
    నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
    కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
    దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
    దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
    దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!

సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.

67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
    దయచేసి మమ్ములను స్వీకరించుము.

దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
    నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
    ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
    మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
    మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
దేవుడు మమ్మల్ని దీవించుగాక.
    భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.

కీర్తనలు. 19

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
    యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
    ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
    మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
    వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.

అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
    తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
    ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
    మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
    దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.

యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
    అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
    జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
యెహోవా చట్టాలు సరియైనవి.
    అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
    ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.

యెహోవాను ఆరాధించుట మంచిది.
    అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
    అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
    సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
    నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.

12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
    కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
    ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.

కీర్తనలు. 46

సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.

46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
    ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
అందుచేత భూమి కంపించినప్పుడు,
    మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
    భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.

ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
    మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
    సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
రాజ్యాలు భయంతో వణకుతాయి.
    యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
    ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
    సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.

10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
    రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
    భూమిమీద మహిమపర్చబడతాను.”

11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

నిర్గమకాండము 3:1-12

మండుతున్న పొద

మోషే మామ పేరు యిత్రో (ఈయన మిద్యాను వారికి యాజకుడు). యిత్రో గొర్రెలకు మోషే కాపరి అయ్యాడు. ఒకనాడు మోషే అరణ్యానికి పశ్చిమంగా ఆ గొర్రెల్ని తోలుకుపోయాడు. అక్కడ హోరేబు అనే ఒక కొండ ఉంది. అది దేవుని కొండ. ఆ కొండమీద మండుతున్న ఒక పొదలో యెహోవా దూతను మోషే చూసాడు.

ఆ పొద మండిపోతూ కాలిపోకుండా ఉండటం మోషే చూశాడు. అందుచేత మోషే, “ఈ పొద మండుతూ ఉండి కాలిపోకుండా ఎలా వుందో దగ్గరకు వెళ్లి చూడాలి” అనుకొన్నాడు.

ఆ పొదను చూచేందుకు మోషే వస్తూ ఉండటం యెహోవా చూశాడు. అందుచేత ఆ పొదలోంచే దేవుడు, “మోషే, మోషే” అని మోషేను పిల్చాడు.

“చిత్తం ప్రభూ” అన్నాడు మోషే.

అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “ఇక దగ్గరకు రాకు. నీ చెప్పులు విడువు. నీవు నిలబడింది పవిత్ర స్థలం నేను నీ పూర్వీకుల దేవుణ్ణి. నేను అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి.”

దేవుణ్ణి చూడాలంటే, భయం వేసింది కనుక మోషే తన ముఖం కప్పుకొన్నాడు.

యెహోవా “ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్లు నా ప్రజల్ని బాధపెట్టినప్పుడు వారు మొర పెట్టడం నేను విన్నాను. వారి బాధ నాకు తెలుసు ఈజిప్టు వాళ్ల బారినుండి నా ప్రజల్ని రక్షించేందుకు ఇక నేను దిగి వస్తాను. ఆ దేశం నుండి వాళ్లను బయటకు తెచ్చి, మరో మంచి దేశానికి నడిపిస్తాను. అక్కడ వాళ్లు ఏ కష్టాలూ లేకుండా స్వేచ్ఛగా ఉంటారు.[a] అది మంచి మంచి వాటితో నిండిన చాలా మంచి దేశం.[b] కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, రకరకాల మనుష్యులు అక్కడ నివసిస్తున్నారు. ఇశ్రాయేలీయుల మొరలు నేను విన్నాను. వాళ్ల జీవితాన్ని ఈజిప్టు వాళ్లు ఎంత కష్టతరం చేసారో నేను చూశాను. 10 అందుచేత నేను ఇప్పుడు ఫరో దగ్గరకు నిన్ను పంపిస్తున్నాను. వెళ్లు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుంచి బయటకు తీసుకువెళ్లు” అని చెప్పాడు.

11 అయితే మోషే, “నేనేమీ అంతగొప్ప వాణ్ణి కాదే. ఫరో దగ్గరకు వెళ్లేందుకుగాని, ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులను బయటకు నడిపించేందుకుగాని నేను ఎంతటివాణ్ణి?” అంటూ దేవుణ్ణి అడిగాడు.

12 “నేను నీకు తోడుగా ఉంటాను గనుక నీవు చేయగలవు. నేనే నిన్ను పంపిస్తున్నాను అనేందుకు రుజువు ఏమిటంటే, నీవు ఈ ప్రజల్ని ఈజిప్టు నుండి బయటికి నడిపించిన తర్వాత నీవు మళ్లీ వచ్చి ఈ కొండమీదనే నన్ను ఆరాధిస్తావు!” అని దేవుడు చెప్పాడు.

హెబ్రీయులకు 12:18-29

18 తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్నిజ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. కారు మబ్బులు, చీకటి, తుఫాను కమ్ముకొన్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. 19 ఆ పర్వతం నుండి బూర ధ్వని, మాట్లాడుతున్న కంఠ ధ్వని వినటానికి రాలేదు. ఆ కంఠం విన్నవాళ్ళు భయపడి వినడానికి నిరాకరించారు. 20 ఎందుకంటే, “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా ఆ జంతువును రాళ్ళతో కొట్టాలి”(A) అని ఆ స్వరం ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞను వాళ్ళు భరించలేకపొయ్యారు. 21 ఆ దృశ్యము ఎంత భయంకరంగా ఉందంటే, మోషే “నేను భయంతో వణికి పోతున్నాను”(B) అని అన్నాడు.

22 కాని మీరు సీయోను పర్వతం దగ్గరకు వచ్చారు. ఇదే పరలోకపు యెరూషలేము! సజీవుడైన దేవుని నగరం. ఆనందంతో సమూహమైన వేలకొలది దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు. 23 మొట్టమొదట జన్మించిన వాళ్ళ సంఘానికి మీరు వచ్చారు. వీళ్ళ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి. మానవుల న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు మీరు వచ్చారు. దేవుడు పరిపూర్ణత కలిగించిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. 24 క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు మీరు వచ్చారు. హేబేలు రక్తానికన్నా ఉత్తమసందేశాన్నిచ్చే “ప్రోక్షింపబడే రక్తం” దగ్గరకు మీరు వచ్చారు.

25 జాగ్రత్త! మనతో మాట్లాడుతున్న ఆయన్ని నిరాకరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన మాటల్ని ఆనాటి వాళ్ళు నిరాకరించారు. తద్వారా ఆయన ఆగ్రహంనుండి తప్పించుకోలేకపోయారు. మరి ఆయన పరలోకంనుండి పలికే మాటల్ని నిరాకరిస్తే ఆయన ఆగ్రహంనుండి ఎలా తప్పించుకొనగలము? 26 ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగించింది. కాని యిప్పుడు ఆయన, “నేను భూమినే కాక ఆకాశాన్ని కూడా మరొక్కసారి కదిలిస్తాను”(C) అని వాగ్దానం చేసాడు. 27 “మరొక్కసారి” అన్న పదాలు, కదిలే వాటిని, అంటే సృష్టింపబడ్డవాటిని నాశనం చేస్తాడని సూచిస్తున్నాయి. కదలనివి అలాగే ఉండిపోతాయి.

28 ఎవ్వరూ కదిలించలేని రాజ్యం మనకు లభింపనున్నది కనుక దేవునికి మనము కృతజ్ఞులమై ఉందాం. ఆయన్ని భయభక్తులతో, ఆయనకు యిష్టమైన విధంగా ఆరాధించుదాము. 29 ఎందుకంటే, మన దేవుడు “మండుచున్న అగ్నిలాంటివాడు.”(D)

లూకా 10:17-24

సాతాను పడిపోవటం

17 ఆ డెబ్బది రెండు మంది శిష్యులు ఆనందంతో తిరిగి వచ్చి, “ప్రభూ! మీ పేరు చెప్పగానే దయ్యాలు కూడా మా మాటలకు లోబడ్డాయి” అని అన్నారు.

18 యేసు, “సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడిపోవటం నేను చూశాను. 19 పాముల మీద నడవటానికి మీకు అధికారము యిచ్చాను. శత్రువును జయించే అధికారం యిచ్చాను. ఏది మీకు హాని చెయ్యలేదు. 20 దయ్యాలు మీ మాట వింటున్నంత మాత్రాన ఆనందించకండి. మీ పేరు పరలోకంలో వ్రాయబడినందుకు ఆనందించండి” అని అన్నాడు.

యేసు తండ్రిని ప్రార్థించటం

(మత్తయి 11:25-27; 13:16-17)

21 ఆయన పవిత్రాత్మలో సంతోషిస్తూ, “ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి ఓ తండ్రి! నీకు స్తుతులు! నీవీ విషయాలు చదువుకున్న వాళ్ళనుండి, విజ్ఞానుల నుండి దాచి, అమాయకులకు తెలియ చేసావు. ఔను, తండ్రీ! ఇదే నీచిత్తము.

22 “నా తండ్రి నాకు అన్నీ యిచ్చాడు. తండ్రికి తప్ప కుమారుడెవరో ఇతర్లకు తెలియదు. కుమారుడు చెప్పదలచిన వాళ్లకు తప్ప తండ్రి ఎవరో యితర్లకు తెలియదు” అని అన్నాడు.

23 ఆ తర్వాత తన శిష్యుల వైపు తిరిగి, “మీరు చూస్తున్నవి చూసే కన్నులు ధన్యమైనవి. 24 నేను చెప్పేదేమిటంటే మీరు చూస్తున్నవి చూడాలని చాలా మంది ప్రవక్తలు, రాజులు ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని వాళ్ళాశించారు. కాని వినలేక పోయారు” అని రహస్యంగా వారితో అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International