Book of Common Prayer
సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.
8 యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
2 పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
3 యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
4 మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
నీవు వానిని గమనించటం ఎందుకు?
5 అయితే మానవుడు నీకు ముఖ్యం.
వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
8 ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!
సంగీత నాయకునికి: కోరహు కుమారుల గీతం.
47 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి.
సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
భూలోకమంతటికీ ఆయన రాజు.
3 ఆయన ప్రజలను మనకు లోబరిచాడు.
ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
4 దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.
5 బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే
యెహోవా దేవుడు లేచాడు.
6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
7 దేవుడు సర్వలోకానికి రాజు.
స్తుతిగీతాలు పాడండి.
8 దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు.
దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు.
9 రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు.
దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
దేవుడు మహోన్నతుడు.
దావీదు కీర్తన.
24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
4 అక్కడ ఎవరు ఆరాధించగలరు?
చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
8 ఈ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
నాలుగవ మృగం తీర్పు
9 “నేను చూస్తూండగా సింహాసనాలు వేయబడ్డాయి.
మరియు ప్రాచీన రాజు[a] తన సింహాసనమున ఆసీనుడై ఉన్నాడు.
ఆయన వస్త్రాలు మంచులా తెల్లగాను,
ఆయన తల వెంట్రుకలు స్వచ్ఛమైన ఉన్నివలె తెల్లగా ఉండినవి.
ఆయన సింహాసనం అగ్ని జ్వాలలతోను,
ఆ సింహాసనపు చక్రాలు మంటలతోను మండుచున్నవి.
10 ఆయన ఎదుట నుండి
అగ్ని ప్రవాహము బయలు వెళ్లింది.
వేవేల కొలది ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు.
కోట్లకొలది ఆయన ఎదుట నిలబడ్డారు.
తీర్పుకై ఆయన న్యాయసభలో
కూర్చుండగా గ్రంథాలు తెరువబడ్డాయి.
11 “చిన్న కొమ్ము గర్వపు మాటలు మాట్లాడుచున్న శబ్దం విని అటు చూశాను. నేను చూస్తుండగా ఆ నాలుగవ మృగం చంపబడింది. దాని శరీరం నాశనం చేయబడింది. అది మండుచున్న మంటల్లోకి త్రోసివేయబడింది. 12 మిగిలిన మృగాల అధికారం వాటినుండి తీసివేయబడింది. కాని కొంతకాలంపాటు అవి నివసించి ఉండడానికి అనుమతి ఇవ్వబడింది.
13 “రాత్రి దర్శనాలలో, మానవ కుమారుని పోలిన ఒక వ్యక్తి రావటం నేను చూశాను. ఆయన ఆకాశంలోని మబ్బులమీద ప్రాచీన రాజు[b] వద్దకు వచ్చి, ఆయన ముందు నిలబడ్డాడు.
14 “మానవ కుమారునివలె కనిపించిన ఆ వ్యక్తికి అధికారం, ప్రభావం, సంపూర్ణ పరిపాలనాధికారం ఇవ్వబడ్డాయి. అందునుబట్టి ప్రజలందరు, అన్ని దేశాలు, ప్రతి భాషకు చెందినవారు ఆయన్ని సేవిస్తారు. ఆయన పరిపాలన ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాజ్యం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. అది ఎన్నటికీ అంతం కానిది.
యేసు మానవజన్మనెత్తటం
5 మనం మాట్లాడుతున్న ప్రపంచాన్ని, అంటే రాబోవు ప్రపంచాన్ని దేవుడు తన దూతలకు లోపర్చ లేదు. 6 ధర్మశాస్త్రంలో ఒకచోట ఈ విధంగా వ్రాయబడింది:
“మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి అతడెంతటివాడు?
మానవ కుమారుణ్ణి నీవు చూడడానికి అతడెంతటివాడు?
7 నీవతనికి దేవదూతలకన్నా కొద్దిగా తక్కువ స్థానాన్ని యిచ్చావు!
మహిమ, గౌరవమనే కిరీటాన్ని నీవతనికి తొడిగించి,
8 అన్నిటినీ అతని పాదాల క్రింద ఉంచావు.”(A)
దేవుడు అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అంటే, ప్రతి ఒక్కటి ఆయన అధికారానికి లోబడి ఉండాలన్నమాట. కాని ప్రస్తుతం, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నట్లు మనకు కనిపించటం లేదు. 9 యేసు, దేవదూతల కన్నా కొంత తక్కువవానిగా చేయబడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణించాలని, దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం ఆయనకు యిచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి మరణించటంవలన “మహిమ, గౌరవము” అనే కిరీటాన్ని ధరించగలిగాడు.
10 దేవుడు తన కుమారుల్లో చాలామంది తన మహిమలో భాగం పంచుకొనేటట్లు చెయ్యాలని, వాళ్ళ రక్షణకు కారకుడైనటువంటి యేసును కష్టాలనుభవింపజేసి, ఆయనలో పరిపూర్ణత కలుగ చేసాడు. ఎవరికోసం, ఎవరిద్వారా, ఈ ప్రపంచం సృష్టింపబడిందో ఆ దేవుడు ఈ విధంగా చేయటం ధర్మమే! యేసు మానవుల్ని పవిత్రం చేస్తాడు.
11 ఆయన పవిత్రం చేసిన ప్రజలు, పవిత్రం చేసే ఆయన ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు. అందువలనే, వాళ్ళు తన సోదరులని చెప్పుకోవటానికి యేసు సిగ్గుపడటంలేదు. 12 ఆయన ఈ విధంగా అన్నాడు:
“నిన్ను గురించి నా సోదరులకు తెలియ చేస్తాను.
సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను!”(B)
13 మరొక చోట
“నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!”(C)
అంతేకాక ఇలా కూడా అన్నాడు:
“నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!”(D)
14 ఆయన “సంతానమని” పిలువబడినవాళ్ళు రక్తమాంసాలుగల ప్రజలు. యేసు వాళ్ళలా అయిపోయి వాళ్ళ మానవనైజాన్ని పంచుకొన్నాడు. ఆయన తన మరణం ద్వారా మరణంపై అధికారమున్న సాతాన్ను నాశనం చేయాలని ఇలా చేశాడు. 15 తద్వారా జీవితాంతం మరణానికి భయపడి జీవించే వాళ్ళకు స్వేచ్ఛకలిగించాడు. 16 నిజానికి, ఆయన దేవదూతలకు సహయం చెయ్యాలని రాలేదు. అబ్రాహాము సంతానానికి సహయం చెయ్యాలని వచ్చాడు. 17 ఈ కారణంగా ఆయన అన్ని విధాల తన సోదరులను పోలి జన్మించవలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజలపై దయ చూపటానికి మానవ జన్మనెత్తాడు. ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో ఒకడయ్యాడు. 18 శోధన సమయాల్లో యేసు కష్టాలను అనుభవించాడు. కనుక యిప్పుడు శోధనలకు గురౌతున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలడు.
యేసు తన శిష్యులతో మాట్లాడటం
(మార్కు 16:14-18; లూకా 24:36-49; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)
16 ఆ తర్వాత ఆ పదకొండుగురు శిష్యులు గలిలయకు వెళ్ళి, యేసు చెప్పిన కొండ మీదికి వెళ్ళారు. 17 అక్కడ యేసును చూసి ఆయన ముందు సాష్టాంగ పడ్డారు. కాని వాళ్ళలో కొందరు సందేహించారు 18 అప్పుడు యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, “పరలోకంలో, భూమ్మీదా ఉన్న అధికారమంతా దేవుడు నాకిచ్చాడు. 19 అందువల్ల అన్ని దేశాలకు వెళ్ళి, వాళ్ళను శిష్యులుగా చెయ్యండి. తండ్రి పేరిట, కుమారుని పేరిట, పవిత్రాత్మ పేరిట వాళ్ళకు బాప్తిస్మము యివ్వండి. 20 నేను మీకాజ్ఞాపించిన వన్నీ వాళ్ళను ఆచరించమని బోధించండి. నేను అన్ని వేళలా ఈ యుగాంతం దాకా మీ వెంట ఉంటాను” అని అన్నాడు.
© 1997 Bible League International