Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 93

93 యెహోవాయే రాజు!
    ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
    ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
    కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
    నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.

కీర్తనలు. 96

96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
    సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
    శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
    దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
    ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
    కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
    దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
    స్తుతి కీర్తనలు పాడండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
    యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10     యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
    యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
    సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
    అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
    ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.

కీర్తనలు. 34

దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.

34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
    ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
దీన జనులారా, విని సంతోషించండి.
    నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
    మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
    నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
    మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
    యెహోవా నా మొర విన్నాడు.
    నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
    ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
    యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
    ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
    అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
    యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
    ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
    ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
    శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
    ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
    ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.

17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
    ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
    ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
    కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
    ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
    చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
    తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.

లేవీయకాండము 25:1-17

భూమికి విశ్రాంతి సమయం

25 సీనాయి కొండ దగ్గర యెహోవా మోషేతో మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు ప్రవేశిస్తారు. ఆ సమయంలో మీరు భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయాన్ని కేటాయించాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ఒక ప్రత్యేక సమయంగా ఉంటుంది. ఆరు సంవత్సరాలు మీరు మీ భూమిలో విత్తనాలు చల్లుకోవాలి. మీ ద్రాక్షా తోటల్లోని తీగెలను ఆరు సంవత్సరాలు మీరు కత్తిరించుకొంటూ, దాని ఫలాన్ని కూర్చుకోవాలి. అయితే ఏడో సంవత్సరం మీరు భూమిని విశ్రాంతి తీసుకోనివ్వాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉంటుంది. మీరు మీ పొలాల్లో విత్తనాలు చల్లకూడదు లేక మీ ద్రాక్షాతోటల్లో తీగలను కత్తిరించకూడదు. మీ పంట కోత అయిపోయిన తర్వాత వాటంతట అవే పెరిగే పంటను మీరు కోయకూడదు. కత్తిరించ బడని ద్రాక్షాతీగెలనుండి ద్రాక్షా పండ్లను మీరు కూర్చగూడదు. భూమికి అది విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది.

“భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది గాని మీకు మాత్రం యింకా సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ ఆడ, మగ సేవకులందరికీ సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ కూలి వాళ్లకు, మీ దేశంలో నివసించే విదేశీయులకు ఆహారం ఉంటుంది. మీ పశువులు, ఇతర జంతువులు తినేందుకు సరిపడినంత ఆహారం ఉంటుంది.

ఉత్సవ కాలము-విమోచన సంవత్సరం (50వ సంవత్సర పండుగ కాలం)

“ఏడేసి సంవత్సరాల చొప్పున ఏడు ఏడుల సంవత్సరాలనుకూడ మీరు లెక్కించాలి. అది 49 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో దేశంలో ఏడు సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది. ప్రాయశ్చిత్తం రోజున పొట్టేలు కొమ్మును మీరు ఊదాలి. అది ఏడో నెల పదోరోజు. పొట్టేలు కొమ్మును మీరు దేశ వ్యాప్తంగా ఊదాలి. 10 50వ సంత్సరాన్ని మీరు ఒక ప్రత్యేక సంవత్సరంగా చేయాలి. మీ దేశంలో నివసించే మనుష్యులందరికీ మీరు స్వతంత్రం ప్రకటించాలి. ఇది బూరధ్వని చేసే మహోత్సవ కాలం అని పిలువబడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. మరియు మీలో ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి తిరిగి వెళ్లాలి. 11 50వ సంవత్సరం మీకు ప్రత్యేక సంబరంగా వుంటుంది. ఆ సంవత్సరములో విత్తనాలు చల్లవద్దు. వాటంతట అవే మొలిచే మొక్కల్ని కోయవద్దు. కత్తిరించబడని ద్రాక్షావల్లులనుండి ద్రాక్షాపండ్లు కూర్చవద్దు. 12 అది బూరధ్వని చేసే 50వ సంవత్సర పండుగ మహోత్సవ కాలం. అది మీకు పవిత్ర సమయంగా ఉంటుంది. పొలంనుండి వచ్చే పంటలను మీరు తినాలి. 13 బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ప్రతి వ్యక్తీ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి.

14 “నీ పొరుగువానికి మీ భూమిని అమ్మినప్పుడు నీవు అతనికి మోసం చేయవద్దు. మరియు నీవు అతని వద్ద భూమిని కొన్నప్పుడు అతడ్ని నిన్ను మోసం చేయనీయకు. 15 నీ పొరుగువాని భూమిని నీవు కొనాలనుకొన్నప్పుడు, గడచిన బూరధ్వని చేసే మహోత్సవ కాలంనుండి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కచూచి, దాన్ని బట్టి ధర నిర్ణయం చేయాలి. ఒకవేళ నీవు భూమి అమ్మితే, పంటలు కోసిన సంవత్సరాలు లెక్కించి, ఆ లెక్క ప్రకారం ధర నిర్ణయించాలి. 16 చాలా సంవత్సరాలు ఉంటే, ఖరీదు ఎక్కువ ఉంటుంది. సంవత్సరాలు తక్కువ ఉంటే ఖరీదు తగ్గించాలి. ఎందుచేతనంటే నీ పొరుగువాడు నిజానికి కొన్ని పంటలు మాత్రమే నీకు అమ్ముతున్నాడు. వచ్చే ఉత్సవంలో ఆ భూమి తిరిగి అతని కుటుంబ పరం అవుతుంది. 17 మీరు ఒకరికి ఒకరు మోసం చేయకూడదు. మీ దేవుణ్ణి మీరు ఘనపర్చాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి.

యాకోబు 1:2-8

విశ్వాసము, జ్ఞానము

2-3 నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు.

మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు. కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము. అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు.

యాకోబు 1:16-18

16 నా ప్రియమైన సోదరులారా! మోసపోకండి. 17 ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్ఠమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. 18 దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు.

లూకా 12:13-21

పిసినారి ఉపమానం

13 ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు.

14 యేసు, “నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు?” అన్నాడు. 15 ఆ తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని యేసు అన్నాడు.

16 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగాపంట పండింది. 17 అతడు ‘నేనేం చేయాలి? నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే’ అని తన మనస్సులో ఆలోచించసాగాడు.

18 “‘ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను’ అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు, తనతో 19 ‘అదృష్టవంతుడివి, సంవత్సరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, ఆనందించు’ అని చెప్పుకుంటానని అనుకొన్నాడు.

20 “కాని దేవుడు అతనితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి ఎవరు అనుభవిస్తారు?’ అని అడిగాడు.

21 “ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా ఉంటుంది.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International