Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 75-76

సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
    మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
    నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.

దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
    న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
    దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”

4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
    కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”

తూర్పునుండిగాని పడమరనుండిగాని
    ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
    దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
    ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
    అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
    దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
    ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
    మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.

సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.

76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
    దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
    దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
    కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.

దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
    తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
    వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
    బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
    రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
దేవా, నీవు భీకరుడవు.
    నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
    దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
    భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
    నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.

11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
    ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
    తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
    భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.

కీర్తనలు. 23

దావీదు కీర్తన.

23 యెహోవా నా కాపరి
    నాకు కొరత ఉండదు
పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
    ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
    ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
    నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
    నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
    నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
    నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
    మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.

కీర్తనలు. 27

దావీదు కీర్తన.

27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
    నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
    కనుక నేను ఎవరికి భయపడను.
దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
    వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
    వారు కాలు తప్పి పడిపోదురు.
అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
    యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.

యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
    నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
    ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
    యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”

నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
    ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
    ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
    అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
    యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.

యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
    నా మీద దయ చూపించుము.
యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
    వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
    కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
    నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
    అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
    సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
    నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
    నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
    బలంగా, ధైర్యంగా ఉండుము.
    యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.

లేవీయకాండము 23:23-44

బూరల పండుగ

23 మరల మోషేతో యెహోవా చెప్పాడు: 24 “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. ఏడవ నెల మొదటి రోజున మీకు ప్రత్యేకమైన విశ్రాంతి రోజు ఉండాలి. అప్పుడు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ప్రత్యేక జ్ఞాపకార్థ సమయంగా మీరు బూర ఊదాలి. 25 ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీరు యెహోవాకు హోమ అర్పణలు అర్పించాలి.”

ప్రాయశ్చిత్త దినం

26 మోషేతో యెహోవా చెప్పాడు, 27 “ఏడవ నెల పదవరోజు ప్రాయశ్చిత్త దినంగా ఉంటుంది. ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు భోజనం చేయకూడదు, యెహోవాకు మీరు హోమ అర్పణ తీసుకొని రావాలి. 28 ఆ రోజున మీరు ఏ పని చేయకూడదు. ఎందుచేతనంటే అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజు, యాజకులు యెహోవా ఎదుటికి వెళ్లి, మిమ్మల్ని పవిత్రం చేసే ఆచారక్రమాన్ని జరిగిస్తారు.

29 “ఆ రోజున భోజనం చేయకుండా ఉండేందుకు ఎవరైనా తిరస్కరిస్తే, ఆ వ్యక్తిని తన ప్రజలనుండి వేరు చేయాలి. 30 ఆ రోజున ఎవరైనా పని చేస్తే ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను నాశనం చేస్తాను. 31 మీరు అసలు ఏమీ పని చేయాకూడదు. మీరు ఎక్కడ నివసించినా ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. 32 అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ఈ ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. ఆ సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ఈ ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.”

పర్ణశాలల పండుగ

33 మరల మోషేతో యెహోవా చెప్పాడు, 34 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఏడవ నెల పదిహేనవ తేదీన పర్ణశాలల పండుగ. యెహోవాకు ఈ పండుగ ఏడు రోజులపాటు కొనసాగుతుంది. 35 మొదటి రోజున పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు. 36 ఏడు రోజులు యెహోవాకు హోమార్పణలు మీరు అర్పించాలి. ఎనిమిదో రోజున మీకు మరో పవిత్ర సమావేశం జరుగుతుంది. మీరు యెహోవాకు హోమార్పణలు అర్పించాలి. ఇది పవిత్ర సమావేశంగా ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు.

37 “అవి యెహోవా ప్రత్యేక పండుగలు. ఆ పండుగల్లో పవిత్ర సమావేశాలు జరుగుతాయి. అర్పణలు, బలిఅర్పణలు, పానార్పణలు, దహనబలులు, ధాన్యార్పణలు మీరు యెహోవాకు తీసుకొని రావాల్సిన హోమార్పణలు. ఆ కానుకలు తగిన సమయంలో మీరు తీసుకొని రావాలి. 38 యెహోవా సబ్బాతు రోజులు జ్ఞాపకం చేసుకోవటంతోబాటు ఈ పండుగలన్నీ మీరు ఆచరించాలి. యెహోవాకు మీరు అర్పించే మీ ఇతర అర్పణలుగాక ఈ కానుకలు అర్పించాలి. మీ ప్రత్యేక వాగ్దానాల చెల్లింపుగా మీరు అర్పించే అర్పణలు గాక వీటిని మీరు అర్పించాలి. మీరు యెహోవాకు ఇవ్వాలనుకొన్న ప్రత్యేక అర్పణలుకాక ఇవి మీరు ఇవ్వాలి.

39 “ఏడవ నెల పదిహేనవ రోజున, దేశంలో మీరు పంటలు కూర్చుకొన్నప్పుడు, యెహోవా పండుగను ఏడు రోజుల పాటు మీరు ఆచరించాలి. మొదటి రోజున, ఏడో రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి. 40 మొదటి రోజు పండ్ల చెట్లనుండి మంచి పండ్లు మీరు కూర్చాలి. ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలువల దగ్గరి నిరవంజి చెట్లు మీరు తీసుకోవాలి. మీ యెహోవా దేవుని ఎదుట ఏడు రోజులు మీరు పండుగ ఆచరించాలి. 41 ప్రతి సంవత్సరం ఏడు రోజులు యెహోవాకు పండుగగా మీరు దీనిని ఆచరించాలి. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ఏడవ నెలలో మీరు ఈ పండుగను ఆచరించాలి. 42 ఏడు రోజులు తాత్కాలిక పర్ణశాలల్లో మీరు నివసించాలి. ఇశ్రాయేలీయులలో పుట్టిన వాళ్ళంతా ఆ పర్ణశాలల్లోనే నివసించాలి. 43 ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి నేను బయటకు తీసుకొని వచ్చినప్పుడు, తాత్కాలిక గుడారాల్లో నేను వారిని నివసింపజేశానని మీ సంతానం అంతా తెలుసుకోవాలి. నేను మీ దేవుడనైన యెహోవాను!”

44 కనుక యెహోవా పండుగ రోజులు అన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే చెప్పాడు.

2 థెస్సలొనీకయులకు 3

మా కోసం ప్రార్థించండి

సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే మా కోసం ప్రార్థించండి. ప్రభువు సందేశం మీలో వ్యాపించిన విధంగా త్వరలోనే మిగతా వాళ్ళలో కూడా వ్యాపించి కీర్తి చెందాలని ప్రార్థించండి. విశ్వాసం అందరిలో ఉండదు. కనుక దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి మేము రక్షింపబడాలని ప్రార్థించండి.

కాని ప్రభువు నమ్మతగినవాడు. కనుక ఆయన మిమ్మల్ని సాతాను నుండి రక్షించి మీకు శక్తి కలిగిస్తాడు. మా ఆజ్ఞల్ని పాటిస్తున్నారనీ ఇక ముందుకునూ పాటిస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకం మాకు ప్రభువు వల్ల కలిగింది. తండ్రియైన దేవునిలో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న సహనము మీ హృదయాల్లో నింపబడాలని మా అభిలాష.

పని చెయ్యటం మీ కర్తవ్యం

సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు పేరిట మేము ఆజ్ఞాపిస్తున్నదేమనగా, మా నుండి విన్న క్రీస్తు సందేశం ప్రకారం జీవించక అక్రమంగా జీవిస్తున్న ప్రతి సోదరునితో సాంగత్యం చెయ్యకండి. మమ్మల్ని అనుసరించాలని మీకు బాగా తెలుసు. మేము మీతో ఉన్నప్పుడు సోమరులంగా ఉండలేదు. అంతేకాక మేము ఎవరి ఇంట్లోనైనా ఊరికే భోజనం చేయలేదు. మీలో ఎవ్వరికీ కష్టం కలిగించరాదని మేము రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసాము. మీ నుండి అలాంటి సహాయం కోరే అధికారం మాకు ఉంది. కాని మీకు ఆదర్శంగా ఉండాలని అలా చేసాము. 10 మేము మీతో ఉన్నప్పుడే, “మనిషి పని చేయకపోతే భోజనం చేయకూడదు” అని చెప్పాము.

11 మీలో కొందరు సోమరులని విన్నాము. వాళ్ళు పని చెయ్యకపోవటమే కాకుండా ఇతరుల విషయంలో జోక్యం కలుగ చేసుకొంటున్నారని విన్నాము. 12 వాళ్ళు ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోరాదని, తాము తినే ఆహారం పనిచేసి సంపాదించాలని యేసు క్రీస్తు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. 13 ఇక మీ విషయమంటారా, మంచి చెయ్యటం మానకండి.

14 ఈ లేఖలో వ్రాసిన మా ఉపదేశం ఎవరైనా పాటించకపోతే అలాంటివాళ్ళను ప్రత్యేకంగా గమనించండి. అలాంటివాణ్ణి సిగ్గుపడేటట్లు చెయ్యటానికి అతనితో సాంగత్యం చేయకండి. 15 అయినా అతణ్ణి శత్రువుగా పరిగణించకుండా సోదరునిగా భావించి అతణ్ణి వారించండి.

చివరి మాట

16 శాంతిని ప్రసాదించే ప్రభువు మీకు అన్ని వేళలా, అన్ని విధాలా శాంతి ప్రసాదించు గాక! పైగా ఆయన మీ అందరికీ తోడై ఉండుగాక!

17 పౌలను నేను, నా స్వహస్తాలతో మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా లేఖలన్నిటిలో నేను ఇదే విధంగా సంతకం చేస్తాను. ఇది నా పద్ధతి.

18 మన యేసు క్రీస్తు అనుగ్రహం మీ అందరికీ లభించుగాక!

మత్తయి 7:13-21

పరలోకానికి, నరకానికి మార్గాలు

(లూకా 13:24)

13-14 “నరకానికి వెళ్ళే మార్గము సులభంగా ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలా మంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్ళే మార్గము కష్టంగా ఉంటుంది. దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు. ఇది గమనించి, ఇరుకైన ద్వారాన్నే ప్రవేశించండి.

ప్రజలు చేయునది వారేమైయున్నారని చూపుతుంది

(లూకా 6:43-44; 13:25-27)

15 “కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొఱ్ఱె తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. కాని లోపల క్రూరమైన తోడేళ్ళలా ఉంటారు. 16 వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షాపండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా? 17 మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి. పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి. 18 మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు. పులువు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు. 19 దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు. 20 అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు.

21 “నన్ను ప్రభూ! ప్రభూ! అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారం నడచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International