Book of Common Prayer
106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
2 యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
3 దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.
4 యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
5 యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.
6 మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
7 యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు.
ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి
విరోధంగా ఎదురు తిరిగారు.
8 అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు,
ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని.
9 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది.
దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు.
10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు.
వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు.
11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచి, కప్పివేసాడు.
వారి శత్రువులు ఒక్కడూ తప్పించుకోలేదు!
12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు.
వారు ఆయనకు స్తుతులు పాడారు.
13 కాని దేవుడు చేసిన వాటిని మన పూర్వీకులు వెంటనే మరచిపోయారు.
వారు దేవుని సలహా వినలేదు.
14 మన పూర్వీకులు ఎడారిలో ఆకలిగొన్నారు.
అరణ్యంలో వారు దేవుణ్ణి పరీక్షించారు.
15 కాని మన పూర్వీకులు అడిగిన వాటిని దేవుడు వారికి ఇచ్చాడు.
అయితే దేవుడు వారికి ఒక భయంకర రోగాన్ని కూడా ఇచ్చాడు.
16 ప్రజలు మోషే మీద అసూయ పడ్డారు.
యెహోవా పవిత్ర యాజకుడు అహరోను మీద వారు అసూయపడ్డారు.
17 కనుక ఆ అసూయపరులను దేవుడు శిక్షించాడు. భూమి తెరచుకొని దాతానును మింగివేసింది.
తరువాత భూమి మూసుకొంటూ అబీరాము సహచరులను కప్పేసింది.
18 అప్పుడు ఒక అగ్ని ఆ ప్రజాసమూహాన్ని కాల్చివేసింది.
ఆ అగ్ని ఆ దుర్మార్గులను కాల్చివేసింది.
19 హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను చేశారు.
వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు.
20 ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని
వారి మహిమ గల దేవునిగా మార్చేశారు.
21 మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు.
ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు.
22 హాము దేశంలొ[a] దేవుడు అద్భుత కార్యాలు చేశాడు.
దేవుడు ఎర్ర సముద్రం దగ్గర భీకర కార్యాలు చేశాడు.
23 దేవుడు ఆ ప్రజలను నాశనం చేయాలని కోరాడు.
కాని దేవుడు ఏర్పరచుకొన్న సేవకుడు మోషే ఆయనను నివారించాడు.
దేవునికి చాలా కోపం వచ్చింది.
కాని దేవుడు ఆ ప్రజలను నాశనం చేయకుండా మోషే అడ్డుపడ్డాడు.
24 అంతట ఆ ప్రజలు ఆనందకరమైన కనాను దేశంలోనికి వెళ్లేందుకు నిరాకరించారు.
ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలను ఓడించుటకు దేవుడు వారికి సహాయం చేస్తాడని ఆ ప్రజలు నమ్మలేదు.
25 మన పూర్వీకులు దేవునికి విధేయులవుటకు నిరాకరించారు.
26 అందుచేత వారు అరణ్యంలోనే మరణిస్తారని దేవుడు ప్రమాణం చేసాడు.
27 వారి సంతతివారిని ఇతర ప్రజలు ఓడించేలా చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు.
మన పూర్వీకులను రాజ్యాలలో చెదరగొడతానని దేవుడు ప్రమాణం చేసాడు.
28 దేవుని ప్రజలు బయల్పెయోరు అనే బయలు దేవత పూజలో పాల్గొన్నారు.
చచ్చినవారికి, విగ్రహానికి బలియిచ్చిన మాంసాన్ని దేవుని ప్రజలు తిన్నారు.
29 దేవుడు తన ప్రజల మీద చాలా కోపగించాడు. మరియు దేవుడు వారిని రోగులనుగా చేసాడు.
30 కాని ఫీనెహాసు దేవుని ప్రార్థించాడు.
దేవుడు రోగాన్ని ఆపుచేసాడు.
31 ఫీనెహాసు చాలా మంచి పని చేసాడు అని దేవునికి తెలుసు.
మరియు శాశ్వతంగా ఎప్పటికి దేవుడు దీనిని జ్ఞాపకం చేసుకొంటాడు.
32 మెరీబా వద్ద ప్రజలకు కోపం వచ్చింది.
మోషేతో ఏదో చెడు కార్యము వారు చేయించారు.
33 ఆ ప్రజలు మోషేను చాలా కలవర పెట్టారు.
అందుచేత మోషే అనాలోచితంగా మాటలు అనేశాడు.
34 కనానులో నివసిస్తున్న ఇతర ప్రజలను నాశనం చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు.
కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు.
35 ఇశ్రాయేలు ప్రజలు ఇతర ప్రజలతో కలిసి పోయారు.
ఇతర ప్రజలు చేస్తున్న వాటినే వీరు కూడా చేశారు.
36 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా తయారయ్యారు.
ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు పెట్టారు.
37 దేవుని ప్రజలు తమ స్వంత బిడ్డలను సహితం చంపి
ఆ బిడ్డలను ఆ దయ్యాలకు బలియిచ్చారు.
38 దేవుని ప్రజలు నిర్దోషులను చంపివేసారు.
వారు తమ స్వంత బిడ్డలనే చంపి ఆ బూటకపు దేవుళ్లకు అర్పించారు.
39 కనుక ఆ ఇతర ప్రజల పాపాలతో దేవుని ప్రజలు మైలపడ్డారు.
దేవుని ప్రజలు తమ దేవునికి అపనమ్మకస్తులై ఆ ఇతర ప్రజలు చేసిన పనులనే చేసారు.
40 దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది.
దేవుడు వారితో విసిగిపోయాడు!
41 దేవుడు తన ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగించాడు.
వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా దేవుడు చేసాడు.
42 దేవుని ప్రజలను శత్రువులు తమ అదుపులో పెట్టుకొని
వారికి జీవితాన్నే కష్టతరం చేసారు.
43 దేవుడు తన ప్రజలను అనేకసార్లు రక్షించాడు.
కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన వాటినే చేశారు.
దేవుని ప్రజలు ఎన్నెన్నో చెడ్డపనులు చేసారు.
44 కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టారు.
ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు.
45 దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొన్నాడు.
దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప ప్రేమతో వారిని ఆదరించాడు.
46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు.
అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు.
47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు.
నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా
ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము.
అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు.
మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.
ప్రత్యేక పండుగలు
23 మోషేతో యెహోవా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: యెహోవా ఏర్పాటు చేసిన పండుగలను పవిత్ర సమావేశాలుగా మీరు ప్రకటించాలి. నా ప్రత్యేక దినాలు ఏవంటే:
సబ్బాతు
3 “ఆరు రోజులు పని చేయండి. అయితే ఏడో రోజు సబ్బాతు, అది పవిత్ర సమావేశం జరిగే రోజు. మీరేమీ పని చేయకూడదు. మీ అందరి గృహాల్లోను ఆది యెహోవా నియమించిన సబ్బాతు.
పస్కా
4 “ఇవి యెహోవా ఏర్పాటు చేసిన పండుగ రోజులు. నిర్ణీత సమాయాల్లో పవిత్ర సమావేశాల్ని గూర్చి మీరు ప్రకటించాలి. 5 మొదటి నెల 14వ రోజు సాయంకాలం యెహోవా పస్కాపండుగ.
పులియని రొట్టెల పండుగ
6 “అదే నెల 15వ రోజు పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెలను ఏడు రోజులు మీరు తినాలి. 7 ఈ సెలవుల్లో మొదటి రోజున మీకు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. 8 ఏడు రోజులవరకు మీరు యెహోవాకు బలి అర్పించాలి. ఏడవ రోజున ఒక పవిత్ర సమావేశం జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.”
ప్రథమ ఫలాల పండుగ
9 మోషేతో యెహోవా చెప్పాడు: 10 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇచ్చే దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు అక్కడ పంటలు కోస్తారు. ఆ సమయంలో మీ పంటలోని ప్రథమ పనను యాజకుని దగ్గరకు మీరు తీసుకొని రావాలి. 11 ఆ పనను యాజకుడు యెహోవా ఎదుట అల్లాడిస్తాడు. అప్పుడు మీరు స్వీకరించబడతారు. యాజకుడు ఆదివారం ఉదయం ఆ పనను అల్లాడిస్తాడు.
12 “మీరు పనను అల్లాడించే రోజున, ఒక సంవత్సరపు పోతు గొర్రె పిల్లను మీరు అర్పించాలి. ఆ గొర్రె పిల్లకు ఏ దోషం ఉండకూడదు. ఆ గొర్రెపిల్ల యెహోవాకు దహనబలి. 13 ఒలీవ నూనెతో కలిపిన రెండు పదోవంతుల పిండిని ధాన్యార్పణగా మీరు అర్పించాలి. ముప్పావు ద్రాక్షారసమును కూడా మీరు అర్పించాలి. ఆ అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన. 14 దేవునికి ఆ అర్పణలు చెల్లించేవరకు, కొత్త ధాన్యంగాని, ఫలాలుగాని, లేక కొత్త ధాన్యంతో చేయబడిన రొట్టెగాని మీరు తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా సరే మీ తరాలన్నింటికీ ఈ ఆజ్ఞ కొన సాగుతుంది.
పెంతెకొస్తు పండుగ
15 “ఆ ఆదివారం మొదలు కొని (నైవేద్యం కోసం మీరు పన తీసుకొని వచ్చిన రోజునుండి) ఏడు వారాలు లెక్కించండి. 16 ఏడు వారాల తర్వాత ఆదివారం నాడు (అంటే యాభైయవ రోజు) యెహోవాకు మీరు కొత్త ధాన్యార్పణను తీసుకొని రావాలి. 17 ఆ రోజున అనగా ఆదివారంనాడు మీ యిండ్ల నుండి రెండు రొట్టెలు తీసుకొని రండి. ఆ రొట్టె నైవేద్యంకోసం. 4 పావులు గోధుమ పిండిలో, పులిసిన పదార్థం ఉపయోగించి ఆ రొట్టెలు తయారుచేయాలి. అది మీ ప్రథమ పంటల్లోనుంచి మీరు యెహోవాకు అర్పించే కానుక.
18 “ప్రజలు ధాన్యార్పణతో బాటు ఒక దూడను ఒక పొట్టేలును, ఏడాది పోతును, ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి. వాటిలో ఏ దోషమూ ఉండకూడదు. అవి యెహోవాకు దహనబలి అర్పణ. అవి హోమంగా అర్పించబడి, యెహోవాకు కమ్మని సువాసనగా ఉంటాయి. 19 పాపపరిహారార్థ బలిగా ఒక మేకపోతును, సమాధాన బలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.
20 “నైవేద్యంగా ప్రథమ ఫలంలోని రొట్టెతో పాటు వాటిని, రెండు గొర్రెపిల్లలను యెహోవా ఎదుట యాజకుడు అల్లాడించాలి. అవి యెహోవాకు పవిత్రమైనది. అవి యాజకునికి చెందుతాయి. 21 అదే రోజున మీరు ఒక పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రోజున మీరేమి పని చేయకూడదు. మీ గృహాలన్నింటిలో ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.
22 “మరియు, మీరు మీ పొలంలో పంట కోసేటప్పుడు పొలం అంచులమట్టుకు కోసి వేయవద్దు. నేలమీద పడే కంకులు ఏరుకోవద్దు. పేదవారికోసమూ, మీ దేశం గుండా ప్రయాణించే విదేశీయుల కోసమూ వాటిని విడిచిపెట్టండి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి!”
పాప పురుషుడు
2 సోదరులారా! మన యేసు ప్రభువు రాకను గురించి, ఆయనతో జరుగబోయే సమావేశాన్ని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 2 ఎవరైనా వచ్చి తమకు మేము ఏదైనా ఉత్తరం వ్రాసినట్లు లేదా ప్రభువు రానున్న దినం వచ్చినట్లు తెలిసిందని చెప్పినా, లేక ఆత్మ ద్వారా ఆ విషయం తెలిసిందని చెప్పినా, లేక ఆ విషయాన్ని గురించి మిమ్మల్ని ఎవరైనా వారించినా భయపడకండి. దిగులు చెందకండి. 3 మిమ్మల్ని ఎవ్వరూ ఏ విధంగా మోసం చేయకుండా జాగ్రత్త పడండి. దేవుని పట్ల తిరుగుబాటు జరిగి, ఆ నాశన పుత్రుడు, దుష్టుడు కనిపించేదాకా ఆ రోజు రాదు. 4 అంతేగాక దేవునికి సంబంధించిన ప్రతిదానిపై ఆ భ్రష్టుడు తనను తాను హెచ్చించుకొంటూ మందిరంలో ప్రతిష్ఠించుకుని తానే దేవుణ్ణని ప్రకటిస్తాడు.
5 నేను మీతో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను. మీకు జ్ఞాపకం ఉంది కదా? 6 ఆ భ్రష్టుని రాకను ఏది అడ్డగిస్తుందో మీకు తెలుసు. సరియైన సమయానికి రావాలని వాని రాక ఆపబడింది. 7 వాని అధర్మం రహస్యంగా పనిచేస్తూ తన శక్తిని చూపటం అప్పుడే మొదలు పెట్టింది. దాన్ని అడ్డగించేవాడు ఒకాయన ఉన్నాడు. వాణ్ణి అడ్డగిస్తున్నవాడు తీసివేయబడేదాకా ఆయన వాణ్ణి అడ్డగిస్తూనే ఉంటాడు. 8 అప్పుడు ఆ భ్రష్టుడు కనిపిస్తాడు. యేసు ప్రభువు వాణ్ణి తన ఊపిరితో హతమారుస్తాడు. యేసు తేజోవంతంగా ప్రత్యక్షమై ఆ భ్రష్టుణ్ణి నాశనం చేస్తాడు.
9 ఆ భ్రష్టుడు సాతాను శక్తితో వచ్చి రకరకాల మహత్కార్యాలు చేస్తాడు. దొంగ చిహ్నాలు, అద్భుతాలు చేసి మోసం చేస్తాడు. 10 నాశనం కానున్నవాళ్ళను అన్ని విధాలా మోసం చేస్తాడు. వాళ్ళు సత్యాన్ని ప్రేమించటానికి, దేవుని రక్షణను స్వీకరించటానికి నిరాకరించారు కనుక నశించిపోతారు. 11 ఈ కారణంగా దేవుడు వాళ్ళకు మోసం చేసే శక్తిని పంపుతాడు. వాళ్ళు దాన్ని నమ్ముతారు. 12 సత్యాన్ని నమ్మక అధర్మంగా జీవించాలని నిశ్చయించుకొన్నవాళ్ళందరినీ శిక్షిస్తాడు.
బలంగా నిలబడండి
13 సోదరులారా! ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ కోసం మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉండాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరచుటవల్ల, సత్యంలో మీకున్న విశ్వాసం వల్ల దేవుడు మిమ్మల్ని రక్షించటానికి కాలానికి ముందే ఎన్నుకొన్నాడు. 14 మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క మహిమలో మీరు భాగం పంచుకోవాలని, మీరు రక్షణ పొందాలనీ దేవుడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు. 15 సోదరులారా! మేము లేఖ ద్వారా మరియు మా బోధ ద్వారా బోధించిన సత్యాలను విడువకుండా నిష్ఠతో అనుసరించండి.
16 యేసు క్రీస్తు ప్రభువు, మనల్ని ప్రేమించిన మన తండ్రియైన దేవుడు మనల్ని అనుగ్రహించి మనకు అనంతమైన ధైర్యాన్ని, మంచి ఆశాభావాన్ని ఇచ్చారు. 17 దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిచి, మంచి పనులు చేయటానికి, మంచి మాటలు ఆడటానికి, మీకు ధైర్యం కలుగజేయునుగాక!
ఇతరులను విమర్షించటంలో జాగ్రతపడుము
(లూకా 6:37-38, 41-42)
7 “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అలా చేస్తే ఇతర్లు కూడ మీపై తీర్పు చెబుతారు. 2 మీరు ఇతర్లపై తీర్పు చెప్పినట్లే ఇతర్లు మీపై కూడా తీర్పు చెబుతారు. మీరు కొలిచిన కొలతతో ఇతర్లు మీకు కొలిచి ఇస్తారు.
3 “మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు. కాని మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించరెందుకు? 4 మీ కంట్లో దూలం పెట్టుకొని ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు!’ అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు? 5 కపటీ! మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయనీ! అప్పుడు నీవు స్పష్టంగా చూడకలిగి, నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును తీయకలుగుతావు.
6 “పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి. అలా చేస్తే అవి తిరగబడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. ముత్యాలను పందుల ముందు వేయకండి. వేస్తే అవి వాటిని కాళ్ళ క్రింద త్రొక్కి పాడుచేస్తాయి.
నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము
(లూకా 11:9-13)
7 “అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది. 8 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది.
9 “రొట్టె నడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా? 10 లేక చేపనడిగితే పామునెవరైనా యిస్తారా? 11 దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలోకంలోవున్న మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా యిస్తాడు.
అతి ముఖ్యమైన నియమం
12 “ప్రతి విషయంలో యితర్లు మీకోసం ఏం చెయ్యాలని మీరు ఆశిస్తారో మీరు యితర్ల కోసం అదే చెయ్యాలి. ఇదే మోషే ధర్మశాస్త్రం యొక్క, ప్రవక్తలు ప్రవచించిన వాటి యొక్క అర్థం.
© 1997 Bible League International