Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 61-62

సంగీత నాయకునికి: తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.

61 దేవా, నా ప్రార్థనా గీతం వినుము.
    నా ప్రార్థన ఆలకించుము.
నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా,
    సహాయం కోసం నీకు మొరపెడతాను.
ఎత్తయిన క్షేమస్థలానికి
    నన్ను మోసికొనిపొమ్ము.
నీవే నా క్షేమ స్థానం.
    నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే.
నీ గుడారంలో[a] నేను శాశ్వతంగా నివసిస్తాను.
    నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.

దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు.
    కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న సమస్తం నీవద్ద నుండే వస్తుంది.
రాజుకు దీర్ఘాయుష్షు దయచేయుము.
    అతన్ని శాశ్వతంగా జీవించనిమ్ము.
అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము.
    నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము.
నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను.
    నేను ప్రమాణం చేసినవాటిని ప్రతి రోజూ చేస్తాను.

సంగీత నాయకునికి: యెదూతూను రాగం. దావీదు కీర్తన.

62 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచివుంటాను.
దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
    పర్వతం మీద ఎత్తయిన నా క్షేమస్థానం దేవుడే. మహా సైన్యాలు కూడా నన్ను ఓడించలేవు.

ఇంకెంత కాలం వారు నా మీద దాడి చేస్తూ ఉంటారు?
నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను.
    పడిపోతున్న కంచెలా ఉన్నాను.
ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి
    పథకాలు వేస్తున్నారు.
వారు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    బహిరంగంగా వారు నన్ను గూర్చి మంచి మాటలు చెబుతారు,
    కాని రహస్యంగా వారు నన్ను శపిస్తారు.

దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను.
    దేవుడు ఒక్కడే నా నిరీక్షణ.
దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు.
    పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే.
నా కీర్తి, విజయం దేవుని నుండి వస్తాయి.
    ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం
ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి.
    మీ సమస్యలు దేవునితో చెప్పండి.
    దేవుడే మన క్షేమ స్థానం.

మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు.
    నిజంగా సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు.
వారు గాలిబుడగల్లా వట్టి ఊపిరియైయున్నారు.
10 బలవంతంగా విషయాలను చేజిక్కించుకొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు.
    దొంగిలించడం ద్వారా నీకు ఏదైనా లాభం కలుగుతుందని తలంచవద్దు.
నీవు ధనికుడవైతే నీ సహాయం కోసం
    ధనాన్ని నమ్ముకొనవద్దు.
11 నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబుతున్నాడు,
    “బలము దేవుని నుండే వస్తుంది.”

12 నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది.
    ఒకడు చేసినవాటినిబట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు.

కీర్తనలు. 68

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

68 దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము.
    ఆయన శత్రువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారిపోయెదరుగాక!
గాలికి ఎగిరిపోయే పొగలా
    నీ శత్రువులు చెదరిపోవుదురుగాక.
అగ్నిలో మైనం కరిగిపోయేలా
    నీ శత్రువులు నాశనం చేయబడుదురుగాక.
కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు.
    మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు.
దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి.
    ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు.
ఆయన పేరు యాహ్.[a]
    ఆయన నామాన్ని స్తుతించండి.
ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు.
    దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు.
ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు.
    దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు.
    కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.

దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు.
    ఎడారిగుండా నీవు నడిచావు.
భూమి కంపించింది.
    దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది.
దేవా, నీవు వర్షం కురిపించావు
    మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు.
10 నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి.
    దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచివాటిని యిచ్చావు.
11 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు.
    నా శుభవార్త చెప్పడానికి అనేక మంది ప్రజలు వెళ్లారు.
12 “శక్తిగల రాజుల సైన్యాలు పారిపోతున్నాయి.
    యుద్ధం నుండి సైనికులు తెచ్చే వస్తువులు ఇంటి వద్ద స్త్రీలు పంచుకొంటారు.
13 ఇంటి దగ్గర ఉండిపోయిన మనుష్యులు ఆ ఐశ్వర్యాలను పంచుకొంటారు.
    వారు పావురపు రెక్కలకు వెండిపూత పూస్తారు. ఆ రెక్కలను వారు బంగారు పూతతో తళ తళ మెరిపిస్తారు.”

14 సల్మోను కొండ మీద శత్రురాజులను దేవుడు చెదరగొట్టాడు.
    వారు పడిపోతున్న మంచులా ఉన్నారు.
15 బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి.
16 బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను చిన్న చూపు చూస్తున్నావు?
    దేవుడు ఆ కొండను ప్రేమిస్తున్నాడు.
    యెహోవా తాను శాశ్వతంగా అక్కడ నివసించాలని నిర్ణయించుకొన్నాడు.
17 యెహోవా పరిశుద్ధమైన సీయోను కొండకు వస్తున్నాడు.
    ఆయన వెనుక ఆయన రథాలు లక్షలాదిగా ఉన్నాయి.
18 ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు.
    ఆయన తన బంధీల బృందాలను నడిపించాడు.
ఆయన మనుష్యులనుండి అనగా ఆయనను
    వ్యతిరేకించిన ప్రజలనుండి కూడ కానుకలు తీసుకొన్నాడు[b]
19 యెహోవాను స్తుతించండి.
    మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు.
    దేవుడు మనల్ని రక్షిస్తాడు.

20 ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు.
    మన యెహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు.
21 దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు.[c]
    దేవుడు తనకు విరోధంగా పోరాడినవారిని శిక్షిస్తాడు.
22 నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను.
    సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను.
23 కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు
    కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.”

24 విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు.
    నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు.
25 గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు.
    మధ్యలో ఆడపడుచులు తంబురలు వాయిస్తారు.
26 మహా సమాజంలో దేవుని స్తుతించండి.
    ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
27 చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు.
    యూదా మహా వంశం అక్కడ ఉంది.
    జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు.

28 దేవా, నీ శక్తి మాకు చూపించుము,
    దేవా, గత కాలంలో మాకోసం నీవు ఉపయోగించిన నీ శక్తి మాకు చూపించుము.
29 రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు,
    యెరూషలేములోని మందిరానికి తీసుకొని వస్తారు.
30 ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము.
    ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము
ఆ రాజ్యాలను యుద్ధంలో
    నీవు ఓడించావు.
ఇప్పుడు వారు నీ వద్దకు వెండి
    తీసుకొని వచ్చునట్లు చేయుము.
31 వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా చేయుము.
    దేవా, ఇథియోపియా (కూషు) వారు వారి ఐశ్వర్యాన్ని నీ వద్దకు తెచ్చేలా చేయుము.
32 భూరాజులారా, దేవునికి పాడండి.
    మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి.

33 దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు.
    ఆయన శక్తిగల స్వరాన్ని ఆలకించండి.
34 మీ దేవుళ్లందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు.
    ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు.
35 దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు.
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు శక్తిని, బలాన్ని ఇస్తాడు.
దేవుని స్తుతించండి.

లేవీయకాండము 16:20-34

20 “అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని, అహరోను పవిత్రం చేస్తాడు. అలా జరిగిన తర్వాత ఆ మేకను ప్రాణంతోనే యెహోవా సన్నిధికి అహరోను తీసుకొని వస్తాడు. 21 బతికే ఉన్న ఆ మేక తలమీద అహరోను తన రెండు చేతులు ఉంచుతాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పాపాలను, నేరాలను ఆ మేకమీద అహరోను ఒప్పుకొంటాడు. ఈ విధంగా అహరోను ప్రజల పాపాలను మేక నెత్తిమీద మోపుతాడు. అప్పుడు ఆ మేకను అరణ్యంలోకి వదిలి పెట్టేస్తాడు. ఈ మేకను అతను తోలివేయటానికి పక్కనే ఒక మనిషి సిద్ధంగా నిలబడి ఉంటాడు. 22 కనుక ప్రజలందరి పాపాలను ఆ మేక తనమీద మోసుకొని ఖాళీ అరణ్యంలోనికి తీసుకొనిపోతుంది. ఆ మేకను తోలు కొనిపోయిన వాడు అరణ్యంలో దానిని విడిచి పెట్టివేయాలి.

23 “అప్పుడు అహరోను సన్నిధి గుడారంలో ప్రవేశించాలి. పవిత్రస్థలంలోనికి వెళ్లినప్పుడు తాను ధరించిన వస్త్రాలను అతడు తీసివేయాలి. వాటిని అక్కడే వదిలివేయాలి. 24 పవిత్ర స్థలంలో అతడు నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు తన ఇతర ప్రత్యేక వస్త్రాలు ధరించాలి. అతడు బయటకు వచ్చి తనకోసం దహన బలిని, ప్రజలకోసం దహనబలిని అర్పించాలి. అతని కోసం, ప్రజలకోసం అతడు తనను పవిత్రంచేసుకోవాలి. 25 అప్పుడు పాపపరిహారార్థ బలి పశువు యొక్క కొవ్వును అతడు బలిపీఠం మీద దహించాలి.

26 “విడిచిపెట్టే మేకను అరణ్యంలో విడిచి పెట్టిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును.

27 “పాపపరిహారార్థ బలిపశువులైన కోడెదూడను, మేకలను బస వెలుపలికి తీసుకొనిపోవాలి. ఈ జంతువుల రక్తం పవిత్ర వస్తువులను పవిత్రం చేసేందుకు పవిత్ర స్థలానికి తీసుకొని రాబడింది. ఆ జంతువుల చర్మాలను శవాలను, వాటి మలమును యాజకులు అగ్నితో కాల్చివేయాలి. 28 తర్వాత వాటిని కాల్చిన వ్యక్తి తన వస్త్రాలను ఉతుక్కొని, నీళ్లలో స్నానంచేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును.

29 “ఆ ఆజ్ఞ మీకు శాశ్వతంగా ఉంటుంది. ఏడవ నెల పదో రోజున మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీరేమీపని చేయకూడదు. మీ మధ్య నివసిస్తున్న విదేశీ యాత్రికులు ఎవరూ పని చేయకూడదు. 30 ఎందుచేతనంటే ఆ రోజు యాజకుడు మిమ్మల్ని పవిత్రంచేసి, మీ పాపాలను కడిగివేస్తాడు. అప్పుడు మీరు యెహోవాకు పవిత్రం చేయబడిన వారవుతారు. 31 ఇది మీకు చాల ముఖ్యమైన విశ్రాంతి రోజు. మీరు భోజనం చేయకూడదు. ఈ ఆజ్ఞ ఎప్పటికీ కొన సాగుతుంది.

32 “కనుక నియమించబడిన ప్రధాన యాజకుడు, అంటే యాజకత్వం చేసేందుకు నియమించబడ్డ మనిషి. అతడు అన్నింటినీ పవిత్రం చేసే కార్యక్రమాన్ని జరిగిస్తాడు. ఆ యాజకుడు పవిత్ర నార వస్త్రాలు ధరించాలి. 33 అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని అతడు పవిత్రం చేయాలి. యాజకులను, ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి. 34 ఇశ్రాయేలు ప్రజలను పవిత్రం చేసేందుకు ఇవ్వబడ్డ ఆ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరంలో ఒక సారి మీరు వాటిని జరిగించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల పాపాల మూలంగా వీటిని చేయవలెను.”

కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ వారు జరిగించారు.

1 థెస్సలొనీకయులకు 5:1-11

ప్రభువు రాకకు సిద్ధంగా ఉండండి

సోదరులారా! ఇవి ఎప్పుడు జరుగనున్నాయో, వాటి సమయాలను గురించి, కాలాలను గురించి మేము వ్రాయనవసరం లేదు. ప్రభువు రానున్న దినము అకస్మాత్తుగా రాత్రిపూట దొంగ వచ్చినట్లు వస్తుందని మీకు బాగా తెలుసు. ప్రజలు, “మేము శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని అంటున్నప్పుడు గర్భిణీయైన స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చినట్లే వాళ్ళు నాశనమౌతారు. తప్పించుకోలేరు.

కాని సోదరులారా! మీరు చీకట్లో లేరు. కనుక ఆ దినం మిమ్మల్ని దొంగల్లా ఆశ్చర్యపరచదు. మనం వెలుగుకు, పగటి వేళకు సంబంధించినవాళ్ళము. రాత్రికి, చీకటివేళకు సంబంధించినవాళ్ళము కాము. మరి అలాంటప్పుడు యితరుల వలె నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ్రహంతో ఉందాము. ఎందుకంటే, నిద్రపొయ్యే వాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు. త్రాగుబోతులు రాత్రివేళ త్రాగుతారు. మనం పగటికి చెందిన వాళ్ళము కనుక ఆత్మ నిగ్రహంతో ఉందాము. విశ్వాసాన్ని, ప్రేమను కవచంగాను, రక్షణ, నిరీక్షణలను శిరస్త్రాణంగాను ధరించుదాము.

ఎందుకంటే దేవుడు కోపాన్ని చూపటానికి మనల్ని ఎన్నుకోలేదు. మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ ఇవ్వటానికి ఎన్నుకొన్నాడు. 10 మనం మరణించినా, లేక బ్రతికి ఉన్నా తాను వచ్చినప్పుడు తనతో కలిసి జీవించాలని క్రీస్తు మనకోసం మరణించాడు. 11 మీరు ఎప్పటిలాగే పరస్పరం ఉత్సాహపరుచుకుంటూ, యితర్ల అభివృద్ధికి తోడ్పడుతూ ఉండండి.

మత్తయి 6:7-15

“అంతేకాక, మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కాని వాళ్ళవలె మాట్లాడవద్దు. ఆలా చేయడంవల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకొంటారు. వాళ్ళవలె చేయకండి. మీకేం కావాలో మీరడగక ముందే మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరి విధంగా ప్రార్థించాలి:

‘పరలోకంలో ఉన్న మా తండ్రీ,
    నీ పేరు సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము.
10 నీ రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే
    ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము.
11 ప్రతి రోజు మాకు కావలసిన ఆహారం మాకు దయ చేయుము.
12 ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించినరీతి,
    మేము చేసిన పాపాలను కూడా క్షమించుము.
13 మేము శోధనకు గురిఅయ్యేలా చేయవద్దు.
    పైగా మమ్ములను దుష్టుని నుండి కాపాడుము.’[a]

14 ఇతర్ల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. 15 కాని యితర్లను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International