Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 56-58

సంగీత నాయకునికి: “దూరపు సింధూర మ్రానులోని పావురము” రాగం. ఫిలిప్తీయులు దావీదును గాతులో పట్టుకొన్నప్పుడు అతడు రచించిన అనుపదగీతం.

56 దేవా, ప్రజలు నా మీద దాడి చేసారు గనుక నాకు దయ చూపించుము.
    రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు.
నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు.
    నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు.
నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ముకొంటాను.
నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.
    దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను.
నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు.
    వారు ఎల్లప్పుడూ నాకు విరోధంగా చెడు పథకాలు వేస్తున్నారు.
వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు.
    నన్ను చంపుటకు ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నారు.
దేవా, వారిని తప్పించుకోనియ్యకుము,
    వారు చేసే చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షించుము.
నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు.
    నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు
నిజంగా నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు.

కనుక సహాయం కోసం నేను నీకు మొర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు.
దేవుడు నాతో ఉన్నాడు ఇది నాకు తెలుసు.

10 దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
    యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
11 నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను.
    మనుష్యులు నన్ను బాధించలేరు.

12 దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను.
    నా కృతజ్ఞతార్పణ నేను నీకు యిస్తాను.
13 ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు.
    నేను ఓడిపోకుండా నీవు కాపాడావు.
కనుక బ్రతికి ఉన్న మనుష్యులు మాత్రమే
    చూడగల వెలుగులో నేను దేవుని ఆరాధిస్తాను.

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది.

57 దేవా, నన్ను కరుణించు
    నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము.
కష్టం దాటిపోయేవరకు
    నేను నీ శరణు జొచ్చియున్నాను.
మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను.
    దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు.
    నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన శిక్షిస్తాడు.
దేవుడు తన నిజమైన ప్రేమను
    నాకు చూపిస్తాడు.

నా జీవితం ప్రమాదంలో ఉంది.
    నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు.
ఈటెలు, బాణాలవంటి పదునైన పళ్లు,
    మనుష్యులను తినే ఖడ్గంలా పదునైన నాలుకలుగల సింహాల్లా వారున్నారు.

దేవా, నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు.
    నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.
నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు.
    వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు.
నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు.
    కాని వారే దానిలో పడ్డారు.

దేవా, నిన్ను విశ్వసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది.
    నేను నీకు స్తుతులు పాడుతాను.
నా ఆత్మా, మేలుకొనుము!
    స్వరమండలమా, సితారా, మేలుకోండి. వేకువను మనం మేల్కొందాము
నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను.
    ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.
10 నీ నిజమైన ప్రేమ ఆకాశంలోకెల్లా అత్యున్నత మేఘాలకంటె ఎత్తయింది.
11 ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు.
    ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం.

58 న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు.
    మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు.
లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు.
    ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.
ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు.
    పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే.
వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు.
    వినలేని త్రాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.
త్రాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు.
    ఆ దుర్మార్గులు అలా ఉన్నారు.

యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు.
    కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము.
ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక.
    బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక.
మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక.
    చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక.
కుండక్రింద ఉన్న నిప్పువేడిలో అతిత్వరగా
    కాలిపోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.

10 మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం
    వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు.
ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు.
11 అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది.
    లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.”

కీర్తనలు. 64-65

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

64 దేవా, నా ప్రార్థన ఆలకించుము.
    నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము.
నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము.
    ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు.
    వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.
వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీపరుని మీద వేస్తారు.
    అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడతాడు.
అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు.
    వారు వారి ఉరులను పెడతారు. “వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని” వారనుకొంటారు.
మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు.
    మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతో కష్టం.
కాని దేవుడు తన “బాణాలను” వారిమీద వేయగలడు.
    అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు.
    కాని దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు.
ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు.
    అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు.
దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు.
    వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు.
అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు.
    ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు.
10 మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి.
    వారు ఆయన్ని నమ్ముకోవాలి.
మంచి మనుష్యుల్లారా, మీరంతా యెహోవాను స్తుతించండి.

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

65 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.
    నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.
    నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,
    ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.
    నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది!
    నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.
    నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు.
వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు.
    ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.
    మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.
    మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.
దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
    దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
    నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
    నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
    భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
    అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
    బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
    లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.

లేవీయకాండము 16:1-19

ప్రాయశ్చిత్త దినం

16 యెహోవాకు ధూపం వేస్తూ అహరోను ఇద్దరు కుమారులూ చనిపోయారు. అది జరిగిన తర్వాత మోషేతో యెహోవా మాట్లాడాడు. మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీ సోదరుడైన అహరోనుతో మాట్లాడు.” పవిత్ర స్థలంలో తెర వెనుకకు అతడు వెళ్లజాలని కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయని అతనితో చెప్పు. ఆ తెర వెనుక గదిలో ఒడంబడిక పెట్టె ఉన్నది. ఆ పవిత్ర పెట్టెమీద కరుణాపీఠం ఉంది. ఆ పెట్టెకు పైగా మేఘంలో నేను ప్రత్యక్ష మవుతాను. అందుచేత యాజకుడు ఎల్లప్పుడూ ఆ గదిలోనికి వెళ్లజాలడు. అతడు ఆ గదిలోనికి వెళ్తే, అతడు మరణించవచ్చు!

“ప్రాయశ్చిత్తపు రోజున అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించక ముందు, పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును అతడు అర్పించాలి. అహరోను నీళ్లతో పూర్తిగా స్నానంచేయాలి. అప్పుడు అహరోను ఈ బట్టలు ధరించాలి. అహరోను పవిత్రమైన చొక్కా ధరించాలి. లోపల వేసుకొనే బట్టలు శరీరాన్ని అంటిపెట్టుకొనేవిగా ఉండాలి. మేలురకం దట్టిని నడుంకు కట్టుకోవాలి. మేలురకం బట్టతో తలపాగా చుట్టుకోవాలి. ఇవి పవిత్ర వస్త్రాలు.

“మరియు పాపపరిహారార్థ బలికోసం రెండు మగ మేకలను, దహనబలికోసం ఒక పొట్టేలును ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి అహరోను తీసుకోవాలి. అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించాలి. ఈ పాపపరిహారార్థ బలి తనకోసమే. అప్పుడు అతనిని, అతని కుటుంబాన్ని పవిత్రంచేసే ఆచారాన్ని అహరోను జరిగించాలి.

“తర్వాత, అహరోను ఆ రెండు మేకలను సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి. ఆ రెండు మేకలకు అహరోను చీట్లు వేయాలి. ఒకచీటి యెహోవాకు, ఇంకొకటి విడిచిపెట్టే అజాజేలుకు.[a]

“అప్పుడు అహరోను చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను యెహోవాకు అర్పించాలి. ఈ మేకను అహరోను పాపపరిహారార్థ బలిగా చేయాలి. 10 అయితే విడిచి పెట్టేందుకు చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను ప్రాణంతోనే యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి. దాన్ని పవిత్రం చేసే క్రమాన్ని యాజకుడు జరిగించాలి. తర్వాత ఈ మేక అర్యణంలో విడిచిపెట్టబడాలి.

11 “తర్వాత అహరోను తన కోసం ఒక కోడెదూడను పాపపరిహారార్థ బలిగా అర్పించాలి. తనను, తన కుటుంబాన్ని అహరోను పవిత్రం చేసుకోవాలి. అహరోను అతని కోసమే పాపపరిహారార్థ బలిగా ఆ కోడెదూడను వధించాలి. 12 అప్పుడు యెహోవా సన్నిధిలోని ధూపపీఠంనుండి ధూపార్తి నిండా నిప్పులు తీసుకోవాలి. చూర్ణం చేయబడిన పరిమళ ధూపాన్ని రెండు గుప్పెళ్ల నిండా అహరోను తీసుకోవాలి. తెర వెనుక నున్న గదిలోనికి అహరోను ఆ పరిమళ ధూపాన్ని తీసుకొని రావాలి. 13 యెహోవా సన్నిధిలో అహరోను ఆ ధూపాన్ని నిప్పుల మీద వేయాలి. అప్పుడు ఒడంబడిక పెట్టె మీద ఉన్న కరుణా పీఠాన్ని ఆ ధూపపొగ ఆవరిస్తుంది. ఈ విధంగా చేస్తే అహరోను మరణించడు. 14 అహరోను ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకొని, తన వేలితో తూర్పుకు కరుణాపీఠం మీదికి చిలకరించాలి. కరుణాపీఠం ముందర అతడు తన వేలితో ఏడుసార్లు రక్తాన్ని చిలకరించాలి.

15 “తర్వాత అహరోను ప్రజలకోసం పాప పరిహారార్థ బలి మేకను వధించాలి. తెరవెనుక ఉన్న గదిలోనికి ఈ మేక రక్తాన్ని అహరోను తీసుకొని రావాలి. కోడెదూడ రక్తంతో ఏమైతేచేసాడో అలాగే మేక రక్తంతోకూడ అహరోను చేయాలి. కరుణాపీఠం మీద, కరుణాపీఠం ఎదుట ఆ మేక రక్తాన్ని అహరోను చిలకరించాలి. 16 ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రమయిన సందర్భాలెన్నో ఉన్నాయి కనుక ఇశ్రాయేలు ప్రజల పాపాలు, నేరాలనుండి ఆ అతిపరిశుద్ధ స్థలాన్ని పవిత్రం చేసేందుకు జరగాల్సిన ప్రాయశ్చిత్తాన్ని అహరోను చేయాలి. అహరోను ఎందుకు ఇవన్నీ చేయాలి? సన్నిధిగుడారం అపవిత్ర ప్రజల మధ్య ఉంటుందిగనుక.

17 “అతి పరిశుద్ధ స్థలాన్ని అహరోను పవిత్రం చేసే సమయంలో సన్నిధిగుడారంలో ఎవ్వరూ ఉండకూడదు. అహరోను బయటకు వచ్చేంతవరకు ఏ వ్యక్తీ లోకిని వెళ్లకూడదు. కనుక అహరోను తనను, తన కుటుంబాన్ని పవిత్రం చేసుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి. 18 తర్వాత యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠం దగ్గరకు అహరోను వెళ్లాలి. అహరోను బలిపీఠాన్ని పవిత్రం చేస్తాడు. కోడెదూడ రక్తంలో కొంచెం, మేక రక్తంలో కొంచెం తీసుకొని బలిపీఠం అన్ని వైపులా ఉన్న దాని కొమ్ములకు అహరోను పూయాలి. 19 తర్వాత అహరోను తన వేలితో కొంత రక్తాన్ని బలి పీఠం మీద ఏడుసార్లు చిలకరించాలి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నింటి నుండి బలిపీఠాన్ని అహరోను పరిశుద్ధంగా, పవిత్రంగా చేయాలి.

1 థెస్సలొనీకయులకు 4:13-18

ప్రభువు రాకడ

13 సోదరులారా! చనిపోయినవాళ్ళను గురించి మీకు తెలియాలని మా కోరిక. బ్రతుకుపై ఆశలేని వాళ్ళవలే దుఃఖించరాదని మా కోరిక. 14 యేసు చనిపోయి తిరిగి బ్రతికివచ్చాడని మనం నమ్ముతాము. అందుకే యేసును విశ్వసించినవాళ్ళు మరణించినప్పుడు దేవుడు వాళ్ళను ఆయనతో సహా బ్రతికిస్తాడని కూడా మనం విశ్వసిస్తాము.

15 ప్రభువు వచ్చేవరకు మనం బ్రతికి ఉంటే, యింతకు క్రితము చనిపోయినవాళ్ళకంటే ముందు వెళ్ళము. ఇది ప్రభువు స్వయంగా చెప్పాడు. 16 ప్రభువు పరలోకం నుండి దిగివచ్చినప్పుడు ప్రధాన దూతతో అధికార పూర్వకంగా వస్తాడు. అప్పుడు ప్రధాన దూత శబ్దము, దేవుని బూర శబ్దం వినిపిస్తాయి. అప్పుడు క్రీస్తులో చనిపోయినవాళ్ళు మొదటలేస్తారు. 17 ఆ తర్వాత యింకా బ్రతికి ఉన్న మనల్ని ప్రభువు వాళ్ళతో సహా ఆకాశంలో ఉన్న మేఘాల్లోకి తీసుకువెళ్తాడు. అప్పటినుండి మనం ఆయనతో చిరకాలం ఉండిపోతాము. 18 అందువల్ల వీటిని గురించి మాట్లాడుకొని పరస్పరం ధైర్యం చెప్పుకోండి.

మత్తయి 6:1-6

యేసు ఇచ్చుటను గురించి బోధించటం

“జాగ్రత్త! మీరు చేసే నీతికార్యాలు ఇతర్లు చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు.

“అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి ఫలం అప్పుడే పూర్తిగా లభించింది. కాని, మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ ఎడమచేతికి తెలియనివ్వకండి. అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు, మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.

యేసు ప్రార్థన గురించి బోధించటం

(లూకా 11:2-4)

“మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం—వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది. మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.

మత్తయి 6:16-18

యేసు ఉపవాసమును గురించి బోధించటం

16 “కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకొంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం, వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు. యింకేమీ లభించదు. 17 మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కొండి. 18 అలా చేస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు. కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International