Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 55

సంగీత నాయకునికి: వాయిద్యాలతోపాడునది. దావీదు ప్రార్థన.

55 దేవా, నా ప్రార్థన వినుము.
    దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
దేవా, దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము.
    నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను.
    నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు.
    వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
నాలో నా గుండె అదురుతోంది.
    నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది.
నాకు భయము మరియు వణకుగా ఉంది.
    నేను భయపడిపోయాను.
ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది.
    నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
    నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.

నేను పరుగెత్తి పోదును.
    నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము.
    ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
10 పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి.
    ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది.
    ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.

12 ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే
    దానిని నేను భరించగలను.
ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే
    నేను దాక్కోగలను.
13 కాని, అది చేస్తున్నది నీవే.
    నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
14 మనం కలిసి మధుర సంభాషణ చేసేవాళ్లము.
    దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.

15 నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను.
    వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను.
    ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.

16 నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను.
    యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
17 సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబుతాను.
    ఆయన నా మాట వింటాడు.
18 నేను చాలా యుద్ధాలు చేశాను.
    కాని దేవుడు నన్ను రక్షించాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు.
19 దేవుడు అనాది కాలంనుండి సింహాసనాసీనుడు.
    నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు.

నా శత్రువులు వారి బ్రతుకులు మార్చుకోరు.
    వారు దేవునికి భయపడరు, గౌరవించరు.
20 నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు.
    అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
21 అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు.
    కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు.
వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి
    కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.

22 నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు
    ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు.
    మంచి మనుష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
23 కాని దేవా! దుష్టులను సమాధి అనే గుంటలోనికి అణచివేస్తావు.
    రక్తం చిందించే మనుష్యులు, విశ్వాసఘాతకులు అర్ధకాలమైనా జీవించరు.
కాని నేనైతే నీయందే విశ్వసిస్తాను.

కీర్తనలు. 138:1-139:23

దావీదు కీర్తన.

138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
    దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
    నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
    నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.

యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
    నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా మహిమ గొప్పది.
దేవుడు గొప్పవాడు.
    అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
    కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
    నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
    యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
    నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
    దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
    నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
    నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
    నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
    గ్రహించటం నాకు కష్టతరం.
నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది.
    యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు.
    పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.
యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు.
    పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.
10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి,
    ఆ చేతితో నన్ను నడిపిస్తావు.

11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే,
    “పగలు రాత్రిగా మారిపోయింది.
    తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు
12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు.
    రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
    నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
    నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
    నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
    ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
    నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
    కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.

19 దేవా, దుర్మార్గులను చంపివేయుము.
ఆ హంతకులను నా దగ్గర నుండి తీసివేయుము.
20     ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు.
    వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.
21 యెహోవా, నిన్ను ద్వేషించే ప్రజలను నేను ద్వేషిస్తాను.
    నీకు విరోధంగా తిరిగే మనుష్యులను నేను ద్వేషిస్తాను.
22 నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను!
    నీ శత్రువులు నాకూ శత్రువులే.
23 యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము.
    నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము.

నిర్గమకాండము 40:18-38

18 యెహోవా చెప్పినట్టే పవిత్ర గుడారాన్ని మోషే నిలబెట్టాడు. అతడు దిమ్మలను ముందుగా కింద పెట్టాడు. తర్వాత ఆ దిమ్మల మీద చట్రాలను పెట్టాడు. తర్వాత అతడు కమ్ములను అమర్చి, స్తంభాలను నిలబెట్టాడు. 19 ఆ తర్వాత పవిత్ర గుడారం కప్పును మోషే నిలబెట్టాడు. తర్వాత గుడారపు కప్పు మీద మరో కప్పును అతడు వేసాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటిని చేసాడు.

20 దేవుని ఆజ్ఞలు రాయబడ్డ రాతి పలకలను ఒడంబడిక పెట్టెలో మోషే పెట్టాడు. ఆ పెట్టెకు కర్రలను మోషే పెట్టాడు. తర్వాత అతడు ఆ పెట్టెకు మూత పెట్టాడు. 21 తర్వాత ఆ పవిత్ర పెట్టెను గుడారంలోకి మోషే తీసుకు వచ్చాడు. సరైన చోట అతడు తెర వేసాడు. ఇది సన్నిధి గుడారంలో పవిత్ర పెట్టెను మరుగు చేస్తుంది. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వీటన్నింటినీ చేసాడు. 22 తర్వాత సన్నిధి గుడారపు బల్లను మోషే పెట్టాడు. గుడారం ఉత్తరాన అతడు దీన్ని పెట్టాడు. (పవిత్ర స్థలంలో) తెరముందర అతడు దీన్ని పెట్టాడు. 23 తర్వాత యెహోవా సన్నిధిలో బల్ల మీద రొట్టెను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు అతడు దీన్ని చేసాడు. 24 తర్వాత మోషే దీపస్తంభాన్ని సన్నిధి గుడారంలో పెట్టాడు. గుడారం దక్షిణాన, బల్లకు ఎదుట అతడు దీపస్తంభం పెట్టాడు. 25 తర్వాత యెహోవా సన్నిధిలో దీపస్తంభం మీద దీపాలను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు.

26 తర్వాత బంగారపు ధూపవేదికను సన్నిధి గుడారంలో మోషే పెట్టాడు. ఆ వేదికను తెరముందర అతడు పెట్టాడు. 27 తర్వాత ఆ బంగారు బలిపీఠం మీద సువాసనగల పరిమళ ధూపం అతడు వేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు. 28 తర్వాత పవిత్ర గుడారం ప్రవేశానికి మోషే తెర వేసాడు.

29 పవిత్ర గుడారం, సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర దహన బలులను దహించే బలిపీఠాన్ని మోషే పెట్టాడు. అప్పుడు ఒక దహన బలి అర్పణను ఆ బలిపీఠం మీద మోషే అర్పించాడు. యెహోవాకు ధాన్యార్పణ కూడ అతడు అర్పించాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటినీ చేసాడు.

30 తర్వాత మోషే సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య గంగాళం ఉంచాడు, కడుక్కొనేందుకు గంగాళంలో నీళ్లు పోసాడు. 31 మోషే, అహరోను, అహరోను కుమారులు వారి కాళ్లు చేతులు కడుక్కొనేందుకు ఈ గంగాళాన్ని ఉపయోగించారు. 32 వారు సన్నిధి గుడారంలో ప్రవేశించినప్పుడల్లా కాళ్లు కడుక్కొనేవారు. వాళ్లు బలిపీఠాన్ని సమీపించిన ప్రతీసారీ వాళ్లను వాళ్లు కడుక్కొనేవారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్లు ఇలా చేసారు.

33 తర్వాత గుడారపు ఆవరణలో తెరలను మోషే తగిలించాడు. మోషే గుడారపు ఆవరణలో బలిపీఠాన్ని పెట్టాడు. తర్వాత అతడు ఆవరణ ప్రవేశం దగ్గర తెరను వేసాడు. కనుక అతడు చేయాలని చెప్పి యెహోవా తనకు అప్పగించిన పని అంతా మోషే ముగించాడు.

యెహోవా మహిమ

34 అంతా ముగించిన తర్వాత సన్నిధి గుడారాన్ని ఒక మేఘం ఆవరించింది. యెహోవా మహిమ ఆ పవిత్ర గుడారాన్ని నింపివేసింది. 35 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచిపోగా యెహోవా మహిమ దాన్ని నింపేసింది. కనుక మోషే ఆ సన్నిధి గుడారంలో ప్రవేశించలేక పోయాడు.

36 (ప్రజలు ఎప్పుడు సాగిపోవాల్సిందీ చూపెట్టిన మేఘం) పవిత్ర గుడారంనుండి మేఘం పైకి లేచినప్పుడు, ప్రజలు ప్రయాణం మొదలు పెట్టేవారు. 37 అయితే ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచి ఉన్నప్పుడు ప్రజలు సాగిపోయే ప్రయత్నం చేయలేదు. మేఘం లేచేంతవరకు వాళ్లు ఆ స్థలంలోనే ఉండిపోయారు. 38 కనుక యెహోవా మేఘం పగటివేళ పవిత్ర గుడారం మీద నిలిచి ఉండేది. మరియు రాత్రివేళ ఆ మేఘంలో అగ్ని ఉండేది. కనుక ఇశ్రాయేలు ప్రజలంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘాన్ని చూడగలిగారు.

1 థెస్సలొనీకయులకు 4:1-12

దేవునికి నచ్చిన జీవితం

సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే దేవుని మెప్పు పొందటానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. మీరు మేము చెప్పినట్లు జీవిస్తున్నారు. కాని మేము ప్రస్తుతం యేసు ప్రభువు పేరిట మిమ్మల్ని అడిగేదేమిటంటే మీరు ఆ జీవితాన్ని యింకా సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి. యేసు ప్రభువు యిచ్చిన అధికారంతో మేము చెప్పిన ఉపదేశాలు మీకు తెలుసు. మీరు పవిత్రంగా ఉంటూ వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి. ఇది దేవుని యిచ్ఛ. మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహాలను మీరు అదుపులో పెట్టుకోవాలి.[a] పవిత్రులు కానివాళ్ళు లైంగిక వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జీవించకూడదు. ఈ విషయంలో ఎవరూ తమ సోదరుల్ని మోసం చేయరాదు. వాళ్ళను తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం చేసినవాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీన్ని గురించి ముందే చెప్పి వారించాము. దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా ఉండేందుకు కాదు. పవిత్రంగా జీవించేందుకు పిలిచాడు. అందువల్ల ఈ ఉపదేశాన్ని తృణీకరించినవాడు మానవుణ్ణి కాదు, తన పరిశుద్ధాత్మనిచ్చిన దేవుణ్ణి తృణీకరించినవాడౌతాడు.

సోదర ప్రేమను గురించి మేము వ్రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరస్పరం ప్రేమించుకొనమని దేవుడే మీకు బోధించాడు. 10 నిజానికి మాసిదోనియ ప్రాంతంలో ఉన్న సోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. కాని సోదరులారా! మీరు యింకా ఎక్కువ ప్రేమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

11 మేమిదివరకే చెప్పిన విధంగా శాంతితో జీవించాలని ఆశించండి. మీ స్వహస్తాలతో పని చేస్తూ యితర్ల జోలికి పోకుండా జీవించండి. 12 అలా చేస్తే మీ నిత్య జీవితాన్ని చూసి యితర్లు మిమ్మల్ని గౌరవిస్తారు. అప్పుడు మీరు యితర్లపై ఆధారపడనవసరం ఉండదు.

మత్తయి 5:38-48

కంటికి కన్ను

(లూకా 6:29-30)

38 “‘కంటికి కన్ను, పంటికి పన్ను ఊడ దీయాలి’(A) అని అనటం మీరు విన్నారు. 39 కాని నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి. 40 ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి. 41 ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే, అతనితో రెండు మైళ్ళు వెళ్ళండి. 42 అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి.

శత్రువులను ప్రేమించు

(లూకా 6:27-28, 32-36)

43 “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’(B) అని చెప్పటం మీరు విన్నారు. 44 కాని నేను చెప్పేదేమిటంటే ‘మీ శత్రువుల్ని ప్రేమించండి[a] మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి.’ 45 అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలౌతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు. 46 మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా? 47 మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే! 48 పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International