Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 45

సంగీత నాయకునికి: “శోషనీము” రాగం. కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరియు ఒక ప్రేమగీతం.

45 రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా
    అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి.
నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా
    నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.

నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!
    నీ పెదవులనుండి దయ వెలువడుతుంది
    కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.
నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరునివలె, మహిమను, ఘనతను ధరించుము.
నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము.
    అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.
నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి
    అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.
దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
    నీ నీతి రాజదండము.
నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
    కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
    నీ దేవుడు కోరుకొన్నాడు.
నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
    నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
    నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.

10 కుమారీ, నా మాట వినుము.
    నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11     రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
    నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
    వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.

13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
    ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
    ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
    సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.

16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
    దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
    శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.

కీర్తనలు. 47-48

సంగీత నాయకునికి: కోరహు కుమారుల గీతం.

47 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి.
    సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
    భూలోకమంతటికీ ఆయన రాజు.
ఆయన ప్రజలను మనకు లోబరిచాడు.
    ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
    యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.

బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే
    యెహోవా దేవుడు లేచాడు.
దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
    మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
దేవుడు సర్వలోకానికి రాజు.
    స్తుతిగీతాలు పాడండి.
దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు.
    దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు.
రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు.
    దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
    దేవుడు మహోన్నతుడు.

కోరహు కుమారుల స్తుతి పాట.

48 యెహోవా గొప్పవాడు.
    మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది.
    అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది.
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.[a]
    అది మహారాజు పట్టణం.
ఇక్కడ ఆ పట్టణంలోని
    భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు.
    వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు.
వారంతా కలసి ముందుకు వచ్చారు.
    ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,
    వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.
    ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
దేవా, బలమైన తూర్పుగాలితో
    తర్షీషు ఓడలను బ్రద్దలు చేశావు.
మేము ఏమి విన్నామో, దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో
    మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో చూశాము.
దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.

దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.
    భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
    నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.
    మరియు యూదా నగరాలు ఆనందంగా ఉన్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
12 సీయోను చుట్టూ తిరుగుతూ
    ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
13 ఎత్తైన గోడలు చూడండి.
    సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి.
అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
14 ఈ విషయాలు దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి:
    ఆయన ఎప్పటికీ మన దేవుడు, ఆయన ఎల్లప్పుడు మనలను కాపాడుతాడు.

నిర్గమకాండము 32:21-34

21 “ఈ ప్రజలు నీకేమి చేసారు? ఇలాంటి చెడ్డ పాపం చేయడానికి నీవెందుకు వాళ్లను నడిపించావు?” అని అహరోనును మోషే అడిగాడు.

22 “అయ్యా, కోపగించకు. ఈ ప్రజలు తప్పు చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని నీకు తెలుసు. 23 ‘ఈజిప్టు నుండి మోషే మమ్మల్ని నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. కనుక మమ్మల్ని నడిపించేందుకు మా కోసం ఒక దేవతను తయారు చేయి’ అని ప్రజలు నాతో అన్నారు. 24 కనుక ‘మీవద్ద ఉన్న బంగారు నగలను నాకు ఇవ్వండి’ అని ప్రజలతో చెప్పాను. ప్రజలు వారి బంగారం నాకు ఇచ్చారు. నేను ఆ బంగారాన్ని అగ్నిలో వేసాను. అగ్నిలో నుండి ఆ దూడ బయటకు వచ్చింది” అని అహరోను జవాబిచ్చాడు.

25 అహరోను అక్కడ గలభాకు కారణమని మోషే తెలుసుకున్నాడు. శత్రువులంతా చూడగలిగేటట్టు ప్రజలు వెర్రివాళ్లలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. 26 కనుక నివాసాల ప్రవేశం దగ్గర మోషే నిలబడ్డాడు. “యెహోవాను వెంబడించాలని కోరేవారు ఎవరో వారు నా దగ్గరకు రావాలి.” అన్నాడు. లేవీ కుటుంబానికి చెందిన ప్రజలంతా మోషే దగ్గరకు పరుగెత్తారు.

27 అప్పుడు మోషే అన్నాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడో నేను మీకు చెబుతాను. ‘ప్రతి మనిషి తన కత్తి తీసుకొని మన బసలో ఒక చివర నుండి మరో చివరకు వెళ్లాలి. ప్రతి మనిషి తన సోదరుణ్ణి, స్నేహితుల్ని, ఇరుగు పొరుగువారిని చంపాల్సి వచ్చినా మీరు వారిని చంపాలి.’”

28 లేవీ కుటుంబానికి చెందిన ప్రజలు మోషే మాటకులోబడ్డారు. ఆ రోజు ఇశ్రాయేలీయులలో సుమారు 3,000 మంది చనిపోయారు. 29 అప్పుడు, “మీ కుమారులను, మీ సోదరులను దీవించే వారినిగా యెహోవా నేడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు” అని మోషే చెప్పాడు.

30 మర్నాటి ఉదయం ప్రజలందరికి మోషే, “మీరు భయంకర పాపం చేసారు. అయితే ఇప్పుడు నేను యెహోవా దగ్గరకు పైకి వెళ్తాను. ఆయన మీ పాపం విషయం మిమ్మల్ని క్షమించేందుకు నేనేమైనా చేయగలనేమో” అని చెప్పాడు. 31 కనుక మోషే యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లి, “దయచేసి ఆలకించు! ఈ ప్రజలు చాలా చెడ్డ పాపం చేసి, బంగారంతో దేవుణ్ణి చేసారు. 32 ఇప్పుడు ఈ పాపం విషయం వారిని క్షమించు. నీవు గనుక వారిని క్షమించకపోతే, నీవు వ్రాసిన గ్రంథంలో[a] నా పేరు తుడిచేయి” అన్నాడు.

33 అయితే మోషేతో యెహోవా అన్నాడు, “నాకు వ్యతిరేకంగా ఎవరు పాపం చేస్తారో ఆ ప్రజల పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తుడిచి వేస్తాను. 34 కనుక కిందకు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటుకు ప్రజలను నడిపించు. నీకు ముందు నా దేవదూత నడుస్తూ నిన్ను నడిపిస్తాడు. పాపం చేసిన వాళ్లను శిక్షించవలసిన సమయం వచ్చినప్పుడు వాళ్లు శిక్షించబడుతారు.”

1 థెస్సలొనీకయులకు 1

మన తండ్రియైన దేవునికి, యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీక పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను మరియు తిమోతి వ్రాయటమేమనగా, మీకు దైవానుగ్రహము, శాంతి లభించుగాక!

దేవునికి కృతజ్ఞతలు

మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరులైనందుకు మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉన్నాము. విశ్వాసంవల్ల మీరు సాధించిన కార్యాన్ని గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాల్ని గురించి యేసు క్రీస్తు ప్రభువులో మీకున్న దృఢవిశ్వాసం వల్ల మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి తండ్రియైన దేవునికి మేము అన్ని వేళలా కృతజ్ఞులము.

సోదరులారా! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకొన్నాడని మాకు తెలుసు. ఎందుకంటే, మేము సువార్తను మీకు వట్టి మాటలతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు. మీరు మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం కలిగినా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు.

కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది. దేవుని పట్ల మీకున్న విశ్వాసం, ఆ పట్టణాలలోనే కాక, ప్రతి చోటా తెలిసింది. దాన్ని గురించి మేమేమీ చెప్పనవసరం లేదు. మీరు మాకెలాంటి స్వాగతమిచ్చారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. అంతేకాక, సజీవమైన నిజమైన దేవున్ని పూజించటానికి మీరు విగ్రహారాధనను వదిలి నిజమైన దేవుని వైపుకు ఏ విధంగా మళ్ళారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. 10 పరలోకము నుండి రానున్న దేవుని కుమారుడైన యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు.

మత్తయి 5:11-16

11-12 “నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు.

ఉప్పు—వెలుగు

(మార్కు 9:50; 4:21; లూకా 14:34-35; 8:16)

13 “మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు, కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు.

14 “మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసంభవం. 15 దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని వాళ్ళందరికి వెలుగునిస్తుంది. 16 అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International