Book of Common Prayer
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
9 కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.
వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
10 ఖడ్గములతో వారు చంపబడతారు.
అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.
ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్ధీకులందరినీ ఆయన ఓడించాడు.
స్తుతి కీర్తన.
98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
ఆయనకు విజయం తెచ్చింది.
2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
6 బూరలు, కొమ్ములు ఊదండి.
మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న
సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
8 నదులారా, చప్పట్లు కొట్టండి.
పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
దావీదు కీర్తన.
103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
3 మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
5 దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
6 యెహోవా న్యాయం కలవాడు.
ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
7 దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
8 యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
14 మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు.
మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు.
15 మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు.
మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు.
మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు.
16 ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడిపోతుంది.
త్వరలోనే ఆ పువ్వు ఎక్కడికి ఎగిరిపోతుందో నీవు చూడలేకపోతావు.
17 కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు.
దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు.
18 దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
19 దేవుని సింహాసనం పరలోకంలో ఉంది.
మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు.
20 దేవదూతలారా, యెహోవాను స్తుతించండి.
దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు.
మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి.
21 యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి.
మీరు ఆయన సేవకులు,
దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.
అవన్నీ యెహోవాను స్తుతించాలి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!
యాజకుల వస్త్రాలు
28 “నీ సోదరుడైన అహరోను, అతని కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి, నీ దగ్గరకు రావాలని చెప్పు. వీళ్లు యాజకులుగా నన్ను సేవిస్తారు.
2 “నీ సోదరుడైన అహరోనుకు ప్రత్యేక వస్త్రాలు చేయించు. ఈ వస్త్రాలు అతనికి గౌరవ మర్యాదలు కల్గిస్తాయి. 3 ఈ బట్టలు తయారుచేయగల నిపుణులు ప్రజల్లో ఉన్నారు. ఈ మనుష్యులకు ప్రత్యేక జ్ఞానం నేనిచ్చాను. అహరోనుకు బట్టలు తయారు చేయుమని వారికి చెప్పు. అతను ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నాడని ఈ బట్టలు చూపెడ్తాయి. అప్పుడు ఒక యాజకునిగా అతడు నన్ను సేవించవచ్చు. 4 ఆ మనుష్యులు చేయాల్సిన బట్టలు ఇవే: న్యాయతీర్పు వస్త్రం ఏఫోదు, చేతుల్లేని ఒక ప్రత్యేక అంగీ, తల కప్పుకొనే బట్ట, ఒక నడికట్టు పట్టి నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకోసం ఆ మనుష్యులు ఈ ప్రత్యేక దుస్తులను తయారు చేయాలి. అప్పుడు అహరోను, అతని కుమారులు యాజకులుగా నన్ను సేవించవచ్చు.
30 దేవుని నిర్ణయాలు తెలుసుకొనేందుకు ఊరీము, తుమ్మీములను ప్రయోగిస్తాడు. అందుచేత ఊరీము, తుమ్మీములను న్యాయతీర్పు పైవస్త్రములో ఉంచాలి. అహరోను యెహోవా ముందర ఉన్నప్పుడు ఈ విషయాలు అతని గుండెమీద ఉంటాయి. కనుక అహరోను యెహోవా యెదుట ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చే ఒక విధానాన్ని ఎల్లప్పుడూ తనతో తీసుకువెళ్తాడు.
యాజకుల యితర వస్త్రాలు
31 “ఏఫోదు పైన ధరించేందుకు ఒక అంగీని చెయ్యాలి. అంగీని నీలంరంగు బట్టతోనే చెయ్యాలి. 32 దాని మధ్యలో తల పట్టేందుకు ఒక రంధ్రం ఉండాలి. అది మెడచుట్టూ చిరిగిపోకుండా గోటు ఉండాలి. 33 నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం రంగుల బట్టతో దానిమ్మపండు చేయాలి. అంగీ కింది భాగంలో దానిమ్మ పండును వేలాడదీయాలి. దానిమ్మపండు మధ్య బంగారు గంటలు వ్రేలాడదీయాలి. 34 అంగీ అడుగున చుట్టూరా ఒక బంగారు దానిమ్మపండు ఒక గంట, మరో దానిమ్మపండు, మరో గంట ఇలా ఉండాలి. 35 అహరోను యాజకునిగా పని చేసేటప్పుడు ఈ అంగీని ధరించి, యెహోవా ఎదుట పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అతడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు గంటలు మోగుతాయి. ఈ విధంగా అహరోను మరణించడు.
36-37 “స్వచ్ఛమైన బంగారంతో ఒక బద్ద చేయాలి, “యెహోవా పరిశుద్ధుడు” అనే మాటలు ఒక ముద్రగా తలపాగా చుట్టూ ముందరవైపు కట్టేందుకు నీలం పతకం ఉపయోగించాలి. 38 అహరోను దీన్ని తన తలమీద ధరిస్తాడు. ఇశ్రాయేలీయుల కానుకల విషయంలో దోషాలు ఏమైన ఉంటే ఆ దోషాన్ని అతడు భరించినప్పుడు, ఇది అతన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. ఈ కానుకలు ప్రజలు యెహోవాకు అర్పించేవి. ప్రజల కానుకలను యెహోవా స్వీకరించేటట్టు అహరోను దీనిని ఎప్పుడూ తన తలమీద ధరించాలి.
క్రీస్తు విరోధుల విషయంలో జాగ్రత్త
18 బిడ్డలారా! ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి రానున్నాడని మీరు విన్నారు. ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలా మంది వచ్చారు. తద్వారా యిది చివరి గడియ అని తెలిసింది. 19 క్రీస్తు విరోధులు మననుండి విడిపొయ్యారు. నిజానికి, వాళ్ళు మనవాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళైనట్లయితే మనతోనే ఉండిపొయ్యేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళలో ఎవ్వరూ మనవాళ్ళు కారని తెలుపుతోంది.
20 కాని దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. తద్వారా మీరంతా సత్యాన్ని గురించి తెలుసుకొన్నారు. 21 మీకు సత్యాన్ని గురించి తెలియదని భావించి నేను మీకు వ్రాస్తున్నాననుకోకండి. సత్యాన్ని గురించి మీకు తెలుసు. పైగా సత్యంనుండి అసత్యం బయటకు రాదు.
22 అసత్యమాడేవాడెవ్వడు? యేసే క్రీస్తు కాదని అనేవాడు. అతడే క్రీస్తు విరోధి. అలాంటి వ్యక్తి తండ్రిని, కుమారుణ్ణి నిరాకరిస్తాడు. 23 కుమారుణ్ణి నిరాకరించే వ్యక్తికి తండ్రి రక్షణ ఉండదు. కుమారుణ్ణి అంగీకరించే వ్యక్తికి తండ్రి రక్షణ తోడుగా ఉంటుంది.
24 మొదట మీరు విన్నవి మీలో ఉండిపోయేటట్లు చూసుకోండి. అప్పుడే మీరు కుమారునిలో, తండ్రిలో జీవించగలుగుతారు. 25 పైగా ఆయన మనకు నిత్యజీవం గురించి వాగ్దానం చేసాడు.
26 ఇవన్నీ మిమ్మల్ని తప్పుదారి పట్టించటానికి ప్రయత్నం చేస్తున్నవాళ్ళను గురించి వ్రాస్తున్నాను. 27 ఇక మీ విషయం అంటారా? దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. దానివల్ల కలిగిన ఫలం మీలో ఉంది. మీకెవ్వరూ బోధించవలసిన అవసరం లేదు. ఆ అభిషేకం వల్ల మీలో జ్ఞానం కలుగుతుంది. దేవుడు మీకు నిజంగా అభిషేకమిచ్చాడు. అది అసత్యం కాదు. ఆయన బోధించిన విధంగా ఆయనలో నివసించండి.
28 బిడ్డలారా! ఆయన ప్రత్యక్ష్యమైనప్పుడు మనలో ధైర్యం ఉండేటట్లు, ఆయన సమక్షంలో సిగ్గు పడకుండా ఉండేటట్లు ఆయనలో జీవిస్తూ ఉండండి. 29 ఆయన నీతిమంతుడని మీకు తెలిసి ఉంటే నీతిని అనుసరించే ప్రతి ఒక్కడూ ఆయననుండి జన్మించాడని మీరు గ్రహిస్తారు.
యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మత్తయి 14:13-21; లూకా 9:10-17; యోహాను 6:1-14)
30 అపొస్తలులు యేసు చుట్టూ చేరి తాము చేసిన వాటిని గురించి, బోధించిన వాటిని గురించి వివరంగా ఆయనకు చెప్పారు. 31 వాళ్ళ దగ్గరకు చాలామంది వస్తూ పోతూ ఉండటంవల్ల వాళ్ళకు తినటానికి కూడా సమయం లేకపోయింది. అందుకు యేసు వాళ్ళతో, “నాతో మీరు మాత్రమే ఏకాంత ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.
32 అందువల్ల వాళ్ళు మాత్రమే ఒక పడవనెక్కి నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. 33 కాని, వాళ్ళు వెళ్ళటం చాలా మంది చూసారు. వాళ్ళెవరో గుర్తించి అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళకన్నా ముందే ఆ ఎడారి ప్రాంతాన్ని చేరుకొన్నారు. 34 యేసు పడవ దిగి ఆ ప్రజాసమూహాన్ని చూసాడు. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలివేసింది. అందువల్ల వాళ్ళకు ఎన్నో విషయాలు బోధించటం మొదలు పెట్టాడు.
35 అప్పటికే మధ్యాహ్నం దాటి సాయంకాలమవుతూ వుంది. ఆయన శిష్యులు వచ్చి, “ఇది నిర్మానుష్య ప్రాంతం. ఇప్పటికే సాయంకాలమవుతూ వుంది. 36 మీరి ప్రజల్ని పంపివేస్తే వాళ్ళు చుట్టూవున్న పల్లెలకో లేక గ్రామలకో వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.
37 కాని యేసు, “వాళ్ళు తినటానికి మీరే ఏదైనా ఇవ్వండి!” అని సమాధానం చెప్పాడు.
“రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని వాళ్లకు పంచి పెట్టమంటావా?” అని ఆయన్ని అడిగారు.
38 “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో వెళ్ళి చూడండి” అని యేసు అన్నాడు.
వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అని అన్నారు.
39 పచ్చిగడ్డి మీద అందరిని గుంపులు గుంపులుగా కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. 40 ప్రజలు గుంపుకు యాబై, నూరుగురి చొప్పున కూర్చున్నారు.
41 యేసు ఆ ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞత చెప్పి రొట్టెల్ని తుంచాడు. అవి తన శిష్యులకిచ్చి ప్రజల ముందుంచమన్నాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికి పంచాడు.
42 అందరూ సంతృప్తిగా తిన్నారు. 43 శిష్యులు మిగిలిన రొట్టెముక్కల్ని, చేప ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. 44 ఆ రోజు అక్కడ ఐదు వేలమంది పురుషులు భోజనం చేసారు.
© 1997 Bible League International