Book of Common Prayer
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
దావీదు దైవధ్యాన కీర్తన.
32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
3 దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
మరియు నీవు నా పాపాలను క్షమించావు.
6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
7 దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
8 యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
9 కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”
10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.
రెండవ భాగం
(కీర్తనలు 42–72)
సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం
42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
2 సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
3 నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.
4 కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.
5 నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
ఆయన నన్ను కాపాడుతాడు.
6 నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
7 నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.
8 ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
9 ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
“యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
“నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.
11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
నా సహాయమా! నా దేవా!
43 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము.
నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము.
ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు.
ఆ ప్రజలు వంకర మనుష్యులు.
దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
2 దేవా, నీవే నా క్షేమ స్థానం.
నీవు నన్నెందుకు విడిచిపెట్టావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి
నేనెందుకు విచారంగా ఉండాలి?
3 దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
4 దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను.
దేవుని దగ్గరకు నేను వస్తాను.
ఆయన నన్ను సంతోషింపజేస్తాడు.
దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.
5 నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను?
నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను?
దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి.
నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది.
నా దేవుడే నాకు సహాయము.
పవిత్రమైన వస్తువులకొరకు బహుమానాలు
25 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “నాకు కానుకలు తీసుకు రమ్మని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. నాకు ఇవ్వాల్సింది ఏమిటి? ప్రతి మనిషి తన హృదయంలో తీర్మానించుకోవాలి. నా కోసం ఈ కానుకల్ని స్వీకరించు. 3 ప్రజల దగ్గర్నుండి నీవు స్వీకరించాల్సిన వాటి జాబితా యిది: బంగారం, వెండి, కంచు, 4 నీలం వస్త్రం, ఊదారంగు వస్త్రం, ఎరుపు వస్త్రం, మేలిమి వస్త్రం, మేక బొచ్చు, 5 గొర్రె చర్మాలు, మేలురకం తోళ్లు, తుమ్మకర్ర 6 దీపాలకు నూనె, ధూపం. ప్రత్యేక అభిషేక తైలానికి[a] సువాసన చేకూర్చే పరిమళ వస్తువులు, 7 ఇంకా లేత పచ్చరాళ్లు, ఏఫోదు[b] మీద లేక న్యాయ తీర్పుపై వస్త్రం మీద పొదిగించడానికి విలువైన రాళ్లు.”
పవిత్ర గుడారం
8 (ఇంకా దేవుడు ఇలా అన్నాడు): “నా కోసం ప్రజలు ఒక పవిత్ర స్థలాన్ని నిర్మిస్తారు. అప్పుడు నేను వారి మధ్య నివసిస్తాను. 9 పవిత్ర గుడారం ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. దానిలో ఏమేమి వస్తువులు ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. సరిగ్గా నేను నీకు చూపించినట్టు ఒడంబడిక పెట్టె తయారు చెయ్యి.
ఒడంబడిక పెట్టె (మందసము)
10 “తుమ్మకర్ర ఉపయోగించి ఒక ప్రత్యేక పెట్టె తయారు చెయ్యి. ఈ పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు ఉండాలి. 11 ఆ పెట్టెలోపల, బంగారు రేకుతో పెట్టెను కప్పాలి. ఆ పెట్టె చుట్టూ అంచుల మీద బంగారపు నగిషీబద్ద పెట్టాలి. 12 ఆ పెట్టె చుట్టూ మోసేందుకు నాలుగు బంగారు ఉంగరాలను తయారు చెయ్యాలి. ఆ పెట్టెకు ఒక్కోపక్క రెండేసి చొప్పున నాలుగు మూలలా ఆ ఉంగరాలను అమర్చాలి. 13 తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను తయారు చేయాలి. ఈ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం పొదిగించాలి. 14 ఆ పెట్టె మూలల్లో ఉన్న ఉంగరాల గుండా ఆ కర్రలను పెట్టాలి. ఆ పెట్టెను మోసేందుకు ఈ కర్రలను ఉపయోగించాలి. 15 ఈ కర్రలు ఎప్పుడూ వాటి ఉంగరాల్లోనే ఉండాలి. కర్రలను బయటికి తియ్యవద్దు.”
16 దేవుడు అన్నాడు: “నేను ఒడంబడికను[c] నీకు ఇస్తాను. ఆ ఒడంబడికను ఈ పెట్టెలో పెట్టు. 17 ఆ పెట్టెకు ఒక మూత[d] చెయ్యాలి. స్వచ్ఛమైన బంగారంతో దీన్ని చెయ్యాలి. 45 అంగుళాల పొడవు, 27 అంగుళాల వెడల్పుతో దీన్ని చెయ్యాలి. 18 తర్వాత రెండు బంగారు కెరూబు దూతలను చేసి ఆ మూతకు రెండుకొనల మీద పెట్టాలి. కొట్టిన బంగారంతో ఈ దూతల్ని చేయాలి. 19 ఆ మూతకు ఒక కొనమీద ఒక దూతను, మరో కొనమీద మరో దూతను ఉంచాలి. మూత, దూతలు అంతా ఒకే వస్తువుగా చేయాలి. 20 కెరూబులు ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉండాలి. ఆ దూతల ముఖాలు మూత వైపుకు చూస్తూ ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు మూతను అవరించి ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు ఆకాశం వైపు ఎత్తబడి ఉండాలి.
21 “ఒడంబడిక రుజువు నేనే మీకిచ్చాను. ఆ ఒడంబడికను పెట్టెలో పెట్టి, ప్రత్యేక మూతను పెట్టెమీద పెట్టాలి. 22 నేను నిన్ను కలుసుకొనేటప్పుడు ఆ ఒడంబడిక పెట్టె ప్రత్యేక మూత మీద ఉన్న కెరూబు దూతల మధ్యనుండి నేను మాట్లాడుతాను. అక్కడినుండే నేను నా ఆజ్ఞలన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలకు యిస్తాను.
క్రొత్త జీవితం
3 మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని కుడిచేతి వైపు కూర్చొని ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నవాటిని ఆశించండి. 2-3 మీరు మరణించారు. ఇప్పుడు మీ ప్రాణం క్రీస్తుతో సహా దేవునిలో దాగి ఉంది. కనుక భూమ్మీద ఉన్నవాటిని కాకుండా పరలోకంలో ఉన్నవాటిని గురించి ఆలోచించండి. 4 క్రీస్తు మీ నిజమైన ప్రాణం. ఆయన వచ్చినప్పుడు మీరాయనతో సహా దేవుని మహిమలో భాగం పంచుకొంటారు.
5 మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి. అంటే, వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ. ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక, వీటన్నిటినీ వదులుకోవాలి. 6 వీటివల్ల దేవునికి కోపం వస్తుంది.[a] 7 మీ గత జీవితంలో ఈ గుణాలు మీలో ఉన్నాయి.
8 కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. బూతులు మాటలాడరాదు. 9 మీరు మీ పాత స్వభావాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు కనుక అసత్యములాడరాదు. 10 మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు. 11 ఇక్కడ గ్రీసు దేశస్థునికి, యూదునికి భేదం లేదు. సున్నతి పొందినవానికి, పొందనివానికి భేదంలేదు. విదేశీయునికి, సిథియనుడికి[b] భేదం లేదు. బానిసకు, బానిసకానివానికి భేదం లేదు. క్రీస్తే సర్వము. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు.
ప్రతి ఒక్కరితో నూతన జీవముతో నుండండి
12 మీరు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు. ఆయన ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి. 13 మీలో ఎవడైనా మీకు అన్యాయం చేసినవాడనిపిస్తే కోపగించుకోకుండా అతణ్ణి క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి. 14 అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అలవర్చుకోండి. అది సంపూర్ణమైన బంధాన్ని, పరిపూర్ణమైన ఐక్యతను కలుగ చేస్తుంది. 15 క్రీస్తు కలుగచేసిన శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీలో శాంతి కలుగచేయాలని ఆయన ఉద్దేశ్యం. కృతజ్ఞతతో ఉండండి.
16 క్రీస్తు సందేశాన్ని మీలో సంపూర్ణంగా జీవించనివ్వండి. మీ తెలివినంతా ఉపయోగించి పరస్పరం సహాయం చేసుకోండి. దైవసందేశాన్ని బోధించుకోండి. దేవునికి మీ హృదయాల్లో కృతజ్ఞతలు తెలుపుకొంటూ స్తుతిగీతాలు, కీర్తనలు పాడుకోండి. వాక్యాలు చదవండి. 17 మాటద్వారా కాని, క్రియా రూపంగా కాని మీరేది చేసినా యేసు ప్రభువు పేరిట చెయ్యండి. ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతతో ఉండండి.
యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం
(మార్కు 1:16-20; లూకా 5:1-11)
18 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు అని పిలువబడే సీమోనును, అతని సోదరుడు అంద్రెయను చూశాడు. ఈ సోదరులు చేపలు పట్టేవారు. వాళ్ళు అప్పుడు నీళ్ళల్లో వల వేస్తూ ఉన్నారు. 19 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి! మీరు మనుష్యుల్ని పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. 20 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.
21 యేసు అక్కడ నుండి వెళ్తూ మరో యిద్దర్ని చూశాడు. వాళ్ళు కూడా సోదరులు. ఒకని పేరు యాకోబు, మరొకని పేరు యోహాను. తండ్రి పేరు జెబెదయి. ఆ సోదరులు తమ తండ్రితో కలసి పడవలో కూర్చొని వలను సరిచేసుకొంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు. 22 వాళ్ళు వెంటనే పడవను, తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు.
యేసు బోధించి రోగులను నయం చేయటం
(లూకా 6:17-19)
23 యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతమంతా పర్యటించాడు. ఆయన ప్రతి రోగిని, బాధపడ్తున్న ప్రతి వ్యక్తిని బాగు చేసాడు. 24 ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపిస్తూవుండింది. ప్రజలు రకరకాల రోగాలు ఉన్నవాళ్ళను, బాధ పడ్తున్న వాళ్ళను, దయ్యాలు పట్టిన వాళ్ళను, మూర్చరోగుల్ని, పక్షవాత రోగుల్ని, ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. ఆయన వాళ్ళను నయం చేశాడు. 25 గలిలయ నుండి, దెకపొలి[a] నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను నది అవతలి వైపుననున్న ప్రాంతాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.
© 1997 Bible League International