Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 38

జ్ఞాపకార్థ దినం[a] కోసం దావీదు కీర్తన.

38 యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు.
    నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.
యెహోవా, నీవు నన్ను బాధించావు.
    నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.
నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది.
    నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.
నేను చెడు కార్యాలు చేసిన దోషిని,
    ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.
నేను తెలివితక్కువగా ఉన్నాను.
    ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.
నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను.
    రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.
నా నడుము వేడిగా కాలిపోతోంది.
    నా శరీరం అంతా బాధగా ఉంది.
నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను.
    నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.
ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు.
    నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.
10 నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది.
    నా చూపు దాదాపు పోయింది.
11 నా రోగం మూలంగా నా స్నేహితులు,
    నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు.
    నా కుటుంబం నా దగ్గరకు రాదు.
12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు.
    నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు.
    వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.
13 అయితే నేను వినబడని చెవిటివానిలా ఉన్నాను.
    మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.
14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను.
    నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.
15 కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను.
    నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము.
16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు.
    నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.
17 నేను పడిపోయేటట్టు ఉన్నాను.
    నేను నా బాధను మరచిపోలేను.
18 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను.
    నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.
19 నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు,
    వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.
20 నా శత్రువులు నాకు కీడు చేశారు,
    నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను.
మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను.
    కాని ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.
21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు.
    నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.
22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
    నా దేవా, నన్ను రక్షించుము.

కీర్తనలు. 119:25-48

దాలెత్

25 నేను త్వరలోనే చనిపోతాను.
    యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము.
26 నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు.
    ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు.
27 యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము.
28 నేను అలసిపోయి విచారంగా ఉన్నాను.
    ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము.
29 యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకుము,
    నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము.
30 యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను.
    జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను.
31 యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను.
    నన్ను నిరాశ పరచవద్దు.
32 నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను.
    యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి.

హే

33 యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము.
    నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
34 గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను.
    నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
35 యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు.
    నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు
    నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
37 యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము.
    నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
38 యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము.
    నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు.
    జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
40 చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
    నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము.

వావ్

41 యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము.
    నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము.
42 అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది.
    యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను.
43 నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను.
44 యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను.
    ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.
46 యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను.
    వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను.
47 యెహోవా, నీ ఆజ్ఞలను చదవటము నాకు ఆనందం.
    ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ.
48 యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను.
    మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.

నిర్గమకాండము 19:16-25

16 మూడవ రోజు ఉదయాన పర్వతం మీద ఉరుములు, మెరుపులు వచ్చాయి. దట్టమైన ఒక మేఘం ఆ పర్వతం మీదికి వచ్చింది. ఒక బూర శబ్దం చాల పెద్దగా వినబడింది. ఆ బసలో ఉన్న ప్రజలంతా భయపడిపోయారు. 17 అప్పుడు పర్వతం దగ్గర దేవుణ్ణి కలుసుకొనేందుకు ప్రజలను వారి బసలోనుంచి మోషే బయటకు నడిపించాడు. 18 సీనాయి పర్వతం పొగతో నిండిపోయింది. కొలిమిలోనుంచి లేచినట్టు పొగ ఆ పర్వతం మీద నుండి పైకి లేచింది. యెహోవా అగ్నిలా ఆ పర్వతం మీదికి వచ్చినందువల్ల యిలా జరిగింది. పైగా పర్వతం అంతా వణకడం మొదలయ్యింది. 19 బూర శబ్దం మరింత గట్టిగా మోగింది. దేవునితో మోషే మాట్లాడినప్పుడల్లా ఉరుములాంటి స్వరంతో యెహోవా జవాబిచ్చాడు.

20 సీనాయి కొండ మీదికి యెహోవా దిగి వచ్చాడు. పరలోకంనుంచి ఆ కొండ శిఖరం మీదికి యెహోవా దిగి వచ్చాడు. అప్పుడు మోషేను తనతో కూడ పర్వత శిఖరం మీదికి రమ్మని యెహోవా పిలిచాడు. కనుక మోషే పర్వతం మీదికి వెళ్లాడు.

21 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు కిందికి వెళ్లి, ప్రజలు నాకు సమీపంగా రాకూడదని, నావైపు చూడకూడదని వారితో చెప్పు. వారు కనుక అలా చేస్తే, వారిలో చాల మంది చస్తారు. 22 నాకు సమీపంగా వచ్చే యాజకులు ఈ ప్రత్యేక సమావేశం కోసం వారిని సిద్ధం చేసుకోవాలని వారితో చెప్పు. వారు ఇలా చేయకపోతే, నేను వాళ్లను శిక్షిస్తాను” అని చెప్పాడు.

23 కానీ మోషే యెహోవాతో “ప్రజలు పర్వతం మీదికి రాలేరు. ఒక గీత గీయమని, ప్రజల్ని ఆ గీత దాటి పవిత్ర స్థలం దగ్గరకు రానివ్వవద్దని నీవే మాకు చెప్పావు” అని అన్నాడు.

24 యెహోవా మోషేతో, “కింద ప్రజల దగ్గరకు వెళ్లి, అహరోనును తీసుకొనిరా. అతణ్ణి నీతోపాటు తీసుకొనిరా, కాని యాజకుల్ని, ప్రజల్ని, రానివ్వవద్దు. వాళ్లు నాకు సమీపంగా వస్తే, నేను వాళ్లను శిక్షిస్తాను” అన్నాడు.

25 మోషే ప్రజల దగ్గరకు కిందికి వెళ్లి, ఈ సంగతులు వారితో చెప్పాడు.

కొలొస్సయులకు 1:15-23

క్రీస్తు యొక్క గొప్పతనము

15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన
    అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు
    పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు.
16 క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు.
    పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని,
    సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు.
అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు.

17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు.
    ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.
18 సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు.
    ఆయనే అన్నిటికీ మూలం.
    చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు.
అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.

19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు.
20     దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని,
    కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు.
తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం.

21 మీ దుష్ప్రవర్తనలవల్ల, మీ మనస్సులో ఉన్న దురాలోచనలవల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు. 22 కాని ప్రస్తుతం తన కుమారుని భౌతిక మరణం ద్వారా మీతో సంధి చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మిమ్మల్ని నిష్కళంకులుగా, నిరపరాధులుగా తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన ఉద్దేశ్యం.

23 మీరు విన్న సువార్త వలన రక్షణ కలుగుతుందన్న ఆశ మీలో కలిగింది. దాన్ని పోగొట్టుకోకుండా, దృఢంగా, స్థిరంగా ఆయన్ని విశ్వసిస్తూ ఉంటేనే అది సంభవిస్తుంది. మీరు విన్న ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న ప్రతీ జీవికి ప్రకటింపబడింది. నేను ఈ సందేశానికి సేవకుణ్ణి అయ్యాను.

మత్తయి 3:13-17

యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం

(మార్కు 1:9-11; లూకా 3:21-22)

13 గలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాప్తిస్మము పొందటానికి యొర్దాను నదీ ప్రాంతానికి వచ్చాడు. 14 కాని యోహాను ఆయనతో, “నీ ద్వారా నేను బాప్తిస్మము పొందాలి కాని, నీవు నా ద్వారా బాప్తిస్మము పొందటానికి రావటమా?” అని అంటూ యేసును ఆపటానికి ప్రయత్నించాడు.

15 యేసు సమాధానంగా, “ప్రస్తుతానికి ఇది జరుగనివ్వుము. నీతిని నిలబెట్టటానికి మనమిలా చెయ్యటం సమంజసమే!” అని అన్నాడు. దీనికి యోహాను అంగీకరించాడు.

16 యేసు బాప్తిస్మము పొంది, నీళ్ళ నుండి వెలుపలికి రాగానే అదే క్షణంలో ఆకాశం తెరుచుకొంది. దేవుని ఆత్మ ఒక పాపురంలాగ తన మీదికి రావటం యేసు చూసాడు. 17 పరలోకంనుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు. ఇతని పట్ల నాకెంతో ఆనందం” అని అన్నది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International