Book of Common Prayer
సాదె
137 యెహోవా, నీవు మంచివాడవు.
నీ చట్టాలు న్యాయమైనవి.
138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
అదంటే నాకు ప్రేమ.
141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు.
కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
నీ ఉపదేశాలు నమ్మదగినవి.
143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
ఖాఫ్
145 యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను.
నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను.
146 యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము.
నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను.
147 యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను.
నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను.
148 నీ వాక్యాన్ని ధ్యానించుటకు
నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను.
149 నీవు దయతో నా మాట విను.
యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము.
150 మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు.
151 యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు.
నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి.
152 నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని
చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను.
రేష్
153 యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము.
నీ ఉపదేశాలను నేను మరువలేదు.
154 యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము.
నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము.
155 దుష్టులు జయించరు. ఎందుకంటే,
వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు.
156 యెహోవా, నీవు చాలా దయగలవాడవు.
నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము
157 నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు.
కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు.
158 ఆ ద్రోహులను నేను చూస్తున్నాను.
ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు.
159 చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను.
యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము.
160 యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి.
నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.
యోబు జవాబు
23 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:
2 “ఈవేళ నేను ఇంకా కోపంగా ఆరోపిస్తూనే ఉన్నాను.
దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు, కనుక నేను ఆరోపిస్తూనే ఉంటాను.
3 దేవునిని ఎక్కడ వెదకాలో
ఆయన యొద్దకు ఎలా వెళ్లాలో నాకు తెలిస్తే బాగుండేది, అని నా ఆశ.
4 నేను దేవునికి నా గాధ వివరించుకొంటాను.
నేను నిర్దోషిని అని చూపించటంకోసం నా నోరు వాదాలతో నిండిపోతుంది.
5 నా వాదాలకు దేవుడు ఎలా జవాబు ఇస్తాడో నేను తెలిసికోవాలని కోరుతున్నాను.
అప్పుడు నేను దేవుని జవాబులు గ్రహిస్తాను.
6 దేవుడు గొప్ప శక్తితో నాకు విరోధంగా ఉంటాడా?
లేదు, ఆయన నా మాట వింటాడు!
7 అక్కడ, దేవుని యెదుట ఒక మంచి మనిషి తన గాధను దేవునికి వివరించవచ్చును.
అప్పుడు నా న్యాయమూర్తి నన్ను విముక్తుణ్ణి చేయవచ్చును.
8 “కానీ నేను తూర్పుకు వెళ్తే దేవుడు అక్కడ లేడు.
ఒకవేళ నేను పడమటికి వెళ్తే ఇంకా దేవుడు నాకు కనబడలేదు.
9 దేవుడు ఉత్తరాన పని చేస్తున్నప్పుడు నాకు ఆయన కనబడడు.
దేవుడు దక్షిణంగా తిరిగినప్పుడు ఇంకా ఆయన నాకు కనబడడు.
10 కానీ నేను వేసే ప్రతి అడుగూ దేవునికి తెలుసు.
ఆయన నన్ను పరీక్షించటం ముగించినప్పుడు నాలో మైల ఏమీ లేనట్టుగా ఆయన చూస్తాడు. నేను స్వచ్ఛమైన బంగారంలా ఉన్నట్టు ఆయన చూస్తాడు.
11 నేను ఎల్లప్పుడూ దేవుడు కోరిన మార్గంలోనే నడిచాను.
దేవుని మార్గం అనుసరించకుండా నేను ఎన్నడూ తిరిగిపోలేదు.
12 దేవుడు ఆజ్ఞాపించే వాటినే నేను ఎల్లప్పుడూ చేస్తాను.
నా భోజనం కంటే దేవుని నోటినుండి వచ్చే మాటలు నాకు ఇష్టం.
43 మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు. 44 అంద్రెయ, పేతురులాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు. 45 ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు.
46 నతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి జరగటం సంభవమా!” అని అడిగాడు.
“వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు.
47 నతనయేలు తన వైపు రావటం యేసు చూసాడు. అతణ్ణి గురించి, “అదిగో! నిజమైన ఇశ్రాయేలీయుడు! అతనిలో ఏ కపటమూ లేదు” అని అన్నాడు.
48 “మీకు నేనెలా తెలుసు?” అని నతనయేలు అడిగాడు.
యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసాను” అని అన్నాడు.
49 నతనయేలు, “రబ్బీ! మీరు నిజముగా దేవుని కుమారుడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు” అని అన్నాడు.
50 యేసు, “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం చూసానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు!” అని అన్నాడు. 51 ఆయన మళ్ళీ, “ఇది నిజం. ఆకాశం తెరచుకోవటం, దేవదూతలు మనుష్యకుమారుని యొద్దకు దిగటం, మరల ఎక్కిపోవటం చూస్తావు” అని అన్నాడు.
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
గ్రహించటం నాకు కష్టతరం.
7 నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది.
యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
8 నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు.
పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.
9 యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు.
పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.
10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి,
ఆ చేతితో నన్ను నడిపిస్తావు.
11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే,
“పగలు రాత్రిగా మారిపోయింది.
తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు
12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు.
రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
19 దేవా, దుర్మార్గులను చంపివేయుము.
ఆ హంతకులను నా దగ్గర నుండి తీసివేయుము.
20 ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు.
వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.
21 యెహోవా, నిన్ను ద్వేషించే ప్రజలను నేను ద్వేషిస్తాను.
నీకు విరోధంగా తిరిగే మనుష్యులను నేను ద్వేషిస్తాను.
22 నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను!
నీ శత్రువులు నాకూ శత్రువులే.
23 యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము.
నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము.
24 చూచి, నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము.
శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము.
జీవము, మరణముల గురించి యేసు మాట్లాడటం
20 పండుగ రోజు ఆరాధన చెయ్యటానికి వెళ్ళిన వాళ్ళల్లో గ్రీకులు కూడా ఉన్నారు. 21 వాళ్ళు ఫిలిప్పును కలుసుకొని, “అయ్యా! మేము యేసును చూడటానికి వచ్చాము” అని అన్నారు. ఫిలిప్పు, గలిలయలోని బేత్సయిదా అనే గ్రామానికి చెందిన వాడు. 22 ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. వీళ్ళిద్దరూ వెళ్ళి యేసుతో చెప్పారు.
23 యేసు ఇలా అన్నాడు: “మనుష్యకుమారుడు మహిమపొందు గడియ దగ్గరకు వచ్చింది. 24 ఇది నిజం. గోధుమ విత్తనం భూమ్మీద పడి చనిపోకపోతే అది ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. 25 తన ప్రాణాన్ని ప్రేమించే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని ఈ ప్రాపంచిక జీవితాన్ని ఏవగించుకొన్నవాడు తన ప్రాణాన్ని కాపాడు కొంటాడు. పైగా అనంతజీవితం పొందుతాడు. 26 నా సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు.
© 1997 Bible League International