Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 148-150

148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
    ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
    ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
    ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
    ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
    మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
    తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
    దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
    నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
    వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
    ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
    సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
    దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!

149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
    ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
    సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
    నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
    దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
    ఆయన వారిని రక్షించాడు!
దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
    పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.

ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
    ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
    వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
ఆ రాజులకు, ప్రముఖులకు
    దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
    దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.

యెహోవాను స్తుతించండి!

150 యెహోవాను స్తుతించండి!
దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి!
    ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి!
    ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!
బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి!
    స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!
తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి!
    తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!
పెద్ద తాళాలతో దేవుణ్ణి స్తుతించండి!
    పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!

సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి!

యెహోవాను స్తుతించండి.

కీర్తనలు. 114-115

114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
    యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
    ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
    యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
    కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.

ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
    యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
    కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?

యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
    ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.

115 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది.
    నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే.
    ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు.
    వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.
వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు.
    వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు.
    వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు.
    వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.

ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము.
    యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు.
    యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు.
    యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.

12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు.
    యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
    యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు.
    యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.

14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
15     యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
    ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
16 ఆకాశం యెహోవాకు చెందుతుంది.
    కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు.
    కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం.
    మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము!

యెహోవాను స్తుతించండి!

నిర్గమకాండము 18:1-12

మోషే మామ నుండి సలహా

18 మోషే మామ యిత్రో, మిద్యానులో యాజకుడు. మోషేకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సహాయం చేసిన ఎన్నో విధానాల గూర్చి యిత్రో విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు నడిపించిన విషయం యిత్రో విన్నాడు. దేవుని పర్వతం దగ్గర మోషే ఉన్నప్పుడు మోషే భార్య సిప్పోరాను వెంటబెట్టుకొని, యిత్రో మోషే దగ్గరకు వెళ్లాడు. (సిప్పోరాను మోషే ఇంటికి పంపించినందు చేత ఆమె మోషే వద్ద లేదు) మోషే ఇద్దరు కుమారులను కూడ యిత్రో తన వెంట తీసుకొని వచ్చాడు. “ఒక దేశంలో నేను పరాయివాణ్ణి” అని మోషే చెప్పాడు గనుక, మొదటి కుమారునికి గెర్షోము అని పేరు పెట్టాడు. “నా తండ్రి దేవుడు నాకు సహాయం చేసాడు. ఈజిప్టు రాజు బారినుండి నన్ను రక్షించాడు” అని మోషే అన్నాడు గనుక, మరో కుమారునికి ఎలీయెజరు అని పేరు పెట్టాడు. దేవుని పర్వతం దగ్గర ఎడారిలో మోషే బస చేస్తున్నప్పుడు యిత్రో మోషే దగ్గరకు వెళ్లాడు. మోషే భార్య, అతని ఇద్దరు కుమారులు యిత్రోతోనే ఉన్నారు.

(మోషేకు యిత్రో ఒక సందేశం పంపించాడు), “నేను నీ మామ యిత్రోను. నీ భార్యను, నీ ఇద్దరు కుమారులను నేను నీ దగ్గరకు తీసుకొని వస్తున్నాను,” అన్నాడు యిత్రో.

కనుక మోషే తన మామను కలుసు కొనేందుకు బయటకు వెళ్లాడు. మోషే అతని ఎదుట వంగి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. వాళ్లిద్దరూ వారి వారి క్షేమాన్ని గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తర్వాత ఇంకా మాట్లాడుకొనేందుకు వాళ్లిద్దరూ మోషే గుడారంలోకి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా చేసినదంతా మోషే యిత్రోకు చెప్పాడు. ఫరోకు, ఈజిప్టు ప్రజలకు యెహోవా చేసిన విషయాల్ని గూర్చి మోషే అతనితో చెప్పాడు. దారిలో వారికి కలిగిన సమస్యలన్నిటిని గూర్చీ మోషే చెప్పాడు. కష్టం వచ్చినప్పుడల్లా ఆ ప్రజల్ని యెహోవా ఏ విధంగా రక్షించిందీ, మోషే తన మామతో చెప్పాడు.

ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన మంచి పనులన్నింటిని గూర్చి విన్నప్పుడు యిత్రో చాలా సంతోషించాడు. ఈజిప్టు వాళ్ల నుండి, ఇశ్రాయేలు ప్రజలను యెహోవా విడుదల చేసినందుకు యిత్రో సంతోషించాడు. 10 యిత్రో ఇలా అన్నాడు:

“యెహోవాను స్తుతించండి.
    ఈజిప్టు మనుష్యులనుండి ఆయన మిమ్మల్ని విడిపించాడు.
    ఫరో బారినుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు.
11 ఈజిప్టు వాళ్లకంటె నీ ప్రజలు గొప్ప వాళ్లుగా చేయబడిన విధానాన్ని బట్టి
దేవుళ్లందరికంటె యెహోవా గొప్ప వాడని ఇప్పుడు నాకు తెలిసింది.”

12 అప్పుడు యిత్రో బలి అర్పణలు, కానుకలు యెహోవాకు సమర్పించాడు. తర్వాత అహరోను, ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) మోషే మామ యిత్రోతో కలిసి భోజనం చేసేందుకు వచ్చారు. దేవుడ్ని ఆరాధించేందుకు ఒక ప్రత్యేక పద్ధతిగా వారు ఇలా చేసారు.

1 యోహాను 2:7-17

మనం యితరుల్ని ప్రేమించాలని యేసు చెప్పాడు

ప్రియ మిత్రులారా! నేను మీ కోసం క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మొదటినుండి మీ దగ్గర ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. మీరు విన్న సందేశమే ఈ పాత ఆజ్ఞ. అయినా, ఆ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞగా మీ కోసం వ్రాస్తున్నాను. దాని సత్యం అందరిలో కనిపిస్తోంది. చీకటి గతిస్తోంది. నిజమైన వెలుగు ప్రకాశించటం మొదలు పెట్టింది.

తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు యింకా అంధకారంలో ఉన్నాడన్నమాట. 10 సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో జీవిస్తాడు. అతనిలో ఏ ఆటంక కారణం ఉండదు. 11 కాని సోదరుణ్ణి ద్వేషించేవాడు అంధకారంలోనే ఉండిపోతాడు. అంటే, ఆ అంధకారంలోనే తిరుగుతూ ఉంటాడన్న మాట. చీకటి అతణ్ణి గ్రుడ్డివానిగా చేసింది కాబట్టి తానెక్కడికి వెళ్తున్నది అతనికే తెలియదు.

12 బిడ్డలారా! ఆయన పేరిట మీ పాపాలు క్షమించబడ్డాయి.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
13 వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాడెవరో మీకు తెలుసు!
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీరు సాతాన్ను గెలిచారు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
14 బిడ్డలారా! తండ్రిని మీరెరుగుదురు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను.
వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాణ్ణి మీరెరుగుదురు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీలో బలం ఉంది.
    దేవుని సందేశం మీలో జీవిస్తోంది.
మీరు సాతానును గెలిచారు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను.

15 ప్రపంచాన్ని కాని, ప్రపంచంలో ఉన్నవాటిని కాని ప్రేమించకండి. అంటే, ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదన్నమాట. 16 శారీరక వాంఛలు, కళ్ళలోని దురాశలు, ఒకడు చేసేదాన్ని బట్టి, కలిగియున్న దాన్ని బట్టి కలిగే గర్వం తండ్రికి సంబంధించినవి కావు. ఇవి ప్రపంచానికి సంబంధించినవి. 17 ఈ ప్రపంచము, దానిలో ఉన్న ఆశలు నశించిపోతాయి. కాని దైవేచ్ఛానుసారం జీవించే వ్యక్తి శాశ్వతంగా జీవిస్తాడు.

మార్కు 16:9-20

యేసు కనిపించటం

(మత్తయి 28:9-10; యోహాను 20:11-18; లూకా 24:13-35)

యేసు ఆదివారం తెల్లవారుఝామున బ్రతికి వచ్చి మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. గతంలో యేసు ఈమె నుండి ఏడు దయ్యాలను వదిలించి ఉన్నాడు. 10 ఆమె ఇదివరలో యేసుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ ఉన్నారు. ఆమె వాళ్లకు జరిగిన సంగతి చెప్పింది. 11 యేసు బ్రతికి ఉన్నాడని, తాను ఆయన్ని చూసానని చెప్పింది. ఇది వాళ్ళు విన్నారు. కాని వాళ్ళు ఆమె మాటలు నమ్మలేదు.

12 ఆ తర్వాత యేసు తన యిద్దరు శిష్యులు వారి గ్రామానికి నడుస్తుండగా మరో రూపంలో కనిపించాడు. 13 వీళ్ళు తిరిగి వచ్చి జరిగిన విషయం మిగిలిన శిష్యులకు చెప్పారు. కాని వాళ్ళు వీళ్ళను కూడా నమ్మలేదు.

యేసు తన శిష్యులతో మాట్లాడటం

(మత్తయి 28:16-20; లూకా 24:36-49; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)

14 ఆ తర్వాత పదకొండుగురు భోజనం చేస్తుండగా యేసు వాళ్ళకు కనిపించాడు. తాను బ్రతికి వచ్చిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు. కనుక యేసు వాళ్ళు తనను నమ్మనందుకు వాళ్ళను గద్దించాడు.

15 యేసు వాళ్ళతో, “ప్రపంచమంతా పర్యటన చేసి ప్రజలందరికి సువార్త ప్రకటించండి. 16 విశ్వసించి బాప్తిస్మము పొందిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. కాని, విశ్వసించని వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. 17 విశ్వసించిన వాళ్లకు ఈ ఋజువులు కనిపిస్తాయి. నాపేరిట వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టకలుగుతారు. తమకు రాని భాషల్లో మాట్లాడకలుగుతారు. 18 తమ చేతుల్తో పాముల్ని పట్టుకోగలుగుతారు. విషం త్రాగినా వాళ్ళకే హానీ కలుగదు. వాళ్ళు తమ చేతుల్ని రోగులపై ఉంచితే వాళ్ళకు నయమైపోతుంది” అని అన్నాడు.

యేసు పరలోకానికి వెళ్ళటం

(లూకా 24:50-53; అపొ. కా. 1:9-11)

19 యేసు ప్రభువు వాళ్ళతో మాట్లాడిన తరువాత దేవుడాయన్ని పరలోకానికి పిలుచుకొన్నాడు. ఆయన అక్కడ దేవుని కుడిచేతి వైపున కూర్చున్నాడు.

20 ఆ తర్వాత వాళ్ళు అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించారు. ప్రభువు వాళ్ళతో సహా పని చేసి వాళ్ళు ప్రకటించిన సందేశం నిజమని నిరూపించటానికి ఎన్నో అద్భుతాలు చేసి చూపాడు. ఆమేన్.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International