Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:1-24

ఆలెఫ్[a]

119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
    వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
    వారు యెహోవాకు విధేయులవుతారు.
యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
    ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
    ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
అప్పుడు నేను నీ ఆజ్ఞలను
    ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
    నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
    కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!

బేత్

యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
    నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
    దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
    ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
    నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
    నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
    నీ మాటలు నేను మరచిపోను.

గీమెల్

17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
    తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
    చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
    ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
    నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
    అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
    అది నాకు మంచి సలహా ఇస్తుంది.

కీర్తనలు. 12-14

సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన.

12 యెహోవా, నన్ను రక్షించుము!
    మంచి మనుష్యులంతా పోయారు.
    భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.
    ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.
    పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.
“మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.
మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.”
    అని ఆ ప్రజలు చెప్పుకొంటారు.

కాని యెహోవా చెబుతున్నాడు,
    “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు.
ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు.
    కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”

యెహోవా మాటలు సత్యం, నిర్మలం.
    నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి.
    కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.

యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.
    ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు.
మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు
    ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
    నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
    ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?

నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
    నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
    నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.

యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
    నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
    కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
    బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
    వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.

పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
    వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
    (వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
    మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
    మంచి పనులు చేయలేదు.

దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
    ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
    దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
    ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
    కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
    ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.

సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
    ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
    ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.

నిర్గమకాండము 15:22-16:10

ఇశ్రాయేలీయులు ఎడారిలోనికి వెళ్లటం

22 మోషే మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం నుండి దూరంగా నడిపిస్తూనే ఉన్నాడు. ప్రజలు షూరు ఎడారిలోకి వెళ్లారు. ఎడారిలో మూడు రోజులు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలకు నీళ్లు ఏవీ దొరకలేదు. 23 మూడురోజుల తర్వాత ప్రజలు మారాకు ప్రయాణమై వెళ్లారు. మారాలో నీళ్లున్నాయి గాని అవి త్రాగలేకపోయారు. ఆ నీళ్లు త్రాగలేనంత చేదుగా ఉన్నాయి. అందుకే ఆ స్థలానికి మారా[a] అని పేరు.

24 ప్రజలు మోషేకు ఫిర్యాదు చేయటం మొదలు బెట్టారు, “ఇప్పుడు మేము ఏమి త్రాగాలి?” అన్నారు ప్రజలు.

25 మోషే యెహోవాకు మొర పెట్టాడు. యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును నీళ్లలో వేసాడు. అతను యిలా చేయగానే ఆ నీళ్లు తాగే మంచి నీళ్లయ్యాయి.

ఆ స్థలంలో ప్రజలకు యెహోవా తీర్పు తీర్చి వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ ప్రజల విశ్వాసాన్ని కూడ యెహోవా పరీక్షించాడు. 26 “మీ యెహోవా దేవునికి మీరు విధేయులు కావాలి. ఆయన ఏవి సరైనవని చెబతాడో వాటిని మీరు చేయాలి. యెహోవా ఆజ్ఞలకు, చట్టానికి మీరు విధేయులైతే, ఈజిప్టు వాళ్లలా మీరు రోగులు అవ్వరు. నేను, యెహోవాను, ఈజిప్టు వాళ్ల మీదకు పంపిన రోగాలు ఏవీ మీ మీదకు పంపించను. నేనే యెహోవాను. మిమ్మల్ని స్వస్థపరచేవాడ్ని నేనే.”

27 అప్పుడు ప్రజలు ఏలీమునకు ప్రయాణమయ్యారు. ఏలీములో 12 నీటి ఊటలు ఉన్నాయి. ఇంకా అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయి. అందుచేత ఆ నీళ్ల దగ్గర వారు బసను ఏర్పాటు చేసుకొన్నారు.

ఇశ్రాయేలీయులు సణగగా దేవుడు ఆహారాన్ని పంపటం

16 తర్వాత ప్రజలు ఏలీము నుండి ప్రయాణం చేసి సీనాయి ఎడారి చేరుకొన్నారు. ఈ స్థలం ఏలీముకి, సీనాయికి మధ్య ఉంది. ఈజిప్టు వదలిన తర్వాత రెండోనెల 15వ రోజున వారు ఈ స్థలానికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ఆ ఎడారిలో వారు మోషే అహరోనులకు ఫిర్యాదు చేసారు. “ఈజిప్టు దేశంలోనే యెహోవా మమ్మల్ని చంపేసి ఉంటే మాకు బాగుండేది. ఈజిప్టులో తినేందుకు మాకు సమృద్ధిగా ఉండేది. మాకు కావాల్సిన భోజనం అంతా మాకు ఉండేది. కానీ ఇప్పుడు నీవు మమ్మల్ని ఈ ఎడారిలోనికి తీసుకొచ్చావు. మేమంతా ఆకలితో ఇక్కడే చస్తాము” అంటూ ప్రజలు మోషే అహరోనులతో చెప్పారు.

అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు, “ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాను. ఈ ఆహారం మీరు తినేందుకే. ప్రతిరోజూ ప్రజలు బయటకు వెళ్లి ఆరోజు తాము తినేందుకు ఎంత భోజనం అవసరమో అంతే సమకూర్చు కోవాలి. నేను చెప్పినట్టు ప్రజలు చేస్తారో లేదో చూద్దామని నేను యిలా చేసాను. ఒక్క రోజుకు ఎంత భోజనం సరిపోతుందో సరిగ్గా అంతే ప్రజలు ప్రతిరోజూ తీసుకోవాలి. అయితే శుక్రవారం నాడు ప్రజలు భోజనం సిద్ధం చేసుకొనేటప్పుడు రెండు రోజులకు సరిపడే భోజనం ఉండేటట్టు వారు చూసుకోవాలి.”

కనుక మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పారు, “ఈ రాత్రి యెహోవా శక్తి మీరు చూస్తారు. ఈజిప్టు దేశం నుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడని మీరు తెలుసుకొంటారు. యెహోవా మహిమను రేపు ఉదయం మీరు చూస్తారు. యెహోవాకు మీరు ఫిర్యాదు చేసారు. ఆయన మా మనవి విన్నాడు. (ఆయన మీకు సహాయం చేస్తాడు) మీరు మా దగ్గర ఫిర్యాదు మీద ఫిర్యాదు చేసారు. మేము ఏ పాటి వారం?”

“మీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు, యెహోవా మీ ఫిర్యాదులు విన్నాడు. కనుక రాత్రివేళ ఆయన మీకు మాంసం ఇస్తాడు. మీకు అవసరం ఉన్న భోజనం అంతా ప్రతి ఉదయం మీకు ఉంటుంది. నా దగ్గర, అహరోను దగ్గర మీరు ఫిర్యాదు చేస్తూ ఉండినారు. కానీ ఇప్పుడు మేము కొంచెం విశ్రాంతి తీసుకొంటాం. మీరు ఫిర్యాదు చేస్తోంది నా మీద, అహరోను మీద కాదని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు యెహోవాకు విరోధంగా ఫిర్యాదు చేస్తున్నారు” అన్నాడు మోషే.

ఆ తర్వాత మోషే అహరోనుతో, “నీవు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు: ‘యెహోవా, మీ ఫిర్యాదులు విన్నాడు గనుక ఆయన ఎదుట సమావేశం అవ్వండి’ అని వారితో చెప్పు అన్నాడు.”

10 అహరోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. వాళ్లంతా ఒక్కచోట చేరారు. అహరోను మాట్లాడుతూ ఉండగా, ప్రజలంతా పక్కకు తిరిగి ఎడారిలోకి చూచారు. యెహోవా మహిమ ఒక మేఘంలా ప్రత్యక్షమవడం వారు చూశారు.

1 పేతురు 2:1-10

అందువలన మీరు దుష్టత్వమంతటినీ, మోసమంతటినీ, వేషధారణను, అసూయను మరియు ప్రతివిధమైన దూషణను మీ నుండి తీసివేయండి. అప్పుడే జన్మించిన శిశువులు పాలకోసం తహతహలాడినట్లు, మీరు కూడా దేవుని వాక్యమను పరిశుద్ధ పాల కోసం తహతహలాడండి. ఆ పాల వల్ల మీరు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు. ప్రభువు మంచివాడని అనుభవ పూర్వకంగా మీరు తెలిసికొన్నారు.

మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్ధకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు. కాని, దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు. మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయబలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు:

“అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను!
    పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది.
ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!”(A)

ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. కాని నమ్మిన వాళ్ళకు:

“ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన
    రాయి మూలకు తలరాయి అయింది.”(B)

మరొక చోట యిలా వ్రాయబడి ఉంది:

“ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది.
    ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.”(C)

దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రుపడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.

కాని, మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు.

10 పూర్వం మీరు దేవుని ప్రజ కాదు.
    ఇప్పుడు మీరు దేవుని ప్రజ.
పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు.
    కాని యిప్పుడు లభించింది.

యోహాను 15:1-11

తీగ, కొమ్మలు

15 “నా తండ్రి తోట యజమాని. నేను నిజమైన ద్రాక్షా తీగను. నాలో ఫలం కాయని కొమ్మలన్నిటిని నా తండ్రి పూర్తిగా కొట్టి వేస్తాడు. ఫలమిచ్చే కొమ్మల్ని, అవి యింకా ఎక్కువ ఫల మిచ్చేటట్లు చెయ్యటానికి వాటికొనల్ని కత్తిరిస్తాడు. నేను మీకు బోధించిన విషయాలవల్ల ఎక్కువ ఫల మిచ్చేటట్లు మీరిదివరకే కత్తిరింపబడ్డారు. నాలో ఐక్యమై ఉండండి. నేను మీలో ఐక్యమై ఉంటాను. కొమ్మ స్వతహాగా ఫలమివ్వ లేదు. అది తీగకు అంటుకొని ఉండాలి. అదేవిధంగా మీరు నాలో ఉంటేనే ఫలమివ్వగలరు.

“నేను తీగను. మీరు నా కొమ్మలు. ఒక వ్యక్తి నాలో ఉండి నేను అతనిలో ఉంటే అతడెక్కువ ఫల మివ్వగలడు. నాకు దూరంగా ఉండి మీరేమీ చెయ్యలేరు. నాలో ఉండని వాళ్ళు కొమ్మవలే పారవేయబడతారు. అప్పుడు కొమ్మలు ఎండి పోతాయి. వాటిని ప్రోగుచేసి ప్రజలు మంటల్లో వేస్తారు. అవి కాలిపోతాయి. మీరు నాలో, నా ఉపదేశాలు మీలో ఉంటే మీరు మీకిష్టమైన దేదైనా అడగండి. అది మీకిస్తాను. కోరింది జరుగుతుంది. మీరు ఎక్కువ ఫలం ఫలించి నా శిష్యులుగా ఉంటే నా తండ్రి మహిమ వ్యక్తం చేసిన వాళ్ళౌతారు.

“నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమకు పాత్రులైఉండండి. 10 నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమలో నిలిచియున్నట్లుగా మీరు నా ఆజ్ఞలకు లోబడినట్లైతే నా ప్రేమలో నిలిచియుంటారు. 11 నా ఆనందం మీరు కూడా పంచుకోవాలని, మీరు సంపూర్ణంగా ఆనందించాలని మీకీ విషయాలన్నీ చెప్పాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International