Book of Common Prayer
146 యెహోవాను స్తుతించండి!
నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
2 నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
3 సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
4 మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
5 సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
6 భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
7 అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
8 గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!
147 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
మన దేవునికి స్తుతులు పాడండి.
ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
2 యెహోవా యెరూషలేమును నిర్మించాడు.
బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
3 పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి,
వారి గాయాలకు కట్లు కడతాడు.
4 దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు.
వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
5 మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు.
ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
6 పేదలను యెహోవా బలపరుస్తాడు.
కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
7 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి.
స్వరమండలాలతో మన దేవుణ్ణి స్తుతించండి.
8 దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు.
భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు.
పర్వతాల మీద దేవుడు గడ్డిని మొలిపిస్తాడు.
9 జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు.
పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు.
ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.
19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.
యెహోవాను స్తుతించండి!
111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
2 యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
3 దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
4 దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
5 దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
6 దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
7 దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
8 దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
9 దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.
112 యెహోవాను స్తుతించండి.
యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.
ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
2 ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు.
మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
3 ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు.
అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
4 మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు.
దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
5 ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది.
తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
6 ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు.
ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడతాడు.
7 మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు.
ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
8 ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు.
అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
9 ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు.
అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
10 దుష్టులు ఇది చూచి కోపగిస్తారు.
వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు.
దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.
113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
యెహోవా నామాన్ని స్తుతించండి.
2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
5 ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
ఆయన తప్పక కిందికి చూడాలి.
7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
8 ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.
యెహోవాను స్తుతించండి!
ఇశ్రాయేలీయుల్ని ఫరో తరమటం
5 ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారని ఫరోకు ఒక సమాచారం అందింది. ఎప్పుడైతే ఈ సంగతి విన్నారో అప్పుడు వెంటనే ఫరో, అతని అధికారులు తాము చేసిన దాన్ని గూర్చి తమ మనసు మార్చుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల్ని అసలు మనం ఎందుకు వెళ్లనిచ్చాం? వాళ్లను మనం ఎందుకు పారిపోనిచ్చాం? ఇప్పుడు మనం మన బానిసల్ని పోగొట్టుకొన్నాం” అన్నాడు ఫరో.
6 కనుక ఫరో తన యుద్ధరథాన్ని సిద్ధం చేసుకొని, తన మనుష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్లాడు. 7 తన మనుష్యుల్లో బలవంతులయిన వాళ్లు 600 మందిని, రథాలు అన్నింటిని తనతో తీసుకొని వెళ్లాడు. ఒక్కోరథానికి ఒక్కో అధికారి ఉన్నాడు. 8 ఇశ్రాయేలీయులు విజయ సంకేతంగా చేతులు పైకెత్తి వెళ్లి పోతున్నారు. కానీ ఈజిప్టురాజైన ఫరో ఇంకా ధైర్యశాలి అయ్యేటట్టు యెహోవా చేసాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా తరిమాడు.
9 ఈజిప్టు సైన్యంలో అశ్వదళాలు, రథాలు చాల ఉన్నాయి. వారు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి, వారు బయల్సెఫోనుకు తూర్పున పీహహీరోతు వద్ద ఎర్ర సముద్రానికి దగ్గర్లో బస చేస్తూ ఉండగానే వారిని సమీపించారు.
10 ఫరో, అతని సైన్యం తమవైపే రావడం ఇశ్రాయేలు ప్రజలు చూసారు. ప్రజలు చాల భయపడ్డారు. సహాయం చేయమని వారు యెహోవాకు మొరపెట్టారు. 11 మోషేతో వాళ్లు యిలా అన్నారు, “అసలు ఈజిప్టు నుండి నీవు మమ్మల్నెందుకు బయటకు తీసుకొచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకురావడం ఎందుకు? మేము హాయిగా ఈజిప్టులోనే చచ్చేవాళ్లం అక్కడ ఈజిప్టులో కావాల్సినన్ని సమాధులున్నాయి. 12 ఇలా జరుగుతుందని మేము నీతో చెప్పాము. ‘దయచేసి మమ్మల్ని విసిగించకు. మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి, ఈజిప్టు వాళ్లకు సేవ చేయనియ్యి అని ఈజిప్టులోనే మేము చెప్పాము.’ ఇలా బయటకు వచ్చి ఈఎడారిలో చావడంకంటె ఈజిప్టులోనే ఉండిపోయి బానిసలంగా ఉంటేనే యింకా బాగుండేది మాకు.”
13 కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు! 14 మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయాల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు.”
15 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఇంకా నీవెందుకు నాకు మొర పెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజల్ని ముందడుగు వేయమని ఆజ్ఞాపించు 16 నీ చేతిలో కర్రను ఎర్రసముద్రం మీదకు చాపు, ఎర్రసముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆరిపోయిన నేలమీద సముద్రంలోనుంచి నడిచి వెళ్లిపోవచ్చు. 17 ఈజిప్టు వాళ్లను ధైర్యంగల వాళ్లుగా నేను చేస్తాను. ఇలా చేసినందువల్ల వారు మిమ్మల్ని తరుముతారు. అయితే ఫరోకంటె, అతని అశ్వదళాలు, రథాలు, అన్నిటికంటె నేను ఎక్కువ శక్తిగలవాడ్ని అని మీకు తెలియజేస్తాను. 18 నేనే యెహోవానని ఈజిప్టు అప్పుడు తెలుసు కొంటుంది. ఫరోను, అతని అశ్వ దళాలను, రథాలను నేను ఓడించినప్పుడు వాళ్లు నన్ను గౌరవిస్తారు.”
ఈజిప్టు సైన్యాన్ని యెహోవా ఓడించటం
19 ఆ సమయంలో యెహోవా దూత ప్రజల వెనక్కు వెళ్లడం జరిగింది. (సాధారణంగా యెహోవా దూత ప్రజలకు ముందర ఉండి వారిని నడిపించడం జరుగుతుంది) కనుక ఎత్తైన మేఘం ప్రజల ముందర నుండి కదలిపోయి, ప్రజల వెనక్కు వెళ్లింది 20 ఈ విధంగా ఈజిప్టు వాళ్లకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఆ మేఘం నిలిచింది. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉంది. కానీ ఈజిప్టు వారికి అంతా చీకటి. అందుచేత ఆరాత్రి ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజల సమీపానికి రాలేకపోయారు.
21 మోషే ఎర్ర సముద్రం మీదికి తన చేయి ఎత్తగానే తూర్పునుండి ఒక బలమైన గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ గాలి రాత్రి అంతా వీచింది. సముద్రం రెండుగా విడిపోయింది. ఆ గాలి నేలను ఆరిపోయ్యేటట్టు చేసింది. 22 ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో పొడినేల మీద వెళ్లారు. వాళ్లకు కుడిప్రక్క, ఎడమప్రక్క నీళ్లు గోడలా నిలిచాయి.
జీవ వాక్యం
1 ఏది మొదటినుండి ఉన్నదో, దాన్ని మేము విన్నాము, మా కళ్ళారా చూసాము. చూసి మా చేతుల్తో తాకాము. అదే జీవం కలిగించే వాక్యం. దాన్ని గురించే మీకు ప్రకటిస్తున్నాము. 2 జీవం కనిపించింది. మేము దాన్ని చూసాము. చూసినట్టు సాక్ష్యం కూడా చెపుతున్నాము. ఆ జీవాన్ని గురించి మీకు ప్రకటిస్తున్నాము. ఆ జీవం తండ్రితో ఉంది. అది మాకు కనిపించింది. 3 తండ్రితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు సహవాసం ఉంది కనుక, మీరు కూడా మాతో సహవాసం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మేము చూసినదాన్ని, విన్నదాన్ని మీకు ప్రకటిస్తున్నాము. 4 మన[a] ఆనందం సంపూర్ణంగా ఉండాలని యిది మీకు వ్రాస్తున్నాను.
వెలుగులో నడుచుట
5 దేవుడు వెలుగై వున్నాడు. ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు. ఈ సందేశాన్ని ఆయన మాకు చెప్పాడు. దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసముందని అంటూ చీకట్లో నడిస్తే మనము అసత్యమాడినట్లే కదా! సత్యాన్ని ఆచరించటం మానుకొన్నట్లే కదా! 7 దేవుడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తే మన మధ్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మన పాపాలన్నిటిని కడుగుతుంది.
యేసు తన శిష్యులను ఆదరించటం
14 “మీరు ఆందోళన చెందకండి. దేవుణ్ణి నమ్మండి. నన్ను కూడా నమ్మండి. 2 నా తండ్రి యింట్లో ఎన్నో గదులున్నాయి. అలా లేక పోయినట్లైతే మీకు చెప్పేవాణ్ణి. మీకోసం ఒక స్థలము నేర్పాటు చేయటానికి అక్కడికి వెళ్తున్నాను. 3 నేను వెళ్ళి మీకోసం స్థలం ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండటం నా ఉద్దేశ్యం. 4 నేను వెళ్ళే చోటికి వచ్చే దారి మీకు యిదివరకే తెలుసు” అని యేసు అన్నాడు.
5 తోమా ఆయనతో, “ప్రభూ! మీరు వెళ్ళే చోటు ఎక్కడుందో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకా దారి ఏ విధంగా తెలుస్తుంది?” అని అన్నాడు.
6 యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే! నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు. 7 నేను ఎవరో మీకు నిజంగా తెలిసివుంటే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది. యిప్పుడు ఆయన్ని చూసారు. ఆయనెవరో మీకు తెలుసు” అని సమాధానం చెప్పాడు.
© 1997 Bible League International