Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 145

దావీదు ప్రార్థన.

145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
    నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
    ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
    ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
    నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
    యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.

యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
    యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా, అందరి యెడలా మంచివాడు.
    దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
    నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
    నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
    మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
    నీవు శాశ్వతంగా పాలిస్తావు.

14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
    కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
    సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
    జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
    యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
    యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
    యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
    మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
    దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
    ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!

కీర్తనలు. 104

104 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
    యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు.
మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు.
    ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు.
ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు.
    దేవా, వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు.
దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు.
    గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు.
దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు.
    నీ సేవకులను అగ్నిలా చేశావు.
దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు.
    కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు.
దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు.
    నీళ్లు పర్వతాలను కప్పివేశాయి.
కాని నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి.
    దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి.
పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత
    నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి.
సముద్రానికి నీవు హద్దులు నియమించావు.
    నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు.

10 దేవా, నీటి ఊటలనుండి నీటి కాలువలలోనికి నీవే నీళ్లను ప్రవహింప చేస్తావు.
    పర్వతాల జలధారల ద్వారా నీవు నీటిని క్రిందికి కాలువలా ప్రవహింపజేసావు.
11 నీటి ప్రవాహాలు అడవి జంతువులన్నిటికీ నీళ్లను ఇస్తాయి.
    అక్కడ నీళ్లు త్రాగటానికి అడవి గాడిదలు కూడ వస్తాయి.
12 నీటి మడుగుల చెంత నివసించుటకు అడవి పక్షులు వస్తాయి.
    సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల మీద నుండి అవి పాడుతాయి.
13 దేవుడు పర్వతాల మీదికి వర్షం పంపిస్తాడు.
    దేవుడు చేసిన పనులు భూమికి అవసరమైన ప్రతి దాన్నీ ఇస్తాయి.
14 దేవా, పశువులకు ఆహారంగా గడ్డి ఎదిగేలా నీవు చేస్తావు.
మేము పెంచుటకు ప్రయాసపడే మొక్కల్ని నీవు మాకిస్తావు. ఆ మొక్కలే ఈ భూమి మీద నుండి మాకు లభించే ఆహారం.
15 దేవా, మమ్మల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం నీవు మాకు ఇస్తావు.
    మా చర్మాన్ని నునుపు చేసే[a] తైలాన్ని నీవు మాకిస్తావు.
    మమ్మల్ని బలంగలవారిగా చేయుటకు నీవు మాకు భోజనం ఇస్తావు.

16 లెబానోను మహా దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు.
    ఆ మహా వృక్షాలు ఎదుగుటకు వాటికి సమృద్ధిగా నీళ్లున్నాయి.
17 పక్షులు ఆ వృక్షాలపై గూళ్లు పెడతాయి.
    పెద్ద కొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి.
18 పెద్ద కొండలు అడవి మేకలకు నివాసం,
    పెద్ద బండలు కుందేళ్లు దాక్కొనే చోట్లు.

19 దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు చంద్రుణ్ణిచ్చావు. దాని మూలంగా పండుగ రోజులను తెలుసుకోగలుగుతాము.
    ఎక్కడ అస్తమించాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు.
20 చీకటిని నీవు రాత్రిగా చేశావు.
    ఆ సమయాన అడవి జంతువులు బయటికి వచ్చి చుట్టూరా సంచరిస్తాయి.
21 సింహాలు దాడి చేసేటప్పుడు గర్జిస్తాయి.
    అవి దేవుడు వాటికిచ్చే ఆహారంకోసం ఆయనను అడుగుతున్నట్టు ఉంటుంది.
22 మరల సూర్యుడు ఉదయించినప్పుడు
    ఆ జంతువులు తిరిగి వాటి నివాసాలకు వెళ్లి విశ్రమిస్తాయి.
23 అప్పుడు ప్రజలు వారి పనుల కోసం బయటకు వెళ్తారు.
    సాయంత్రం వరకు వారు పని చేస్తారు.

24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు.
    భూమి నీ కార్యాలతో నిండిపోయింది.
    నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
25 మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది.
    మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి, కొన్ని చిన్నవి.
    మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.
26 మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి.
    నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం[b] ఆ సముద్రంలో ఆడుకుంటుంది.

27 దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి.
    దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం ఇస్తావు.
28 దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు.
    మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.
29 నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు
    అవి భయపడిపోతాయి.
వాటి ప్రాణం వాటిని విడిచినప్పుడు అవి బలహీనమై చస్తాయి.
    మరియు అవి మరల మట్టి అయిపోతాయి.
30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి.
    భూమి మరల క్రొత్తదిగా అవుతుంది.

31 యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక.
    యెహోవా చేసిన వాటిని చూచి ఆయన ఆనందించునుగాక.
32 యెహోవా భూమివైపు చూసేటప్పుడు
    అది వణకుతుంది.
ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు
    వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.

33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను.
    నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.
35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక.
    దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!

యెహోవాను స్తుతించు!

నిర్గమకాండము 13:17-14:4

ఈజిప్టు నుండి బయటకు ప్రయాణం

17 ఫరో ఈజిప్టును విడిచి వెళ్లనిచ్చాడు. సముద్రం వెంబడి పోయే మార్గంలో ఆ ప్రజలను యెహోవా వెళ్లనీయలేదు. ఈ మార్గం పాలస్తీనాకు దగ్గర దారి. కాని “ప్రజలు ఆ దారిన వెళ్తే యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్లు మనసు మార్చుకొని మళ్లీ ఈజిప్టుకు వెళ్లిపోవచ్చు.” 18 కనుక వారిని ఇంకో మార్గాన యెహోవా నడిపించాడు. ఎర్ర సముద్రం పక్కగా ఉండే అరణ్యంలోనుంచి ఆయన వారిని నడిపించాడు. అయితే, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి పెట్టినప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించి బయల్దేరారు.

యోసేపు ఎముకలు స్వదేశానికి తీసుకొని వెళ్లడం

19 మోషే తనతో బాటు యోసేపు ఎముకలను తీసుకొని వెళ్లాడు. ఇలా చేయాలనిచెప్పి యోసేపు తాను చనిపోక ముందే ఇశ్రాయేలి కుమారులతో ప్రమాణం చేయించుకొన్నాడు. “దేవుడు మిమ్మల్ని రక్షించినప్పుడు ఈజిప్టులోనుంచి నా ఎముకల్ని మీతో తీసుకు వెళ్లాలని జ్ఞాపకం ఉంచుకోండి” అని తాను చనిపోక ముందు యోసేపు చెప్పాడు.

యెహోవా తన ప్రజలను నడిపించాడు

20 ఇశ్రాయేలు ప్రజలు సుక్కోతు విడిచి ఏతాములో బసచేసారు. ఏతాము ఎడారికి సమీపంగా ఉంది. 21 యెహోవా ముందు దారితీశాడు. పగటి వేళ ప్రజలను నడిపించేందుకు ఒక ఎత్తయిన మేఘ స్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు, మరియు రాత్రివేళ మార్గం చూపించడానికి ఒక ఎత్తయిన అగ్నిస్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు. వాళ్లు రాత్రి సమయంలో కూడ ప్రయాణం చేయగలిగేటట్టు ఆ అగ్ని వారికి వెలుతురు నిచ్చింది. 22 పగటి వేళంతా ఆ ఎత్తయిన మేఘమూ, రాత్రి వేళంతా అగ్ని స్తంభమూ వాళ్లతోటే ఉన్నాయి.

14 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ప్రజలు వెనక్కు తిరిగి పీహ హీరోతుకు ప్రయాణం కట్టమని చెప్పు. మిగ్దోలుకు, సముద్రానికి మధ్య ప్రదేశంలో రాత్రికి బసచేయాలని వారితో చెప్పు. ఇది బయల్సెఫోను దగ్గర్లో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తప్పిపోయి ఉంటారని ఫరో తలుస్తాడు. పైగా ప్రజలు వెళ్ల గలిగినచోటు ఇంకేమీ ఉండదు అనుకొంటాడు. ఫరోను నేను ధైర్యశాలిగా చేస్తాను. అతడేమో మిమ్మల్ని తరుముతాడు. అయితే ఫరోను, అతని సైన్యాన్ని నేను ఓడిస్తాను. ఇది నాకు కీర్తి తెచ్చి పెడుతుంది. నేనే యెహోవానని ఈజిప్టు వాళ్లు అప్పుడు తెల్సుకొంటారు.” ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విధేయులై ఆయన చెప్పినట్టు చేసారు.

2 కొరింథీయులకు 4:16-5:10

విశ్వాసంద్వారా జీవించటం

16 కనుక మేము అధైర్యపడము. భౌతికంగా మేము క్షీణించిపోతున్నా, మా ఆంతర్యం ప్రతి రోజూ శక్తి పొందుతూ ఉంది. 17 క్షణికమైన మా మామూలు కష్టాలు మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నవి. మనము పొందుతున్న మహిమతో, అనుభవింపనున్న కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కింపతగినవి కావు. 18 అందువల్ల కనిపించే వాటిపై మా దృష్టి ఉంచక కనిపించని వాటిపై మా దృష్టి కేంద్రీకరిస్తున్నాము. కనిపించేది క్షణికము. కనిపించనిది అనంతము.

భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు. పరలోకపు గుడారాన్ని ధరించాలని ఆశిస్తూ మనము ఇంకా మూల్గుతూ ఉన్నాము. మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు. ఈ గుడారంలో నివసిస్తున్నంతకాలం మనం పెద్దభారంతో మూల్గుతూ ఉంటాము. ఈ భౌతిక శరీరాన్ని ధరించిన మనము ఈ జీవితం యొక్క అంతంలో పరలోకపు శరీరాన్ని ధరించుకొంటాము. ఆ శరీరాన్ని ధరించటానికి దేవుడు మనల్ని సిద్ధం చేసాడు. దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చాడు.

అందువల్ల మనము ఈ శరీరంలో నివాసమున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు ఖండితంగా తెలుసు. మనము దృష్టి ఉండటం వల్ల జీవించటం లేదు. విశ్వాసం ఉండటం వల్ల జీవిస్తున్నాము. మనమీ శరీరానికి దూరమై, ప్రభువుతో నివసించాలని కోరుకొంటున్నాము. మనకు ఆ ధైర్యం ఉంది. అందువల్ల మనమీ శరీరంలో నివసిస్తున్నా లేక దానికి దూరంగా ఉన్నా ఆయన్ని ఆనంద పరచటమే మన ఉద్దేశ్యం. 10 ఎందుకంటే మనమంతా క్రీస్తు సింహాసనం ముందు నిలబడవలసి వస్తుంది. అప్పుడు, ఈ శరీరంలో మనముండగా చేసిన మంచికి, చెడుకు తగిన విధంగా ప్రతి ఒక్కడూ ప్రతిఫలం పొందుతాడు.

మార్కు 12:18-27

కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:23-33; లూకా 20:27-40)

18 చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకరని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసారు. 19 “అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, ఆ చనిపోయిన సోదరుని భార్యను బ్రతికివున్న సోదరుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో వ్రాసాడు. 20 ఒకప్పుడు ఏడుగురు సోదరులుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా చనిపొయ్యాడు. 21 రెండవ వాడు అతని వితంతువును వివాహమాడాడు. కాని అతడు కూడా సంతానం లేకుండా చనిపొయ్యాడు. మూడవ వానికి కూడా అదే సంభవించింది. 22 ఆ ఏడుగురిలో ఎవ్వరికి సంతానం కలగలేదు. చివరకు ఆ స్త్రీకూడా చనిపోయింది. 23 చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణింపబడుతుంది? ఆమెను ఆ ఏడగురు పెండ్లి చేసుకొన్నారు కదా?” అని అడిగారు.

24 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు. కనుక పొరబడుతున్నారు. 25 చనిపోయిన వాళ్ళు బ్రతికివచ్చాక వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడ, మగ అని ఉండరు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. 26 ఇక చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో మోషే తాను వ్రాసిన గ్రంథంలో ‘పొదను’ గురించి వ్రాసినప్పుడు, దేవుడు అతనితో ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’(A) అని అతనితో చెప్పాడు. 27 ‘నేను వాళ్ళ దేవుణ్ణి’ అని ఆయన అన్నప్పుడు, వాళ్ళు నిజంగా చనిపోలేదన్న మాట. అంటే ఆయన బ్రతికివున్న వాళ్ళకు మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు.”[a]

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International