Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 136

136 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుళ్లకు దేవుణ్ణి స్తుతించండి!
    ఆయన నిజమైన ప్రేమ నిరంతరం ఉంటుంది.
యెహోవా దేవున్ని స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే ఆయన్ని మాత్రమే స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ ఎల్లప్పుడు ఉంటుంది.
జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ ఎల్లకాలం ఉంటుంది.
దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రున్న్, నక్షత్రాలను చేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
10 దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, జంతువులలోను మొదటివాటిని చంపేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
11 దేవుడు ఈజిప్టునుండి ఇశ్రాయేలును విడిపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
12 దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
13 దేవుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
14 దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముద్రంలో నడిపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
15 దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్రసముద్రంలో ముంచివేశాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
16 దేవుడు తన ప్రజలను ఎడారిలో నడిపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
17 దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
18 దేవుడు బలమైన రాజులను ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
19 దేవుడు అమోరీయుల రాజైన సీహోనును ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
20 దేవుడు బాషాను రాజైన ఓగును ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
21 దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
22 దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
23 దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
24 దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
25 దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
26 పరలోకపు దేవుణ్ణి స్తుతించండి!
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

కీర్తనలు. 118

118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యాజకులారా, మీరు చెప్పండి.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.

నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
    యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను.
    నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
యెహోవా నా సహాయకుడు;
    నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
మనుష్యులను నమ్ముకొనుటకంటే
    యెహోవాను నమ్ముట మేలు.
మీ నాయకులను నమ్ముకొనుట కంటే
    యెహోవాను నమ్ముకొనుట మేలు.

10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.

13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
    కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
    యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.

17 నేను జీవిస్తాను! కాని మరణించను.
    మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
    కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
    నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
    ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
    మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
    అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
    ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!

25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
    దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26     యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”

యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
    బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”

28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
    నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

నిర్గమకాండము 13:1-2

13 అప్పుడు యెహోవా మోషేతో యిలా అన్నాడు. “ఇశ్రాయేలులో పెద్దకుమారుడు ప్రతి ఒక్కడూ నాకు చెందుతాడు. ప్రతి స్త్రీకి పుట్టిన పెద్దకుమారుడూ నావాడు. మీ జంతువుల్లో మొదట పుట్టే ప్రతి మగదాన్నీ మీరు నాకు అర్పించాలి.”

నిర్గమకాండము 13:11-16

11 “మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి యెహోవా మిమ్మల్ని నడిపిస్తాడు. కనానీయులు ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈ దేశాన్ని మీకు ఇస్తానని మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత 12 ప్రతి పెద్ద కుమారుణ్ణి ఆయనకు ఇవ్వాలని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే జంతువుల్లో ప్రథమంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ యెహోవాకు అర్పించాలి. 13 తొలి పిల్లగా పుట్టిన ప్రతి గాడిదనూ యెహోవా దగ్గర్నుండి మళ్లీ కొనుక్కోవచ్చు. మీరు ఆ గాడిదకు బదులుగా ఒక గొర్రెపిల్లను ఇచ్చి, గాడిదను విడిపించుకోవచ్చును. యెహోవా దగ్గర్నుండి ఆ గాడిదను కొని విడిపించుకోనట్లయితే, దాన్ని చంపేయాలి. మీరు దాని మెడ విరుగగొట్టాలి. అది బలి అర్పణ అవుతుంది. ప్రతి పెద్ద సంతానాన్నీ యెహోవా దగ్గరనుండి మళ్లీ కొనుక్కోవాలి.

14 “మీరెందుకు ఇలా చేస్తున్నారని భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. ‘దీనంతటికీ భావం ఏమిటి?’ అని వారు అంటారు. దానికి మీరు యిలా జవాబిస్తారు. ‘ఈజిప్టు నుండి మనల్ని రక్షించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడు. అక్కడ మనం బానిసలంగా ఉంటిమి. అయితే యెహోవా మనల్ని అక్కడ నుండి బయటకు నడిపించి ఇక్కడకు తీసుకొచ్చాడు. 15 ఈజిప్టులో ఫరో మొండికెత్తాడు. మనల్ని వెళ్లనిచ్చేందుకు అతడు నిరాకరించాడు. కనుక ఆ దేశంలో ప్రతి జ్యేష్ఠ సంతానాన్నీ యెహోవా చంపేసాడు. (పెద్ద కుమారుల్ని, తొలి చూలు జంతువుల్ని యెహోవా చంపేసాడు) ఆ కారణంచేత జంతువుల్లో మొదటి సంతానంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ[a] నేను యెహోవాకు అర్పిస్తున్నాను. ఆ కారణంచేతనే నా పెద్ద కుమారుల్లో ప్రతి ఒక్కరినీ నేను యెహోవా దగ్గర్నుండి కొంటున్నాను.’ 16 ఇది మీ ముంజేతికి కట్టబడ్డ దారం పోగులాంటిది. అది నీ కంటికి ఒక బాసికంలాంటిది.[b] యెహోవా తన మహత్తర శక్తిచేత మనల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయకరంగా ఉంటుంది.”

1 కొరింథీయులకు 15:51-58

51 మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు. 52 చివరి బూర ఊదినప్పుడు, మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయినవాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది. 53 ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి. 54 ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది:

“మరణం ఓడిపోయి, సంపూర్ణ విజయం కలిగింది.”(A)

55 “ఓ మరణమా! నీ విజయం ఎక్కడ?
ఓ మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?”(B)

56 మరణం కాటు వేయగల శక్తిని ధర్మశాస్త్రంనుండి పొందుతుంది. 57 కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి వందనాలు.

58 కనుక నా ప్రియమైన సోదరులారా! ఏదీ మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. ప్రభువుకోసం పడిన మీ శ్రమ వృథాకాదు. ఇది మీకు తెలుసు. కనుక సదా ప్రభువు సేవలో లీనమై ఉండండి.

లూకా 24:1-12

యేసు బ్రతికి రావటం

(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; యోహాను 20:1-10)

24 ఆదివారం తెల్లవారుఝామున ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరకు వెళ్ళారు. సమాధికి ఉన్న రాయి త్రోసి వేయబడి ఉండటం గమనించి లోపలికి వెళ్ళి చూసారు. అక్కడ వాళ్ళకు యేసు ప్రభువు దేహం కనిపించ లేదు. దీన్ని గురించి వాళ్ళింకా ఆశ్చర్యపడుతుండగా అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై వాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. వాళ్ళ దుస్తులు మెరుపువలె మెరుస్తూ ఉన్నాయి. భయంతో ఆ స్త్రీలు ముఖాల్ని వంచుకొన్నారు.

ఆ దేవదూతలు, “మీరు బ్రతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ళ మధ్య ఎందుకు వెతుకుతున్నారు? 6-7 ఆయన బ్రతికి, యిక్కడినుండి వెళ్లిపోయాడు. ఆయన మీతో కలిసి గలిలయలో ఉన్నప్పుడు, ‘మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడాలి; సిలువ మీద చంపబడాలి. మూడవ రోజు బ్రతికి రావాలి!’ అని అన్న విషయం మీకు జ్ఞాపకం లేదా!” అని అన్నారు. అప్పుడు వాళ్ళకు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి.

9-10 మగ్దలేనే మరియ, యోహాన్న, యాకోబుల తల్లి మరియ, మరియు మిగతా స్త్రీలు సమాధినుండి వెళ్ళి ఈ విషయాలు ఆ పదకొండుగురికి, మిగతా వాళ్ళకు చెప్పారు. 11 ఆ స్త్రీల మాటలకు అర్థం లేదనుకొని శిష్యులు వాళ్ళ మాటలు నమ్మలేదు. 12 అయినా పేతురు లేచి ఆ సమాధి దగ్గరకు పరుగెత్తాడు. లోనికి తొంగి చూసి, కట్టబడిన వస్త్రాలు అక్కడ పడివుండటం గమనించాడు. ఏమి జరిగి ఉంటుందా? అని ఆశ్చర్యపడ్తూ వెళ్ళిపోయాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International