Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 146-149

146 యెహోవాను స్తుతించండి!
    నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
    నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
    మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
    అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
    సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
    ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
    గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
    విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
    అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!

147 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    మన దేవునికి స్తుతులు పాడండి.
    ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
యెహోవా యెరూషలేమును నిర్మించాడు.
    బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి,
    వారి గాయాలకు కట్లు కడతాడు.
దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు.
    వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు.
    ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
పేదలను యెహోవా బలపరుస్తాడు.
    కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి.
    స్వరమండలాలతో మన దేవుణ్ణి స్తుతించండి.
దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు.
    భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు.
పర్వతాల మీద దేవుడు గడ్డిని మొలిపిస్తాడు.
జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు.
    పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు.
    ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
    సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
    నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
    ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
    దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
    ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
    ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
    మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.

19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
    దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
    ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.

యెహోవాను స్తుతించండి!

148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
    ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
    ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
    ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
    ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
    మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
    తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
    దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
    నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
    వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
    ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
    సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
    దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!

149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
    ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
    సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
    నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
    దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
    ఆయన వారిని రక్షించాడు!
దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
    పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.

ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
    ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
    వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
ఆ రాజులకు, ప్రముఖులకు
    దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
    దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.

యెహోవాను స్తుతించండి!

నిర్గమకాండము 13:3-10

మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ రోజును జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారు. అయితే ఈనాడు యెహోవా తన మహా శక్తిని ప్రయోగించి మిమ్మల్ని విడుదల చేసాడు. మీరు మాత్రం పులిసిన పదార్థంతో రొట్టెలు తినకూడదు. అబీబు[a] మాసంలో ఈనాడు మీరు ఈజిప్టును విడిచి వెళ్తున్నారు. మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసిస్తున్న దేశాన్ని మీకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. యెహోవా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహిస్తున్న ఆ సుందర దేశానికి నడిపించిన తర్వాత అప్పుడు కూడా మీరు ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆరాధన రోజుగా మీకు ఉండాలి.

“ఏడు రోజులపాటు పులియని రొట్టెలే మీరు తినాలి. ఏడోనాడు ఒక గొప్ప విందు ఉంటుంది. ఈ విందు యెహోవా ఘనతను సూచిస్తుంది. కనుక ఏడు రోజులు పులిసిన పదార్థంతో చేయబడ్డ రొట్టెలు ఏవీ మీరు తినకూడదు. మీ దేశం మొత్తంలో ఎక్కడా పులిసిన పదార్థంతో తయారైన రొట్టెలు ఉండకూడదు. ‘యెహోవా ఈజిప్టునుండి మమ్మల్ని బయటకు రప్పించాడు. కనుక మనం ఈ పండుగ చేసుకొంటున్నాము’ అని ఈ రోజు నాడు మీరు మీ పిల్లలతో చెప్పాలి.”

“మీరు జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు తోడ్పడుతుంది. అది మీ ముంజేతి మీద కట్టుకొన్న దారం పోగులా ఉంటుంది. అది మీ కళ్లముందు కనబడే ఒక జ్ఞాపికలా ఉంటుంది. యెహోవా ప్రబోధాలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు సహాయ పడుతుంది. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయ పడుతుంది. 10 కనుక ప్రతి సంవత్సరం సరైన సమయంలో ఈ పండుగను జ్ఞాపకం చేసుకోండి.

1 కొరింథీయులకు 15:41-50

41 సూర్యుడు ఒక రకంగా, చంద్రుడు ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా ప్రకాశిస్తాయి. ఒక నక్షత్రం ప్రకాశించిన విధంగా మరొక నక్షత్రం ప్రకాశించదు.

42 చనిపోయినవాళ్ళు బ్రతికి రావటం కూడా అదే విధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి, నశించని శరీరాన్ని పొందుతారు. 43 గౌరవం లేని శరీరంగా నాటబడి, మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా నాటబడి, శక్తిగల శరీరముగా లేస్తుంది. 44 భౌతికమైన శరీరాన్ని నాటి, ఆత్మీయమైన శరీరాన్ని పుట్టిస్తాడు.

భౌతికమైన శరీరం ఉంది అంటే, ఆత్మీయ శరీరం కూడా ఉంటుంది. 45 ఈ విధంగా వ్రాయబడింది: “ప్రథమ పురుషుడైన ఆదాము జీవించే నరుడయ్యాడు, చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు.” 46 ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం వచ్చింది. ఆ తర్వాత ఆత్మీయత వచ్చింది. 47 మొదటి పురుషుడు భూమ్మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. రెండవ మనుష్యుడు పరలోకంనుండి దిగివచ్చాడు. 48 భూమ్మీద ఉన్నవాళ్ళు మట్టితో సృష్టింపబడినవానివలే ఉన్నారు. పరలోకానికి సంబంధించినవాళ్ళు పరలోకంనుండి వచ్చినవానివలె ఉన్నారు. 49 మట్టితో సృష్టింపబడినవాని పోలికలతో మనము జన్మించినట్లే, పరలోకం నుండి వచ్చినవాని పోలికలను కూడా మనము పొందుతాము.

50 సోదరులారా! నేను చెప్పేదేమిటంటే, రక్త మాంసాలతో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. నశించిపోయేది అమరత్వం పొందదు.

మత్తయి 28:16-20

యేసు తన శిష్యులతో మాట్లాడటం

(మార్కు 16:14-18; లూకా 24:36-49; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)

16 ఆ తర్వాత ఆ పదకొండుగురు శిష్యులు గలిలయకు వెళ్ళి, యేసు చెప్పిన కొండ మీదికి వెళ్ళారు. 17 అక్కడ యేసును చూసి ఆయన ముందు సాష్టాంగ పడ్డారు. కాని వాళ్ళలో కొందరు సందేహించారు 18 అప్పుడు యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, “పరలోకంలో, భూమ్మీదా ఉన్న అధికారమంతా దేవుడు నాకిచ్చాడు. 19 అందువల్ల అన్ని దేశాలకు వెళ్ళి, వాళ్ళను శిష్యులుగా చెయ్యండి. తండ్రి పేరిట, కుమారుని పేరిట, పవిత్రాత్మ పేరిట వాళ్ళకు బాప్తిస్మము యివ్వండి. 20 నేను మీకాజ్ఞాపించిన వన్నీ వాళ్ళను ఆచరించమని బోధించండి. నేను అన్ని వేళలా ఈ యుగాంతం దాకా మీ వెంట ఉంటాను” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International