Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 51

సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.

51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
    నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
    నా పాపాలన్నీ తుడిచివేయుము.
దేవా, నా దోషం అంతా తీసివేయుము.
    నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
నేను పాపం చేశానని నాకు తెలుసు.
    నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
    దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
    నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
నేను పాపంలో పుట్టాను.
    పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
    అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
    నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
    నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
నా పాపాలను చూడకుము!
    వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
    నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
    నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
    కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
    నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
    వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
    నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15     నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
    లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
    దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.

18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
    యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
    మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.

కీర్తనలు. 69:1-23

సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.

69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
    నా నోటి వరకు నీళ్లు లేచాయి.
నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
    నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
    అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
    నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
    నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.
నా తలపైగల వెంట్రుకల కంటె ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు.
    ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు.
    ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు.
    నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.
నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము.
    ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధకులను ఇబ్బంది పడనీయకుము.
నా ముఖం సిగ్గుతో నిండి ఉంది.
    నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను.
నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు.
    నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు.
నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది.
    నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను.
10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను.
    అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు.
11 నా విచారాన్ని చూపించేందుకు నేను దుఃఖ బట్టలు ధరిస్తున్నాను.
    ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు.
12 బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు.
    త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు.
13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన.
    నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను.
దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.
14 బురదలో నుండి నన్ను పైకి లాగుము.
    బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు.
నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము.
15 అలలు నన్ను ముంచివేయనీయకుము.
    లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము.
    సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము
16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము.
    నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము.
17 నీ సేవకునికి విముఖుడవు కావద్దు.
    నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము.
18 వచ్చి నా ఆత్మను రక్షించుము.
    నా శత్రువులనుండి నన్ను తప్పించుము.
19 నా అవమానం నీకు తెలుసు.
    నా శత్రువులు నన్ను అవమానపరిచారని నీకు తెలుసు.
    వారు నన్ను కించపరచటం నీవు చూసావు.
20 సిగ్గు నన్ను కృంగదీసింది.
    అవమానం చేత నేను చావబోతున్నాను.
సానుభూతి కోసం నేను ఎదురు చూశాను.
    కాని ఏమీ దొరకలేదు.
ఎవరైనా నన్ను ఆదరిస్తారని నేను ఎదురుచూశాను.
    కాని ఎవరూ రాలేదు.
21 వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు.
    ద్రాక్షారసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు.
22 వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి.
    విందులు జరుగుతుంటాయి. వారి భోజనాలే వారికి ఎక్కువ అగును గాక.
23 వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము.

విలాప వాక్యములు 1:1-2

యెరూషలేము తన వినాశనానికి దుఃఖించుట

యెరూషలేము ఒకనాడు జనసందోహంతో కిటకిటలాడిన నగరం.
    కాని ఘోరంగా నిర్జనమయ్యింది!
ఒకప్పుడు ప్రపంచ మహానగరాల్లో యెరూషలేము ఒక మహానగరం.
    కాని అది విధవరాలుగా అయింది.
ఒకనాడామె నగరాలలో యువరాణిలా ఉన్నది.
    కాని ఆమె ఒక బానిసలా చేయబడింది.
ఆమె రాత్రివేళ తీవ్రంగా దుఃఖిస్తుంది.
    ఆమె కన్నీరు ఆమె చెక్కిళ్లపై ఉన్నాయి.
    ఆమెను ఓదార్చటానికి ఎవ్వరూ లేరు.
ఆమెతో సఖ్యంగా ఉన్న ఏ ఒక్క దేశమూ
    ఆమెను ఓదార్ఛలేదు.
ఆమె స్నేహితులంతా ఆమెపట్ల విముఖులయ్యారు.
    ఆమె స్నేహితులు ఆమెకు శత్రువులయ్యారు.

విలాప వాక్యములు 1:6-12

సీయోను కుమార్తె[a] అందం
    మాయమయ్యింది.
ఆమె రాకుమారులు లేళ్లవలె అయ్యారు.
    గడ్డి మేయటానికి పచ్చిక బయలు కానరాని లేళ్లవలె వారున్నారు.
శక్తి లేకపోయినా వారెలాగో పారిపోయారు.
    తమను వెంటాడుతున్న వారి నుండి వారు పారిపోయారు.
యెరూషలేము గతాన్ని తలుస్తూవుంది
యెరూషలేము బాధపడిన దినాలను, నివాసం లేక
    తిరిగిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది.
ఆమె తన గత వైభవాన్ని జ్ఞాపకం చేసికొంటూవుంది.
    పాత రోజుల తన అనుభవాలను ఆమె తలపోసుకొంటుంది.
శత్రువు తన ప్రజలను చెరబట్టిన దినాలను ఆమె జ్ఞాపకం చేసికొంటూ ఉంది.
    ఆమెకు కలిగిన నిస్సహాయ పరిస్థితిని ఆమె జ్ఞాపకం చేసికొంటుంది.
ఆమె శత్రువులు ఆమెను చూచి నవ్వారు.
    ఆమె నాశనం చేయబడినందున వారు నవ్వారు.
యెరూషలేము ఘోరంగా పాపం చేసింది.
    యెరూషలేము పాపాల కారణంగా
    ఆమెను చూసిన వారంతా తలలూపే పరిస్థితి వచ్చింది.
ఆమెను గౌరవించిన వారంతా ఇప్పుడామెను అసహ్యించుకుంటున్నారు.
    ఆమెను వారు నగ్నంగా చూశారు,
    గనుక వారామెను అసహ్యించు కుంటున్నారు.
యెరూషలేము మూల్గుతూ ఉంది.
    ఆమె వెనుదిరిగి పోతూవుంది.
యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి.
    తనకు జరుగబోయే విషయాలను గూర్చి ఆమె ఆలోచించలేదు.
ఆమె పతనం విస్మయం కలుగజేస్తుంది.
    ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూలేరు.
“ఓ ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు!
    తనెంత గొప్పవాడినని నా శత్రువు అనుకొంటున్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది.

10 శత్రువు తన చేతిని చాచాడు.
    అతడామె విలువైన వస్తువులన్నీ తీసికొన్నాడు.
వాస్తవంగా, పరదేశీయులు తన పవిత్ర దేవాలయములో ప్రవేశించటం ఆమె చూసింది.
    ఓ యెహోవా, ఆ ప్రజలు నీ పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించకూడదు! అని నీవు ఆజ్ఞాపించావు.
11 యెరూషలేము ప్రజలంతా ఉస్సురుమంటూ ఉన్నారు.
    ఆమె ప్రజలంతా ఆహారం కొరకు వెదుకుతున్నారు.
ఆహారం కొరకు వారికున్న విలువైన వస్తువులన్నీ ఇచ్చివేస్తున్నారు.
    ఇది వారు తమ ప్రాణాలు నిలుపుకోవటానికి చేస్తున్నారు.
యెరూషలేము ఇలా అంటున్నది: “యెహోవా, ఇటు చూడు; నావైపు చూడు!
    ప్రజలు నన్నెలా అసహ్యించుకొంటున్నారో చూడు.”
12 త్రోవన పోయే ప్రజలారా, మీరు నన్ను లక్ష్యపెట్టినట్లు లేదు.
    కాని నావైపు దృష్టి ప్రసరించి చూడండి.
నా బాధవంటి బాధ మరొక్కటేదైనా ఉందా?
    నాకు సంభవించిన బాధలాంటిది మరేదైనా ఉందా?
యెహోవా నన్ను శిక్షంచిన బాధకు మించిన బాధ మరేదైనా ఉందా?
    ఆయనకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున ఆయన నన్ను శిక్షించాడు.

2 కొరింథీయులకు 1:1-7

దైవేచ్ఛ వల్ల యేసు క్రీస్తు అపొస్తులునిగా ఉన్న పౌలు నుండి, మన సోదరుడైన తిమోతి నుండి కొరింథులో ఉన్న దేవుని సంఘానికి మరియు అకయ ప్రాంతంలోని పవిత్రులకు.

మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించాలని కోరుతున్నాను.

దేవునికి వందనాలు చెల్లించుట

మన యేసు క్రీస్తు ప్రభువును, తండ్రియైన దేవుణ్ణి స్తుతిద్దాము. దేవుడు దయామయుడు. మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఆయన మన కష్టాలు తొలగిపోవటానికి సహాయం చేస్తాడు. ఆయనలాగే మనము కూడా యితరుల కష్టాలు తొలగించటానికి సహాయం చెయ్యాలని ఆయన ఉద్దేశం. క్రీస్తు కష్టాల్ని మనము పంచుకొన్న విధంగా ఆయన ద్వారా కలిగే సహాయాన్ని కూడా పంచుకొందాము. మీకు సహాయం చెయ్యాలని, రక్షణ కలగాలని మేము కష్టాలు అనుభవిస్తున్నాము. మీకు సహాయం చెయ్యటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సహాయం వల్ల మేము అనుభవించిన కష్టాలు మీరు కూడా అనుభవించేటట్లు మీలో సహనం కలుగుతుంది. నాకు మీ పట్ల గట్టి నమ్మకం ఉంది. మీరు మా కష్టాలు పంచుకొన్నట్లుగానే, మాకు కలిగే సహాయాన్ని కూడా పంచుకొంటారని మాకు తెలుసు.

మార్కు 11:12-25

ఎండిపొయిన అంజూరపు చెట్టు

(మత్తయి 21:18-19)

12 మరుసటిరోజు వాళ్ళు బేతనియనుండి బయలుదేరి వస్తుండగా యేసుకు ఆకలి వేసింది. 13 కొంత దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం యేసు చూసాడు. దాని మీద పండ్లున్నాయేమో చూడాలని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక, అది పండ్లు కాచేకాలం కానందువల్ల ఆయనకు ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14 అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడదు!” అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు విన్నారు.

యేసు ఆలయంలోనికి వెళ్ళటం

(మత్తయి 21:12-17; లూకా 19:45-48; యోహాను 2:13-22)

15 యెరూషలేము చేరుకొన్నాక యేసు దేవాలయంలోకి ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వాళ్ళను తరిమి వేయటం మొదలుపెట్టాడు. డబ్బు మార్చే వ్యాపారస్తుల బల్లల్ని, పావురాలు అమ్ముతున్న వ్యాపారస్తుల బల్లల్ని క్రింద పడవేసాడు. 16 దేవాలయం ద్వారా ఎవరూ సరుకులు మోసుకు పోనీయకుండా చేసాడు. 17 ఆయన బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జనాంగాలకు ప్రార్థనా ఆలయం అనిపించుకొంటుంది’ అని గ్రంథాల్లో వ్రాసారు.(A) కాని మీరు దాన్ని దోపిడి దొంగలు దాచుకొనే గుహగా మార్చారు”(B) అని అన్నాడు.

18 అక్కడున్న ప్రజలు యేసు బోధను విని ఆశ్చర్యపొయ్యారు. ప్రధానయాజకులు, శాస్త్రులు భయపడి యేసును చంపటానికి మార్గం వెతకటం మొదలు పెట్టారు. 19 సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు.

యేసు విశ్వాస శక్తిని చూపటం

(మత్తయి 21:20-22)

20 ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. 21 పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు.

22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. 23 ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. 24 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది. 25 అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతణ్ణి క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International