Book of Common Prayer
దావీదు కీర్తన.
24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
4 అక్కడ ఎవరు ఆరాధించగలరు?
చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
8 ఈ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
దావీదు కీర్తన.
103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
3 మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
5 దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
6 యెహోవా న్యాయం కలవాడు.
ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
7 దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
8 యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
14 మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు.
మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు.
15 మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు.
మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు.
మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు.
16 ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడిపోతుంది.
త్వరలోనే ఆ పువ్వు ఎక్కడికి ఎగిరిపోతుందో నీవు చూడలేకపోతావు.
17 కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు.
దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు.
18 దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
19 దేవుని సింహాసనం పరలోకంలో ఉంది.
మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు.
20 దేవదూతలారా, యెహోవాను స్తుతించండి.
దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు.
మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి.
21 యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి.
మీరు ఆయన సేవకులు,
దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.
అవన్నీ యెహోవాను స్తుతించాలి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!
రాబోయే రాజు
9 సీయోనూ, నీవు సంతోషంగా వుండు!
యెరూషలేము ప్రజలారా, ఆనందంతో కేకలు పెట్టండి!
చూడండి, మీరాజు మీ వద్దకు వస్తున్నాడు!
ఆయన విజయం సాధించిన మంచి రాజు.
కాని ఆయన వినయం గలవాడు. ఆయన ఒక గాడిదపై స్వారీ చేస్తున్నాడు. ఒక గాడిద పిల్లపై వస్తున్నాడు.
10 రాజు చెపుతున్నాడు, “నేను ఎఫ్రాయిములో రథాలనూ,
యెరూషలేములో గుర్రవు రౌతులను నాశనం చేశాను.
యుద్ధంలో వాడిన విల్లంబులను నాశనం చేశాను.”
శాంతిని గూర్చిన వార్తను అన్య దేశాలు విన్నాయి.
ఆ రాజు సముద్రంనుండి సముద్రంవరకు పరిపాలిస్తాడు.
ఆయన నదినుండి భూమిపై సుదూర ప్రాంతాలవరకు పాలిస్తాడు.
యెహోవా తన ప్రజలను రక్షించటం
11 యెరూషలేమూ, మన ఒడంబడిక రక్తంతో స్థిరపర్చబడింది.
కావున నీ బందీలను నేను విడుదల చేశాను. నీ ప్రజలు ఇక ఎంతమాత్రం ఆ ఖాళీ చెరసాలలో ఉండరు.
12 చెరపట్టబడిన ప్రజలారా, ఇంటికి వెళ్ళండి.
మీకు ఇంకా ఆశపడదగింది ఉంది.
నేను మీవద్దకు తిరిగి వస్తున్నానని
నేను మీకు చెపుతున్నాను!
9 యెహోవా చెపుతున్నాడు: “ఆ సమయంలో యెరూషలేముపై యుద్ధానికి వచ్చిన దేశాలను నేను నాశనం చేస్తాను. 10 దావీదు వంశాన్ని, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను దయాదాక్షిణ్య స్వభావంతో నింపివేస్తాను. వారు నన్ను పొడిచారు. అలాంటి నా సహాయం కొరకే వారు ఎదురు చూస్తారు. వారు చాలా విచారిస్తారు. తన ఏకైక కుమారుడు చనిపోయినవాడు విలపించేలా, తన మొదటి కుమారుడు చని పోయినవాడు విలపించేలా వారు దుఃఖిస్తారు. 11 యెరూషలేములో గొప్ప దుఃఖ సమయం ఉంటుంది. అది మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను మరణంపట్ల ప్రజల దుఃఖంలా వుంటుంది.
13 కాని, ఆ సమయంలో దావీదు కుటుంబానికి, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకొరకు ఒక నీటి జల తీయబడుతుంది. ఆ జలం వారి పాపాలను కడిగి, వారిని పవిత్రులుగా చేయటానికి ఉద్దేశించబడుతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “ఖడ్గమా, గొర్రెల కాపరిని నరుకు! నా స్నేహితుని నరుకు! కాపరిని నరుకు! గొర్రెలన్నీ పారిపోతాయి. నేను ఆ చిన్నవాటిని శిక్షిస్తాను. 8 దేశ జనాభాలో మూడింట రెండు వంతులు బాధింపబడగా చనిపోతారు. మూడింట ఒకవంతు బతుకుతారు. 9 చనిపోగా మిగిలినవారిని నేను పరీక్షిస్తాను. వారికి నేను ఎన్నో కష్టాలు కలుగ జేస్తాను. వెండిని శుద్ధి చేయటానికి కాల్చబడే అగ్నిలా ఆ కష్టాలు వుంటాయి. ఒకడు బంగారాన్ని పరీక్ష చేసినట్లు నేను వారిని పరీక్ష చేస్తాను. అప్పుడు సహాయం కొరకు వారు నన్ను పిలుస్తారు. నేను వారికి సమాధానమిస్తాను. ‘మీరు నా ప్రజలు’ అని నేను అంటాను. అప్పుడు వారు ఇలా అంటారు: ‘యెహోవా మా దేవుడు.’”
12 నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు. 13 అన్నిటికీ ప్రాణం పోసే దేవుని పేరిట, పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీకరించిన యేసు క్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. 14 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఈ ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయకుండా, ఏ అపకీర్తీ రానివ్వకుండా చూడు. 15 “మన పాలకుడు,” రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం రాగానే యేసు క్రీస్తును పంపుతాడు. 16 మనం సమీపించలేని వెలుగులో ఉండే అమరుడైన దేవుడాయన. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆయన శక్తి తరగకుండా ఉండుగాక! అమేన్.
యేసు యెరూషలేమును చూచి యేడవటం
41-42 ఆయన యెరూషలేము సమీపిస్తూ ఆ పట్టణాన్ని చూసి ఈ విధంగా విలపించ సాగాడు: “శాంతిని స్థాపించటానికి ఏమి కావాలో నీకు ఈ రోజైనా తెలిసుంటే బాగుండేది. కాని అది నీకిప్పుడు అర్థం కాదు. 43 నీ శత్రువులు నీ చుట్టూ గోడకట్టి నాలుగు వైపులనుండి ముట్టడి చేసే రోజులు రానున్నాయి. 44 వాళ్ళు నిన్ను, నీ ప్రజల్ని నేల మట్టం చేస్తారు. దేవుని రాకను నీవు గమనించలేదు. కనుక వాళ్ళు ఒక రాయి మీద యింకొక రాయి ఉండకుండా చేస్తారు.”
యేసు ఆలయంలోనికి వెళ్ళటం
(మత్తయి 21:12-17; మార్కు 11:15-19; యోహాను 2:13-22)
45 ఆ తర్వాత ఆయన మందిరంలోకి ప్రవేశించి అక్కడ అమ్ముతున్న వ్యాపారస్తుల్ని తరిమి వేయటం మొదలు పెట్టాడు. 46 వాళ్ళతో, “నా ఆలయం ప్రార్థనా ఆలయం.(A) కాని మీరు దాన్ని ‘దొంగలు దాగుకొనే స్థలంగా’(B) మార్చారు!” అని చెప్పబడిందని అన్నాడు.
47 ఆయన ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ ఉండే వాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజా నాయకులు ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. 48 కాని ప్రజలు యేసు మాటలు శ్రద్ధతో వింటూ ఉండటంవల్ల ఆయన్ని ఏ విధంగా చంపాలో వాళ్ళకు బోధపడలేదు.
© 1997 Bible League International