Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 137

137 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని
    సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం.
దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లకు[a] మన సితారాలు తగిలించాము.
బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు.
    సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు.
    సీయోను గూర్చి పాటలు పాడమని వారు మనకు చెప్పారు.
కాని విదేశంలో మనం యెహోవాకు
    కీర్తనలు పాడలేము!
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
    నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండిపోవును గాక!
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
    నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకుపోవును గాక!
నేను ఎన్నటికీ నిన్ను మరువనని
    వాగ్దానం చేస్తున్నాను.

యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను!
    యెహోవా, యెరూషలేము పడిన రోజున
ఎదోమీయులు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకొనుము.
    దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు.
బబులోనూ, నీవు నాశనం చేయబడతావు!
    నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించబడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక!
    నీ చంటి బిడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.

కీర్తనలు. 144

దావీదు కీర్తన.

144 యెహోవా నా దుర్గం.[a] యెహోవాను స్తుతించండి.
    యెహోవా నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తాడు.
యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం చేస్తాడు.
యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు.
    పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం.
యెహోవా నన్ను రక్షిస్తాడు,
    యెహోవా నా కేడెం.
నేను ఆయనను నమ్ముతాను.
    నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు.
యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం?
    నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు?
మనిషి జీవితం గాలి బుడగలాంటిది.
    వాని జీవితం దాటిపోతున్న నీడలాంటిది.

యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము.
    పర్వతాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది.
యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము.
    నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము.
యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము.
    ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము.
    ఇతరుల నుండి నన్ను రక్షించుము.
ఈ శత్రువులు అబద్ధీకులు.
    వారు అసత్య విషయాలు చెబుతారు.

యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకార్యాలను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము.
    పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను.
10 రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు.
    యెహోవా సేవకుడు దావీదును అతని శత్రువు ఖడ్గాలనుండి ఆయన రక్షించాడు.
11 ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము.
    ఈ శత్రువులు అబద్ధీకులు.
    వారు అసత్యాలు చెబుతారు.

12 మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను.
    మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు.
13 మన ధాన్యపు కొట్టాలు అన్ని రకాల పంటలతో
    నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
మన పొలాల్లోని గొర్రెలు వేలకు వేలుగా
    పిల్లల్ని పెడతాయని నేను ఆశిస్తున్నాను.
14     మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను.
శత్రువులు ఎవరూ మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తున్నాను.
    మనం ఎన్నటికీ యుద్ధానికి వెళ్లం అని నేను ఆశిస్తున్నాను.
మన వీధుల్లో ప్రమాదాల కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను.

15 ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు.
    యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు.

కీర్తనలు. 42-43

రెండవ భాగం

(కీర్తనలు 42–72)

సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం

42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
    అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
    ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
    నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.

కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
    నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
    అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.

నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
    ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
    ఆయన నన్ను కాపాడుతాడు.
నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
    కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
    నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.

ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
    అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
    “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
    నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
    “నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.

11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
    నా సహాయమా! నా దేవా!

43 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము.
నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము.
ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు.
ఆ ప్రజలు వంకర మనుష్యులు.
దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
దేవా, నీవే నా క్షేమ స్థానం.
    నీవు నన్నెందుకు విడిచిపెట్టావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి
    నేనెందుకు విచారంగా ఉండాలి?
దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
    నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను.
    దేవుని దగ్గరకు నేను వస్తాను.
ఆయన నన్ను సంతోషింపజేస్తాడు.
    దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.

నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను?
దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి.
    నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది.
    నా దేవుడే నాకు సహాయము.

నిర్గమకాండము 10:21-11:8

అంధకారం

21 అప్పుడు యెహోవా, “నీ చెయ్యి పైకెత్తు, ఈజిప్టు చీకటిమయం అవుతుంది. చీకటిలో తడవులాడేటంత కటిక చీకటి కమ్ముతుంది” అని మోషేతో చెప్పాడు.

22 కనుక మోషే తన చేతిని పైకి ఎత్తగానే ఒక చీకటి మేఘం ఈజిప్టును ఆవరించేసింది. ఈజిప్టులో మూడు రోజుల పాటు ఆ చీకటి ఉండిపోయింది. 23 ఎవ్వరూ ఎవ్వర్నీ చూడలేక పోయారు. మూడు రోజుల వరకు ఎవ్వరూ వాళ్ల స్థానాలు విడిచి పెట్టలేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రదేశాలన్నింటిలో వెలుగు ఉంది.

24 ఫరో మళ్లీ మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు మీ పిల్లల్ని మీతో కూడా తీసుకొని వెళ్లొచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి” అన్నాడు.

25 “మా గొర్రెల్ని, పశువుల్ని మాతో కూడ తీసుకొని వెళ్లడమేకాదు, మేము వెళ్లేటప్పుడు మీరు కూడ కానుకలు, బలి అర్పణలు మాకు యివ్వాలి. మా యెహోవా దేవుడ్ని ఆరాధించడానికి ఈ బలులను మేము వాడుకొంటాము. 26 యెహోవాను ఆరాధించేందుకు మా జంతువుల్ని కూడ మేము తీసుకొని వెళ్తాము. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి పెట్టబడదు. యెహోవాను ఆరాధించేందుకు ఏమేమి కావాలో సరిగ్గా మాకూ ఇంకా తెలియదు. మేము వెళ్తున్న చోటికి చేరిన తర్వాతే అది మాకు తెలుస్తుంది. అందుచేత యివన్నీ మేము తీసుకెళ్లాల్సిందే” అని మోషే అన్నాడు.

27 యెహోవా ఫరోను ఇంకా మొండిగా చేసాడు. అందుచేత ఫరో ప్రజలను వెళ్లనివ్వలేదు. 28 అప్పుడు ఫరో మోషేతో, “పో, నా దగ్గర్నుండి వెళ్లిపో! నీవు మళ్లీ ఇక్కడకు రాకూడదు. నన్ను కలుసుకోవాలని మరోసారి వస్తే, నీవు చస్తావు” అన్నాడు.

29 “మోషే ఫరోతో, నీవు చెప్పింది నిజమే. నిన్ను చూడ్డానికి నేను మళ్లీ రాను” అని చెప్పాడు.

జ్యేష్ఠుల మరణం

11 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఫరో మీదికి, ఈజిప్టు మీదికి నేను ఇంకా ఒక నాశనం తీసుకు రావల్సి ఉంది. దాని తర్వాత అతడు మిమ్మల్ని ఈజిప్టు నుండి పంపించి వేస్తాడు. వాస్తవానికి మీరు ఈ దేశం వదలి వెళ్లిపోవాలని అతడు మిమ్మల్ని బలవంతం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఈ సందేశం మీరు చెప్పాలి, ‘మీరు స్త్రీలు పురుషులు అందరూ మీ చుట్టు ప్రక్కల వాళ్ల దగ్గరకు వెళ్లి, వారి వెండి, బంగారు వస్తువులన్నీ మీకు ఇమ్మని అడగాలి. ఈజిప్టు వాళ్లకు మీపై దయ కలిగేటట్టు యెహోవా చేస్తాడు.’” అప్పటికే ఈజిప్టు ప్రజలు మరియు ఫరో అధికారులు కూడా మోషేను ఒక మహాత్మునిగా ఎంచుతున్నారు.

మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ వేళ మధ్యరాత్రి మరణదూత ఈజిప్టులో తిరుగుతాడు. ఫరో పెద్ద కుమారుడు మొదలు ధాన్యం తిరుగలి విసరుతున్న బానిసయొక్క, పెద్ద కుమారుడు వరకు ఈజిప్టులో ప్రతి పెద్ద కుమారుడు మరణిస్తాడు. అలాగే జంతువుల్లో మొదట పుట్టినవన్నీ చస్తాయి. గతంలోకంటె, భవిష్యత్తులోకంటె, ఇప్పుడు ఈజిప్టులోవినబడే ఏడ్పులు మరీ దారుణంగా ఉంటాయి. కాని ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరికీ హాని కలుగదు. కనీసం వారిపై ఒక కుక్క కూడ మొరగడం ఉండదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరుగాని, వారి జంతువుల్లో ఏ ఒక్కటిగాని బాధపడవు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు వాళ్లకంటె, ప్రత్యేకంగా నేను చూశానని మీరు తెలుసుకొంటారు. అప్పుడు మీ బానిసలు (ఈజిప్టు వాళ్లు) సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తారు. ‘మీ ప్రజలందరినీ తీసుకొని మీరు వెళ్లిపోండి’ అని వాళ్లే అప్పుడు చెబతారు. అప్పుడు నేను కోపంగా ఫరోను విడిచి వెళ్తాను.”

2 కొరింథీయులకు 4:13-18

13 లేఖనాల్లో, “నేను విశ్వసించాను. కనుక మాట్లాడుతున్నాను”(A) అని వ్రాయబడి ఉంది. మేము కూడా అదే విధంగా విశ్వసించాము. కనుక మాట్లాడుతున్నాము. 14 ఎందుకంటే, చనిపోయిన యేసు ప్రభువును బ్రతికించినవాడు, ఆయనతో సహా మమ్మల్ని కూడా బ్రతికిస్తాడని మాకు తెలుసు. ఆ విధంగా మమ్ములను కూడా లేపి, మీతో సహా మమ్మల్ని కూడా దేవుని సమక్షంలో నిలబెడతాడు. 15 ఇవన్నీ మీ కోసమే జరుగుతున్నాయి. దైవానుగ్రహం ప్రజల్లో వ్యాపిస్తూ పోవాలనీ, దేవుని మహిమ నిమిత్తమై ప్రజలు అర్పించే కృతజ్ఞతలు పెరుగుతూ పోవాలని యిందులోని ఉద్దేశ్యం.

విశ్వాసంద్వారా జీవించటం

16 కనుక మేము అధైర్యపడము. భౌతికంగా మేము క్షీణించిపోతున్నా, మా ఆంతర్యం ప్రతి రోజూ శక్తి పొందుతూ ఉంది. 17 క్షణికమైన మా మామూలు కష్టాలు మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నవి. మనము పొందుతున్న మహిమతో, అనుభవింపనున్న కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కింపతగినవి కావు. 18 అందువల్ల కనిపించే వాటిపై మా దృష్టి ఉంచక కనిపించని వాటిపై మా దృష్టి కేంద్రీకరిస్తున్నాము. కనిపించేది క్షణికము. కనిపించనిది అనంతము.

మార్కు 10:46-52

గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం

(మత్తయి 20:29-34; లూకా 18:35-43)

46 ఆ తర్వాత వాళ్ళు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వాళ్ళతో ఉన్న ప్రజల గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు బిక్షగాడు. 47 ఆ గ్రుడ్డివాడు, వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకొని, “యేసూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు!” అని బిగ్గరగా అనటం మొదలు పెట్టాడు.

48 చాలామంది అతణ్ణి తిట్టి ఊరుకోమన్నారు. కాని ఆ గ్రుడ్డివాడు. “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని యింకా బిగ్గరగా అరిచాడు.

49 యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అని అన్నాడు.

వాళ్ళా గ్రుడ్డివానితో, “ధైర్యంగా లేచి నిలుచో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని అన్నారు. 50 ఆ గ్రుడ్డివాడు కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి, గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు.

51 యేసు, “ఏమి కావాలి?” అని అడిగాడు.

ఆ గ్రుడ్డివాడు, “రబ్బీ! నాకు చూపు కావాలి” అని అన్నాడు.

52 యేసు, “నీ విశ్వాసం నీకు నయం చేసింది. యిక వెళ్ళు” అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International