Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 131-133

యాత్ర కీర్తన.

131 యెహోవా, నేను గర్విష్ఠిని కాను.
    నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను.
నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను.
    నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను.
నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది.
    తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా
    నా ప్రాణం మౌనంగా, నెమ్మదిగా ఉంది.

ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో.
    ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో.

యాత్ర కీర్తన.

132 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకొమ్ము.
కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
    ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను.
    నేను నా పడక మీద పండుకొనను,
నేను నిద్రపోను,
    నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను,
యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను!
    ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”

ఎఫ్రాతాలో[a] మేము దాన్ని గూర్చి విన్నాం.
    ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము[b] దగ్గర మేము కనుగొన్నాము.
మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి.
    దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము.
    యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము.
    నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
10 నీ సేవకుడైన దావీదు కోసం
    నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు.
11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు.
    దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే
    అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.

13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు.
    తన నివాసస్థలంగా దాన్ని కోరుకొని యున్నాడు.
14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం.
    నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను.
    ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను.
    మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను.
    నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను.
    కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”

దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.

133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
    ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
    అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
    సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.

కీర్తనలు. 140

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

140 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము.
ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు.
    వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి
    వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.

యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు.
    నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు.
    నా దారిలో వారు ఉచ్చు పెడతారు.

యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను.
    యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు.
    నీవు ఇనుప టోపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు.
యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు.
    వారి పథకాలు నెగ్గనీయకు.

యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము.
    ఆ మనుష్యులు చెడు కార్యాలు తలపెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చేయుము.
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము.
    నా శత్రువులను అగ్నిలో పడవేయుము.
    వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము.
11 యెహోవా, ఆ అబద్దికులను బ్రతుకనియ్యకుము.
    ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము.
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు.
    నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు.
    నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.

కీర్తనలు. 142

దావీదు ధ్యాన గీతం. అతడు గుహలో ఉన్నప్పటి ప్రార్థన.

142 సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను.
    యెహోవాను నేను ప్రార్థిస్తాను.
నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
    నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు.
    నా ప్రాణం నాలో మునిగిపోయింది.
    అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.

నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు.
    పారిపోవుటకు నాకు స్థలం లేదు.
    నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను.
    యెహోవా, నీవే నా క్షేమ స్థానం.
    యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
యెహోవా, నా ప్రార్థన విను.
    నీవు నాకు ఎంతో అవసరం.
నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము.
    యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను.
నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై,
    నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.

నిర్గమకాండము 7:25-8:19

కప్పలు

25 నైలు నది నీళ్లను యెహోవా మార్చేసిన తర్వాత ఏడు రోజులు గడిచాయి.

మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఫరో దగ్గరకు వెళ్లి, ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు, అని యెహోవా చెబుతున్నాడని అతనితో చెప్పు. వారు వెళ్లడానికి ఫరో నిరాకరిస్తే నేను ఈజిప్టును కప్పలతో నింపేస్తాను నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నదిలోనుంచి వచ్చి మీ ఇళ్లలో దూరుతాయి. అవి మీ పడక గదుల్లో పడకల మీద వుంటాయి. మీ అధికారుల ఇళ్లలో, మీ వంట పాత్రల్లో, నీళ్ల బానల్లో కప్పలే ఉంటాయి. నీవు, నీ ప్రజలు, నీ అధికారులు అందరి మీదికీ కప్పలు వచ్చేస్తాయి.’”

అప్పుడు మోషేతో యెహోవా, “కాలువలు, నదులు, చెరువులు, అన్నింటి మీదికీ తన చేతి కర్రను ఎత్తమని అహరోనుతో చెప్పు. కప్పలు బయటకు వచ్చి ఈజిప్టు అంతటా నిండుతాయి” అని చెప్పాడు.

కనుక ఈజిప్టు జలాలపై అహరోను తన చేయి ఎత్తగా నీళ్లలో నుండి కప్పలు బయటకు వచ్చి, ఈజిప్టు దేశమంతా నిండిపోవటం మొదలయింది.

మాయలు చేసే ఈజిప్టు మాంత్రికులు కూడా అలాగే చేసారు, కనుక ఈజిప్టు మీదికి ఇంకా ఎక్కువ కప్పలు వచ్చాయి.

మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు, “నా దగ్గర్నుండి, నా ప్రజల దగ్గర్నుండి కప్పలను తీసివేయుమని యెహోవాను అడగండి. యెహోవాకు బలులు అర్పించేందుకు ప్రజల్ని నేను వెళ్లనిస్తాను” అన్నాడు ఫరో.

ఫరోతో మోషే ఇలాగు చెప్పాడు, “కప్పలు ఎప్పుడు పోవాలనుకుంటున్నావో నాతో చెప్పు, నీ కోసం, నీ ప్రజల కోసం, నీ అధికారుల కోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడే కప్పలు మిమ్మల్ని, మీ ఇళ్లను విడిచిపెట్టి నదిలోనే ఉండిపోతాయి. (కప్పలు ఎప్పుడు నిన్ను వదిలి పోవాలనుకొంటున్నావు?)”

10 “రేపే” అన్నాడు ఫరో.

మోషే అన్నాడు: “నీవు చెప్పినట్టే జరుగుతుంది. మా దేవుడైన, యెహోవాలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరని నీవు తెలుసుకొంటావు. 11 నిన్ను, నీ ఇంటిని, నీ అధికారుల్ని, నీ ప్రజల్ను కప్పలు విడిచిపోతాయి. ఆ కప్పలు నదిలోనే ఉండిపోతాయి.”

12 మోషే, అహరోను ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయారు. ఫరో మీదికి ఆయన పంపిన కప్పల్నిగూర్చి మోషే యెహోవాకు మొరపెట్టాడు. 13 మోషే అడిగిన ప్రకారం దేవుడు చేసాడు. ఇళ్లలో, వాకిళ్లలో, పొలాల్లో కప్పలు చచ్చాయి. 14 అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది. 15 కప్పల బాధ వదలిపోవడం చూచి ఫరో మళ్లీ మొండికెత్తాడు. అతను ఏమి చెయ్యాలని మోషే అహరోనులు అడిగారో, అలా చేయలేదు. ఇదంతా సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.

పేలు

16 యెహోవా మోషేతో ఇలా అన్నాడు “నీ కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టు ఈజిప్టుదేశ వ్యాప్తంగా దుమ్ము పేలు అవుతాయి. అని అహరోనుతో చెప్పు.”

17 వారు అలా చేసారు. అహరోను తన చేతి కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టాడు. ఈజిప్టు అంతటా దుమ్ము పేలు అయింది. మనుష్యుల మీద జంతువుల మీద పేలు ఎక్కేసాయి.

18 ఈజిప్టు మాంత్రికులు వారి మాయల్ని ప్రయోగించి వారు కూడ అలా చేయాలని ప్రయత్నం చేసారు. కానీ దుమ్ము నుండి పేలు వచ్చేటట్టు చేయలేక పోయారు. జంతువుల మీద, మనుష్యుల మీద పేలు అలాగే ఉండిపోయాయి.

19 కనుక ఇది యెహోవా శక్తివల్లే జరిగిందని మాంత్రికులు ఫరోతో చెప్పారు. కాని ఫరో వారు చెప్పింది ఒప్పుకోలేదు. ఇదీ సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.

2 కొరింథీయులకు 3:7-18

క్రొత్త నిబంధన యొక్క మహిమ

రాతిపలకపై అక్షరాలతో చెక్కబడిన నియమాలను దేవుడు యిచ్చినప్పుడు, మోషే ముఖం మీద మహిమాప్రకాశం కనిపించింది. తదుపరి ఆ మహిమ తగ్గుతూ పోయింది. అయినా ఇశ్రాయేలు ప్రజలు అతని ముఖం చూడలేక పోయారు. చావును కలిగించే పాలనలో మహిమ అంత గొప్పగా ఉంటే, దేవుని ఆత్మనిచ్చే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. శిక్షను కలిగించే పాలనలో అంత మహిమ ఉంటే, నీతిని స్థాపించే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. 10 ఇప్పుడు మనకు లభించిన గొప్ప మహిమతో పోలిస్తే, గతంలో ఉండిన ఆ మహిమకు ప్రకాశం లేదు. 11 నశించిపోతున్న ఆ మహిమకు అంత ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే మహిమకు యింకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచించండి.

12 మాకు అంత నిరీక్షణ ఉంది కనుకనే మాలో యింత ధైర్యముంది. 13 తగ్గిపోతున్న తన ప్రకాశాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడరాదని మోషే తన ముఖానికి ముసుగు వేసుకొన్నాడు. మేము మోషేలాంటివాళ్ళము కాదు. 14 వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈ నాటికీ వాళ్ళు పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు వాళ్ళకు ముసుగు కనిపిస్తూవుంటుంది. దాన్ని ఎవ్వరూ తీయలేరు. క్రీస్తు మాత్రమే ఆ ముసుగు తీసివేయగలడు. 15 ఈ నాటికీ మోషే గ్రంథాలు చదివినప్పుడు ఆ ముసుగు వాళ్ళ బుద్ధిని కప్పివేస్తుంది. 16 కాని ప్రభువు వైపుకు మళ్ళినవాళ్ళ “ముసుగు తీసివేయబడింది.”(A) 17 ప్రభువే “ఆత్మ”. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేఛ్చ ఉంటుంది. 18 ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటువంటి ప్రభువు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది.

మార్కు 10:17-31

ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం

(మత్తయి 19:16-30; లూకా 18:18-30)

17 యేసు బయలుదేరుతుండగా ఒక మనిషి పరుగెత్తుకొంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా! నేను నిత్యజీవం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.

18 యేసు, “నేను మంచివాణ్ణి అని ఎందుకు అంటున్నావు. దేవుడు తప్ప ఎవరూ మంచివారు కారు. మోషే ఆజ్ఞలు నీకు తెలుసు కదా! 19 హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యం చెప్పరాదు. మోసం చెయ్యరాదు. నీ తల్లి తండ్రుల్ని గౌరవించు” అని అన్నాడు.

20 అతడు, “అయ్యా! నా చిన్నతనంనుండి నేను వీటిని పాటిస్తున్నాను!” అని అన్నాడు.

21 యేసు అతని వైపు చూసాడు. అతనిపై యేసుకు అభిమానం కలిగింది. అతనితో, “నీవు యింకొకటి చెయ్యాలి. వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు.

22 ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్నబోయింది. అతని దగ్గర చాలా ధనముండటం వల్ల దుఃఖంతో అక్కడినుండి వెళ్ళిపొయ్యాడు.

23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనమున్నవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం” అని అన్నాడు.

24 శిష్యులు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. యేసు మళ్ళీ, “శిష్యులారా! దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో కష్టం! 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.

26 ఇది విని శిష్యులు యింకా ఎక్కువ ఆశ్చర్యపడ్డారు. అలాగైతే, “ఎవరికి రక్షణ లభిస్తుంది?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు.

27 యేసు వాళ్ళవైపు చూసి, “మానవునికి ఇది అసాధ్యమైన పని కాని, దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.

28 పేతురు ఆయనతో, “మిమ్మల్ని అనుసరించాలని మేము అన్నీ వదిలివేసాము” అని అన్నాడు.

29-30 యేసు, “ఇది నిజం. నా కోసం, సువార్తకోసం, తన యింటినికాని, సోదరులనుకాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లినికాని, తండ్రినికాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని, విడిచినవాడు ఈ తరంలోనే నూరు రెట్లు యిళ్ళను, సోదరులను, అక్క చెల్లెండ్లను, తల్లుల్ని, సంతానాన్ని, పొలాల్ని పొందుతాడు. వీటితో పాటు హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో నిత్యజీవం పొందుతాడు. 31 కాని ముందున్న వాళ్ళు చివరివాళ్ళై, చివర వున్న వాళ్ళు ముందుకు వెళ్తారు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International