Book of Common Prayer
సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.
69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
నా నోటి వరకు నీళ్లు లేచాయి.
2 నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
3 సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.
4 నా తలపైగల వెంట్రుకల కంటె ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు.
ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు.
వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు.
ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
5 దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు.
నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.
6 నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము.
ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధకులను ఇబ్బంది పడనీయకుము.
7 నా ముఖం సిగ్గుతో నిండి ఉంది.
నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను.
8 నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు.
నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు.
9 నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది.
నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను.
10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను.
అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు.
11 నా విచారాన్ని చూపించేందుకు నేను దుఃఖ బట్టలు ధరిస్తున్నాను.
ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు.
12 బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు.
త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు.
13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన.
నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను.
దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.
14 బురదలో నుండి నన్ను పైకి లాగుము.
బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు.
నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము.
15 అలలు నన్ను ముంచివేయనీయకుము.
లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము.
సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము
16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము.
నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము.
17 నీ సేవకునికి విముఖుడవు కావద్దు.
నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము.
18 వచ్చి నా ఆత్మను రక్షించుము.
నా శత్రువులనుండి నన్ను తప్పించుము.
19 నా అవమానం నీకు తెలుసు.
నా శత్రువులు నన్ను అవమానపరిచారని నీకు తెలుసు.
వారు నన్ను కించపరచటం నీవు చూసావు.
20 సిగ్గు నన్ను కృంగదీసింది.
అవమానం చేత నేను చావబోతున్నాను.
సానుభూతి కోసం నేను ఎదురు చూశాను.
కాని ఏమీ దొరకలేదు.
ఎవరైనా నన్ను ఆదరిస్తారని నేను ఎదురుచూశాను.
కాని ఎవరూ రాలేదు.
21 వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు.
ద్రాక్షారసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు.
22 వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి.
విందులు జరుగుతుంటాయి. వారి భోజనాలే వారికి ఎక్కువ అగును గాక.
23 వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము.
24 నీ కోపమును వారిపై కుమ్మరించుము.
నీ భయంకర కోపమును వారు సహించనిమ్ము.
25 వారి కుటుంబాలు, ఇండ్లు
పూర్తిగా నాశనం చేయబడునుగాక.
26 నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు.
అప్పుడు బాధను గూర్చి వారు మాట్లాడుకుంటారు.
27 వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షించుము.
నీవు ఎంత మంచివాడవుగా ఉండగలవో వారికి చూపించవద్దు.
28 జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయుము.
మంచి మనుష్యుల పేర్లతో పాటు వారి పేర్లను గ్రంథంలో వ్రాయవద్దు.
29 నేను విచారంగాను, బాధతోను ఉన్నాను.
దేవా, నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము.
30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.
కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.
ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
32 పేద ప్రజలారా, మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.
పేద ప్రజలారా, ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.
యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
34 ఆకాశమా, భూమీ, సముద్రమా,
దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.
యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు.
ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
36 ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.
ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.
మూడవ భాగం
(కీర్తనలు 73–89)
ఆసాపు స్తుతి కీర్తన.
73 దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు.
పవిత్ర హృదయాలు గల ప్రజలకు దేవుడు మంచివాడు.
2 నేను దాదాపుగా జారిపోయి,
పాపం చేయటం మొదలు పెట్టాను.
3 దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను.
ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.
4 ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు.
వారు జీవించుటకు శ్రమపడరు.[a]
5 మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు.
ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు.
6 కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు.
వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం.
7 ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు.
వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు.
8 ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు.
వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు.
9 ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు.
వారు భూమిని పాలించేవారని తలుస్తారు.
10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి
వారు చెప్పే సంగతులు నమ్ముతారు.
11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు.
సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.”
12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు.
మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.
13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి?
నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి?
14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను.
నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు.
15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను.
కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.
16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను.
కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది.
17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను,
వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.
18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు.
వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం.
19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును.
అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు.
భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు.
అప్పుడు వారు అంతమైపోతారు.
20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు
మరచిపోయే కలవంటి వారు ఆ మనుష్యులు.
మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను
నీవు కనబడకుండా చేస్తావు.
21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను.
ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను.
దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను.
తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.
23 నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను.
దేవా, నీవు నా చేయి పట్టుకొనుము.
24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము.
ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.
మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?
26 ఒకవేళ నా మనస్సు,[b] నా శరీరం నాశనం చేయబడతాయేమో.
కాని నేను ప్రేమించే బండ[c] నాకు ఉంది.
నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.
27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు.
నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను.
దేవుడు నా యెడల దయ చూపించాడు.
నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం.
దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.
6 తర్వాత యోసేపు, అతని సోదరులు, వారి తరం వారు అందరూ చనిపోయారు. 7 అయితే, ఇశ్రాయేలు ప్రజలకు పిల్లలు చాలామంది ఉన్నారు. వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. ఆ ప్రజలు చాలా బలవంతులు కాగా ఈజిప్టు దేశం వాళ్లతోనే నిండిపోయింది.
ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు
8 అప్పుడు ఒక కొత్తరాజు ఈజిప్టును పాలించడం మొదలు పెట్టాడు. ఈ రాజుకు యోసేపు తెలియదు. 9 ఈ రాజు తన ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు జనాన్ని చూడండి. వాళ్లు చాలామంది ఉన్నారు! పైగా వాళ్లు మనకంటె చాలా బలంగా ఉన్నారు! 10 వాళ్లపైన మనం ఏదైనా పథకం వేయాలి. లేకపోతే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మన శత్రువులతో ఏకం కావచ్చు. అల్లాంటప్పుడు వాళ్లు మనల్ని ఓడించి, మన దగ్గర్నుండి తప్పించుకొని పారిపోవచ్చు.”
11 ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు జీవితాన్ని కష్టతరం చేయాలనుకొన్నారు. అందుచేత బానిసలపైన ఉండే అధికారులను ఇశ్రాయేలీయుల మీద నియమించారు. ఆ యజమానులు ఇశ్రాయేలు ప్రజలను బలవంతం చేసి ఫరోకోసం ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేసు పట్టణాలను కట్టించారు. (ధాన్యం మొదలైన వాటిని వాళ్లు ఈ పట్టణాల్లో నిల్వ చేసేవాళ్లు[a])
12 ఇశ్రాయేలీయులు ప్రయాసపడి పనిచేయునట్లు ఈజిప్టు వాళ్లు వారిని బలవంతపెట్టారు. కాని పనిలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా బలవంతం చేయబడితే, అంతగా వాళ్లు పెరిగి విస్తరించిపోయారు. కనుక ఇశ్రాయేలు ప్రజలను చూస్తోంటే, ఈజిప్టు వాళ్లు మరింత ఎక్కువగా భయపడిపోయారు. 13 అందుచేత ఈజిప్టు వారు ఇశ్రాయేలు ప్రజల శరీర శ్రమను మునుపటికన్నా ఎక్కువగా కష్టతరం చేసి బలవంత పెట్టారు.
14 ఇశ్రాయేలీయుల జీవితాన్ని చాలా కష్టతరం చేశారు ఈజిప్టువారు. అడుసు[b] తొక్కి ఇటుకలు చేయడంలో వాళ్లు ఇశ్రాయేలు ప్రజల్ని బలవంతం చేశారు. అలాగే పొలాల్లో పనిచేయడానికి కూడా వాళ్లను చాల బలవంత పెట్టారు. వాళ్లు చేసిన ప్రతి పనిలోనూ వాళ్లను చాల బలవంత పెట్టి ఒత్తిడి చేసారు.
దేవుడ్ని వెంబడించిన మంత్రసానులు
15 షిఫ్రా, పూయా అను ఇద్దరు మంత్రసానులుండే వారు. వీరు ఇశ్రాయేలు స్త్రీల కాన్పు సమయాల్లో సహాయ పడేవారు. ఈజిప్టు రాజు ఈ మంత్రసానులను పిలిచి, 16 “ఈ హీబ్రూ స్త్రీలు పిల్లల్ని కనడంలో మీరు ఇలానే సహాయం చేస్తూ ఉండండి. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ పిల్లను బ్రతకనివ్వండి, కాని శిశువు మగవాడైతే మాత్రం తప్పక చంపేయండి” అని చెప్పాడు.
17 ఆ మంత్రసానులు దైవ భక్తిగలవాళ్లు గనుక వారు రాజుగారి ఆజ్ఞకు లోబడలేదు. మగ పిల్లలందర్నీ వాళ్లు బ్రతకనిచ్చారు.
18 ఈజిప్టు రాజు ఆ మంత్రసానులను పిలిచి, “మీరు ఎందుకిలా చేసారు? ఆ మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారు?” అంటూ ప్రశ్నించాడు.
19 “ఈజిప్టు స్త్రీలకంటె హీబ్రూ స్త్రీలకు చాల బలం ఉంది. సహాయం చేసేందుకు మేము వెళ్లేలోపుగానే వాళ్లు పిల్లల్ని కనేసారు.” అంటూ మంత్రసానులు ఫరోతో చెప్పారు. 20-21 ఆ మంత్రసానుల విషయమై దేవుడు సంతోషించాడు కనుక వాళ్లకూ వారి స్వంత కుటుంబాలు ఉండేటట్టు దేవుడు వారికి మేలు చేశాడు.
హీబ్రూ ప్రజలు[c] ఇంకా పిల్లల్ని కంటూనే ఉండేవారు. వాళ్లు చాలా బలవంతులయ్యారు. 22 కనుక ఫరో, “మగశిశువు పుట్టినప్పుడల్లా, మీరు వాడ్ని నైలు నదిలో పడవేయండి. కాని ఆడపిల్లల్ని అందరినీ బ్రతకనియ్యండి” అని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు.
ఒకే శరీరం, అనేక అవయవాలు
12 శరీరంలో అనేక భాగాలు ఉన్నా అవి కలిసి ఒక దేహంగా పని చేస్తాయి. క్రీస్తు కూడా అంతే. 13 అంటే మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము యూదులమైనా, గ్రీకులమైనా, బానిసలమైనా, బానిసలము కాకపోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు.
14 మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు. 15 ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక నేను ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 16 అదే విధంగా ఒకవేళ చెవి, “నేను కన్నును కాను. కనుక ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 17 శరీరమంతా కన్నైపోతే దేనితో వింటాం? శరీరమంతా చెవియైతే దేనితో వాసన చూస్తాం? 18 కాని నిజానికి దేవుడు ఈ శరీరంలోని ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమర్చాడు. 19 అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు. 20 నిజానికి శరీరంలో అనేక భాగాలు ఉన్నా శరీరం ఒక్కటే.
21 కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” అని అనలేదు. అదే విధంగా శిరస్సు పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు. 22 సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. 23 ముఖ్యం కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడుతాము. బహిరంగపరచలేని భాగాల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాము. 24 బహిరంగపరచగల భాగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపనవసరం లేదు. కాని దేవుడు శరీరానికి సంబంధించిన భాగాల్ని ఒక చోట చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగించాడు. 25 శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని, ఆయన ఉద్దేశ్యం. 26 ఒక భాగానికి కష్టం కలిగితే ప్రతీయొక భాగం దానితో సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే మిగతా భాగాలన్నింటికీ దానితో సహా ఆనందం కలుగుతుంది.
పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం
(మత్తయి 16:13-20; లూకా 9:18-21)
27 యేసు తన శిష్యులతో కలిసి, కైసరయ ఫిలిప్పి పట్టణానికి చుట్టూవున్న పల్లెలకు వెళ్ళాడు. దారిలో యేసు వాళ్ళతో, “ప్రజలు నేనెవరని అనుకొంటున్నారు?” అని అడిగాడు.
28 వాళ్ళు, “బాప్తిస్మము నిచ్చే యోహాను అని కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు” అని సమాధానం చెప్పారు.
29 “మరి మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని అడిగాడు.
పేతురు, “మీరే క్రీస్తు”[a] అని సమాధానం చెప్పాడు.
30 తనను గురించి ఎవ్వరికి చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు.
యేసు తన మరణాన్ని గురించి చెప్పటం
(మత్తయి 16:21-28; లూకా 9:22-27)
31 ఆ తదుపరి యేసు వాళ్ళకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు: “మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానయాజకులు, శాస్త్రులు, ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికివస్తాడు.” 32 యేసు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాడు.
పేతురు ఆయన చేయిపట్టుకొని వారించటం మొదలు పెట్టాడు. 33 కాని యేసు వెనక్కు తిరిగి తన శిష్యుల వైపు ఒకసారి చూసి, పేతురుతో “సైతానా! నాముందు నుండి వెళ్ళిపో! నీవు మానవరీతిగా ఆలోచిస్తున్నావు కాని, దేవుని రీతిగా కాదు” అని అన్నాడు.
34 ఆ తర్వాత తన శిష్యుల్ని, ప్రజల్ని దగ్గరకు పిలిచి, “మీరు నన్ను అనుసరింపదలిస్తే, తనను తాను విసర్జించుకొని తన సిలువను మోస్తూ అనుసరించాలి. 35 ఎందుకంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నాకోసం, సువార్త కోసం ప్రాణాన్ని పోగొట్టుకొన్నవాడు దాన్ని కాపాడుకొంటాడు. 36 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని వదులుకొన్న మనిషికి ఏంలాభం కలుగుతుంది? 37 తన ప్రాణాన్ని తిరిగి పొందటానికి మనిషి ఏంయివ్వగలడు? 38 ఈ తరం వ్యభిచారంతో, పాపంతో నిండివుంది. నా విషయంలో కాని, నా బోధనల విషయంలో కాని ఎవ్వడు సిగ్గుపడతాడో, మనుష్య కుమారుడు తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతలతో కలసి వచ్చినప్పుడు వాని విషయంలో సిగ్గుపడతాడు.”
9 ఆయన వాళ్ళతో, “ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యం శక్తితో రావటం చూస్తారు. దానికి ముందు వాళ్ళు మరణించరు” అని అన్నాడు.
© 1997 Bible League International