Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 101

దావీదు కీర్తన.

101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
    యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
నా యెదుట ఏ విగ్రహాలు[a] ఉంచుకోను.
    అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
    నేను అలా చేయను!
నేను నిజాయితీగా ఉంటాను.
    నేను దుర్మార్గపు పనులు చేయను.
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
    అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
    అతిశయించడం నేను జరుగనివ్వను.

నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
    ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
    యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
    అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
    దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.

కీర్తనలు. 109:1-30

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

109 దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు.
దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబుతున్నారు.
ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబుతున్నారు.
    ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు.
నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను.
    కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు.
నేను వారిని ప్రేమించాను.
    కాని వారు నన్ను ద్వేషించారు.

నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము.
    వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము.
నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము.
    నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము.
నా శత్రువును త్వరగా చావనిమ్ము.
    నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక!
నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక!
10 వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక!
11 నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము.
    అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము.
12 నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
    అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
13 నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము.
    తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.
14 నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను
    యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
15 ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
    ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ.
16 ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు.
    అతడు ఎన్నడూ ఎవరిని ప్రేమించలేదు.
    అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టతరం చేసాడు.
17 ప్రజలకు సంభవించే చెడు సంగతులు, శాపము చూడటానికి ఆ దుర్మార్గునికి ఎంతో ఇష్టం.
    కనుక ఆ చెడు సంగతులు అతనికే సంభవించనిమ్ము.
ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు.
    కనుక అతనికి మంచి సంగతులేవీ జరుగనివ్వకుము.
18 శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము.
దుర్మార్గులు త్రాగేందుకు శాపాలే నీళ్లుగా ఉండనిమ్ము
    శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము.
19 శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము.
    శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము.

20 నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నన్ను చంపాలని చూస్తున్న మనుష్యులందరికీ వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
21 యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు.
    నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని,
    నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
23 దినాంతంలో దీర్ఘ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది.
    ఎవరో నలిపివేసిన నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి.
    నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
25 చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు.
    వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము!
    నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
27 అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు.
    వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము.
    అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము!
    వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.

కీర్తనలు. 119:121-144

అయిన్

121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
    నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
    యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
    కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
125 నేను నీ సేవకుడను
    నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
    ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
127 యెహోవా, నీ ఆజ్ఞలు
    మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
    తప్పుడు బోధలు నాకు అసహ్యం.

పే

129 యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం,
    అందుకే నేను దానిని అనుసరిస్తాను.
130 ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది.
    నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది.
131 యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను.
    నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను.
132 దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము.
    నీ నామమును ప్రేమించే వారికి సరియైనవి ఏవో వాటిని చేయుము.
133 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము.
    నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు.
134 యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము.
    నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
135 యెహోవా, నీ సేవకుని అంగీకరించి
    నీ న్యాయచట్టాలు నేర్పించుము.[a]
136 ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల
    నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను.

సాదె

137 యెహోవా, నీవు మంచివాడవు.
    నీ చట్టాలు న్యాయమైనవి.
138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
    యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
    ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
    అదంటే నాకు ప్రేమ.
141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు.
    కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
    నీ ఉపదేశాలు నమ్మదగినవి.
143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
    కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
    నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.

ఆదికాండము 50:15-26

సోదరులు యోసేపుకు ఇంకా భయపడుట

15 యాకోబు మరణించిన తర్వాత యోసేపు సోదరులు దిగులుపడిపోయారు. చాలాకాలం క్రిందట వారు చేసినదాన్ని బట్టి యోసేపు ఇంకా వారిమీద కోపంగా ఉంటాడని వారు భయపడ్డారు. మనము చేసినదాని విషయంలో “బహుశాః యోసేపు మనల్ని ఇంకా ద్వేషించవచ్చు. మరియు మనం అతనికి చేసిన కీడంతటికి తిరిగి పగ తీర్చుకోవచ్చు” అని తమలో తాము అనుకొన్నారు. 16 కనుక ఆ సోదరులు యోసేపుకు ఈ సందేశం పంపించారు: “నీ తండ్రి చనిపోక ముందు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 17 ‘యోసేపుకు వారు చేసిన కీడును దయతో క్షమించమని నేను అతణ్ణి బ్రతిమాలుతున్నానని యోసేపుతో చెప్పండి’ అని అతడు చెప్పాడు. కనుక యోసేపూ, మేము చేసిన తప్పు పనిని దయచేసి ఇప్పుడు క్షమించు. మేము నీ తండ్రి దేవుని దాసులం.”

యోసేపు సోదరులు చెప్పిన విషయాలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి, అతడు ఏడ్చేశాడు. 18 యోసేపు సోదరులు అతని దగ్గరకు వెళ్లి అతని ఎదుట సాగిలపడ్డారు. వారు “మేము నీకు దాసులం” అని చెప్పారు.

19 అప్పుడు యోసేపు, “భయపడకండి, నేనేం దేవుణ్ణి కాను. మిమ్మల్ని శిక్షించే హక్కు నాకు లేదు. 20 మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు. 21 కనుక భయపడవద్దు. నేను మీ కోసం, మీ పిల్లలకోసం జాగ్రత్త పుచ్చుకుంటాను” అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో దయగా మాట్లాడాడు. ఆ సోదరులకు యిది నెమ్మది కలిగించింది.

22 యోసేపు తన తండ్రి కుటుంబంతో సహా ఈజిప్టులోనే జీవించటం కొనసాగించాడు. యోసేపు 110 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. 23 యోసేపు జీవించి ఉన్నప్పుడు, ఎఫ్రాయిముకు పిల్లలు, పిల్లల పిల్లలు పుట్టారు. మరియు అతని కుమారుడు మనష్షేకు మాకీరు అనే పేరుగల ఒక కొడుకు ఉన్నాడు. మాకీరు పిల్లలను చూచేంతవరకు యోసేపు జీవించాడు.

యోసేపు మరణం

24 యోసేపు మరణం దగ్గరపడినప్పుడు, అతడు, “నేను చనిపోవాల్సిన సమయం దాదాపు వచ్చేసింది. అయితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నాకు తెలుసు. ఆయన మిమ్మల్ని ఈ దేశంనుండి బయటకు తీసుకొని వెళ్తాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు” అని తన సోదరులతో చెప్పాడు.

25 అప్పుడు యోసేపు తన వాళ్లందర్నీ ఒక వాగ్దానం చెయ్యమని అడిగాడు. “దేవుడు మిమ్మల్ని ఆ నూతన దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో కూడ తీసుకొని వెళ్తామని నాకు వాగ్దానం చేయండి” అన్నాడు యోసేపు.

26 యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈజిప్టులో మరణించాడు. వైద్యులు అతని శరీరాన్ని సమాధి చేసేందుకు సిద్ధంచేసి, ఈజిప్టులో సమాధి పెట్టెలో ఆ శరీరాన్ని ఉంచారు.

1 కొరింథీయులకు 12:1-11

పవిత్రాత్మ వరాలు

12 సోదరులారా! పరిశుద్ధాత్మ యిచ్చే వరాలను గురించి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయము. మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి త్రోవతప్పి, మాట్లాడలేని విగ్రహాల వైపుకు మళ్ళారు. ఇది మీకు తెలుసు. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే ప్రభువు” అని అనగలడు.

దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు. దేవుడు నలుగురిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు.

దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం. ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు. 10 ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరొకనికి ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చి చెప్పే శక్తినిచ్చాడు. 11 ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్ఛానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు.

మార్కు 8:11-26

కొందరు యేసు అధికారాన్ని సందేహించటం

(మత్తయి 16:1-4; లూకా 11:16, 29)

11 పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఆయన్ని పరీక్షించే ఉద్దేశ్యంతోనే ఆకాశంనుండి ఒక రుజువు చూపమన్నారు. 12 ఆయన పెద్దగా నిట్టూర్చి, “ఈ కాలపు వాళ్ళు అద్భుతాల్ని రుజువులుగా చూపమని ఎందుకు అడుగుతారు? ఇది నిజం. మీకు ఏ రుజువూ చూపబడదు” అని అన్నాడు. 13 ఆ తర్వాత ఆయన వాళ్ళను వదిలి పడవనెక్కి అవతలి ఒడ్డు చేరుకొన్నాడు.

శిష్యులు యేసుని అపార్థము చేసికొనటం

(మత్తయి 16:5-12)

14 శిష్యులు రొట్టెలు తేవటం మరిచిపోయారు. వాళ్ళ దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉంది. 15 యేసు, “జాగ్రత్తగా ఉండండి. పరిసయ్యుల పులుపును హేరోదు పులుపును[a] గమనిస్తూ ఉండండి” అని వాళ్ళను హెచ్చరించాడు.

16 ఇది వాళ్ళు పరస్పరం చర్చించుకొంటూ, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా!” అని అనుకొన్నారు.

17 వాళ్ళు ఏమి చర్చించుకొంటున్నారో యేసు కనిపెట్టి, “రొట్టెలులేవని ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు యింకా అర్థంకాలేదా? మీరు చూడలేదా? మీ బుద్ధి మందగించిందా? 18 మీకు కళ్ళున్నాయి కాని చూడలేరు. చెవులున్నాయి కాని వినలేరు. మీకు జ్ఞాకపం లేదా? 19 నేను ఐదు రొట్టెల్ని విరిచి ఐదువేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపలనిండా నింపారు?” అని అడిగాడు.

“పన్నెండు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

20 “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని గంపలనిండా నింపారు?” అని యేసు అన్నాడు.

“ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

21 “యింకా మీకు అర్థం కాలేదా?” అని ఆయన వాళ్ళతో అన్నాడు.

బేత్సయిదాలో గ్రుడ్డివానికి నయం చేయటం

22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. అక్కడి ప్రజలు గ్రుడ్డివాణ్ణి యేసు దగ్గరకు తీసుకు వచ్చారు. అతణ్ణి తాకమని వాళ్ళు ఆయనను వేడుకొన్నారు. 23 యేసు ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకొని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. యేసు ఆ గ్రుడ్డివాని కళ్ళ మీద ఉమ్మివేసి తన చేతుల్ని వాటిపైవుంచి, “నీకేమైనా కనబడుతోందా” అని అడిగాడు.

24 ఆ గ్రుడ్డివాడు తలెత్తి, “మనుష్యులు నడుస్తున్నట్లు కనబడుతున్నారు. కాని వాళ్ళు చెట్లలా కనబడుతున్నారు” అని అన్నాడు.

25 యేసు మళ్ళీ ఒకసారి అతని కళ్ళపై తన చేతుల్ని ఉంచాడు. వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అతనికి దృష్టి వచ్చింది. అన్నీ స్పష్టంగా చూడగలిగినాడు. 26 యేసు అతణ్ణి యింటికి పంపుతూ, “గ్రామంలోకి వెళ్ళవద్దు”[b] అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International