Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 66-67

సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.

66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
    స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
    దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
    నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
    అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
    ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
    అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
    సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
    ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
    భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
    అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
    కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
    నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15     నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
    నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
    నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.

16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
    దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
    నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
    కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
    దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
    దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
    దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!

సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.

67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
    దయచేసి మమ్ములను స్వీకరించుము.

దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
    నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
    ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
    మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
    మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
దేవుడు మమ్మల్ని దీవించుగాక.
    భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.

కీర్తనలు. 19

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
    యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
    ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
    మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
    వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.

అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
    తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
    ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
    మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
    దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.

యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
    అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
    జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
యెహోవా చట్టాలు సరియైనవి.
    అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
    ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.

యెహోవాను ఆరాధించుట మంచిది.
    అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
    అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
    సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
    నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.

12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
    కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
    ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.

కీర్తనలు. 46

సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.

46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
    ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
అందుచేత భూమి కంపించినప్పుడు,
    మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
    భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.

ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
    మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
    సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
రాజ్యాలు భయంతో వణకుతాయి.
    యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
    ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
    సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.

10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
    రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
    భూమిమీద మహిమపర్చబడతాను.”

11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

ఆదికాండము 48:8-22

అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు.

యోసేపు తన తండ్రితో, “వీళ్లు నా కుమారులు. దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిలు వీళ్లే” అని చెప్పాడు.

“నీ కుమారులను నా దగ్గరకు తీసుకొని రా! నేను వారిని ఆశీర్వదిస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.

10 ఇశ్రాయేలు వృద్ధుడు గనుక అతని చూపు సరిగ్గా లేదు. అందుచేత యోసేపు ఆ బాలురను తన తండ్రికి దగ్గరగా తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు వారిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. 11 అప్పుడు ఇశ్రాయేలు, “నీ ముఖం మళ్లీ చూస్తానని నేను ఎన్నడూ అనుకోలేదు. అయితే చూడు! నిన్ను, నీ పిల్లలను కూడ దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు యోసేపుతో.

12 అప్పుడు యోసేపు ఆ బాలురను ఇశ్రాయేలు ఒడిలోనుండి దించగా, వారు అతని తండ్రి ఎదుట సాగిలపడ్డారు.

13 ఎఫ్రాయిమును తన కుడి ప్రక్కను, మనష్షేను తన ఎడమ ప్రక్కను యోసేపు ఉంచాడు. (కనుక ఇశ్రాయేలుకు ఎడమ ప్రక్క ఎఫ్రాయిము, కుడి ప్రక్క మనష్షే ఉన్నారు). 14 కానీ ఇశ్రాయేలు తన చేతులను అటుయిటు మార్చి చిన్న పిల్లవాడు ఎఫ్రాయిము తలమీద తన కుడి చేతిని పెట్టాడు. తర్వాత ఇశ్రాయేలు పెద్దపిల్లవాడు మనష్షే తలమీద తన ఎడమ చేతిని పెట్టాడు. మనష్షే జ్యేష్ఠుడైనప్పటికి అతడు తన ఎడమ చేతిని మనష్షే మీద ఉంచాడు. 15 మరియు ఇశ్రాయేలు యోసేపును ఆశీర్వదించి ఇలా చెప్పాడు:

“నా పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు మన దేవుణ్ణి ఆరాధించారు.
    ఆ దేవుడే నా జీవితమంతా నన్ను నడిపించాడు.
16 ఆయనే నా కష్టాలన్నింటినుండి నన్ను రక్షించిన దూత.
    ఆయనే ఈ బాలురను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను.
ఇప్పుడు ఈ పిల్లలకు నా పేరు ఉంటుంది. మన పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకుల పేర్లు వారికి ఉంటాయి.
    వారు ఈ భూమి మీద గొప్ప వంశాలుగా గొప్ప రాజ్యాలుగా ఎదగాలని నా ప్రార్థన.”

17 తన తండ్రి కుడిచేయి ఎఫ్రాయిము మీద ఉంచినట్లు యోసేపు చూశాడు. ఇది యోసేపుకు సంతోషం కలిగించలేదు. యోసేపు తన తండ్రి చేయి తీసుకొని, ఎఫ్రాయిము తలమీదనుండి తీసి, మనష్షే తలమీద ఉంచాలనుకొన్నాడు. 18 యోసేపు తన తండ్రితో, “నీ కుడి చేయి సరైన వాడిమీద పెట్టలేదు. మనష్షే జ్యేష్ఠుడు” అని చెప్పాడు.

19 అయితే అతని తండ్రి వాదించి చెప్పాడు, “నాకు తెలుసు కొడుకా, మనష్షే జ్యేష్ఠుడు. అతడు గొప్పవాడవుతాడు. అతడు అనేకమంది ప్రజలకు తండ్రి కూడ అవుతాడు. కానీ చిన్నవాడు పెద్దవాడికంటె గొప్పవాడవుతాడు. మరియు చిన్నవాడి వంశం ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది.”

20 అలా ఇశ్రాయేలు ఆనాడు వారిని ఆశీర్వదించాడు.

“ఇశ్రాయేలువారు ఆశీర్వదించుటకు
    నీ నామాన్ని ఉపయోగిస్తారు.
ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు ‘దేవుడు ఎఫ్రాయిము
    మరియు మనష్షేవలె చేయునుగాక అని వాళ్లంటారు’ అని అతడు చెప్పాడు.”

ఈ విధంగా మనష్షేకంటె ఎఫ్రాయిమును గొప్ప చేశాడు ఇశ్రాయేలు.

21 అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు “చూడు, నా మరణ ఘడియ దాదాపు సమీపించింది. అయితే దేవుడు మాత్రం ఇంకా మీతో ఉంటాడు. మీ పూర్వీకుల దేశానికి ఆయన మిమ్మును నడిపిస్తాడు. 22 నీ సోదరులకు ఇవ్వనిది నేను నీకు ఇచ్చాను. అమోరీ ప్రజలనుండి నేను గెలుచుకొన్న పర్వతాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆ పర్వతం కోసం నా కత్తితో, నా బాణంతో నేను ఆ మనుష్యులతో పోరాడి గెల్చాను.”

రోమీయులకు 8:11-25

11 మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు.

12 అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు. 13 ఎందుకంటే, ఐహికవాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు. కాని శరీరం చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మద్వారా రూపు మాపితే మీరు జీవిస్తారు.

14 దేవుని ఆత్మను అనుసరించినవాళ్ళు దేవుని కుమారులు. 15 మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు. మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి మారుగా మనము దేవుణ్ణి, “అబ్బా! తండ్రీ!” అని పిలుస్తున్నాము 16 మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు. 17 మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము. క్రీస్తుతో సహవారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకొంటే, ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి.

రానున్న తేజస్సు

18 మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. 19 దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. 20 సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. 21 బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది.

22 సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. 23 అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. 24 మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? 25 కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము.

యోహాను 6:27-40

27 చెడిపోయే ఆహారం కోసం పాటు పడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై తండ్రి ఆయన దేవుడు తన అంగీకార ముద్రవేశాడు” అని చెప్పాడు.

28 వాళ్ళు ఆయన్ని, “దైవకార్యం చెయ్యాలంటే మేము ఏమి చెయ్యాలి?” అని అడిగారు.

29 యేసు, “ఆయన్నిపంపిన వాణ్ణి నమ్మటమే దైవకార్యం” అని సమాధానం చెప్పాడు.

30 కనుక వాళ్ళు ఆయనతో చెప్పారు, “అలాగైతే, మేము నమ్మేటట్లు ఏ అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తారు? 31 మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను[a] తిన్నారు. దీన్ని గురించి గ్రంథాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన, వాళ్ళు తినటానికి పరలోకం నుండి ఆహారం యిచ్చాడు.”

32 యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పరలోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చింది మోషే కాదు. దాన్ని యిచ్చేవాడు నా తండ్రి. 33 ఆ జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి జీవాన్నిస్తాడు” అని అన్నాడు.

34 వాళ్ళు, “అయ్యా! యికనుండి ఈ ఆహారం మాకివ్వండి!” అని అన్నారు.

35 యేసు ఈ విధంగా చెప్పాడు: “నేను జీవాన్నిచ్చే ఆహారాన్ని, నా దగ్గరకు వచ్చినవాడు ఆకలితో పోడు. నన్ను నమ్మినవానికి ఎన్నడూ దాహం కలుగదు. 36 కాని నేను ఇంతకు క్రితం చెప్పినట్లు, నన్ను చూసారు! అయినా మీరు నమ్మలేదు! 37 తండ్రి నాకప్పగించిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణెవణ్ణి నేను ఎన్నటికి నెట్టి వేయను. 38 ఎందుకంటే, నేను పరలోకం నుండి నా యిష్టం నెరవెర్చుకోవటానికి దిగిరాలేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చటానికి వచ్చాను. 39 నన్ను పంపిన వాని కోరిక యిది: నా కప్పగింపబడిన వాళ్ళను నేను పోగొట్టు కోరాదు. వాళ్ళను చివరి రోజు బ్రతికించాలి. 40 కుమారుని వైపు చూసి ఆయన్ని నమ్మినవాడు అనంత జీవితం పొందాలి. ఇది నా తండ్రి కోరిక. అలా నమ్మిన వాణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International