Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 80

సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
    యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
    వచ్చి మమ్మల్ని రక్షించుము.
దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
    మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
    మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
    నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
    మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
    నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.

గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
    ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
    నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
“ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
    దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
    దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11     దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
    ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
    అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
    పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
    నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
    నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.

17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
    నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
    అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
    నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.

కీర్తనలు. 77

సంగీత నాయకునికి: యెదూతూను రాగం. ఆసాపు కీర్తన.

77 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను.
    దేవా, నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను.
    రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను.
    నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.
నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు,
    నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.
నీవు నన్ను నిద్రపోనియ్యవు.
    నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలవరపడి పోయాను.
గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను.
    చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను.
    నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.
“మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా?
    ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?
దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా?
    ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?
కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా?
    ఆయన జాలి కోపంగా మార్చబడిందా” అని నాకు అనిపిస్తుంది.

10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా?
    అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.

11 యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
    దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను.
    ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం.
    దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.
14 నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి.
    నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు.
    యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.

16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి.
    లోతైన జలాలు భయంతో కంపించాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి.
    ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి.
    అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి.
    మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది.
    భూమి కంపించి వణికింది.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు.
    కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు
    మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.

కీర్తనలు. 79

ఆసాపు స్తుతి కీర్తన.

79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
    ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
    యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
    అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
    మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
    మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
    బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
    నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
    వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
    త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
    నీవు మాకు ఎంతో అవసరం.
మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
    నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
    నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
10 “మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?”
    అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు.
దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము.
    నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.
11 దయచేసి, ఖైదీల మూల్గులు వినుము!
    దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము.
12 దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము.
    ఆ ప్రజలు నిన్ను అవమానించిన సమయాలనుబట్టి వారిని శిక్షించుము.
13 మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం.
    మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము.
    దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.

ఆదికాండము 44:18-34

బెన్యామీను కోసం యూదా బ్రతిమలాడుట

18 అప్పుడు యోసేపు దగ్గరకు యూదా వెళ్లి ఇలా చెప్పాడు: “అయ్యా, దయచేసి తమరితో నన్ను తేటగా చెప్పనివ్వండి. దయచేసి నాపై కోపగించకండి. మీరు ఫరో అంతటి వారని నాకు తెలుసు. 19 క్రితంసారి మేము ఇక్కడ ఉన్నప్పుడు, ‘మీకు తండ్రిగాని, సోదరుడు గాని ఉన్నాడా?’ అని తమరు అడిగారు. 20 దానికి మేము, ‘మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ముసలివాడు. మాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు మా తండ్రికి ముసలితనంలో పుట్టాడు, అందుచేత మా తండ్రికి వాడంటే చాలా ప్రేమ. పైగా ఆ చిన్న కుమారుని అన్న చనిపోయాడు. అందుచేత ఆ తల్లికి పుట్టిన కుమారులలో మిగిలినవాడు ఇతడు ఒక్కడే. మా తండ్రికి ఇతనంటే ఎంతో ప్రేమ’ అని జవాబు చెప్పాం. 21 అప్పుడు ‘ఆ సోదరుని నా దగ్గరకు తీసుకొని రండి, నేను అతడ్ని చూడాలి’ అన్నారు తమరు. 22 దానికి మేము ‘ఆ చిన్నవాడు రావటానికి వీల్లేదు. అతడ్ని అతని తండ్రి విడిచిపెట్టలేడు. అతని తండ్రి అతణ్ణి గనుక పోగొట్టుకొంటే, ఆయన దుఃఖంతో మరణిస్తాడు’ అని తమరితో చెప్పాం. 23 కానీ తమరేమో ‘మీరు మీ చిన్న తమ్ముడ్ని తప్పక తీసుకొని రావాల్సిందే, లేకపోతే మీకు ధాన్యం అమ్మేది లేదు’ అన్నారు మాతో. 24 కనుక మేము తిరిగి మా తండ్రి దగ్గరకు వెళ్లి, మీరు మాతో చెప్పినది ఆయనకు చెప్పాం.

25 “తర్వాత మా తండ్రి ‘మీరు మళ్లీ వెళ్లి మనకోసం ధాన్యం కొనండి’ అన్నాడు. 26 మేము మా తండ్రితో ‘మా చిన్న తమ్ముడు లేకుండా మేము వెళ్లలేం. మా చిన్న తమ్ముడ్ని చూచేంత వరకు మళ్లీ మాకు ధాన్యం అమ్మనని ఆ పాలకుడు అన్నాడు’ అని చెప్పాం. 27 అప్పుడు మా తండ్రి మాతో, ‘నా భార్య రాహేలు ఇద్దరు కుమారుల్ని నాకు కన్నది. 28 ఒక కుమారుడ్ని నేను బయటకు వెళ్లనిస్తే, అతణ్ణి అడవి మృగం చంపేసింది. అప్పట్నుండి నేను అతణ్ణి చూడలేదు. 29 రెండో కుమారునిగూడా మీరు నా దగ్గర్నుండి తీసుకొని పోతే, అతనికి ఏమైనా సంభవిస్తే ఆ దుఃఖంతో నేను మరణించాల్సిందే!’ అన్నాడు. 30 కనుక ఇప్పుడు మేము మా చిన్నసోదరుడు మాతో లేకుండా ఇంటికి వెళ్తే, ఏమి జరుగుతుందో ఊహించండి. మా తండ్రి జీవితంలో ఈ కుర్రవాడు చాలా ముఖ్యం. 31 ఈ కుర్రవాడు మాతో లేకపోవటం గమనిస్తే, మా తండ్రి చనిపోతాడు. ఆ తప్పు మాదే అవుతుంది. మహాగొప్ప దుఃఖంతో మా తండ్రి చనిపోయేటట్లు చేసిన వాళ్లమవుతాం.

32 “ఈ పిల్లవాని విషయం నేను బాధ్యత తీసుకొన్నాను. ‘ఇతణ్ణి మళ్లీ నీ దగ్గరకు తీసుకొని రాకపోతే నా జీవితకాలమంతా నన్ను నీవు నిందించమని’ నా తండ్రితో నేను చెప్పాను. 33 కనుక ఇప్పుడు నేను మీకు మనవి చేసేది, మిమ్మల్ని బ్రతిమాలాడేది ఏమిటంటే, దయచేసి ఈ పిల్లవాణ్ణి తన సోదరులతో వెళ్లనివ్వండి. నేను ఇక్కడే ఉండి, మీకు బానిసను అవుతాను. 34 ఈ పిల్లవాడు నాతో లేకపోతే, నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్లలేను. నా తండ్రికి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది.”

1 కొరింథీయులకు 7:25-31

పెండ్లి చేసుకొనుటలో గల సమస్యలు

25 ఇక కన్యలను గురించి: ప్రభువు మీకు ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. కాని దేవుని అనుగ్రహంవల్ల నేను మీకు చెపుతున్న సలహాలు నమ్మతగినవి. 26 ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల వల్ల మీరు కన్యలుగా ఉండిపోవటం మంచిది. 27 ఇక పురుషులు, మీరు వివాహితులైనట్లయితే విడాకులు ఇవ్వకండి. మీరు అవివాహితులైనట్లయితే భార్యల కోసం వెతక్కండి. 28 అలాగని మీరు వివాహం చేసుకొంటే పాపం కాదు. అదే విధంగా కన్యలు కూడా వివాహం చేసుకొంటే పాపం కాదు. కాని వివాహం చేసుకొన్నవాళ్ళు జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు. మీకా కష్టాలు కలుగరాదని ఇలా చెపుతున్నాను.

29 సోదరులారా! ఇక వ్యవధి లేదు. ఇక మీదటనుండి భార్యలున్నవాళ్ళు భార్యలు లేనట్లు జీవించాలి. 30 దుఃఖించేవాళ్ళు దుఃఖించనట్లు, ఆనందిస్తున్నవాళ్ళు ఆనందించనట్లు, కొనేవాళ్ళు కొన్నవి తమని కానట్లు జీవించాలి. 31 ఇప్పుడున్న ప్రపంచం నశించబోతోంది. కనుక ఈ ప్రపంచంలో జీవిస్తున్నవాళ్ళు దానిలో ఉన్న వస్తువుల పట్ల ఆశ పెంచుకోకుండా జీవించాలి.

మార్కు 5:21-43

యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం

(మత్తయి 9:18-26; లూకా 8:40-56)

21 యేసు మళ్ళీ పడవనెక్కి సముద్రం దాటి అవతలి గట్టు చేరుకొన్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన చుట్టూ చేరింది. ఆయన యింకా సముద్రం దగ్గరే ఉన్నాడు. 22 ఇంతలో సమాజ మందిరానికి అధికారులలో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసును చూసి ఆయన కాళ్ళ మీద పడి, 23 “నా చిన్నకూతురు చావు బ్రతుకుల్లో ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద ఉంచితే ఆమెకు నయమై జీవిస్తుంది” అని దీనంగా వేడుకొన్నాడు.

24 యేసు అతని వెంట వెళ్ళాడు. ఒక పెద్ద ప్రజాసమూహం ఆయన్ని త్రోసుకుంటూ ఆయన్ని అనుసరించింది.

25 పన్నెండు సంవత్సరాల నుండి రక్త స్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది. 26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా ఆమెస్థితి యింకా క్షీణించింది.

27 ఆమె యేసును గురించి వినటంవల్ల గుంపులోనుండి యేసు వెనుకగా వచ్చింది. 28 తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమైపోతుంది” అని అనుకొని, ఆయన వస్త్రాన్ని తాకింది. 29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోని బాధలనుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమయింది. 30 వెంటనే, యేసుకు తన నుండి శక్తి పోయినట్లు తెలిసింది. చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి చూసి, “నా దుస్తుల్ని ఎవరు తాకారు?” అని అన్నాడు.

31 ఆయన శిష్యులు, “ప్రజలు మిమ్మల్ని త్రోసుకొంటూ మీ మీద పడుతున్నారు గదా! అయినా ఎవరు తాకారని అడుగుతున్నారెందుకు?” అని అన్నారు.

32 కాని యేసు, “ఎవరు తాకారు?” అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. 33 అప్పుడా స్త్రీ తనకు నయమైపోయిందని తెలుసుకొని, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి జరిగినదంతా చెప్పింది. 34 ఆయనామెతో, “అమ్మా! నీ విశ్వాసమే నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి” అని అన్నాడు.

35 యేసు ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరానికి అధికారియైన యాయీరు ఇంటి నుండి కొందరు మనుష్యులు వచ్చి యాయీరుతో, “మీ కూతురు మరణించింది. బోధకునికి శ్రమ కలిగించటం దేనికి?” అని అన్నారు.

36 యేసు వాళ్ళన్న దాన్ని విని లెక్క చేయకుండా సమాజమందిరపు అధికారితో, “భయపడకు. నమ్మకంతో ఉండు” అని అన్నాడు.

37 యేసు పేతుర్ని, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును తప్ప మరెవ్వరిని తనవెంట రానివ్వలేదు. 38 యాయీరు యింటికి వచ్చాక అక్కడున్న వాళ్ళు బిగ్గరగా ఏడుస్తూ పెడ బొబ్బలు పెడుతూ ఉండటం యేసు చూసాడు. ఏమీ తోచక అందరూ దిగులుతో ఉండినారు. 39 ఆయన యింట్లోకి వెళ్ళి వాళ్ళతో, “ఎందుకు దిగులు? ఎందుకీ ఏడుపు? ఆమె చనిపోలేదు. నిద్రలోవుంది! అంతే!” అని అన్నాడు. 40 కాని వాళ్ళాయన్ని హేళన చేసారు. యేసు వాళ్ళనందరినీ వెలుపలికి పంపాడు. ఆమె తండ్రిని, తల్లిని తనతోవున్న శిష్యుల్ని వెంటబెట్టుకొని, ఆమె ఉన్న గదికి వెళ్ళాడు. 41 ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “తలీతాకుమీ!” అని అన్నాడు. (తలీతాకుమీ అంటే “చిన్నమ్మాయి! నేను చెబుతున్నాను లెమ్ము!” అని అర్థం.) 42 ఆమె వెంటనే లేచి నడవటం మొదలు పెట్టింది. (ఆమె వయస్సు పన్నెండు సంవత్సరాలు.) ఇది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. 43 దీన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆమెకు తినటానికి ఏదైనా యివ్వమని వాళ్ళకు చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International