Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 72

సొలొమోను కీర్తన.

72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
    రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
    నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
    నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
    ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
    ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
    నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
    చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు
    అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము.
అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము
    అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిలపడనిమ్ము.
10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక.
    షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక.
11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక.
    రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక.
12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు.
    మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు.
13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు.
    రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు.
14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు.
    ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
15 రాజు దీర్ఘాయుష్మంతుడగును గాక.
    షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక.
రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి.
    ప్రతిరోజూ అతణ్ణి దీవించండి.
16 పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక.
    కొండలు పంటలతో నిండిపోవునుగాక.
పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక.
    పొలాలు గడ్డితో నిండిపోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక.
17 రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక.
    సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక.
అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక.
    మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక.

18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
    అలాంటి అద్భుతకార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే.
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి.
    ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక.
ఆమేన్, ఆమేన్!

20 యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం.

కీర్తనలు. 119:73-96

యోద్

73 యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో నన్ను నిలబెడుతావు.
    నీ ఆదేశాలు నేర్చుకొని గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
74 యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతోషిస్తారు.
    నీవు చెప్పే విషయాలను నేను నమ్ముతాను. కనుక వారికి చాలా సంతోషం.
75 యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయని నాకు తెలుసు.
    నీవు నన్ను శిక్షించటం నీకు సరియైనదే.
76 ఇప్పుడు నిజమైన నీ ప్రేమతో నన్ను ఆదరించుము.
    నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము.
77 యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బ్రతుకనిమ్ము.
    నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనందిస్తాను.
78 నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని సిగ్గుపరచు.
    యెహోవా, నేను నీ ఆజ్ఞలను అధ్యయనం చేస్తాను.
79 నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
    నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
80 యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము.
    అందుచేత నేను అవమానించబడను.

కఫ్

81 నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను.
    కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను.
82 నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి.
    యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు?
83 నేను చెత్తకుప్పలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా
    నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు.
84 నేను ఎంత కాలం జీవిస్తాను?
    యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు?
85 కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు.
    మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం.
86 యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు.
    అబద్ధికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము!
87 ఆ అబద్ధికులు నన్ను దాదాపుగా నాశనం చేశారు.
    నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు.
88 యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము.
    నీవు చెప్పే వాటిని నేను చేస్తాను.

లామెద్

89 యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది.
90 నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు.
    యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది.
91 నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి.
    యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి.
92 నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే,
    నా శ్రమ నన్ను నాశనం చేసి ఉండేది.
93 యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి
    కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను.
94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము.
    ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను.
95 దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు.
    అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది.
96 నీ ధర్మశాస్త్రానికి తప్ప
    ప్రతిదానికీ ఒక హద్దు ఉంది.

ఆదికాండము 42:18-28

షిమ్యోను బందీగా ఉంచబడుట

18 మూడు రోజుల తర్వాత వారితో యోసేపు ఇలా అన్నాడు, “నేను దేవునికి భయపడేవాణ్ణి. అందుచేత మీరు సత్యమే చెబుతున్నారని రుజువు చేసేందుకు మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇలా మీరు చేస్తే నేను మిమ్మల్ని బ్రతకనిస్తాను. 19 మీరు నమ్మకమైన మనుష్యులైతే, మీ సోదరులలో ఒకరు ఇక్కడ చెరసాలలో ఉండాలి. మిగిలినవారు మీ వాళ్లకోసం ధాన్యం తీసుకొని వెళ్లవచ్చు. 20 అప్పుడు మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రండి. ఈ విధంగా, మీరు సత్యం చెబుతున్నారేమో నేను తెలుసుకొంటాను.”

ఆ సోదరులు దీనికి ఒప్పుకొన్నారు. 21 “మన చిన్న తమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభవిస్తున్నాం. అతడు కష్టంతో ఉండటం మనం కళ్లారా చూశాం. రక్షించమని అతడు మనల్ని బ్రతిమలాడాడు. కానీ వినటానికి కూడ మనం నిరాకరించాం. అందుకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం” అని వాళ్లలో వారు చెప్పుకొన్నారు.

22 అప్పుడు రూబేను, “ఆ పిల్లవానికి మీరేమి కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను కాని మీరు నా మాట వినకపోయారు. కనుక అతని మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందుతున్నాం,” అని వాళ్లతో చెప్పాడు.

23 యోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక అనువాదకుడ్ని వాడుకొన్నాడు. అందుచేత వారి భాష యోసేపు గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు. కానీ వారు చెప్పిన ప్రతి మాటా యోసేపు విని, గ్రహించాడు. 24 వారి మాటలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి. అందుచేత యోసేపు వాళ్లను విడిచి వెళ్లి ఏడ్చేశాడు. కొంచెం సేపయ్యాక యోసేపు మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ సోదరులలో ఒకడైన షిమ్యోనును పట్టుకొని మిగిలిన సోదరులు చూస్తుండగానే కట్టివేశాడు. 25 వారి సంచులను ధాన్యంతో నింపమని కొందరు సేవకులతో యోసేపు చెప్పాడు. ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు సొమ్ము చెల్లించారు. కానీ యోసేపు ఆ డబ్బు ఉంచుకోలేదు. ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేశాడు యోసేపు. అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన వాటన్నింటిని యోసేపు వారికి ఇచ్చాడు.

26 కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదలమీద వేసుకొని వెళ్లిపోయారు. 27 ఆ సోదరులు ఆ రాత్రి ఒకచోట బస చేశారు. ఆ సోదరులలో ఒకడు తన గాడిద కొరకు కొంచెం ధాన్యం తన సంచి తెరిచాడు. అతని డబ్బు అతని సంచిలోనే కనబడింది. 28 అతడు, “చూడండి, ధాన్యంకోసం నేను చెల్లించిన డబ్బు ఇదిగో. ఈ డబ్బును ఎవరో మళ్లీ నా సంచిలో పెట్టేశారు” అని మిగతా సోదరులతో చెప్పాడు. ఆ సోదరులకు చాలా భయం వేసింది, “దేవుడు మనకు ఏం చేస్తున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

1 కొరింథీయులకు 5:9-6:8

నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను. 10 అంటే, సంఘానికి చెందని అవినీతిపరులతో, లోభులతో, మోసగాళ్ళతో, విగ్రహారాధకులతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పటం లేదు. అలా చేస్తే మీరు ఈ ప్రపంచాన్నే వదిలివేయవలసి వస్తుంది. 11 నేను ప్రస్తుతం వ్రాసేది ఏమిటంటే తాను సోదరుణ్ణని చెప్పుకొంటూ, లైంగిక అవినీతితో జీవించేవానితో, లోభత్వం చేసేవానితో, విగ్రహారాధన చేసేవానితో, ఇతరులను దూషించేవానితో, త్రాగుబోతుతో, మోసం చేసేవానితో, సహవాసం చేయవద్దని చెపుతున్నాను. అలాంటి వానితో కలిసి భోజనం కూడా చేయవద్దు.

12 సంఘానికి చెందనివానిపై తీర్పు చెప్పే అధికారం నాకు లేదు. కాని సంఘంలో ఉన్నవానిపై తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. 13 “ఆ దోషిని మీ సంఘం నుండి వెలివేయండి.”(A) కాని సంఘానికి చెందనివాళ్ళపై దేవుడు తీర్పు చెపుతాడు.

క్రైస్తవుల మధ్య వివాదాలు

ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందనివాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం? పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా? మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి? మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా? సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా? సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట.

మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది. దానికి మారుగా మీరే అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే మోసం చేస్తున్నారు.

మార్కు 4:1-20

రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం

(మత్తయి 13:1-9; లూకా 8:4-8)

ఒక రోజు యేసు సముద్రం దగ్గర బోధించటం మొదలు పెట్టాడు. ఆయన చుట్టూ చాలమంది ప్రజలు చేరటం వల్ల ఆయన పడవనెక్కి కూర్చొని నీళ్ళలోకి వెళ్ళాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు. ఆయన ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళకు చాలా విషయాలు బోధించాడు. ఆ విధంగా బోధిస్తూ,

“వినండి! ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. అతడు విత్తనములు చల్లుతుండగా కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. వాటిని పక్షులు తినివేసాయి. మరికొన్ని మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందువల్ల అవి త్వరగా మొలకెత్తాయి. కాని సూర్యుడు రాగానే అవి ఆ వేడికి వాడిపోయాయి. వాటికి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల మధ్య పడ్డాయి. ఆ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కలను అణచి వేయటంవల్ల వాటికి ధాన్యం పండలేదు. మరికొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి, ముప్పై వంతుల, అరవైవంతుల, నూరువంతుల పంటను కూడా యిచ్చాయి.”

ఈ విధంగా చెప్పి యేసు, “చెవులున్న వాడు విననీ!” అని అన్నాడు.

యేసు బోధించుటకు ఉపమానములను ఎందుకు ఉపయోగించాడు

(మత్తయి 13:10-17; లూకా 8:9-10)

10 ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన పన్నెండుగురు శిష్యులు ఆయన చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు.

11 ఆయన వాళ్ళతో, “దేవుని రాజ్యంయొక్క రహస్య జ్ఞానాన్ని మీకు చెప్పాను. కాని యితరులకు ఈ జ్ఞానం ఉపమానాల ద్వారా చెబుతాను. 12 ఎందుకంటే,

‘వాళ్ళు ఎప్పుడూ చూస్తారు కాని ఏదీ గ్రహించరు.
    అన్నీ వింటారు కాని ఒక్కటీ అర్థం చేసుకోరు.
వాళ్ళు అలా చేస్తే దేవుని వైపు మళ్ళవచ్చు దేవుడు వాళ్ళను క్షమిస్తాడు.’”(A)

యేసు విత్తనము యొక్క ఉపమానమును వివరించటం

(మత్తయి 13:18-23; లూకా 8:11-15)

13 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “మీకీ ఉపమానం అర్థం కాలేదా? మరి మిగతా ఉపమానాల్ని ఎలా అర్థం చేసుకొంటారు? 14 రైతు, దైవ సందేశాన్ని విత్తుతున్నవాడు. 15 కొందరు వ్యక్తులు దారి మీది మట్టిలాంటి వాళ్ళు. వీళ్ళలో విత్తనం నాటిన వెంటనే, అంటేవాళ్ళు విన్న వెంటనే, సైతాను వచ్చి వాళ్ళలో నాటబడిన దైవసందేశాన్ని తీసుకువెళ్తాడు.

16 “మరి కొందరు రాతినేలలాంటి వాళ్ళు. వీళ్ళు సందేశాన్ని విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. 17 కాని వాళ్ళు సందేశాన్ని లోతైన జీవితంలోనికి నాటనివ్వరు. కొంత కాలం మాత్రమే నిలుస్తుంది. ఆ సందేశం కారణంగా కష్టంకాని, హింసకాని కలిగితే వాళ్ళు వెంటనే దాన్ని వదిలేస్తారు.

18 “మరి కొందరు ముళ్ళమొక్కలు మొలిచే నేలలాంటి వాళ్ళు. వాళ్ళు దైవసందేశం వింటారు కాని 19 ఈ జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, యితర వస్తువుల పట్ల వ్యామోహం, ఆ దైవ సందేశాన్ని అణిచివేసి ఫలించకుండా చేస్తాయి.

20 “ఇతరులు సారవంతమైన భూమిలాంటివాళ్ళు. కనుక వీళ్ళు దైవసందేశాన్ని విని అంగీకరించి ఫలంపొందే వాళ్ళు. కనుక వీళ్ళు ముప్పై, అరవై, నూరువంతుల ఫలం ఫలిస్తారు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International