Book of Common Prayer
సంగీత నాయకునికి: తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.
61 దేవా, నా ప్రార్థనా గీతం వినుము.
నా ప్రార్థన ఆలకించుము.
2 నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా,
సహాయం కోసం నీకు మొరపెడతాను.
ఎత్తయిన క్షేమస్థలానికి
నన్ను మోసికొనిపొమ్ము.
3 నీవే నా క్షేమ స్థానం.
నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే.
4 నీ గుడారంలో[a] నేను శాశ్వతంగా నివసిస్తాను.
నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.
5 దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు.
కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న సమస్తం నీవద్ద నుండే వస్తుంది.
6 రాజుకు దీర్ఘాయుష్షు దయచేయుము.
అతన్ని శాశ్వతంగా జీవించనిమ్ము.
7 అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము.
నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము.
8 నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను.
నేను ప్రమాణం చేసినవాటిని ప్రతి రోజూ చేస్తాను.
సంగీత నాయకునికి: యెదూతూను రాగం. దావీదు కీర్తన.
62 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచివుంటాను.
2 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
పర్వతం మీద ఎత్తయిన నా క్షేమస్థానం దేవుడే. మహా సైన్యాలు కూడా నన్ను ఓడించలేవు.
3 ఇంకెంత కాలం వారు నా మీద దాడి చేస్తూ ఉంటారు?
నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను.
పడిపోతున్న కంచెలా ఉన్నాను.
4 ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి
పథకాలు వేస్తున్నారు.
వారు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
బహిరంగంగా వారు నన్ను గూర్చి మంచి మాటలు చెబుతారు,
కాని రహస్యంగా వారు నన్ను శపిస్తారు.
5 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను.
దేవుడు ఒక్కడే నా నిరీక్షణ.
6 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు.
పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే.
7 నా కీర్తి, విజయం దేవుని నుండి వస్తాయి.
ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం
8 ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి.
మీ సమస్యలు దేవునితో చెప్పండి.
దేవుడే మన క్షేమ స్థానం.
9 మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు.
నిజంగా సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు.
వారు గాలిబుడగల్లా వట్టి ఊపిరియైయున్నారు.
10 బలవంతంగా విషయాలను చేజిక్కించుకొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు.
దొంగిలించడం ద్వారా నీకు ఏదైనా లాభం కలుగుతుందని తలంచవద్దు.
నీవు ధనికుడవైతే నీ సహాయం కోసం
ధనాన్ని నమ్ముకొనవద్దు.
11 నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబుతున్నాడు,
“బలము దేవుని నుండే వస్తుంది.”
12 నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది.
ఒకడు చేసినవాటినిబట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు.
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
68 దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము.
ఆయన శత్రువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారిపోయెదరుగాక!
2 గాలికి ఎగిరిపోయే పొగలా
నీ శత్రువులు చెదరిపోవుదురుగాక.
అగ్నిలో మైనం కరిగిపోయేలా
నీ శత్రువులు నాశనం చేయబడుదురుగాక.
3 కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు.
మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు.
4 దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి.
ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు.
ఆయన పేరు యాహ్.[a]
ఆయన నామాన్ని స్తుతించండి.
5 ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు.
దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు.
6 ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు.
దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు.
కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.
7 దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు.
ఎడారిగుండా నీవు నడిచావు.
8 భూమి కంపించింది.
దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది.
9 దేవా, నీవు వర్షం కురిపించావు
మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు.
10 నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి.
దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచివాటిని యిచ్చావు.
11 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు.
నా శుభవార్త చెప్పడానికి అనేక మంది ప్రజలు వెళ్లారు.
12 “శక్తిగల రాజుల సైన్యాలు పారిపోతున్నాయి.
యుద్ధం నుండి సైనికులు తెచ్చే వస్తువులు ఇంటి వద్ద స్త్రీలు పంచుకొంటారు.
13 ఇంటి దగ్గర ఉండిపోయిన మనుష్యులు ఆ ఐశ్వర్యాలను పంచుకొంటారు.
వారు పావురపు రెక్కలకు వెండిపూత పూస్తారు. ఆ రెక్కలను వారు బంగారు పూతతో తళ తళ మెరిపిస్తారు.”
14 సల్మోను కొండ మీద శత్రురాజులను దేవుడు చెదరగొట్టాడు.
వారు పడిపోతున్న మంచులా ఉన్నారు.
15 బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి.
16 బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను చిన్న చూపు చూస్తున్నావు?
దేవుడు ఆ కొండను ప్రేమిస్తున్నాడు.
యెహోవా తాను శాశ్వతంగా అక్కడ నివసించాలని నిర్ణయించుకొన్నాడు.
17 యెహోవా పరిశుద్ధమైన సీయోను కొండకు వస్తున్నాడు.
ఆయన వెనుక ఆయన రథాలు లక్షలాదిగా ఉన్నాయి.
18 ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు.
ఆయన తన బంధీల బృందాలను నడిపించాడు.
ఆయన మనుష్యులనుండి అనగా ఆయనను
వ్యతిరేకించిన ప్రజలనుండి కూడ కానుకలు తీసుకొన్నాడు[b]
19 యెహోవాను స్తుతించండి.
మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు.
దేవుడు మనల్ని రక్షిస్తాడు.
20 ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు.
మన యెహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు.
21 దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు.[c]
దేవుడు తనకు విరోధంగా పోరాడినవారిని శిక్షిస్తాడు.
22 నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను.
సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను.
23 కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు
కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.”
24 విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు.
నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు.
25 గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు.
మధ్యలో ఆడపడుచులు తంబురలు వాయిస్తారు.
26 మహా సమాజంలో దేవుని స్తుతించండి.
ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
27 చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు.
యూదా మహా వంశం అక్కడ ఉంది.
జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు.
28 దేవా, నీ శక్తి మాకు చూపించుము,
దేవా, గత కాలంలో మాకోసం నీవు ఉపయోగించిన నీ శక్తి మాకు చూపించుము.
29 రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు,
యెరూషలేములోని మందిరానికి తీసుకొని వస్తారు.
30 ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము.
ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము
ఆ రాజ్యాలను యుద్ధంలో
నీవు ఓడించావు.
ఇప్పుడు వారు నీ వద్దకు వెండి
తీసుకొని వచ్చునట్లు చేయుము.
31 వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా చేయుము.
దేవా, ఇథియోపియా (కూషు) వారు వారి ఐశ్వర్యాన్ని నీ వద్దకు తెచ్చేలా చేయుము.
32 భూరాజులారా, దేవునికి పాడండి.
మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి.
33 దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు.
ఆయన శక్తిగల స్వరాన్ని ఆలకించండి.
34 మీ దేవుళ్లందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు.
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు.
35 దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు.
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు శక్తిని, బలాన్ని ఇస్తాడు.
దేవుని స్తుతించండి.
కలలు నిజం అగుట
42 ఈ సమయంలో కనాను దేశంలోను కరవు ప్రబలుతోంది. అయితే ఈజిప్టులో ధాన్యం ఉన్నట్లు యాకోబు తెలుసుకొన్నాడు. కనుక యాకోబు తన కుమారులతో ఇలా చెప్పాడు: “ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు మనం కూర్చోవటం? 2 ఈజిప్టులో అమ్మకానికి ధాన్యం ఉన్నట్లు నేను విన్నాను. అందుచేత మనం అక్కడికి వెళ్లి, మనం తినేందుకు ధాన్యం కొనుక్కోవాలి. అప్పుడు మనం చావకుండా బ్రతుకుతాం.”
3 కనుక యోసేపు సోదరులు పదిమంది ధాన్యం కొనేందుకు ఈజిప్టుకు వెళ్లారు. 4 బెన్యామీనును యాకోబు పంపలేదు. (బెన్యామీను ఒక్కడే యోసేపుకు స్వంత తమ్ముడు). బెన్యామీనుకు ఏదైనా కీడు సంభవిస్తుందేమోనని యాకోబు భయపడ్డాడు.
5 కనానులో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ప్రజలు కనానునుండి ఈజిప్టు వెళ్లారు. వారిలో ఇశ్రాయేలు కుమారులు కూడ ఉన్నారు.
6 ఆ సమయంలో ఈజిప్టు అంతటి మీద యోసేపు పాలకుడు. ఈజిప్టుకు వచ్చిన ప్రజలకు ధాన్యం అమ్మకం చేసేందుకు గాను నియమింపబడిన అధికారి యోసేపు. అయితే యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డారు. 7 యోసేపు తన సోదరులను చూశాడు, వారెవరయిందీ అతనికి తెలుసు, కానీ యోసేపు వారిని ఎరుగనట్టే వారితో మాట్లాడాడు. అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. “ఎక్కడనుండి వచ్చారు మీరు?” అని అతడు అడిగాడు.
ఆ సోదరులు “మేము కనాను దేశంనుండి వచ్చాం. ఆహారం కొనేందుకు మేము వచ్చాం” అని జవాబిచ్చారు.
8 ఈ మనుష్యులు తన సోదరులని యోసేపుకు తెలుసును. కానీ అతను ఎవరయిందీ వారికి తెలియదు. 9 అతని అన్నల విషయంలో అతనికి వచ్చిన కలలను యోసేపు జ్ఞాపకం చేసుకొన్నాడు.
యోసేపు తన అన్నలతో, “మీరు ఆహారం కొనేందుకు రాలేదు. మీరు గూఢచారులు. మా బలహీనతలు తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు.
10 అయితే ఆ సోదరులు, “లేదండి అయ్యా, మీ సేవకులంగా మేము వచ్చాం. ఆహారం కొనేందుకు మాత్రమే మేము వచ్చాం. 11 మేమంతా అన్నదమ్ములం. మా అందరి తండ్రి ఒక్కడే. మేము నిజాయితీగల మనుష్యులం, మేము గూఢచారలం కాము. ఆహారం కొనేందుకు మాత్రమే మేము వచ్చాం” అని అతనితో చెప్పారు.
12 అప్పుడు యోసేపు, “లేదు, లేదు, ఏ విషయంలో మేము బలహీనులమో తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు వారితో.
13 ఆ సోదరులు అన్నారు: “లేదు, మేమంతా అన్నదమ్ములం. మా కుటుంబంలో మొత్తం పన్నెండుమంది సోదరులం. మా అందరికీ తండ్రి ఒక్కడే. మా అందరిలో చిన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర మా తండ్రితోనే ఉన్నాడు. మరో తమ్ముడు చాలకాలం క్రిందటే చనిపోయాడు. మీ ముందర మేము సేవకుల్లాంటి వాళ్లం. మేము కనాను దేశం వాళ్లం.”
14 అయితే యోసేపు వారితో ఇలా అన్నాడు: “లేదు, నేను అన్నదే సరియైనట్లు నాకు తెలుస్తోంది. మీరు గూఢచారులు. 15 అయితే మీరు సత్యమే చెబుతున్నట్లు మిమ్మల్ని రుజువు చేయనిస్తాను. మీ చిన్నతమ్ముడు ఇక్కడికి వచ్చేంతవరకు మిమ్మల్ని వదలిపెట్టనని ఫరో పేరు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. 16 కనుక మీలో ఒకరు తిరిగి వెళ్లి మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రావాలి. అంతవరకు మిగిలినవారు ఇక్కడే చెరసాలలో ఉండాలి. మీరు సత్యం చెబుతున్నారో లేదో మేము చూస్తాం. అయితే మీరు గూఢచారులనే నా నమ్మకం.” 17 తర్వాత యోసేపు వాళ్లందర్నీ మూడు రోజులపాటు చెరసాలలో పెట్టాడు.
నీతిలేని సోదరుణ్ణి బహిష్కరించండి
5 మీలో లైంగిక అవినీతి బాగా వ్యాపించి పోయిందని నాకు సృష్టంగా తెలిసింది. అలాంటి అవినీతి, క్రైస్తవులు కానివాళ్ళలో కూడా లేదు. ఒకడు తన సవతి తల్లితో సంబంధం పెట్టుకొన్నాడని విన్నాను. 2 ఇది గర్వించతగిన విషయమా? ఇది చాలా దుఃఖించవలసిన విషయము. ఈ పని చేసినవాణ్ణి మీరు సంఘం నుండి బహిష్కరించవలసి ఉంది. 3 నేను శరీరముతో మీ దగ్గర లేకున్నా నా ఆత్మలో మీతో ఉన్నాను. నేను మీతో ఉన్నట్లు భావించి ఈ అపరాధము చేసిన వానిపై తీర్పు చెపుతున్నాను. 4 మీరు యేసు ప్రభువు పేరిట సమావేశమైనప్పుడు నా ఆత్మలో మీతో ఉంటాను. యేసు ప్రభువు శక్తి మీలో ఉంటుంది. 5 అప్పుడు అతణ్ణి సాతానుకు అప్పగించండి. తద్వారా వాని పాపనైజం నశించి అతని ఆత్మ మన ప్రభువు వచ్చిన రోజున రక్షింపబడుతుంది.
6 “పులుపు కొంచెమైనా, పిండినంతా పులుపు చేస్తుందని తెలియదా? మీరు గర్వించటం మంచిది కాదు.” 7 పులిసిన పాత పిండిని పారవేయండి. క్రీస్తు మన పస్కా గొఱ్ఱెపిల్లగా బలి ఇవ్వబడ్డాడు. అప్పుడు మీరు క్రొత్త పిండిలా ఉంటారు. నిజానికి మీరు పులియని క్రొత్త పిండివంటివాళ్ళు. 8 కనుక పులియని రొట్టెతో పండుగ చేసుకొందాము. ద్వేషంతో, పాపంతో కూడుకొన్న పాత పులిసిన పిండితో కాక నిష్కపటంతోనూ, సత్యంతోనూ కూడుకొన్న పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము.
19 యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు.
యేసుని శక్తి దేవునినుండి వచ్చినది
(మత్తయి 12:22-32; లూకా 11:14-23; 12:10)
20 ఆ తర్వాత యేసు యింటికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు సమావేశమయ్యారు. దీనితో ఆయనకు, ఆయన శిష్యులకు తినటానికి కూడా సమయం దొరకలేదు. 21 ప్రజలు “ఆయనకు మతిపోయింది” అని అంటూ ఉండటంవల్ల ఆయన బంధువులు ఆయన భారం వహించటానికి వచ్చారు.
22 యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, “అతనికి బయల్జెబూలు దయ్యం పట్టింది. దయ్యాల రాజు సహాయంతో అతడు దయ్యాలను వదిలిస్తున్నాడు” అని అన్నారు.
23 అందువల్ల యేసు వాళ్ళను గురించి, ఉపమానాలు ఉపయోగించి వారితో ఈ విధంగా అన్నాడు: “సైతాను తనను తాను ఏవిధంగా పారద్రోలుతాడు? 24 ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు. 25 కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు. 26 సైతాను తనకు తాను విరోధి అయి తన అధికారంతో చీలికలు తెచ్చుకొంటే ఆ సైతాను నిలవడు. వాని అధికారం అంతమౌతుంది.
27 “నిజానికి బలవంతుని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని దోచుకోవాలనుకొంటే మొదట ఆ బలవంతుణ్ణి కట్టివేయవలసి వస్తుంది. అప్పుడే ఆ యింటిని దోచుకోగల్గుతాడు.
28 “నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు క్షమిస్తాడు. 29 కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎప్పటికి క్షమించడు. అతణ్ణి శాశ్వతమైన పాపం చేసిన వానిగా పరిగణిస్తాడు.”
30 ధర్మశాస్త్ర పండితులు తనలో దురాత్మ ఉందని అనటం వలన ఆయన పై విధంగా అన్నాడు.
యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు
(మత్తయి 12:46-50; లూకా 8:19-21)
31 యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకణ్ణి లోపలికి పంపారు. 32 యేసు చుట్టూ జనసమూహం ఉంది. వాళ్ళు ఆయనతో, “మీ తల్లి, సోదరులు మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు” అని అన్నారు.
33 “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అంటూ 34 చుట్టూ కూర్చున్న వాళ్ళవైపు చూసి, “వీరే నా తల్లి, నా సోదరులు. 35 దైవేచ్చానుసారం నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి” అని అన్నాడు.
© 1997 Bible League International