Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 24

దావీదు కీర్తన.

24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
    ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
    ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.

యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
    యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
అక్కడ ఎవరు ఆరాధించగలరు?
    చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
    అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
    అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
    అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.

మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
    ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
    సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.

గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
    పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
    మహిమగల రాజు లోనికి వస్తాడు.
ఈ మహిమగల రాజు ఎవరు?
    ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
    యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.

గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
    పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
    మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
    ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.

కీర్తనలు. 29

దావీదు కీర్తన.

29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
    ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
    మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
    మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
    ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
    లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
    షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
    యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
    ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.

10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
    మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
    యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.

కీర్తనలు. 8

సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.

యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
    నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
    నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
    నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
    నీవు వానిని గమనించటం ఎందుకు?
అయితే మానవుడు నీకు ముఖ్యం.
    వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
    మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
    ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
    చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!

కీర్తనలు. 84

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన

84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
    నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
    పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
    అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
    వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.

ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
    వారు నిన్నే నడిపించ నిస్తారు.
దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
    నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
    ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.

సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
    యాకోబు దేవా, నా మాట వినుము.

దేవా, మా సంరక్షకుని కాపాడుము.
    నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
    నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
    నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
    దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
    ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.

ఆదికాండము 41:14-45

కలల భావం చెప్పేందుకు యోసేపును పిలిపించుట

14 కనుక ఫరో చెరసాలలోనుంచి యోసేపును పిలిపించాడు. సంరక్షకులు వెంటనే యోసేపును చెరసాలలోనుంచి తీసుకొని వచ్చారు. యోసేపు క్షౌరం చేసుకొని, శుభ్రమైన బట్టలు వేసుకొన్నాడు. అప్పుడు అతడు వెళ్లి ఫరో ముందర నిలవబడ్డాడు. 15 అప్పుడు ఫరో “నాకో కల వచ్చింది, అయితే ఆ కలను నాకు వివరించగల వాళ్లు ఒక్కళ్లూ లేరు. ఎవరైనా వారి కల నీతో చెబితే నీవు వాటిని వివరించి, భావంకూడ చెప్పగలవని నేను విన్నాను” అని యోసేపుతో అన్నాడు.

16 యోసేపు, “కలలను గ్రహించటంలో నా నైపుణ్యం ఏమీ లేదు. ఆ శక్తి దేవుడికే ఉంది. కనుక దేవుడే ఫరోకు కూడ ఈ పని చేసి పెడ్తాడు” అని జవాబిచ్చాడు.

17 అప్పుడు ఫరో యోసేపుతో చెప్పాడు: “నా కలలో నేను నైలునది ప్రక్కగా నిలబడ్డాను. 18 ఆ నదిలోనుంచి ఏడు ఆవులు బయటకు వచ్చి గడ్డి మేయటం నేను చూశాను. ఈ ఆవులు బలిసి, అందంగా ఉన్నాయి. 19 అప్పుడు మరో ఏడు ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను. ఈ ఆవులు బక్కచిక్కి రోగిష్ఠివిగా ఉన్నాయి. ఈజిప్టు దేశం మొత్తంలో నేను చూసిన ఆవుల్లో అవి పరమ అసహ్యంగా ఉన్నాయి. 20 అసహ్యమైన ఈ ఏడు ఆవులు ముందు వచ్చిన అందమైన ఏడు ఆవులను తినివేశాయి. 21 అయితే ఆ ఏడు ఆవులను తినివేసిన తర్వాత కూడ అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి. వాటిని చూస్తే, అవి ఏడు ఆవులను తిన్న వాటిల్లాగ అగుపించవు. ముందు అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో యిప్పుడూ అలానే కనబడ్డాయి. అప్పుడు నేను మేల్కొన్నాను.

22 “తర్వాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను. ఆ వెన్నులు నిండుగా, చక్కగా, అందంగా ఉన్నాయి. 23 తర్వాత వాటికి యింకా ఏడు వెన్నులు పెరిగాయి. కానీ ఆ వెన్నులు పీలగా, అసహ్యంగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి. 24 అప్పుడు ఏడు మంచి వెన్నులను పీల వెన్నులు తినివేశాయి.

“మంత్రాలు తెలిసిన నా మనుష్యులకు, విద్వాంసులకు నేను ఈ కల చెప్పాను. కానీ ఎవ్వరూ ఆ కలను వివరించలేక పోతున్నారు. ఏమిటి దీని భావం?”

కల భావం యోసేపు వివరించుట

25 అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు: “ఈ రెండు కలల భావం ఒక్కటే. ఏమి చేయనున్నాడో అది దేవుడు మీతో చెబుతున్నాడు. 26 ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు. ఏడు మంచి ధాన్యపు వెన్నులు ఏడు సంవత్సరాలు. రెండు కలల్లోని సంగతి ఒక్కటే. 27 బక్కచిక్కి ఉన్న ఆవులు ఏడు, పీలగా ఉన్న ధాన్యపు వెన్నులు కూడ ఏడు. అంటే, అవి ఈ దేశంలో ఏడు ఆకలి సంవత్సరాలు. ఏడు మంచి సంవత్సరాల తర్వాత ఈ ఏడు సంవత్సరాలు వస్తాయి. 28 త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు మీకు చూపెట్టాడు. నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది. 29 ఈజిప్టు దేశమంతటా ఏడేళ్లపాటు మంచి పంటలు పండి, తినటానికి సమృద్ధిగా ఉంటుంది. 30 అయితే ఆ ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరవు సంవత్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట ఎంత అయినా, దానిని మరచిపోతారు. ఈ ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది. 31 సమృద్ధిగా భోజనం చేయటం అంటే ఏమిటో ప్రజలు మరచిపోతారు.

32 “ఫరోగారూ, ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పక జరిపిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అదీ త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది. 33 కనుక ఓ ఫరో, చాలా తెలివి, జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటిమీద అధికారిగా మీరు నియమించాలి. 34 ఆ తర్వాత ప్రజల దగ్గర్నుండి ధాన్యం సేకరించేందుకు మరి కొందర్ని మీరు నియమించాలి. ప్రతీ వ్యక్తి ఏడు మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో అయిదవ భాగం ఇవ్వాలి. 35 రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుష్యులకు ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుష్యులకు చెప్పండి. తర్వాత ఆ ధాన్యం అవసరం వచ్చేంతవరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో! ఈ విధంగా ఆ ఆహారం మీ అధీనంలో ఉంటుంది. 36 ఈజిప్టు దేశంలో వచ్చే ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది. అప్పుడు ఈజిప్టు ప్రజలు ఆ ఏడు సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు.”

37 ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు. 38 “ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు.

39 కనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి. 40 అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు.

41 (ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు ఉండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తున్నాను” అని యోసేపుతో చెప్పాడు. 42 అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసు ఫరో వేశాడు. 43 రెండో రాజరథం మీద తిరగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. “ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి” అంటూ వాళ్లు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు.

44 అతనితో ఫరో అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.”

45 ఫరో యోసేపుకు జప్నత్పనేహు అనే మరో పేరు పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకుడయ్యాడు.

రోమీయులకు 6:3-14

బాప్తిస్మము పొందిన మన మందరము క్రీస్తు యేసులో ఐక్యత పొందాము. ఈ బాప్తిస్మము ద్వారా ఆయన మరణంలో కూడా భాగం పంచుకొన్నామని మీకు తెలియదా? ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం.

మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్ధానములో కూడా మనం ఐక్యం కాగలం. మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు. ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు.

మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు. 10 పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు. 11 అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి.

12 నశించిపోయే మన శరీరాన్ని పాపం పాలించకుండా జాగ్రత్త పడండి. దాని కోరికలకు లోబడకండి. 13 మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి. 14 మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు.

యోహాను 5:19-24

యేసు దేవుని అధికారం కలిగియున్నాడు

19 యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు. 20 తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా అశ్చర్యపోతారు. 21 తండ్రి చనిపోయిన వాళ్ళను బ్రతికించినట్లే కుమారుడు కూడా తనకు యిష్టం వచ్చిన వాళ్ళకు ప్రాణం పోస్తాడు.

22 “అంతేకాదు, తండ్రి ఎవరి మీద తీర్పు చెప్పడు. తీర్పు చెప్పటానికి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చాడు. 23 తండ్రిని గౌరవించినట్లు, కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు” అని అన్నాడు.

24 యేసు, “ఇది సత్యం. నామాటలు విని నన్ను పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International