Book of Common Prayer
జాయిన్
49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
కనుక నాకు ఈలాగు జరుగుతుంది.
హేత్
57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను.
నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
తేత్
65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల కీర్తన.
49 సర్వ దేశములారా, ఇది వినండి.
భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి.
2 ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.
3 నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను.
నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
4 సామెతపైనా ఆసక్తినుంచుతాను.
ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను.
5 అపాయాన్నిగూర్చి నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు.
నా దుష్ట శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
6 ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి
తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
7 ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు.
నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
8 ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కునేందుకు
సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
9 ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు
కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు,
మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు.
మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది.
వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
12 ధనికులు నిరంతరం జీవించలేరు.
వారు జంతువుల్లా మరణిస్తారు.
13 బుద్ధిహీనులకు, మరియు వారు చెప్పేది
అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది.
14 మనుష్యులందరూ గొర్రెల్లా ఉన్నారు. సమాధి వారిదొడ్డి.
మరణం వారి కాపరి.
వారి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి వ్యర్థమైపోతాయి.
15 కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని విమోచిస్తాడు.
సమాధి శక్తి నుండి ఆయన నన్ను విడుదల చేస్తాడు.
16 మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు.
వాని ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.
17 ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వెంట వాడేమీ తీసుకొనిపోడు.
వాని ఐశ్వర్యం వానితో సమాధిలోనికి దిగిపోదు.
18 అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతోషంగా ఉంటాడు.
ఒక మనుష్యుడు తనకు తాను మంచి చేసికొని పొగడ్తలు పొందినా,
19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు.
అతడు ఇక వెలుగును ఎన్నటికి చూడడు.
20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు. అతడు నశించే మృగంలాంటి వాడు.
సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.
53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
2 నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
3 కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
ఒక్కడూ లేడు.
4 దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
కాని వారు నన్ను ప్రార్థించరు.
ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”
5 కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.
6 ఇశ్రాయేలు ప్రజలారా,
సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
యాకోబు సంతోషిస్తాడు.
ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.
25 యోసేపు బావిలో పడి ఉంటే, అతని సోదరులు భోజనం చేసేందుకు కూర్చున్నారు. అప్పుడు వారు చూడగా, గిలాదునుండి ఈజిప్టుకు ప్రయాణం చేస్తోన్న వ్యాపారస్తుల బృందం ఒకటి కనబడింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం, ఐశ్వర్యాలు మోస్తున్నాయి. 26 కనుక యూదా తన సోదరులతో “మనం మన సోదరున్ని చంపి, వాని మరణాన్ని దాచిపెడితే మనకేం లాభం? 27 ఈ వ్యాపారస్తులకు గనుక మనం వాణ్ణి అమ్మివేస్తే మనకు లాభం వస్తుంది. పైగా మన సొంత సోదరున్ని చంపిన అపరాధం మనమీద ఉండదు” అన్నాడు. మిగిలిన సోదరులు సమ్మతించారు. 28 మిద్యానీ వ్యాపారవేత్తలు అటు రాగానే, ఆ సోదరులు యోసేపును బావిలో నుండి బయటకు తీశారు. 20 వెండి నాణాలకు వారతణ్ణి ఆ వ్యాపారవేత్తలకు అమ్మివేశారు. వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకువెళ్లారు.
29 ఇంతసేపూ రూబేను అక్కడ తన సోదరులతో లేడు. యోసేపును వారు అమ్మివేసినట్లు అతనికి తెలియదు. రూబేను బావి దగ్గరకు వచ్చినప్పుడు, యోసేపు బావిలో లేడు. రూబేనుకు ఎక్కడ లేని విచారం కలిగింది. తన విషాదాన్ని తెలియజేయడానికి తన గుడ్డలను చింపివేసుకొన్నాడు. 30 రూబేను తన సోదరుల దగ్గరకు వెళ్లి, “పిల్లవాడు బావిలో లేడు, నేనేం చేయాలి?” అని అడిగాడు. 31 ఆ సోదరులు ఒక మేకను చంపి, దాని రక్తాన్ని యోసేపుయొక్క అందమైన అంగీకి పూశారు. 32 తర్వాత ఆ సోదరులు ఆ అంగీని తమ తండ్రికి చూపించారు. “ఈ అంగీ మాకు దొరికింది. ఇది యోసేపుదా?” అంటూ అడిగారు ఆ సోదరులు.
33 తండ్రి అంగీని చూచి, అది యోసేపుదేనని తెలుసుకొన్నాడు. “అవును, అది అతనిదే, ఒకవేళ అడవి మృగం ఏదైనా అతణ్ణి చంపివేసిందేమో. నా కుమారుడు యోసేపును అడవి మృగం ఏదో భక్షించి వేసింది!” అన్నాడు ఆ తండ్రి. 34 యాకోబు తన కుమారుని గూర్చిన దుఃఖంతో తన వస్త్రాలు చింపివేసుకున్నాడు. అతడు దుఃఖంలో ఉన్నట్లు వ్యక్తం చేసేందుకు ప్రత్యేక వస్త్రాలు యాకోబు ధరించాడు. యాకోబు తన కుమారుని విషయం చాలా కాలం దుఃఖంగానే ఉన్నాడు. 35 యాకోబు కుమారులు, కుమార్తెలు అందరూ అతణ్ణి ఓదార్చాలని ప్రయత్నించారు. అయినా యాకోబుకు ఎన్నడూ ఆదరణ కలుగలేదు. యాకోబు “నా మరణ దినంవరకు నా కుమారుని గూర్చి దుఃఖిస్తూనే ఉంటాను” అన్నాడు. అందుచేత అతని కుమారుడైన యోసేపు కోసం యాకోబు దుఃఖంలోనే కాలం గడుపుతూ ఉండిపోయాడు.
36 యోసేపును కొన్న మిద్యాను వ్యాపారవేత్తలు దరిమిలా అతణ్ణి ఈజిప్టులో ఫరో సంరక్షక సేనాధిపతి పోతీఫరుకు అమ్మివేశారు.
నా సందేశం: సిలువ వేయబడిన యేసు క్రీస్తు
2 సోదరులారా! నేను మీ దగ్గరకు వచ్చి దేవుని రహస్యాన్ని ప్రకటించినప్పుడు మాటల చాతుర్యంతో గాని లేక ఉత్కృష్టమైన విజ్ఞానంతో గాని ప్రకటించలేదు[a] 2 ఎందుకంటే నేను మీతో ఉన్నప్పుడు యేసు క్రీస్తునూ, ఆయన సిలువ మరణాన్ని తప్ప మిగతా వాటిని గురించి మరచిపోవాలని నిర్ణయించుకొన్నాను. 3 నేను మీదగ్గరకు వచ్చినప్పుడు నా శక్తిపై నమ్మకం పెట్టుకొని రాలేదు. భయంతో వణుకుతూ వచ్చాను. 4 మిమ్నల్ని సమ్మతింప చెయ్యాలని నేను జ్ఞానంతో నిండిన పదాలుపయోగించి నా సందేశం బోధించలేదు. దేవుని ఆత్మ యిచ్చిన శక్తినుపయోగించి నా సందేశంలో ఉన్న సత్యాన్ని ఋజువు చేసాను. 5 మీ విశ్వాసానికి మానవుల పాండిత్యం కాకుండా దేవుని శక్తి పునాదిగా ఉండాలని నా ఉద్దేశ్యం.
ఆత్మ ఇచ్చిన జ్ఞానము
6 కాని ఆత్మీయ పరిపూర్ణత పొందినవాళ్ళకు మేము జ్ఞానంతో నిండిన సందేశం చెపుతాము. ఆ సందేశం ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు. అది ప్రపంచాన్ని పాలించే పాలకులకు సంబంధించిన జ్ఞానమూ కాదు. చివరికి ఆ పాలకులు లేకుండా పోతారు. 7 నేను చెపుతున్నది దేవుడు చెప్పిన రహస్య జ్ఞానం. “ఇది” ఇంతదాకా మానవులనుండి రహస్యంగా దాచబడిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు మహిమ కలగాలని కాలానికి ముందే దేవుడు నిర్ణయించాడు. 8 ఈనాటి పాలకులు దాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని అర్థం చేసుకొనివుంటే మహిమా స్వరూపి అయిన మన ప్రభువును సిలువకు వేసి చంపేవాళ్ళు కాదు. 9 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకోసం సిద్ధంగా
ఉంచిన వాటిని ఎవరి కళ్ళూ చూడలేదు.
ఎవరి చెవులు వినలేదు.
ఎవరూ వాటిని ఊహించలేదు.”(A)
10 కాని దేవుడు ఈ రహస్యాన్ని మనకు తన ఆత్మ ద్వారా తెలియచేసాడు.
ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తాడు. దేవునిలో దాగి ఉన్నవాటిని కూడా పరిశోధిస్తాడు. 11 మానవునిలో ఉన్న ఆలోచనలు అతనిలో ఉన్న ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. అదే విధంగా దేవునిలో ఉన్న ఆలోచనలు ఆయన ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. 12 మనం ఈ ప్రపంచానికి సంబంధించిన ఆత్మను పొందలేదు. దేవుడు పంపిన ఆత్మను మనం పొందాము. తాను ఉచితంగా యిచ్చినవాటిని గురించి మనం తెలుసుకోవాలని ఆయన ఉద్ధేశ్యం.
13 మానవులు తమ జ్ఞానంతో బోధించిన పదాలను వాడకుండా ఆత్మ బోధించిన పదాలను వాడి, ఆత్మీయ సత్యాలను ఆత్మీయ భాషలో చెపుతూ ఉంటాము.
యేసు అనేకులను నయం చేయటం
(మత్తయి 8:14-17; లూకా 4:38-41)
29 వాళ్ళు సమాజమందిరం వదిలి నేరుగా యాకోబు మరియు యోహానులతో కలిసి సీమోను మరియు అంద్రెయల ఇంటికి వెళ్ళారు. 30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టివుంది. ఆమెను గురించి వాళ్ళు యేసుతో చెప్పారు. 31 ఆయన ఆమెను సమీపించి చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టాడు. జ్వరం ఆమెను వదిలిపోయింది. ఆమె వెంటనే వాళ్ళకు పరిచర్యలు చెయ్యటం మొదలు పెట్టింది.
32 ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని, దయ్యంపట్టిన వాళ్ళను, యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. 33 ఆ ఊరంతా ఆయనవున్న యింటిముందు చేరుకుంది. 34 రకరకాల వ్యాధులున్న వాళ్ళకు యేసు నయం చేసాడు. ఎన్నో దయ్యాలను విడిపించాడు. ఆ దయ్యాలకు తానెవరో తెలుసు కనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
యేసు ఇతర పట్టణాలకు వెళ్ళటం
(లూకా 4:42-44)
35 యేసు తెల్లవారుఝామున ఇంకా చీకటియుండగానే లేచి యిల్లు వదిలి ఎడారి ప్రదేశానికి వెళ్ళి, అక్కడ ప్రార్థించాడు. 36 సీమోను మరియు అతని సహచరులు యేసును వెతకటానికి వెళ్ళారు. 37 ఆయన్ని చూసి వాళ్ళు, “అంతా మీకోసం వెతుకుతున్నారు” అని అన్నారు.
38 యేసు సమాధానం చెబుతూ, “ఇతర గ్రామాలకు వెళ్దాం రండి. అక్కడ కూడా ప్రకటించాలని నా అభిలాష, నేను వచ్చింది కూడా అందుకే కదా!” అని అన్నాడు. 39 ఆయన గలిలయ ప్రాంతమంతా పర్యటన చేసి అక్కడి సమాజమందిరాల్లో ప్రకటించాడు. దయ్యాలను వదిలించాడు.
యేసు రోగిని నయం చేయటం
(మత్తయి 8:1-4; లూకా 5:12-16)
40 ఒక కుష్టురోగి ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి, “మీరు దయతలిస్తే నయం చెయ్యగలరు” అని వేడుకున్నాడు.
41 యేసుకు జాలివేసింది. తన చేయి జాపి, “సరే దయ చూపుతాను!” అని అంటూ అతణ్ణి తాకాడు. 42 వెంటనే కుష్టురోగం అతన్ని వదిలిపోయింది. అతనికి నయమైంది.
43 అతణ్ణి పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా జాగ్రత్తపడు. 44 కాని వెళ్ళి మీ యాజకునికి చూపు. మోషే ఆజ్ఞాపించిన బలి యిచ్చి నీవు శుద్ధి అయినట్లు రుజువు చేసుకొ” అని గట్టిగా చెప్పాడు. 45 కాని అతడు వెళ్ళి అందరికి చెప్పాడు. ఆ కారణంగా యేసు ఆ గ్రామాన్ని బహిరంగంగా ప్రవేశించ లేక పొయ్యాడు. గ్రామాల వెలుపల అరణ్య ప్రదేశాల్లో బస చేసాడు. అయినా ప్రజలు అన్ని ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.
© 1997 Bible League International