Book of Common Prayer
సంగీత నాయకునికి: “శోషనీము” రాగం. కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరియు ఒక ప్రేమగీతం.
45 రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా
అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి.
నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా
నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.
2 నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!
నీ పెదవులనుండి దయ వెలువడుతుంది
కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.
3 నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరునివలె, మహిమను, ఘనతను ధరించుము.
4 నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము.
అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.
5 నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి
అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.
6 దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
నీ నీతి రాజదండము.
7 నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
నీ దేవుడు కోరుకొన్నాడు.
8 నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
9 నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.
10 కుమారీ, నా మాట వినుము.
నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11 రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.
13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.
16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల గీతం.
47 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి.
సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
భూలోకమంతటికీ ఆయన రాజు.
3 ఆయన ప్రజలను మనకు లోబరిచాడు.
ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
4 దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.
5 బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే
యెహోవా దేవుడు లేచాడు.
6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
7 దేవుడు సర్వలోకానికి రాజు.
స్తుతిగీతాలు పాడండి.
8 దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు.
దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు.
9 రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు.
దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
దేవుడు మహోన్నతుడు.
కోరహు కుమారుల స్తుతి పాట.
48 యెహోవా గొప్పవాడు.
మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
2 దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది.
అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది.
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.[a]
అది మహారాజు పట్టణం.
3 ఇక్కడ ఆ పట్టణంలోని
భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
4 ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు.
వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు.
వారంతా కలసి ముందుకు వచ్చారు.
5 ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,
వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
6 ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.
ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
7 దేవా, బలమైన తూర్పుగాలితో
తర్షీషు ఓడలను బ్రద్దలు చేశావు.
8 మేము ఏమి విన్నామో, దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో
మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో చూశాము.
దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.
9 దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.
భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.
మరియు యూదా నగరాలు ఆనందంగా ఉన్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
12 సీయోను చుట్టూ తిరుగుతూ
ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
13 ఎత్తైన గోడలు చూడండి.
సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి.
అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
14 ఈ విషయాలు దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి:
ఆయన ఎప్పటికీ మన దేవుడు, ఆయన ఎల్లప్పుడు మనలను కాపాడుతాడు.
12 ఒకరోజు, యోసేపు సోదరులు తమ తండ్రి గొర్రెల్ని మేపుకొనేందుకు షెకెం వెళ్లారు. 13 యాకోబు, “నీ సోదరులు షెకెంలో నా గొర్రెల్ని కాస్తున్నారు. నీవు అక్కడికి వెళ్లాలి” అని యోసేపుతో చెప్పాడు.
“అలాగే, నేను వెళ్తా,” అన్నాడు యోసేపు.
14 యోసేపు తండ్రి, “నీవు వెళ్లి నీ సోదరులు క్షేమంగా ఉన్నారో లేదో చూచి, మళ్లీ వచ్చి నా గొర్రెల క్షేమ సమాచారం నాకు చెప్పాలి” అన్నాడు. అందుచేత యోసేపు తండ్రి హెబ్రోను లోయనుండి షెకెముకు అతడ్ని పంపించాడు.
15 షెకెములో యోసేపు తప్పిపోయాడు. అతడు పొలాల్లో తిరుగుతోంటే ఒక మనిషి చూశాడు. “ఏమిటి వెదుకుతున్నావు” అన్నాడు ఆ మనిషి.
16 “నేను నా అన్నల కోసం వెదుకుతున్నాను. వాళ్లు గొర్రెల్ని మేపుకొంటూ ఎక్కడ ఉన్నారో నీవు చెప్పగలవా?” అన్నాడు యోసేపు.
17 ఆ మనిషి “అప్పుడే వాళ్లు వెళ్లిపోయారు గదా. వాళ్లు దోతాను వెళ్తాం అని చెప్పుకోవటం నేను విన్నాను” అన్నాడు. కనుక యోసేపు తన సోదరులను వెంబడించి, దోతానులో వారిని చూడగలిగాడు.
బానిసగా యోసేపును అమ్ముట
18 యోసేపు రావటం అతని అన్నలు అంత దూరం నుంచే చూశారు. అతణ్ణి చంపేందుకు ఒక పథకం వేయాలని వారు తీర్మానించుకొన్నారు. 19 ఆ సోదరులు వాళ్లలో వారు ఇలా చెప్పుకొన్నారు, “కలలుకనే యోసేపు ఇక్కడికి వస్తున్నాడు. 20 ఇప్పుడు మనకు వీలైనప్పుడే మనం వాణ్ణి చంపివేయాలి. వాని శవాన్ని ఇక్కడే ఏదో ఖాళీ బావిలో పడవేస్తే సరిపోతుంది. అడవి మృగం ఏదో వాణ్ణి చంపేసిందని మన తండ్రితో మనం చెప్పొచ్చు. అప్పుడు అతని కలలన్నీ అర్థము లేనివని వానికి మనం చూపెట్టవచ్చు.”
21 కానీ రూబేను యోసేపును కాపాడాలి అనుకొన్నాడు, “వాణ్ణి మనం చంపొద్దు. 22 వానికి హాని చేయకుండానే ఒక బావిలో పడవేస్తే సరిపోతుంది” అని చెప్పాడు రూబేను. యోసేపును రక్షించి, అతని తండ్రి దగ్గరకు పంపించాలని రూబేను వేసిన పథకం ఇది. 23 యోసేపు తన సోదరుల దగ్గరకు వచ్చాడు. వారు అతని మీద పడి, అందమైన అతని పొడవాటి అంగీని చింపేసారు. 24 తర్వాత, ఎండిపోయి ఖాళీగా ఉన్న ఒక బావిలో అతణ్ణి పడవేశారు.
20 మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా! 21 తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ఖత్వం” అని భావిస్తున్న “మా సందేశాన్ని” విశ్వసించినవాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.
22 యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు. 23 మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేనిదానిగాను కనిపిస్తుంది. 24 కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకానివాళ్ళకు “క్రీస్తు” దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము. 25 దేవుని అవివేకం, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్ఠమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.
26 సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచం మిమ్మల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్ఠలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు. 27 కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు. 28 ప్రపంచం ముఖ్యమైనవాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్నచూపుతో చూడబడేవాళ్ళనూ, ఏవగించుకొనబడేవాళ్ళనూ, లెక్క చెయ్యబడనివాళ్ళను ఎన్నుకొన్నాడు. 29 తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం. 30 కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు. 31 అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”(A)
గలిలయలో యేసుని సేవా ప్రారంభం
(మత్తయి 4:12-17; లూకా 4:14-15)
14 యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు గలిలయకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. 15 ఆయన, “దేవుని రాజ్యం వస్తుంది. ఆ సమయం దగ్గరకు వచ్చింది. మారుమనస్సు పొంది సువార్తను విశ్వసించండి” అని ప్రకటించాడు.
యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం
(మత్తయి 4:18-22; లూకా 5:1-11)
16 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. ఆయన చేపలు పట్టేవాళ్ళైన సీమోను మరియు అతని సోదరుడు అంద్రెయ వల వేయటం చూసాడు. 17 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి. మీరు మనుష్యులను పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. 18 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.
19 ఆయన కొంతదూరం వెళ్ళాక జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడు యోహాను పడవలో ఉండటం చూసాడు. వాళ్ళు వల సిద్ధం చేసుకొంటూ ఉన్నారు. 20 యేసు వాళ్ళను పిలిచాడు. వాళ్ళు తమ తండ్రి జెబెదయిని పనివాళ్ళతో అక్కడే పడవలో వదిలివేసి యేసును అనుసరించారు.
యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం
(లూకా 4:31-37)
21 అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు. 22 శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలా బోధించాడు. కనుక ప్రజలు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు. 23 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజమందిరానికి వచ్చాడు. 24 వాడు, “నజరేయుడవైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరవో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నాడు.
25 యేసు, “నోరుమూసుకో వాని నుండి బయటకు రా!” అని గద్దిస్తూ అన్నాడు. 26 ఆ దయ్యం వాణ్ణి వణికించి పెద్దకేక పెడుతూ వానినుండి బయటికి వచ్చింది.
27 ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు, “ఇదేమిటి? కొత్తబోధనా? పైగా అధికారంతో బోధిస్తున్నాడే! దయ్యాలను ఆజ్ఞాపిస్తే అవికూడా విధేయతతో ఆయనకు లోబడుతున్నవి!” అని పరస్పరం మాట్లాడుకున్నారు. 28 గలిలయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకందరికి ఆయన గురించి తెలిసిపోయింది.
© 1997 Bible League International