Book of Common Prayer
106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
2 యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
3 దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.
4 యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
5 యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.
6 మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
7 యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు.
ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి
విరోధంగా ఎదురు తిరిగారు.
8 అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు,
ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని.
9 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది.
దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు.
10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు.
వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు.
11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచి, కప్పివేసాడు.
వారి శత్రువులు ఒక్కడూ తప్పించుకోలేదు!
12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు.
వారు ఆయనకు స్తుతులు పాడారు.
13 కాని దేవుడు చేసిన వాటిని మన పూర్వీకులు వెంటనే మరచిపోయారు.
వారు దేవుని సలహా వినలేదు.
14 మన పూర్వీకులు ఎడారిలో ఆకలిగొన్నారు.
అరణ్యంలో వారు దేవుణ్ణి పరీక్షించారు.
15 కాని మన పూర్వీకులు అడిగిన వాటిని దేవుడు వారికి ఇచ్చాడు.
అయితే దేవుడు వారికి ఒక భయంకర రోగాన్ని కూడా ఇచ్చాడు.
16 ప్రజలు మోషే మీద అసూయ పడ్డారు.
యెహోవా పవిత్ర యాజకుడు అహరోను మీద వారు అసూయపడ్డారు.
17 కనుక ఆ అసూయపరులను దేవుడు శిక్షించాడు. భూమి తెరచుకొని దాతానును మింగివేసింది.
తరువాత భూమి మూసుకొంటూ అబీరాము సహచరులను కప్పేసింది.
18 అప్పుడు ఒక అగ్ని ఆ ప్రజాసమూహాన్ని కాల్చివేసింది.
ఆ అగ్ని ఆ దుర్మార్గులను కాల్చివేసింది.
19 హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను చేశారు.
వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు.
20 ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని
వారి మహిమ గల దేవునిగా మార్చేశారు.
21 మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు.
ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు.
22 హాము దేశంలొ[a] దేవుడు అద్భుత కార్యాలు చేశాడు.
దేవుడు ఎర్ర సముద్రం దగ్గర భీకర కార్యాలు చేశాడు.
23 దేవుడు ఆ ప్రజలను నాశనం చేయాలని కోరాడు.
కాని దేవుడు ఏర్పరచుకొన్న సేవకుడు మోషే ఆయనను నివారించాడు.
దేవునికి చాలా కోపం వచ్చింది.
కాని దేవుడు ఆ ప్రజలను నాశనం చేయకుండా మోషే అడ్డుపడ్డాడు.
24 అంతట ఆ ప్రజలు ఆనందకరమైన కనాను దేశంలోనికి వెళ్లేందుకు నిరాకరించారు.
ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలను ఓడించుటకు దేవుడు వారికి సహాయం చేస్తాడని ఆ ప్రజలు నమ్మలేదు.
25 మన పూర్వీకులు దేవునికి విధేయులవుటకు నిరాకరించారు.
26 అందుచేత వారు అరణ్యంలోనే మరణిస్తారని దేవుడు ప్రమాణం చేసాడు.
27 వారి సంతతివారిని ఇతర ప్రజలు ఓడించేలా చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు.
మన పూర్వీకులను రాజ్యాలలో చెదరగొడతానని దేవుడు ప్రమాణం చేసాడు.
28 దేవుని ప్రజలు బయల్పెయోరు అనే బయలు దేవత పూజలో పాల్గొన్నారు.
చచ్చినవారికి, విగ్రహానికి బలియిచ్చిన మాంసాన్ని దేవుని ప్రజలు తిన్నారు.
29 దేవుడు తన ప్రజల మీద చాలా కోపగించాడు. మరియు దేవుడు వారిని రోగులనుగా చేసాడు.
30 కాని ఫీనెహాసు దేవుని ప్రార్థించాడు.
దేవుడు రోగాన్ని ఆపుచేసాడు.
31 ఫీనెహాసు చాలా మంచి పని చేసాడు అని దేవునికి తెలుసు.
మరియు శాశ్వతంగా ఎప్పటికి దేవుడు దీనిని జ్ఞాపకం చేసుకొంటాడు.
32 మెరీబా వద్ద ప్రజలకు కోపం వచ్చింది.
మోషేతో ఏదో చెడు కార్యము వారు చేయించారు.
33 ఆ ప్రజలు మోషేను చాలా కలవర పెట్టారు.
అందుచేత మోషే అనాలోచితంగా మాటలు అనేశాడు.
34 కనానులో నివసిస్తున్న ఇతర ప్రజలను నాశనం చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు.
కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు.
35 ఇశ్రాయేలు ప్రజలు ఇతర ప్రజలతో కలిసి పోయారు.
ఇతర ప్రజలు చేస్తున్న వాటినే వీరు కూడా చేశారు.
36 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా తయారయ్యారు.
ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు పెట్టారు.
37 దేవుని ప్రజలు తమ స్వంత బిడ్డలను సహితం చంపి
ఆ బిడ్డలను ఆ దయ్యాలకు బలియిచ్చారు.
38 దేవుని ప్రజలు నిర్దోషులను చంపివేసారు.
వారు తమ స్వంత బిడ్డలనే చంపి ఆ బూటకపు దేవుళ్లకు అర్పించారు.
39 కనుక ఆ ఇతర ప్రజల పాపాలతో దేవుని ప్రజలు మైలపడ్డారు.
దేవుని ప్రజలు తమ దేవునికి అపనమ్మకస్తులై ఆ ఇతర ప్రజలు చేసిన పనులనే చేసారు.
40 దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది.
దేవుడు వారితో విసిగిపోయాడు!
41 దేవుడు తన ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగించాడు.
వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా దేవుడు చేసాడు.
42 దేవుని ప్రజలను శత్రువులు తమ అదుపులో పెట్టుకొని
వారికి జీవితాన్నే కష్టతరం చేసారు.
43 దేవుడు తన ప్రజలను అనేకసార్లు రక్షించాడు.
కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన వాటినే చేశారు.
దేవుని ప్రజలు ఎన్నెన్నో చెడ్డపనులు చేసారు.
44 కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టారు.
ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు.
45 దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొన్నాడు.
దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప ప్రేమతో వారిని ఆదరించాడు.
46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు.
అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు.
47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు.
నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా
ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము.
అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు.
మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.
11 నా కుమారుడా, నీవు తప్పు చేస్తున్నావని కొన్ని సార్లు యెహోవా నీకు చూపిస్తాడు. కాని ఈ శిక్షను గూర్చి కోపించకు. దాని నుండి నేర్చు కొనేందుకు ప్రయత్నించు. 12 ఎందుకంటే, యెహోవా తాను ప్రేమించే మనుష్యులను ఆయన సరిచేస్తాడు. అవును, తాను ప్రేమించే కుమారుని శిక్షించే ఒక తండ్రిలాంటివాడు దేవుడు.
13 జ్ఞానమును సంపాదించి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మనిషి అర్థం చేసుకోవటం మొదలు పెట్టినప్పుడు అతడు ధన్యుడు. 14 జ్ఞానము మూలంగా వచ్చే లాభం వెండి కంటే మంచిది. జ్ఞానము మూలంగా వచ్చే లాభం మంచి బంగారం కంటే మేలు. 15 జ్ఞానము నగల కంటే ఎంతో ఎక్కువ విలువ గలది. నీవు కోరుకో దగినది ఏదీ జ్ఞానము అంతటి విలువ గలది కాదు!
16 జ్ఞానము సుదీర్గ జీవితాన్ని, ఐశ్వర్యాల్ని, ఘనతలను నీకు ఇస్తుంది. 17 జ్ఞానముగల మనుష్యులు శాంతి, సంతోషం, కలిగి జీవిస్తారు. 18 జ్ఞానము జీవవృక్షంలా ఉంటుంది. దానిని స్వీకరించే వారికి అది నిండు జీవితాన్ని ఇస్తుంది. జ్ఞానమును కలిగినవారు నిజంగా సంతోషంగా ఉంటారు.
19 భూమిని చేయుటకు యెహోవా తన తెలివిని ఉపయోగించాడు. ఆకాశాలను చేయుటకు యెహోవా తెలివి ఉపయోగించాడు. 20 నీళ్లను చేయుటకు యెహోవా తెలివి ప్రయోగించాడు. ఆయన జ్ఞానము ద్యారా ఆకాశాలు వర్షాన్ని కురిపిస్తాయి.
18 బిడ్డలారా! మనం మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మన ప్రేమను వెల్లడి చేద్దాం.
19-20 మన హృదయాలు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడు, అన్నీ తెలిసినవాడు కనుక, మనం నోటి మాటలతో కాక క్రియారూపంగా సత్యంతో ప్రేమను చూపుదాం. అలా చేస్తే మనం సత్యానికి చెందిన వాళ్ళమని తెలుసుకొంటాం. పైగా ఆయన సమక్షంలో దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడని, మన హృదయాలకు నచ్చ చెప్పగలుగుతాం.
21 ప్రియ మిత్రులారా! మన హృదయాలు మన మీద నిందారోపణ చేయలేనిచో మనకు ఆయన సమక్షంలో ధైర్యం ఉంటుంది. 22 దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయనకు ఆనందం కలిగే విధంగా నడుచుకొంటే మనం అడిగింది మనకు లభిస్తుంది. 23 ఆయన ఆజ్ఞ యిది: దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచండి. ఆయనాజ్ఞాపించిన విధంగా పరస్పరం ప్రేమతో ఉండండి. 24 దేవుని ఆజ్ఞల్ని పాటించినవాళ్ళు ఆయనలో జీవిస్తారు. ఆయన వాళ్ళలో జీవిస్తాడు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మద్వారా ఆయన మనలో జీవిస్తున్నాడని తెలుసుకోగలుగుతాం.
ఆత్మల్ని పరిశీలించండి
4 ప్రియ మిత్రులారా! అన్ని ఆత్మల్ని నమ్మకండి. ఆ ఆత్మలు దేవునినుండి వచ్చాయా అన్న విషయాన్ని పరిశీలించండి. ఎందుకంటే, మోసం చేసే ప్రవక్తలు చాలామంది ఈ ప్రపంచంలోకి వచ్చారు. 2 యేసు క్రీస్తు దేవునినుండి శరీరంతో వచ్చాడని అంగీకరించిన ప్రతీ ఆత్మ దేవునికి చెందినదని దేవుని ఆత్మద్వారా మీరు గ్రహించాలి. 3 యేసును అంగీకరించని ప్రతి ఆత్మ దేవునినుండి రాలేదన్నమాట. అలాంటి ఆత్మ క్రీస్తు విరోధికి చెందింది. ఆ ఆత్మలు రానున్నట్లు మీరు విన్నారు. అవి అప్పుడే ప్రపంచంలోకి వచ్చాయి.
4 బిడ్డలారా! మీరు దేవుని సంతానం కనుక వాటిని జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళకన్నా గొప్పవాడు. 5 క్రీస్తు విరోధులు ప్రపంచానికి చెందినవాళ్ళు. అందువల్ల వాళ్ళు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతారు. ప్రపంచం వాళ్ళ మాటలు వింటుంది. 6 మనం దేవునికి చెందిన వాళ్ళం. అందువల్ల దేవుణ్ణి తెలుసుకొన్నవాడు మన మాటలు వింటాడు. కాని దేవునికి చెందనివాడు మన మాటలు వినడు. దీన్నిబట్టి మనము ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో తెలుసుకోగలుగుతాము.
లాజరు కుటుంబాన్ని ఓదార్చుట
17 యేసు అక్కడికి చేరుకున్నాడు. నాలుగు రోజుల ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది. 18 బేతనియ, యెరూషలేమునకు సుమారు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది. 19 చాలా మంది యూదులు మార్తను, మరియను వాళ్ళ సోదరుడు చనిపోయినందుకు ఓదార్చటానికి వచ్చారు.
20 యేసు వస్తున్నాడని విని మార్త ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళింది. కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది. 21 మార్త యేసుతో, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయే వాడు కాదు. 22 కాని, యిప్పటికైనా మీరడిగితే దేవుడు మీరడిగింది యిస్తాడని నాకు తెలుసు” అని అన్నది.
23 యేసు ఆమెతో, “మీ సోదరుడు మళ్ళీ బ్రతికివస్తాడు” అని అన్నాడు.
24 మార్త, “చివరి రోజున అనగా అందరూ బ్రతికి వచ్చే రోజున అతడూ బ్రతికి వస్తాడని నాకు తెలుసు” అని సమాధానం చెప్పింది.
25 యేసు, “బ్రతికించే వాణ్ణి, బ్రతుకును నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు. 26 జీవిస్తున్నవాడు నన్ను విశ్వసిస్తే ఎన్నటికి మరణించడు. ఇది నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు.
27 ఆమె, “నమ్ముతున్నాను ప్రభూ! మీరు క్రీస్తు అని, ఈ ప్రపంచంలోకి వచ్చిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను” అని అన్నది.
యేసు యేడవటం
28 ఈ విధంగా అన్న తర్వాత యింటికి వెళ్ళి తన సోదరి మరియను ప్రక్కకు పిలిచి, ఆమెతో, “బోధకుడు వచ్చాడు. నీ కొరకు అడుగుతున్నాడు” అని అన్నది. 29 మరియ యిది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళింది.
© 1997 Bible League International