Book of Common Prayer
118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
3 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని యాజకులారా, మీరు చెప్పండి.
4 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.
5 నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
6 యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను.
నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
7 యెహోవా నా సహాయకుడు;
నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
8 మనుష్యులను నమ్ముకొనుటకంటే
యెహోవాను నమ్ముట మేలు.
9 మీ నాయకులను నమ్ముకొనుట కంటే
యెహోవాను నమ్ముకొనుట మేలు.
10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
17 నేను జీవిస్తాను! కాని మరణించను.
మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26 యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”
యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”
28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దావీదు ప్రార్థన.
145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
2 ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
3 యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
4 యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
5 ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
6 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
7 నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.
8 యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా, అందరి యెడలా మంచివాడు.
దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
నీవు శాశ్వతంగా పాలిస్తావు.
14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!
మంచి స్త్రీ—జ్ఞానము
20 ఇలా విను! జ్ఞానము ప్రజలకు ఉపదేశించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె (జ్ఞానము) వీధుల్లో, సంతల్లో అరుస్తుంది. 21 రద్దీగల వీధి మూలల్లో ఆమె (జ్ఞానము) పిలుస్తోంది. ఆమె (జ్ఞానము) తన మాటలు వినేందుకు ప్రజలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ ద్వారాల దగ్గర ఉంటూ (జ్ఞానము) చెపుతుంది:
22 “మీరు వెర్రివాళ్లు. ఇంకెన్నాళ్లు మీరు ఇలా వెర్రి పనులు చేస్తూనే ఉంటారు? ఎన్నాళ్లు మీరు తెలివిని ద్వేషీస్తూ ఉంటారు? 23 మీరు పశ్చాత్తాపపడి నా సలహా, నా ఉపదేశం విని ఉంటే, నాకు తెలిసింది అంతా నేను మీతో చెప్పి ఉండేదాన్ని. నాకు ఉన్న తెలివి అంతా మీకు ఇచ్చి ఉండేదాన్ని.
24 “కాని మీరు నా మాట వినేందుకు తిరస్కరించారు. సహాయం చేయటానికి నేను ప్రయత్నించాను. నేను నా చేయి అందించాను. కాని నా సహాయం స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 25 నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 26 అందుచేత నేను మీ కష్టం చూచి నవ్వుతాను. మీకు కష్టం కలగటం చూచి నేను సరదా పడతాను. 27 గొప్ప కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది. సమస్యలు ఒక బలమైన గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి.
28 “ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా సహాయం కోసం అడుగుతారు. కాని నేను మీకు సహాయం చేయను. మీరు నాకోసం వెదుకుతారు, కాని మీరు నన్ను కనుగొనలేరు. 29 మీరు ఎన్నడూ నా తెలివిని కోరుకోలేదు, గనుక నేను మీకు సహాయం చేయను. మీరు యెహోవాకు భయపడి ఆయనను గౌరవించుటకు నిరాకరించారు. 30 నా సలహా మాటలు వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు. నేను సరైనదారి మీకు చూపించినప్పుడు మీరు నా మాట వినేందుకు నిరాకరించారు. 31 కనుక మీరు మీ స్వంత విదానంలోనే పనులు చేసుకోవాలి. మీ స్వంత కీడు మార్గాల్లో జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు.
32 “అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తారు. వారి బుద్ధిహీన పధ్ధతులలో కొనసాగటం వారికి సంతోషం, అదే వారిని చంపుతుంది. 33 కాని, నాకు విధేయత చూపే వ్యక్తి క్షేమంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. అతడు కీడుకు భయపడాల్సిన అవసరం ఉండదు.”
దేవునితో సమాధానం
11 కనుక ప్రభువుకు భయపడుట అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఆయన సందేశాన్ని అంగీకరించుమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తాము. మా గురించి దేవునికి బాగా తెలుసు. మీ హృదయాలకు కూడా ఈ విషయం తెలుసునని నా విశ్వాసం. 12 మా గురించి మేము చెప్పుకోవాలని లేదు. మా విషయంలో గర్వించటానికి మీకు అవకాశం యిస్తున్నాము. అప్పుడు మీరు మనిషి గుణాన్ని కాక, అతని వేషం చూసి పొగిడేవాళ్ళకు సమాధానం చెప్పగలుగుతారు. 13 మాకు మతి పోయిందా? ఔను, అది దేవుని కోసం పోయింది. మాకు మతి ఉందా? ఔను అది మీకోసం ఉంది. 14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం ఆయన మరణించాడు. అందువల్ల అందరూ ఆయన మరణంలో భాగం పంచుకొన్నారు. ఇది మనకు తెలుసు. 15 ఆయన అందరి కోసం మరణించాడు. కనుక జీవిస్తున్నవాళ్ళు యిక మీదట తమ కోసం జీవించరాదు. మరణించి ప్రజలకోసం మళ్ళీ బ్రతికింపబడినవాని కోసం జీవించాలి.
16 ఇకనుండి మేము ఎవ్వరినీ లౌకికంగా పరిగణించము. ఒకప్పుడు మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాము, గాని ఇప్పుడు అలా కాదు. ఆయన్ని గురించి మా అభిప్రాయం మారిపోయింది. 17 క్రీస్తులో ఐక్యత పొందినవాడు క్రొత్త జీవితం పొందుతాడు. పాత జీవితం పోయి క్రొత్త జీవితం వస్తుంది. 18 ఇదంతా దేవుడు చేసాడు. శత్రువులుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తన మిత్రులుగా చేసుకొన్నాడు. ఇతరులను కూడా తన మిత్రులుగా చేసే బాధ్యత మనపై ఉంచాడు. 19 క్రీస్తు ద్వారా దేవుడు అందరినీ తన మిత్రులుగా చేసుకొనుచున్నాడన్నదే మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమిస్తాడు. వాళ్ళను తన మిత్రులుగా ఏ విధంగా చేసుకొంటాడన్న సందేశం చెప్పాడు. 20 మేము క్రీస్తు రాయబారులం. దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధానపడమని మిమ్మల్ని వేడుకొంటున్నాము. 21 క్రీస్తు పాపం చెయ్యలేదు. కాని మనకోసం దేవుడు ఆయన్ని పాపంగా చేసాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని దృష్టిలో నీతిమంతులంగా ఉండాలని ఇలా చేసాడు.
యాకోబు మరియు యోహానుల నివేదన
(మత్తయి 20:20-28)
35 జెబెదయి కుమారులు యాకోబు మరియు యోహానులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము అడిగింది చెయ్యమని కోరుతున్నాము” అని అన్నారు.
36 “ఏమి చెయ్యమంటారు?” అని యేసు అడిగాడు.
37 వాళ్ళు, “మీరు మహిమను పొందినప్పుడు మాలో ఒకరిని మీ కుడిచేతి వైపు, మరొకరిని మీ ఎడమచేతివైపు కూర్చోనివ్వండి” అని అడిగారు.
38 యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగినదాన్ని మీరు త్రాగగలారా? నేను పొందిన బాప్తిస్మము మీరు పొందగలరా?” అని అడిగాడు.
39 “పొందగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, “నేను త్రాగిన దాన్ని మీరు త్రాగుదురు, నేను పొందిన బాప్తిస్మము మీరు పొందుదురు. 40 కాని నా కుడివైపు, లేక నా ఎడమ వైపు కూర్చోమనటానికి అనుమతి యిచ్చేది నేను కాదు. ఈ స్థానాలు ఎవరి కోసం నియమించబడ్డాయో వాళ్ళు మాత్రమే కూర్చోగలరు” అని అన్నాడు.
41 ఇది విని మిగతా పది మందికి యాకోబు మరియు యోహానులపై కోపం వచ్చింది. 42 యేసు వాళ్ళను దగ్గరకు పిలిచి, “యూదులుకాని వాళ్ళను పాలించ వలసిన ప్రభువులు, వాళ్ళపై తమ అధికారం చూపుతూ ఉంటారు. ఇతర అధికారులు కూడా వాళ్ళపై అధికారం చూపుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు. 43 మీ విషయంలో అలా కాదు. మీలో అందరి కన్నా గొప్ప కావాలనుకున్నవాడు మిగతా వాళ్ళందరికి సేవ చేయాలి. 44 మీలో ప్రాముఖ్యత పొందాలనుకొన్నవాడు మీ అందరికి బానిసగా ఉండాలి. 45 ఎందుకంటే మనుష్యకుమారుడు కూడా సేవ చేయించుకోవటానికి రాలేదు. కాని సేవ చేయటానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనంగా ధారపోయటానికి వచ్చాడు” అని అన్నాడు.
© 1997 Bible League International