Book of Common Prayer
33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు.
నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు.
34 సారవంతమైన భూమిని పనికిమాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు.
ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే.
35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు.
ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు.
36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు.
ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు.
37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు.
వారికి మంచి పంట వచ్చింది.
38 దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుంబాలు పెద్దవయ్యాయి.
వారికి ఎన్నెన్నో పశువులు ఉన్నాయి.
39 విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు
చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి.
40 దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు.
బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు.
41 అయితే, అప్పుడు దేవుడు ఆ పేద ప్రజలను వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు.
ఇప్పుడు వారి కుటుంబాలు గొర్రెల మందల్లా పెద్దవిగా ఉన్నాయి.
42 మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు.
కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు.
43 ఒక వ్యక్తి తెలివిగలవాడైతే ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు.
ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.
దావీదు స్తుతి కీర్తన
108 దేవా, నా హృదయం, నా ఆత్మ నిశ్చలముగాఉన్నాయి.
నేను పాడుటకు, స్తుతి కీర్తనలు
వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.
2 స్వర మండలములారా, సితారలారా,
మనం సూర్యున్ని[a] మేల్కొలుపుదాం
3 యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము.
ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.
4 యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది.
నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.
5 దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము!
సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.
6 దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము.
నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.
7 యెహోవా తన ఆలయము నుండి[b] మాట్లాడి యిలా చెప్పాడు,
“యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను.
(ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను)
నా ప్రజలకు షెకెమును ఇస్తాను.
వారికి సుక్కోతులోయను ఇస్తాను.
8 గిలాదు, మనష్షే నావి.
ఎఫ్రాయిము నా శిరస్త్రాణం.
యూదా నా రాజదండం.
9 మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం.
ఎదోము నా చెప్పులు మోసే బానిస.
ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”
10 శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు?
ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?
11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో
నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?
12 దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము
మనుష్యులు మాకు సహాయం చేయలేరు!
13 దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు.
దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.
33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
3 ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
4 దేవుని మాట సత్యం!
ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
5 నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
బేతేలులో యాకోబు
35 “బేతేలు పట్టణం వెళ్లు. అక్కడ నివసించి, ఆరాధనకు బలిపీఠం నిర్మించు. నీవు నీ అన్న ఏశావు దగ్గర్నుండి పారిపోతున్నప్పుడు నీకు అక్కడ ప్రత్యక్షమైన ఏల్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అక్కడ ఆ దేవుణ్ణి ఆరాధించటానికి ఒక బలిపీఠం తయారు చేసుకో” అని దేవుడు యాకోబుతో చెప్పాడు.
2 కనుక యాకోబు తన కుటుంబం అంతటితో, సేవకులందరితో ఇలా చెప్పాడు: “మీ దగ్గర ఉన్న చెక్క, లోహములతో చేయబడిన ఆ తప్పుడు దేవతలన్నిటిని నాశనం చేయండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. శుభ్రమైన వస్త్రాలను ధరించండి. 3 మనం యిక్కడ్నుండి బేతేలుకు వెళ్లిపోవాలి. ఆ స్థలంలో నాకు కష్టం కలిగినప్పుడు సహాయం చేసినటువంటి దేవునికి బలిపీఠం కట్టాను. ఆ దేవుడే నేను వెళ్లిన ప్రతి చోటా నాతో ఉన్నాడు.”
4 కనుక ప్రజలు వారి దగ్గర ఉన్న అసత్య దేవతలన్నిటిని యాకోబుకు ఇచ్చివేశారు. వారంతా వారి చెవులకు ధరించిన నగలను యాకోబుకు ఇచ్చివేశారు. షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం క్రింద యాకోబు వీటన్నిటిని పాతి పెట్టాడు.
5 యాకోబు, అతని కుమారులు ఆ స్థలం విడిచి వెళ్లిపోయారు. ఆ ఊరి ప్రజలు వీరిని వెంబడించి, చంపాలనుకొన్నారు. అయినా వారు చాలా భయపడి,[a] యాకోబును వెంబడించలేదు. 6 కనుక యాకోబు, అతని వాళ్లంతా లూజు వెళ్లారు. లూజు ఇప్పుడు బేతేలు అని పిలువబడుతోంది. అది కనాను దేశంలో ఉంది. 7 అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి ఏల్ బేతేలు అని యాకోబు పేరు పెట్టాడు. అతడు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు మొట్టమొదటి సారిగా అక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమైన కారణంగా యాకోబు ఈ పేరును నిర్ణయించాడు.
8 రిబ్కా దాది దెబోరా అక్కడే చనిపోయింది. బేతేలులో సింధూర వృక్షం క్రింద ఆమెను వారు పాతిపెట్టారు. ఆ స్థలానికి అల్లోను బాకూత్ అని వారు పేరు పెట్టారు.
యాకోబు క్రొత్త పేరు
9 పద్దనరాము నుండి యాకోబు తిరిగి వస్తుండగా, దేవుడు మరల అతనికి ప్రత్యక్షమయి, యాకోబును యిలా ఆశీర్వదించాడు. 10 “నీ పేరు యాకోబు. కాని, ఆ పేరును నేను మార్చేస్తాను. ఇప్పుడు నీవు యాకోబు అని పిలువబడవు. నీ క్రొత్త పేరు ‘ఇశ్రాయేలు’ అని ఉంటుంది.” కాబట్టి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
11 అతనితో దేవుడన్నాడు: “నేను సర్వశక్తిమంతుడనైన దేవుణ్ణి. కనుక నీకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను: నీకు చాలా సంతోషం కలిగి, ఒక గొప్ప జనాంగంగా పెరుగుదువు! మరిన్ని జనాంగాలు, మరికొందరు రాజులు నీలో నుండి ఉద్భవిస్తారు. 12 అబ్రాహాము, ఇస్సాకులకు ఒక ప్రత్యేక దేశం నేనిచ్చాను. ఇప్పుడు ఆ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. పైగా నీ తర్వాత జీవించే నీ ప్రజలందరికీ ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను.” 13 అంతలో దేవుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు. 14-15 ఈ స్థలంలో ఒక స్మారక శిల[b] యాకోబు నిలబెట్టాడు. ద్రాక్షారసం, తైలం పోసి ఆ బండను పవిత్రం చేశాడు యాకోబు. ఆ స్థలంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు గనుక ఇది ఒక ప్రత్యేక స్థలం. యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు.
రాహేలు ప్రసవిస్తూ చనిపోవుట
16 యాకోబు, అతని వాళ్లు బేతేలు నుండి ప్రయాణమయ్యారు. ఇంక వారు ఎఫ్రాతా (బెత్లెహేం) చేరుతారనగా, రాహేలుకు ప్రసవ వేదన ప్రారంభమయింది. 17 అయితే ఈ కాన్పులో రాహేలు చాలా కష్టపడుతోంది. ఆమె విపరీతంగా బాధపడుతోంది. రాహేలు పనిమనిషి ఇది చూసి, “రాహేలూ, భయపడకు. నీవు మరో కుమారుణ్ణి కంటున్నావు” అని చెప్పింది.
18 కుమారుని కంటుండగా రాహేలు చనిపోయింది. చనిపోక ముందు ఆ పిల్లవాడికి బెనోని[c] అని ఆమె పేరు పెట్టింది. అయితే యాకోబు అతనికి బెన్యామీను[d] అని పేరు పెట్టాడు.
19 ఎఫ్రాతా మార్గంలో రాహేలు సమాధి చేయబడింది (ఎఫ్రాతా అంటే బెత్లెహేం). 20 రాహేలు గౌరవార్థం, ఆమె సమాధి మీద యాకోబు ఒక ప్రత్యేక బండను ఉంచాడు. ఆ ప్రత్యేక బండ నేటికీ అక్కడ ఉంది.
పరస్పరం ప్రేమతో ఉండండి
11 “పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని మీరు మొదటినుండి విన్నారు. 12 సాతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను తన సోదరుణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్గుడు.
13 ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. 14 మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాము కనుక మరణంనుండి బ్రతికింపబడ్డాము. ఈ విషయం మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. 15 సోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకునితో సమానము. అలాంటివానికి నిత్యజీవం లభించదని మీకు తెలుసు.
16 యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము. 17 ఒకని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి. కాని, అతడు తన సోదరునికి అవసరాలు ఉన్నాయని తెలిసి కూడా దయ చూపకుండా ఉంటే అతని పట్ల దేవుని దయ ఎందుకు ఉంటుంది? 18 బిడ్డలారా! మనం మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మన ప్రేమను వెల్లడి చేద్దాం.
లాజరు మరణము
11 బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, ఆమె సోదరి మార్త కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళు. 2 ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు. 3 ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమిస్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త యేసుకు పంపారు.
4 యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కలుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు. 5 యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది. 6 లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి, 7 ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు.
8 వాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా?” అని అడిగారు.
9 యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు. 10 రాత్రి వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రిందపడతాడు” అని అన్నాడు.
11 ఈ విషయాలు చెప్పాక యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను.”
12 ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు. 13 యేసు మాట్లాడింది అతని చావును గురించి. కాని ఆయన శిష్యులు ఆయన సహజమైన నిద్రను గురించి మాట్లాడుతున్నాడనుకున్నారు.
14 అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. 15 నేనక్కడ లేనిది మంచిదైంది. మీ కోసమే అలా జరిగింది. మీరు నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం” అని అన్నాడు.
16 దిదుమ అని పిలువబడే తోమా, మిగతా శిష్యులతో, “యేసుతో కలిసి చనిపోవటానికి మనం కూడా ఆయన వెంట వెళ్దాం” అని అన్నాడు.
© 1997 Bible League International