Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 105

105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
    ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
    ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
    సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
    ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
    దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
యెహోవా మన దేవుడు.
    యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు.[a]
దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి.
    వెయ్యి తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు.
    ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
    ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.”
    అని దేవుడు చెప్పాడు.
12 అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు.
    మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే.
13 దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి
    వారు ప్రయాణం చేసారు.
14 కాని యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు.
    వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు.
15 “నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు.
    నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు.
16 దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు.
    ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు.
17 అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు.
    యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు.
18 యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు.
    అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు.
19 యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు
    అతడు (యోసేపు) బానిసగా చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది.
20 కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు.
    అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు.
21 అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు.
    రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు.
22 యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు.
    పెద్ద మనుష్యులకు యోసేపు నేర్పించాడు.
23 తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు.
    యాకోబు హాము దేశంలో[b] నివసించాడు.
24 యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది.
    వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు.
25 కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు.
    ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు.
26 కనుక దేవుడు తన సేవకుడైన మోషేను,
    తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు.
27 హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి
    దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు.
28 దేవుడు కటిక చీకటిని పంపించాడు.
    కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు.
29 కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు.
    వాళ్ల చేపలన్నీ చచ్చాయి.
30 ఆ దేశం కప్పలతో నింపివేయబడింది.
    రాజు గదులలోకి కూడ కప్పలు వచ్చాయి.
31 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు,
    దోమలు వచ్చాయి.
    అన్నిచోట్లా అవే ఉన్నాయి.
32 దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు.
    ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి.
33 ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు.
    వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు.
34 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు వచ్చాయి.
    అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి.
35 మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి.
    నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి.
36 అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్ని దేవుడు చంపేశాడు.
    వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు.
37 అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు.
    వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు.
    దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
38 దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది.
    ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
39 దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు.
    రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
40 ప్రజలు మాంసం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు.
    దేవుడు వారికి ఆకాశం నుండి సమృద్ధిగా ఆహారాన్ని యిచ్చాడు.
41 దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ వచ్చాయి.
    ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.

42 దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు.
    దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
43 దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
    ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు.
    ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
    వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.

యెహోవాను స్తుతించండి.

ఆదికాండము 32:3-21

యాకోబు అన్న ఏశావు శేయీరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇది ఎదోం పర్వత ప్రాంతం. యాకోబు ఏశావు దగ్గరకు వార్తాహరులను పంపాడు. “ఏశావుకు ఇలా చెప్పండి” అని వార్తాహరులతో చెప్పాడు యాకోబు: “‘మీ సేవకుడైన యాకోబు, నా యజమాని ఏశావుకు చెప్పేదేమిటంటే, ఇన్ని సంవత్సరాలు నేను లాబానుతో నివసించాను. పశువులు, గాడిదలు, మందలు, అనేక మంది సేవకులు, దాసీలు నాకు ఉన్నారు. అవన్నీ నేను నీకు పంపిస్తున్నాను. నీవు మమ్మల్ని చేర్చుకోవాలని మనవి.’”

వార్తాహరులు తిరిగి వచ్చి, “నీ అన్న ఏశావును కలుసుకొనేందుకు మేము వెళ్లాం. నిన్ను కలుసుకొనేందుకు అతడు వస్తున్నాడు. అతనితో 400 మంది మనుష్యులు ఉన్నారు” అని యాకోబుతో చెప్పారు.

ఆ వార్త యాకోబుకు భయం కలిగించింది. తనతో ఉన్న మనుష్యులందరినీ అతడు రెండు గుంపులుగా విభజించాడు. మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. “ఏశావు వచ్చి ఒక గుంపును హతమార్చినా, మరో గుంపు పారిపోయి తప్పించుకోవచ్చు” అనుకున్నాడు యాకోబు.

యాకోబు ఇలా అన్నాడు “నా తండ్రి అబ్రాహాము దేవా! నా తండ్రి ఇస్సాకు దేవా! ఓ యెహోవా, నన్ను మళ్లీ నా కుటుంబం దగ్గరకు, నా స్వదేశానికి నీవే వచ్చేయమన్నావు. నీవు నాకు మేలు చేస్తానన్నావు. 10 నా యెడల నీవు ఎంతో దయ చూపించావు. నాకు ఎన్నో మేళ్లు చేశావు. మొదటిసారి నేను యోర్దాను దాటినప్పుడు, నా చేతి కర్ర తప్ప యింకేమీ నా స్వంతం లేదు. ఇప్పుడు రెండు గుంపులకు సరిపడినంత నాకు ఉన్నది. 11 దయచేసి నా అన్న ఏశావు నుంచి నన్ను కాపాడు. నాకు అతడంటే భయంగా ఉంది. అతడు వచ్చి మమ్మల్ని అందరిని, చివరికి తల్లులను, పిల్లలను కూడ చంపేస్తాడని భయంగా ఉంది. 12 ‘నేను నీతో మంచిగా ఉంటాను. నేను నీ కుటుంబాన్ని వర్ధిల్లచేసి, నీ పిల్లల్ని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తాను. లెక్కింప జాలనంత విస్తారంగా వారుంటారు’ అని నీవు నాతో అన్నావు గదా ప్రభూ!”

13 యాకోబు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. ఏశావుకు కానుకలుగా ఇచ్చేందుకు కొన్ని వస్తువులను యాకోబు సిద్ధం చేశాడు. 14 యాకోబు 200 ఆడ మేకలను, 20 మేకపోతులను, 200 ఆడ గొర్రెలను, 20 పొట్టేళ్లను తీసుకొన్నాడు. 15 30 ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఎద్దులను, 20 ఆడ గాడిదలను, 10 మగ గాడిదలను యాకోబు తీసుకొన్నాడు. 16 “ఒక్కొక్క రకం జంతువుల మందను యాకోబు తన సేవకులకు అప్పగించాడు. అప్పుడు యాకోబు తన సేవకులతో ఒక్కో రకం జంతువుల మందను వేరు చేయండి నాకు ముందుగా నడుస్తూ, ఒక్కో మందకు మధ్య ఎడం ఉంచండి” అన్నాడు. 17 యాకోబు వారికి ఇవ్వవలసిన ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. మొదటి మంద వెంబడి ఉన్న సేవకునితో యాకోబు “నా అన్న ఏశావు నీ దగ్గరకు వచ్చి, ‘ఇవి ఎవరి జంతువులు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నీవు ఎవరి సేవకుడువి?’ అని అడిగితే, 18 ‘ఇవి నీ సేవకుడైన యాకోబు మందలు. నా యజమాని ఏశావుకు కానుకగా యాకోబు వీటిని పంపించాడు. యాకోబు కూడా మా వెనుక వస్తున్నాడు’ అని నీవు చెప్పాలి” అన్నాడు.

19 అందరూ అలాగే చేయాలి అని రెండవ సేవకునికి, మూడవ సేవకునికి, మిగిలిన సేవకులందరికి యాకోబు ఆజ్ఞాపించాడు. “ఏశావును మీరు కలుసుకొన్నప్పుడు, ఏశావుకు మీరు ఇలానే చేయాలి. 20 ‘ఇది నీ కోసం కానుక, నీ సేవకుడైన యాకోబు వెనుక ఉన్నాడు’ అని మీరు చెప్పాలి” అన్నాడు యాకోబు.

“ఈ కానుకలు ఇచ్చి వీళ్లను ముందు పంపిస్తే, ఒకవేళ ఏశావు నన్ను క్షమించి చేర్చుకొంటాడేమో” అనుకొన్నాడు యాకోబు. 21 కనుక యాకోబు ఏశావుకు కానుకలు పంపించాడు. అయితే యాకోబు మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే వుండిపోయాడు.

1 యోహాను 2:18-29

క్రీస్తు విరోధుల విషయంలో జాగ్రత్త

18 బిడ్డలారా! ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి రానున్నాడని మీరు విన్నారు. ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలా మంది వచ్చారు. తద్వారా యిది చివరి గడియ అని తెలిసింది. 19 క్రీస్తు విరోధులు మననుండి విడిపొయ్యారు. నిజానికి, వాళ్ళు మనవాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళైనట్లయితే మనతోనే ఉండిపొయ్యేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళలో ఎవ్వరూ మనవాళ్ళు కారని తెలుపుతోంది.

20 కాని దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. తద్వారా మీరంతా సత్యాన్ని గురించి తెలుసుకొన్నారు. 21 మీకు సత్యాన్ని గురించి తెలియదని భావించి నేను మీకు వ్రాస్తున్నాననుకోకండి. సత్యాన్ని గురించి మీకు తెలుసు. పైగా సత్యంనుండి అసత్యం బయటకు రాదు.

22 అసత్యమాడేవాడెవ్వడు? యేసే క్రీస్తు కాదని అనేవాడు. అతడే క్రీస్తు విరోధి. అలాంటి వ్యక్తి తండ్రిని, కుమారుణ్ణి నిరాకరిస్తాడు. 23 కుమారుణ్ణి నిరాకరించే వ్యక్తికి తండ్రి రక్షణ ఉండదు. కుమారుణ్ణి అంగీకరించే వ్యక్తికి తండ్రి రక్షణ తోడుగా ఉంటుంది.

24 మొదట మీరు విన్నవి మీలో ఉండిపోయేటట్లు చూసుకోండి. అప్పుడే మీరు కుమారునిలో, తండ్రిలో జీవించగలుగుతారు. 25 పైగా ఆయన మనకు నిత్యజీవం గురించి వాగ్దానం చేసాడు.

26 ఇవన్నీ మిమ్మల్ని తప్పుదారి పట్టించటానికి ప్రయత్నం చేస్తున్నవాళ్ళను గురించి వ్రాస్తున్నాను. 27 ఇక మీ విషయం అంటారా? దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. దానివల్ల కలిగిన ఫలం మీలో ఉంది. మీకెవ్వరూ బోధించవలసిన అవసరం లేదు. ఆ అభిషేకం వల్ల మీలో జ్ఞానం కలుగుతుంది. దేవుడు మీకు నిజంగా అభిషేకమిచ్చాడు. అది అసత్యం కాదు. ఆయన బోధించిన విధంగా ఆయనలో నివసించండి.

28 బిడ్డలారా! ఆయన ప్రత్యక్ష్యమైనప్పుడు మనలో ధైర్యం ఉండేటట్లు, ఆయన సమక్షంలో సిగ్గు పడకుండా ఉండేటట్లు ఆయనలో జీవిస్తూ ఉండండి. 29 ఆయన నీతిమంతుడని మీకు తెలిసి ఉంటే నీతిని అనుసరించే ప్రతి ఒక్కడూ ఆయననుండి జన్మించాడని మీరు గ్రహిస్తారు.

యోహాను 10:19-30

19 ఈ మాటల వల్ల యూదుల్లో తిరిగి చీలికలు వచ్చాయి. 20 చాలా మంది, “దయ్యం పట్టి అతనికి బాగా పిచ్చెక్కింది. అతని మాటలెందుకు వినటం?” అని అన్నారు.

21 కాని మరికొందరు, “అవి దయ్యం పట్టినవాని మాటలు కావు. దయ్యం గ్రుడ్డి వాళ్ళకు ఎట్లా దృష్టిని కలిగించగలదు?” అని అన్నారు.

యూదులు విశ్వసించకపోవటం

22 ఆలయ ప్రతిష్టిత అనే పండుగ యెరూషలేములో జరుగుతూంది. 23 అది చలికాలం. యేసు మందిరావరణంలో సొలొమోను మంటపం దగ్గర నడుస్తూవున్నాడు. యూదులు ఆయన చుట్టూ గుమికూడారు. 24 వాళ్ళు, “నీవు మమ్మల్ని ఎంతకాలం సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువయినట్లైతే దాచకుండా చెప్పు” అని అన్నారు.

25 యేసు, “ఆ విషయం నేను ఇది వరకే చెప్పాను. కాని మీరు నమ్మటం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న అద్భుతాలే నేను ఎవరన్న దానికి రుజువు. 26 కాని మీరు నా మందకు చెందిన వాళ్ళు కాదు. కాబట్టి నన్ను విశ్వసించటం లేదు. 27 నా గొఱ్ఱెలు నా మాట గుర్తిస్తాయి. నాకు వాటిని గురించి తెలుసు. అవి నన్ను అనుసరిస్తాయి. 28 వాటికి నేను అనంత జీవితం యిస్తాను. అవి ఎన్నటికీ మరణించవు. వాటిని నా అండ నుండి ఎవ్వరూ తీసుకొని పోలేరు. 29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరి కన్నా గొప్పవాడు. నా తండ్రి అండనుండి వాటిని ఎవ్వరూ తీసుకొని పోలేరు. 30 నేను, నా తండ్రి ఒకటే!” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International