Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 101

దావీదు కీర్తన.

101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
    యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
నా యెదుట ఏ విగ్రహాలు[a] ఉంచుకోను.
    అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
    నేను అలా చేయను!
నేను నిజాయితీగా ఉంటాను.
    నేను దుర్మార్గపు పనులు చేయను.
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
    అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
    అతిశయించడం నేను జరుగనివ్వను.

నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
    ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
    యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
    అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
    దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.

కీర్తనలు. 109:1-30

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

109 దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు.
దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబుతున్నారు.
ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబుతున్నారు.
    ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు.
నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను.
    కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు.
నేను వారిని ప్రేమించాను.
    కాని వారు నన్ను ద్వేషించారు.

నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము.
    వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము.
నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము.
    నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము.
నా శత్రువును త్వరగా చావనిమ్ము.
    నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక!
నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక!
10 వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక!
11 నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము.
    అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము.
12 నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
    అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
13 నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము.
    తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.
14 నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను
    యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
15 ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
    ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ.
16 ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు.
    అతడు ఎన్నడూ ఎవరిని ప్రేమించలేదు.
    అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టతరం చేసాడు.
17 ప్రజలకు సంభవించే చెడు సంగతులు, శాపము చూడటానికి ఆ దుర్మార్గునికి ఎంతో ఇష్టం.
    కనుక ఆ చెడు సంగతులు అతనికే సంభవించనిమ్ము.
ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు.
    కనుక అతనికి మంచి సంగతులేవీ జరుగనివ్వకుము.
18 శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము.
దుర్మార్గులు త్రాగేందుకు శాపాలే నీళ్లుగా ఉండనిమ్ము
    శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము.
19 శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము.
    శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము.

20 నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నన్ను చంపాలని చూస్తున్న మనుష్యులందరికీ వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
21 యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు.
    నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని,
    నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
23 దినాంతంలో దీర్ఘ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది.
    ఎవరో నలిపివేసిన నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి.
    నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
25 చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు.
    వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము!
    నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
27 అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు.
    వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము.
    అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము!
    వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.

కీర్తనలు. 119:121-144

అయిన్

121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
    నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
    యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
    కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
125 నేను నీ సేవకుడను
    నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
    ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
127 యెహోవా, నీ ఆజ్ఞలు
    మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
    తప్పుడు బోధలు నాకు అసహ్యం.

పే

129 యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం,
    అందుకే నేను దానిని అనుసరిస్తాను.
130 ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది.
    నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది.
131 యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను.
    నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను.
132 దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము.
    నీ నామమును ప్రేమించే వారికి సరియైనవి ఏవో వాటిని చేయుము.
133 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము.
    నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు.
134 యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము.
    నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
135 యెహోవా, నీ సేవకుని అంగీకరించి
    నీ న్యాయచట్టాలు నేర్పించుము.[a]
136 ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల
    నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను.

సాదె

137 యెహోవా, నీవు మంచివాడవు.
    నీ చట్టాలు న్యాయమైనవి.
138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
    యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
    ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
    అదంటే నాకు ప్రేమ.
141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు.
    కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
    నీ ఉపదేశాలు నమ్మదగినవి.
143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
    కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
    నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.

ఆదికాండము 31:25-50

దొంగిలించిన దేవుళ్ల కోసం వెదకుట

25 మర్నాడు ఉదయాన్నే యాకోబును లాబాను పట్టుకొన్నాడు. కొండమీద యాకోబు గుడారం వేసుకొన్నాడు. కనుక లాబాను, అతని మనుష్యులంతా గిలాదు కొండమీద గుడారాలు వేసుకొన్నారు.

26 యాకోబుతో లాబాను అన్నాడు: “నీవెందుకు నన్ను మోసం చేశావు? యుద్ధంలో చెరపట్టిన స్త్రీలవలె నా కూతుళ్లను ఎందుకు తీసుకు పోతున్నావు? 27 నాకు చెప్పకుండా నీవెందుకు పారిపోతున్నావు? నీవు నాతో చెప్పి ఉంటే నీకు నేను విందు చేసేవాణ్ణి. వాయిద్యాలతో సంగీతం, నాట్యం ఉండేవి. 28 కనీసం నా మనవళ్లను, మనవరాళ్లను ముద్దు పెట్టుకోనివ్వలేదు, నా కూతుళ్లకు వీడ్కోలు చెప్పనివ్వలేదు. నీవు ఇలా చేయటం చాలా బుద్ధి తక్కువ పని. 29 నిజంగా నిన్ను బాధించగల శక్తి నాకు ఉంది. అయితే గత రాత్రి నీ తండ్రి దేవుడు నాకు దర్శనం యిచ్చాడు. ఏ విధంగా కూడ నిన్ను బాధ పెట్టవద్దని ఆయన నన్ను హెచ్చరించాడు. 30 నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లిపోవాలన్న ఆశ నీకు ఉన్నట్లు నాకు తెలుసు. అందుకే నీవు బయల్దేరావు. కాని నా యింటి దేవతలను ఎందుకు దొంగిలించావు?”

31 యాకోబు ఇలా జవాబిచ్చాడు: “భయం చేత నీకు చెప్పకుండా బయల్దేరాను. నీ కుమార్తెలను నా దగ్గర్నుండి నీవు తీసుకొంటావేమో అనుకొన్నాను. 32 అంతేగాని నీ విగ్రహాలను మాత్రం నేను దొంగిలించలేదు. ఇక్కడ నాతో ఉన్నవాళ్లలో ఎవరి దగ్గరయినా నీ విగ్రహాలు దొరికితే, అలాంటి వ్యక్తి చంపివేయబడుగాక. నీ మనుష్యులే నాకు సాక్షులు. నీకు చెందినది ఏదైనా ఉందేమో నీవు వెదకవచ్చు. ఏదైనా సరే నీదైతే దాన్ని తీసుకో” లాబాను దేవుళ్లను రాహేలు దొంగిలించినట్లు యాకోబుకు తెలియదు.

33 కనుక లాబాను వెళ్లి యాకోబు గుడారాల్లో వెదికాడు. యాకోబు గుడారంలోను, తర్వాత లేయా గుడారంలోను అతడు వెదికాడు. ఆ తర్వాత బానిస స్త్రీలు ఇద్దరూ ఉంటున్న గుడారంలో అతడు వెదికాడు. కాని అతని నివాసంలో దేవుళ్లు కనబడలేదు. అప్పుడు లాబాను రాహేలు గుడారంలోకి వెళ్లాడు. 34 రాహేలు తన ఒంటె సామగ్రిలో ఆ దేవుళ్లను దాచిపెట్టి, వాటి మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, కాని ఆ విగ్రహాలు అతనికి దొరకలేదు.

35 “నాయనా, నా మీద కోపగించకు. నీ యెదుట నేను నిలబడలేక పోతున్నాను. నేను ఋతు క్రమంలో ఉన్నాను” అని రాహేలు తన తండ్రితో చెప్పింది. కనుక లాబాను ఆ బస అంతటా వెదికాడు, కాని తన ఇంటి దేవుళ్లు అతనికి కనబడలేదు.

36 అప్పుడు యాకోబుకు చాలా కోపం వచ్చింది. యాకోబు అన్నాడు: “నేనేం తప్పు చేశాను? ఏ ఆజ్ఞను నేను ఉల్లంఘించాను? నన్ను వెంటాడే హక్కు నీకెక్కడిది? 37 నా ఆస్తి అంతా నీవు వెదికావు. నీకు చెందినది ఏమీ నీకు దొరకలేదు. నీకేమైనా దొరికి ఉంటే దాన్ని నాకు చూపించు. మన మనుష్యులకు కనబడేటట్లు దాన్ని ఇక్కడ పెట్టు. మనలో ఎవరిది సరిగా ఉందో మనవాళ్లే నిర్ణయిస్తారు. 38 ఇరవై సంవత్సరాలు నీ కోసం నేను పని చేశాను. ఆ కాలమంతటిలో గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని ఒక్కటి కూడా పుట్టుకలో చావలేదు. నీ మందలోని పొట్టేళ్లలో ఒక్కటి కూడా నేను తినలేదు. 39 ఎప్పుడైనా సరే, అడవి మృగాలు గొర్రెల్ని చంపితే, ఆ విలువ నేనే చెల్లించాను. చచ్చిన జంతువును ఎప్పుడూ నీకు చూపెట్టి, ఇది నా తప్పు కాదు అని నేను చెప్పలేదు. అయినా సరే, రాత్రింబవళ్లు నీ మందల్ని కాపలా కాచాను. 40 పగలు ఎండకు నా బలం క్షీణించింది. రాత్రి చలి మూలంగా నా కన్నులకు నిద్ర దూరమయింది. 41 20 సంవత్సరాలు ఒక బానిసలా నేను నీకు పని చేశాను. నీ కుమార్తెలను సంపాదించుకోవటానికి మొదట 14 సంవత్సరాలు నేను నీకు పని చేశాను. తర్వాత ఆరు సంవత్సరాలు నీ జంతువుల్ని సంపాదించటంకోసం పని చేశాను. ఆ కాలంలో నా జీతాన్ని నీవు పదిసార్లు మార్చావు. 42 అయితే నా పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే గనుక నాకు తోడుగా లేకపోతే, నీను నన్ను వట్టి చేతులతో పంపి ఉండేవాడివి. కాని నా కష్టాలను దేవుడు చూశాడు. నేను చేసిన పనిని దేవుడు చూశాడు. నాదే సరి అని గతరాత్రి దేవుడు రుజువు చేశాడు.”

యాకోబు, లాబాను సంధి

43 యాకోబుతో లాబాను చెప్పాడు: “ఈ అమ్మాయిలు నా కుమార్తెలు. వారి పిల్లలు నాకు చెందినవాళ్లు. ఈ జంతువులన్నీ నావే. ఇక్కడ నీకు కనబడుతోన్న సమస్తం నాదే. అయినప్పటికీ నా కుమార్తెలను, వారి పిల్లలను నా దగ్గర ఉంచుకొనేందుకు నేను చేయగలిగింది ఏమీ లేదు. 44 కనుక నీతో ఒడంబడిక చేసుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మనకు ఒడంబడిక ఒకటి కుదిరిందని సూచించేందుకు మనం ఇక్కడ ఒక రాళ్ల కుప్ప వేద్దాం.”

45 కనుక యాకోబు ఒక పెద్ద బండను తెచ్చాడు, అతడు ఒక ఒడంబడిక చేసుకొన్నట్లు సూచనగా దాన్ని నిలువబెట్టాడు. 46 మరికొన్ని రాళ్లు తెచ్చి కుప్పగా వేయమని అతడు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు ఆ రాళ్ల కుప్ప ప్రక్కన వాళ్లు భోజనం చేశారు. 47 ఆ స్థలానికి యగర్ శాహదూత[a] అని లాబాను పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు[b] అని పేరు పెట్టాడు.

48 “మనం ఇద్దరం మన ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప సహాయపడుతుంది” అన్నాడు లాబాను యాకోబుతో. అందుకే ఆ స్థలానికి గలేదు అని యాకోబు పేరు పెట్టాడు.

49 అప్పుడు లాబాను, “మనం ఒకరినుండి ఒకరం విడిపోయేటప్పుడు యెహోవా మనల్ని కాపాడును గాక!” అన్నాడు. కనుక ఆ స్థలానికి మిస్పా అని కూడ పేరు.

50 అప్పుడు లాబాను అన్నాడు, “నా కుమార్తెలను నీవు బాధిస్తే, దేవుడు నిన్ను శిక్షిస్తాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొంటే దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు.

1 యోహాను 2:12-17

12 బిడ్డలారా! ఆయన పేరిట మీ పాపాలు క్షమించబడ్డాయి.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
13 వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాడెవరో మీకు తెలుసు!
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీరు సాతాన్ను గెలిచారు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
14 బిడ్డలారా! తండ్రిని మీరెరుగుదురు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను.
వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాణ్ణి మీరెరుగుదురు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీలో బలం ఉంది.
    దేవుని సందేశం మీలో జీవిస్తోంది.
మీరు సాతానును గెలిచారు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను.

15 ప్రపంచాన్ని కాని, ప్రపంచంలో ఉన్నవాటిని కాని ప్రేమించకండి. అంటే, ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదన్నమాట. 16 శారీరక వాంఛలు, కళ్ళలోని దురాశలు, ఒకడు చేసేదాన్ని బట్టి, కలిగియున్న దాన్ని బట్టి కలిగే గర్వం తండ్రికి సంబంధించినవి కావు. ఇవి ప్రపంచానికి సంబంధించినవి. 17 ఈ ప్రపంచము, దానిలో ఉన్న ఆశలు నశించిపోతాయి. కాని దైవేచ్ఛానుసారం జీవించే వ్యక్తి శాశ్వతంగా జీవిస్తాడు.

యోహాను 10:1-18

గొఱ్ఱెలకాపరి, తన గొఱ్ఱెలు

10 యేసు, “ఇది నిజం. గొఱ్ఱెల దొడ్డిలోకి తలుపు ద్వారా వెళ్ళకుండా గోడనెక్కి వెళ్ళేవాడు దొంగ, దోపిడిగాడు. తలుపు ద్వారా ప్రవేశించేవాడు ఆ గొఱ్ఱెలకు కాపరి. ద్వారపాలకుడు అతని కోసం తలుపు తెరుస్తాడు. గొఱ్ఱెలు అతని స్వరము గుర్తిస్తాయి. ఆ గొఱ్ఱెలు అతనివి. అతడు ఆ గొఱ్ఱెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకొని వెళ్తాడు. తన గఱ్ఱెల్ని వెలుపలికి పిలుచుకొని వచ్చాక అతడు ముందు నడుస్తాడు. వాటికి అతని స్వరం తెలుసు కనుక అవి అతణ్ణి అనుసరిస్తాయి. అవి క్రొత్త వాని వెంట వెళ్ళవు. క్రొత్త వాని స్వరం గుర్తుపట్టలేవు. కనుక పారిపోతాయి.” అని అన్నాడు.

యేసు ఈ ఉపమానం ఉపయోగించి బోధించాడు. కాని వాళ్ళకు ఆయనేమి చెబుతున్నాడో అర్థం కాలేదు.

యేసు మంచి కాపారి

అందువల్ల యేసు మళ్ళీ ఈవిధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “నిజంగా నేను గొఱ్ఱెలకు ద్వారాన్ని. నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు దొంగలు, దోపిడిగాళ్ళు. కనుక గొఱ్ఱెలు వాళ్ళ మాటలు వినలేదు. నేను ద్వారాన్ని. నా ద్వారా ప్రవేశించిన వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు స్వేచ్ఛతో లోపలికి వస్తూ పోతూ ఉంటారు. ఆ గొఱ్ఱెలకు పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి. 10 దొంగ దొంగతనం చేయటానికి, చంపటానికి, నాశనం చేయటానికి వస్తాడు. నేను వాళ్ళకు క్రొత్త జీవితం ఇవ్వాలని వచ్చాను. ఆ క్రొత్త జీవితం సంపూర్ణమైనది.

11 “మంచి కాపరి గొఱ్ఱెల కోసం చావటానికి కూడా సిద్ధమౌతాడు. నేను ఆ మంచి కాపరిని. 12 కూలి కోసం పనిచేసే వాడు కాపరికాడు. గొఱ్ఱెలు అతనివి కావు. కనుక అతడు తోడేళ్ళు రావటం చూస్తే గొఱ్ఱెల్ని వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేళ్ళు వచ్చి మంద మీద పడి వాటిని చెదరగొడతాయి. 13 అతడు కూలి కొరకు పని చేసేవాడు కాబట్టి గొఱ్ఱెల క్షేమం చూడడు.

14-15 “నేను మంచి కాపరిని. నా తండ్రికి నన్ను గురించి, నాకు నా తండ్రిని గురించి తెలుసు. అదే విధంగా నాకు నా గొఱ్ఱెల్ని గురించి, నా గొఱ్ఱెలకు నా గురించి తెలుసు. నా గొఱ్ఱెల కోసం నేను ప్రాణం ఇస్తాను. 16 ఈ మందకు చెందని గొఱ్ఱెలు కొన్ని ఉన్నాయి. అవికూడా నావే. వాటిని కూడా నేను తీసుకొని రావాలి. అవి నా మాట వింటాయి. అప్పుడు అన్నీ ఒకే మందగా ఉంటాయి. ఒకే ఒక కాపరి ఉంటాడు. 17 నేను నా ప్రాణం యివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని తిరిగి పొందడానికి శక్తిమంతుడను. కనుకనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. 18 నా ప్రాణాన్ని నానుండి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్వయంగా నా ప్రాణం యిస్తాను. నా ప్రాణం యివ్వటానికి, తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. అది నా తండ్రి ఆజ్ఞ.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International