Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 66-67

సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.

66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
    స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
    దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
    నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
    అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
    ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
    అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
    సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
    ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
    భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
    అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
    కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
    నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15     నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
    నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
    నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.

16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
    దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
    నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
    కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
    దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
    దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
    దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!

సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.

67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
    దయచేసి మమ్ములను స్వీకరించుము.

దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
    నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
    ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
    మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
    మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
దేవుడు మమ్మల్ని దీవించుగాక.
    భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.

కీర్తనలు. 19

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
    యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
    ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
    మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
    వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.

అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
    తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
    ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
    మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
    దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.

యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
    అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
    జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
యెహోవా చట్టాలు సరియైనవి.
    అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
    ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.

యెహోవాను ఆరాధించుట మంచిది.
    అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
    అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
    సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
    నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.

12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
    కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
    ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.

కీర్తనలు. 46

సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.

46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
    ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
అందుచేత భూమి కంపించినప్పుడు,
    మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
    భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.

ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
    మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
    సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
రాజ్యాలు భయంతో వణకుతాయి.
    యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
    ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
    సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.

10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
    రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
    భూమిమీద మహిమపర్చబడతాను.”

11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

ఆదికాండము 29:20-35

20 కనుక యాకోబు అక్కడే ఉండి, రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయితే అతడు రాహేలును అధికంగా ప్రేమించాడు గనుక అది అతనికి చాలా కొద్ది కాలంలాగే కనబడింది.

21 ఏడు సంవత్సరాలు అయ్యాక, “రాహేలును నాకు యివ్వండి, పెళ్లి చేసుకొంటాను. నీ దగ్గర నేను పని చేయాల్సిన కాలం తీరిపోయింది” అని యాకోబు లాబానుతో చెప్పాడు.

22 కనుక ఆ ప్రదేశంలోని ప్రజలందరికి లాబాను విందు ఇచ్చాడు. 23 ఆ రాత్రి లాబాను తన కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు తీసుకు వచ్చాడు. యాకోబు లేయాలు లైంగికంగా కలుసుకొన్నారు. 24 తన దాసి జిల్ఫాను తన కుమార్తెకు దాసీగా లాబాను ఇచ్చాడు. 25 తాను సంభోగించినది లేయా అని తెల్లవారినప్పుడు యాకోబు తెలుసుకొన్నాడు. లాబానుతో యాకోబు, “నీవు నన్ను మోసం చేశావు. నేను రాహేలును పెళ్లి చేసుకోవాలని నీ దగ్గర కష్టపడి పని చేశాను. ఎందుకు నన్ను నీవు మోసం చేశావు?” అన్నాడు.

26 లాబాను చెప్పాడు: “పెద్ద కూతురికి పెళ్లికాక ముందు చిన్న కూతురికి పెళ్లి చేయటానికి మా దేశంలో ఒప్పుకోరు. 27 అయితే పెళ్లి ఆచారంగా వారం రోజులు ముగించు, రాహేలునుకూడ పెళ్లి చేసుకొనేందుకు ఇస్తాను. కానీ నీవు మాత్రం మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేయాలి.”

28 కనుక యాకోబు అలాగే వారం ముగించాడు. అప్పుడు లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. 29 తన దాసీ బిల్హాను తన కుమార్తె రాహేలుకు దాసీగా ఇచ్చాడు. 30 కనుక యాకోబు రాహేలుతో కూడా సంభోగించాడు. లేయాకంటే రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. లాబాను దగ్గర మరో ఏడు సంవత్సరాలు యాకోబు పని చేశాడు.

యాకోబు కుటుంబం పెరుగుట

31 లేయాకంటె రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించడం యెహోవా చూశాడు. అందుచేత యెహోవా లేయాకు పిల్లలు పుట్టేలాగు చేశాడు. రాహేలుకు పిల్లలు లేరు.

32 లేయాకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె అతనికి రూబేను[a] అని పేరు పెట్టింది. “నా కష్టాలను యెహోవా చూశాడు. నా భర్త నన్ను ప్రేమించటం లేదు. ఒకవేళ నా భర్త ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో” అని లేయా అతనికి ఈ పేరు పెట్టింది.

33 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి షిమ్యోను[b] అని ఆమె పేరు పెట్టింది. “నేను ప్రేమించబడటం లేదని తెలిసి యెహోవా విని, నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చాడు” అని లేయా చెప్పింది.

34 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఆ కుమారునికి ఆమె లేవి[c] అని పేరు పెట్టింది. “ఇప్పుడు నా భర్త నన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. అతనికి ముగ్గురు కుమారుల్ని నేను ఇచ్చాను” అనుకొంది లేయా.

35 అప్పుడు లేయాకు మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి యూదా[d] అని ఆమె పేరు పెట్టింది. “నేను ఇప్పుడు యెహోవాను స్తుతిస్తాను” అని అతనికి ఆ పేరు పెట్టింది లేయా. అంతటితో ఆమెకు సంతాన ప్రాప్తి ఆగిపోయింది.

1 తిమోతికి 3:14-4:10

14 నేను నీ దగ్గరకు త్వరలోనే రావాలనుకొంటున్నాను. అయినా నేనీ ఆజ్ఞల్ని ఎందుకు వ్రాస్తున్నానంటే, 15 ఒకవేళ నేను రావటం ఆలస్యం అయితే ప్రజలు దేవుని కుటుంబంలో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఈ లేఖ ద్వారా నీకు తెలియజేస్తున్నాను. దేవుని సంఘం ఒక స్తంభంలాంటిది. అది సత్యానికి ఆధారమైనది. 16 ఆత్మీయతలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది.

క్రీస్తు మానవ రూపం ఎత్తాడు.
పరిశుద్ధాత్మ వలన ఆయన నిజమైన నిర్దోషిగా నిరూపించబడ్డాడు.
దేవదూతలు ఆయన్ని చూసారు.
రక్షకుడని ఆయన గురించి జనాంగములకు ప్రకటింపబడింది.
ప్రజలు ఆయన్ని విశ్వసించారు.
ఆయన తన మహిమతో పరలోకానికి కొనిపోబడ్డాడు.

దొంగ బోధకులు

చివరిదినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలి మోసగించే దయ్యాల బోధనల్ని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెపుతున్నాడు. దొంగ మాటలు చెప్పేవాళ్ళు దొంగ ఉపదేశాలు చేస్తారు. వాళ్ళ అంతరాత్మలు మొద్దుబారాయి. అలాంటివాళ్ళు వివాహం చేసుకోవటం తప్పని, కొన్ని రకాల ఆహారాలు తినకూడదని బోధిస్తారు. కాని దేవుడు ఆ ఆహారాలు తినటానికే సృష్టించాడు. విశ్వాసులు, సత్యాన్ని తెలుసుకొన్నవాళ్ళు దేవునికి కృతజ్ఞతలర్పించి ఆ ఆహారాల్ని భుజించాలి. దేవుడు తినటానికి సృష్టించినవన్నీ మంచివే కనుక మనం దేన్నీ నిరాకరించకూడదు. అన్నిటినీ దేవునికి కృతజ్ఞతలర్పించి భుజించాలి. అవి దేవుని వాక్యం వల్లను, ప్రార్థన ద్వారాను పవిత్రం చేయబడినాయి.

మంచి సేవకునిగా ఉండుము

నీవీ బోధలు సోదరులకు చెబితే యేసు క్రీస్తు యొక్క మంచి సేవకునిగా పరిగణింపబడతావు. నీవు విశ్వసించిన సత్యాలను, సుబోధలను నీవు అనుసరిస్తున్నావు కనుక నీకు అభివృద్ధి కల్గుతుంది. ఆత్మీయత లేని కాకమ్మ కథలకు, ముసలమ్మ కథలకు దూరంగా ఉండు. భక్తితో ఉండటానికి అభ్యాసం చెయ్యి. శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. దైవభక్తివల్ల ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవితంలోనూ మంచి కల్గుతుంది. కనుక అది అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. ఇది నమ్మదగిన విషయం. సంపూర్ణంగా అంగీకరించదగినది. 10 మానవ జాతి రక్షకుడైన దేవుణ్ణి, ముఖ్యంగా తనను నమ్మినవాళ్ళను రక్షించే సజీవుడైన దేవుణ్ణి మనం విశ్వసించాము. కనుకనే మనము సహనంతో కష్టించి పని చేస్తున్నాము.

మార్కు 10:23-31

23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనమున్నవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం” అని అన్నాడు.

24 శిష్యులు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. యేసు మళ్ళీ, “శిష్యులారా! దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో కష్టం! 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.

26 ఇది విని శిష్యులు యింకా ఎక్కువ ఆశ్చర్యపడ్డారు. అలాగైతే, “ఎవరికి రక్షణ లభిస్తుంది?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు.

27 యేసు వాళ్ళవైపు చూసి, “మానవునికి ఇది అసాధ్యమైన పని కాని, దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.

28 పేతురు ఆయనతో, “మిమ్మల్ని అనుసరించాలని మేము అన్నీ వదిలివేసాము” అని అన్నాడు.

29-30 యేసు, “ఇది నిజం. నా కోసం, సువార్తకోసం, తన యింటినికాని, సోదరులనుకాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లినికాని, తండ్రినికాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని, విడిచినవాడు ఈ తరంలోనే నూరు రెట్లు యిళ్ళను, సోదరులను, అక్క చెల్లెండ్లను, తల్లుల్ని, సంతానాన్ని, పొలాల్ని పొందుతాడు. వీటితో పాటు హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో నిత్యజీవం పొందుతాడు. 31 కాని ముందున్న వాళ్ళు చివరివాళ్ళై, చివర వున్న వాళ్ళు ముందుకు వెళ్తారు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International