Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 88

కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీత నాయకునికి: బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం.

88 యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు.
    రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
దయచేసి నా ప్రార్థనలను గమనించుము.
    కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.
నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను.
    మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.
జీవించుటకు బహు బలహీనుడివలె, చనిపోయిన మనిషివలె
    ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.
మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను.
    నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను.
నీనుండీ, నీ కాపుదలనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను.
    మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.
యెహోవా, నీవు నన్ను భూమి క్రింద సమాధిలో ఉంచావు.
    నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.
నీవు నా మీద కోపగించావు.
    నీవు నన్ను శిక్షించావు.

నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు.
    అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు.
నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.
    నా బాధ అంతటిని గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి.
యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను.
    ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.
10 యెహోవా, చనిపోయినవారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు!
    దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!

11 చనిపోయినవాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు.
    చనిపోయినవారు మృతుల లోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.
12 చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు.
    మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.
13 యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
    ప్రతి వేకువ జామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.
14 యెహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు?
    నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?
15 నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని.
    నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.
16 యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు.
    శిక్ష నన్ను చంపేస్తుంది.
17 నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి.
    నా నొప్పులు, బాధల్లో నేను మునిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
18 మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచిపెట్టివేసేటట్టుగా నీవు చేశావు.
    చీకటి మాత్రమే నాకు మిగిలింది.

కీర్తనలు. 91-92

91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
    సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
“నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
    అని నేను యెహోవాకు చెబుతాను.
దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
    ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
    పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
    దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
    పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
చీకటిలో దాపురించే రోగాలకు గాని
    మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.
నీ ప్రక్కన వేయిమంది,
    నీ కుడి ప్రక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు.
    నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు.
ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా
    నీకు కనబడుతుంది.
ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
    సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
    నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
    దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
    నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
    నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
    నేను వారికి జవాబు ఇస్తాను.
    వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
    నేను వాళ్లను రక్షిస్తాను.”

సబ్బాతుకోసం స్తుతి కీర్తన.

92 యెహోవాను స్తుతించుట మంచిది.
    సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
    రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
    సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
    నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు.
    నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం.
నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు.
    మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.
దుర్మార్గులు గడ్డిలా మొలిచినా,
    చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు.
కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించబడతావు.
యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు.
    చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడతారు.
10 కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు.
    సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు.
11 నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను.
    నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను.

12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
    వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
    వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
    వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
    ఆయనలో అవినీతి లేదు.

ఆదికాండము 27:46-28:4

46 అప్పుడు రిబ్కా ఇస్సాకుతో, “నీ కుమారుడైన ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. వాళ్లు మన ప్రజలు కారు గనుక వారితో నేను చాలా విసిగిపోయాను. యాకోబు కూడా వాళ్లలో ఒక స్త్రీని పెళ్లి చేసుకొంటే, నేను చావటం మంచిది” అని చెప్పింది.

28 ఇస్సాకు యాకోబును పిలిచి ఆశీర్వదించాడు. తర్వాత ఇస్సాకు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇస్సాకు ఇలా చెప్పాడు: “కనాను స్త్రీని మాత్రం నీవు వివాహం చేసుకోగూడదు. కనుక ఈ చోటు విడిచి, పద్దనరాము వెళ్లు. నీ తల్లిరి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. నీ తల్లి సోదరుడు లాబాను అక్కడే నివసిస్తున్నాడు. అతని కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి, అధిక సంతానాన్ని నీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఒక గొప్ప జనాంగానికి నీవు పితరుడవు కావాలని నా ప్రార్థన. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్లే నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదించాలని నా ప్రార్థన. నీవు నివసించే దేశం నీ స్వంతం కావాలని నా ప్రార్థన. ఇది దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశం.”

ఆదికాండము 28:10-22

బేతేలులో యాకోబు కలగనుట

10 యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు. 11 యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా సూర్యాస్తమయం అయింది. అందుచేత ఆ రాత్రి ఉండేందుకు యాకోబు ఒక చోటికి వెళ్లాడు. అక్కడ ఒక బండ కనబడింది. నిద్రపోయేందుకు యాకోబు దానిమీద తలపెట్టి పండుకొన్నాడు. 12 యాకోబుకు ఒక కల వచ్చింది. నేలమీద ఒక నిచ్చెన ఉండి, అది ఆకాశాన్ని అంటుకొన్నట్లు అతనికి కల వచ్చింది. దేవుని దూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుచు, దిగుచు ఉన్నట్లు యాకోబు చూశాడు.

13 అప్పుడు ఆ నిచ్చెన పైన యెహోవా నిలిచినట్లు యాకోబు చూశాడు. యెహోవా చెప్పాడు: “నీ తాత అబ్రాహాము దేవుణ్ణి, యెహోవాను నేను. నేను ఇస్సాకు దేవుణ్ణి. ఇప్పుడు నీవు నిద్రపోతున్న ఈ దేశాన్ని నీకు నేనిస్తాను. నీకు, నీ పిల్లలకు ఈ స్థలం నేనిస్తాను. 14 నేలమీద ధూళి కణముల్లాగ నీకు కూడా ఎంతోమంది వారసులు ఉంటారు. తూర్పు పడమరలకు, ఉత్తర దక్షిణాలకు వారు విస్తరిస్తారు. నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమిమీదనున్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి.

15 “నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. మళ్లీ నిన్ను ఈ దేశానికి నేను తీసుకొని వస్తాను. నేను వాగ్దానం చేసింది నెరవేర్చేవరకు నిన్ను నేను విడువను.”

16 అప్పుడు యాకోబు నిద్రనుండి మేల్కొని, “యెహోవా ఈ స్థలంలో ఉన్నాడని నాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నట్లు, నేను నిద్రపోయేంత వరకు నాకు తెలియదు” అన్నాడు.

17 యాకోబు భయపడి, “ఇది మహా గొప్ప స్థానం. ఇది దేవుని మందిరం. ఇది పరలోక ద్వారం” అన్నాడు అతను.

18 ఉదయం పెందలాడే యాకోబు లేచి, తాను పండుకొన్న రాయి తీసుకొని, దానిని అంచుమీద నిలబెట్టాడు. తర్వాత ఆ రాయిమీద అతడు నూనె పోశాడు. ఈ విధంగా అతడు ఆ రాయిని దేవుని జ్ఞాపకార్థ చిహ్నంగా చేశాడు. 19 ఆ స్థలం పేరు లూజు. అయితే యాకోబు దానికి బేతేలు[a] అని పేరు పెట్టాడు.

20 అప్పుడు యాకోబు ఒక ప్రమాణం చేశాడు. “దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను ఎక్కడికి వెళ్లినా దేవుడు నన్ను కాపాడుతూ ఉంటే, తినుటకు భోజనం, ధరించుటకు బట్టలు దేవుడు నాకు ఇస్తూ ఉంటే, 21 నా తండ్రి ఇంటికి నేను సమాధానంగా తిరిగి రాగలిగితే, ఇవన్నీ దేవుడు చేస్తే, అప్పుడు యెహోవాయే నా దేవుడు. 22 నేను ఈ రాయిని యిక్కడ నిలబెడతాను. దేవుని కోసం ఇది పరిశుద్ధ స్థలం అని అది తెలియజేస్తుంది. దేవుడు నాకు ఇచ్చే వాటన్నింటిలో పదవ భాగం నేను ఆయనకు ఇస్తాను” అని అతను చెప్పాడు.

రోమీయులకు 13

అధికారులు

13 ప్రభుత్వాన్ని దేవుడే నియమించాడు కనుక ప్రతి ఒక్కడూ ప్రభుత్వం చెప్పినట్లు చెయ్యాలి. ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని కూడా దేవుడే నియమించాడు. అందువల్ల ప్రభుత్వాన్ని ఎదిరించిన వాడు దేవుని ఆజ్ఞను ఎదిరించిన వానితో సమానము. వాళ్ళు శిక్షననుభవించవలసి వస్తుంది. సక్రమంగా నడుచుకొనేవాళ్ళు పాలకులకు భయపడరు. తప్పు చేసినవాళ్ళకే ఆ భయం ఉంటుంది. ప్రభుత్వానికి భయపడకుండా ఉండాలంటే, సక్రమంగా నడుచుకోండి. అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని మెచ్చుకుంటుంది.

మీ మంచి కోసం ప్రభుత్వ అధికారులు దేవుని సేవకులుగా పని చేస్తున్నారు. కాని మీరు తప్పు చేస్తే భయపడవలసిందే! వాళ్ళు ఖడ్గాన్ని వృథాగా ధరించరు. దేవుని సేవకులుగా వాళ్ళు తప్పు చేసినవాళ్ళను శిక్షించటానికి ఉన్నారు. అందువల్ల శిక్షింపబడుతారనే కాకుండా మీ అంతరాత్మల కోసం కూడా అధికారులు చెప్పినట్లు చెయ్యటం అవసరం.

అధికారులు దేవుని సేవకులు. వాళ్ళు తమ కాలాన్నంతా దీని కోసమే ఉపయోగిస్తున్నారు. అందువల్లే మీరు పన్నులు చెల్లిస్తున్నారు. ఎవరికేది ఋణపడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు ఋణపడి ఉంటే పన్నుల్ని, సుంకాలు ఋణపడి ఉంటే సుంకాల్ని, మర్యాదను ఋణపడి ఉంటే మర్యాదను, గౌరవాన్ని ఋణపడి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.

ప్రేమ

తోటివాళ్ళను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్నంతా అనుసరించినట్లే కనుక ఇతర్లను ప్రేమించటం అనే ఋణంలో తప్ప మరే ఋణంలో పడకండి. “వ్యభిచారం చెయ్యరాదు; హత్య చెయ్యరాదు; దొంగతనం చెయ్యరాదు; ఇతర్లకు చెందిన వాటిని ఆశించరాదు”(A) అనే మొదలగు ఆజ్ఞలన్నీ, “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే ఆజ్ఞలో మిళితమై ఉన్నాయి. 10 ప్రేమ పొరుగు వానికి హాని కలిగించదు. కాబట్టి ధర్మశాస్త్రం సాధించాలి అనుకొన్నదాన్ని ప్రేమ సాధిస్తుంది.

11 యేసు క్రీస్తును మనం నమ్మిన నాటి కంటే నేడు రక్షణ దగ్గరగా ఉంది కనుక ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకోండి. ఆ గడియ అప్పుడే వచ్చేసింది. కనుక నిద్రనుండి మేలుకోండి. 12 రాత్రి గడిచిపోతోంది. అంతం కాని పగలు త్వరలోనే రాబోతోంది. అందువల్ల చీకట్లో చేసే పనుల్ని ఆపి, పగటి వేళ ధరించే ఆయుధాల్ని ధరించండి. 13 పగటి వేళకు తగ్గట్టుగా మర్యాదగా మసలుకొండి. ఉగ్రత తాండవం చెయ్యకుండా, త్రాగి మత్తులు కాకుండా, వ్యభిచారం చెయ్యకుండా, నీతి లేని పనులు చెయ్యకుండా, కలహాలు, అసూయలు లేకుండా ప్రవర్తించండి. 14 యేసు క్రీస్తు ప్రభువును వస్త్రంగా ధరించండి. శారీరక వాంఛల్ని ఏ విధంగా తృప్తి పరుచుకోవాలా అని ఆలోచించటం మానుకోండి.

యోహాను 8:33-47

33 వాళ్ళు, “మేము అబ్రాహాము వంశీయులం. మేమింతవరకు ఎవ్వరికి బానిసలుగా ఉండలేదు. మరి మాకు స్వేచ్ఛ కలుగుతుందని ఎందుకంటున్నావు?” అని అన్నారు.

34 యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస ఔతాడు. 35 బానిసకు కుటుంబంలో శాశ్వతమైన స్థానం ఉండదు. కాని కుమారుడు శాశ్వతంగా ఆ యింటికి చెందినవాడు. 36 కుమారుడు స్వేచ్ఛ కలిగిస్తే మీకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది. 37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. అయినా మీకు నా సందేశం నచ్చలేదు. కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. 38 నేను నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. మీరు మీ తండ్రి[a] నుండి విన్నదాన్ని చేస్తున్నారు” అని అన్నాడు.

39 “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు! 40 నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు. 41 మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు.

వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు.

42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు. 43 మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. 44 మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి స్వభావము. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడుతాడు. వాడు అబద్ధానికి తండ్రి.

45 “నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు. 46 నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు. 47 దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International