Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 24

దావీదు కీర్తన.

24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
    ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
    ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.

యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
    యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
అక్కడ ఎవరు ఆరాధించగలరు?
    చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
    అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
    అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
    అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.

మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
    ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
    సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.

గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
    పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
    మహిమగల రాజు లోనికి వస్తాడు.
ఈ మహిమగల రాజు ఎవరు?
    ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
    యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.

గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
    పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
    మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
    ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.

కీర్తనలు. 29

దావీదు కీర్తన.

29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
    ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
    మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
    మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
    ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
    లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
    షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
    యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
    ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.

10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
    మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
    యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.

కీర్తనలు. 8

సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.

యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
    నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
    నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
    నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
    నీవు వానిని గమనించటం ఎందుకు?
అయితే మానవుడు నీకు ముఖ్యం.
    వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
    మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
    ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
    చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!

కీర్తనలు. 84

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన

84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
    నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
    పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
    అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
    వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.

ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
    వారు నిన్నే నడిపించ నిస్తారు.
దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
    నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
    ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.

సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
    యాకోబు దేవా, నా మాట వినుము.

దేవా, మా సంరక్షకుని కాపాడుము.
    నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
    నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
    నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
    దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
    ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.

ఆదికాండము 18:16-33

16 అప్పుడు ఆ మనుష్యులు వెళ్లటానికి లేచారు. వారు సొదొమ వైపు చూసి, ఆ దిశగా నడక ప్రారంభించారు. వారికి వీడ్కోలు చెప్పటానికి అబ్రాహాము వాళ్లతో కొంత దూరం నడిచాడు.

దేవునితో అబ్రాహాము బేరం

17 యెహోవా తనలో తాను ఇలా అనుకొన్నాడు: “ఇప్పుడు నేను చేయబోతున్నది అబ్రాహాముకు నేను చెప్పాలా? 18 అబ్రాహాము గొప్ప శక్తిగల జనానికి మూల పురుషుడు అవుతాడు. అతని మూలంగా భూమి మీది ప్రజలంతా ఆశీర్వదించబడుతారు. 19 అబ్రాహాముతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేసుకున్నాను. అతని పిల్లలు, సంతానము యెహోవా ఇష్ట ప్రకారం జీవించేటట్లు అబ్రాహాము వారికి ఆజ్ఞాపించాలని నేను ఇలా చేశాను. సక్రమంగా న్యాయంగా వాళ్లు జీవించాలని నేను ఇలా చేశాను. అప్పుడు, యెహోవానైన నేను వాగ్దానం చేసిన వాటిని అతనికి ఇవ్వగలను.”

20 మరల యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ గొమొఱ్ఱాల అరుపులు చాలా పెద్దవి. వారి పాపం చాలా భయంకరమైనది అని నేను విన్నాను. 21 కనుక నేను వెళ్లి, అక్కడి విషయాలు నేను విన్నంత చెడ్డగా ఉన్నాయేమో చూస్తాను. అప్పుడు నాకు నిశ్చయంగా తెలుస్తుంది.”

22 అంచేత ఆ మనుష్యులు మళ్లీ సొదొమవైపు నడక ప్రారంభించారు. అయితే అబ్రాహాము యెహోవాతో అక్కడ ఉండిపోయాడు. 23 అప్పుడు అబ్రాహాము యెహోవాను సమీపించి ఇలా అడిగాడు. “యెహోవా, నీవు దుష్టులను నాశనం చేసేటప్పుడు మంచివారిని కూడా నాశనం చేస్తావా? 24 ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది మంచివాళ్లు ఉంటే ఎలా? ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా? అక్కడ నివసిస్తున్న 50 మంది మంచివాళ్ల కోసం తప్పక నీవు ఆ పట్టణాన్ని కాపాడు. 25 ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు. చెడ్డవాళ్లను చంపడంకోసం 50 మంది మంచివాళ్లను నీవు నాశనం చేయవు. అలా గనుక జరిగితే మంచివాళ్లు చెడ్డవాళ్లు సమానమై, ఇద్దరూ శిక్షించబడుతారు. భూలోకమంతటికి నీవు న్యాయమూర్తివి. నిజంగా నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు.”

26 అప్పుడు, “సొదొమ పట్టణంలో 50 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణం అంతటిని కాపాడుతాను” అన్నాడు యెహోవా.

27 దానికి అబ్రాహాము ఇలా అన్నాడు: “ప్రభూ, నీతో పోల్చుకొంటే, నేను ధూళిని, బూడిదను మాత్రమే. అయినా నేను మరోసారి తెగించి ఈ ప్రశ్న అడుగుతున్నాను. 28 ఒకవేళ అయిదుగురు మంచివాళ్లు తప్పిపోయి, 45 మంది మంచివాళ్లు మాత్రమే ఆ పట్టణంలో ఉంటే ఎలా? కేవలం అయిదుగురు తక్కువ అయినందువల్ల మొత్తం పట్టణమంతటిని నాశనం చేస్తావా?”

“అక్కడ 45 మంది మంచివాళ్లు గనుక నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను వదిలివేస్తాను” అన్నాడు యెహోవా.

29 మరల అబ్రాహాము, “అక్కడ 40 మంది మంచివాళ్లు మాత్రమే నీకు కనబడినా, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని యెహోవాను అడిగాడు.

“40 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు యెహోవా.

30 అందుకు అబ్రాహాము, “ప్రభూ, నా మీద కోపగించకు. మరొక్క మాట అడుగుతాను. ఆ పట్టణంలో 30 మంది మంచివాళ్లు మాత్రమే కనబడితే, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని అడిగాడు.

అందుకు యెహోవా, “అక్కడ 30 మంది మంచివాళ్లు నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని చెప్పాడు.

31 అప్పుడు అబ్రాహాము, “నా ప్రభువుతో మరోసారి మాటలాడ తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది మంచివాళ్లే ఉంటే” అన్నాడు.

“20 మంది మంచివాళ్లు నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని జవాబిచ్చాడు యెహోవా.

32 అప్పుడు అబ్రాహాము ఇలా అన్నాడు, “ప్రభూ, నాపై కోపగించకు, ఈ ఒక్కసారే చివరిగా నీతో మాటలాడ తెగిస్తున్నాను. పదిమంది మంచివాళ్లే గనుక అక్కడ నీకు కనబడితే, నీవేం చేస్తావు?”

“పదిమంది మంచివాళ్లు గనుక అక్కడ నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అన్నాడు యెహోవా.

33 యెహోవా అబ్రాహాముతో మాట్లాడటం అయిపోయింది గనుక యెహోవా వెళ్లిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి వెళ్లిపోయాడు.

గలతీయులకు 5:13-25

13 నా సోదరులారా! మీరు స్వేచ్ఛగా జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరీ స్వేచ్ఛను మీ శారీరక వాంఛలు తీర్చుకోవటానికి ఉపయోగించకండి. దానికి మారుగా ప్రేమతో పరస్పరం సహాయం చేసుకొంటూ ఉండండి. 14 “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు”(A) అన్న ఒకే నియమంలో ధర్మశాస్త్రమంతా యిమిడి ఉంది. 15 మీరీ విధంగా కలహములాడుకొంటూ, హింసించుకొంటూ ఉంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకొంటారు. అలా జరగక ముందే జాగ్రత్త పడండి.

పరిశుద్ధాత్మ మరియు మానవ స్వభావం

16 కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు. 17 ఎందుకంటే మానవ స్వభావము పరిశుద్ధాత్మ కోరుకొంటున్నదానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. తద్వారా మీరు చెయ్యాలనుకుంటున్నదాన్ని చెయ్యలేకపోతున్నారు. 18 కాని పరిశుద్ధాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం మిమ్మల్ని బంధించదు.

19 మానవ స్వభావం యొక్క పనులు మనకు బాగా తెలుసు. అవేవనగా వ్యభిచారము, అపవిత్రత, కామము, 20 విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు, 21 అసూయ, త్రాగుబోతుతనము, కామకేళీలు మొదలగునవి. వీటిని గురించి నేనిదివరకే వారించాను. మళ్ళీ వారిస్తున్నాను. ఈ విధంగా జీవించేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. 22 కాని పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, 23 వినయం, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు. 24 యేసుక్రీస్తుకు చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు. 25 మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకారము నడుచుకొందాము.

మార్కు 8:22-30

బేత్సయిదాలో గ్రుడ్డివానికి నయం చేయటం

22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. అక్కడి ప్రజలు గ్రుడ్డివాణ్ణి యేసు దగ్గరకు తీసుకు వచ్చారు. అతణ్ణి తాకమని వాళ్ళు ఆయనను వేడుకొన్నారు. 23 యేసు ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకొని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. యేసు ఆ గ్రుడ్డివాని కళ్ళ మీద ఉమ్మివేసి తన చేతుల్ని వాటిపైవుంచి, “నీకేమైనా కనబడుతోందా” అని అడిగాడు.

24 ఆ గ్రుడ్డివాడు తలెత్తి, “మనుష్యులు నడుస్తున్నట్లు కనబడుతున్నారు. కాని వాళ్ళు చెట్లలా కనబడుతున్నారు” అని అన్నాడు.

25 యేసు మళ్ళీ ఒకసారి అతని కళ్ళపై తన చేతుల్ని ఉంచాడు. వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అతనికి దృష్టి వచ్చింది. అన్నీ స్పష్టంగా చూడగలిగినాడు. 26 యేసు అతణ్ణి యింటికి పంపుతూ, “గ్రామంలోకి వెళ్ళవద్దు”[a] అని అన్నాడు.

పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం

(మత్తయి 16:13-20; లూకా 9:18-21)

27 యేసు తన శిష్యులతో కలిసి, కైసరయ ఫిలిప్పి పట్టణానికి చుట్టూవున్న పల్లెలకు వెళ్ళాడు. దారిలో యేసు వాళ్ళతో, “ప్రజలు నేనెవరని అనుకొంటున్నారు?” అని అడిగాడు.

28 వాళ్ళు, “బాప్తిస్మము నిచ్చే యోహాను అని కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు” అని సమాధానం చెప్పారు.

29 “మరి మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని అడిగాడు.

పేతురు, “మీరే క్రీస్తు”[b] అని సమాధానం చెప్పాడు.

30 తనను గురించి ఎవ్వరికి చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International