Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 40

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
    నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
    ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
    ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
    యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
    వారు యెహోవాను నమ్ముకొంటారు.
ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
    ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
    ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
    మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
    నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.

యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
    బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
    దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
    నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
    నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
    యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
    ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
    నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
    నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.

12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.
    లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు.
నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి.
    నేను వాటిని తప్పించుకోలేను.
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి.
    నేను ధైర్యాన్ని కోల్పోయాను.
13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము.
    త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము.
    ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.
    వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.
    “యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.

17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని.
    యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము.
నాకు సహాయం చేయుము.
    నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.

కీర్తనలు. 54

సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.

54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
    నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
దేవా, నా ప్రార్థనను,
    నేను చెప్పే సంగతులను ఆలకించుము.
పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
    బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.

చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
    నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
    దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.

దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
    యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
    మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.

కీర్తనలు. 51

సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.

51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
    నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
    నా పాపాలన్నీ తుడిచివేయుము.
దేవా, నా దోషం అంతా తీసివేయుము.
    నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
నేను పాపం చేశానని నాకు తెలుసు.
    నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
    దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
    నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
నేను పాపంలో పుట్టాను.
    పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
    అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
    నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
    నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
నా పాపాలను చూడకుము!
    వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
    నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
    నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
    కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
    నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
    వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
    నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15     నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
    లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
    దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.

18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
    యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
    మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.

ఆదికాండము 17:15-27

వాగ్దాన పుత్రుడు ఇస్సాకు

15 అబ్రాహాముతో దేవుడు అన్నాడు: “నీ భార్య శారయికి నేను ఒక క్రొత్త పేరు పెడ్తాను. ఆమె క్రొత్త పేరు శారా.[a] 16 ఆమెను నేను ఆశీర్వదిస్తాను. ఆమెకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను, మరి నీవు తండ్రివి అవుతావు. అనేక క్రొత్త జనాంగములకు ఆమె తల్లి అవుతుంది. జనముల రాజులు ఆమెలోనుండి వస్తారు.”

17 దేవుణ్ణి గౌరవించుటకు అబ్రాహాము ముఖం క్రిందికి దించుకొన్నాడు. అయితే అతడు నవ్వి, తనలో తాను అనుకొన్నాడు: “నా వయస్సు 100 సంవత్సరాలు. నాకు కొడుకు పుట్టజాలడు. మరి శారా వయస్సు 90 సంవత్సరాలు. ఆమెకు శిశువు జన్మించడం అసాధ్యం.”

18 అప్పుడు అబ్రాహాము దేవునితో ఇలా అన్నాడు: “నా కుమారుడు ఇష్మాయేలు జీవించి నిన్ను సేవిస్తాడని ఆశిస్తున్నాను.”

19 దేవుడు చెప్పాడు: “లేదు! నీ భార్య శారాకు కుమారుడు పుడతాడని నేను చెప్పాను. అతనికి ఇస్సాకు[b] అని నీవు పేరు పెడ్తావు. అతనితో నేను నా ఒడంబడిక చేసుకొంటాను. ఆ ఒడంబడిక అతని సంతానాలన్నిటితోను శాశ్వతంగా కొనసాగే ఒడంబడికగా ఉంటుంది.

20 “ఇష్మాయేలును గూర్చి నీవు నన్ను అడిగావు, నేను విన్నాను. అతణ్ణి నేను ఆశీర్వదిస్తాను. అతనికి చాలా మంది పిల్లలు ఉంటారు. పన్నెండు మంది మహా నాయకులకు అతడు తండ్రి అవుతాడు. అతని కుటుంబం ఒక గొప్ప జాతి అవుతుంది. 21 అయితే ఇస్సాకుతో నేను నా ఒడంబడిక చేస్తాను. శారాకు పుట్టబోయే కుమారుడు ఇస్సాకు. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో నీకు కుమారుడు పుడతాడు.”

22 అబ్రాహాముతో దేవుడు మాట్లాడటం ముగించిన తర్వాత అబ్రాహాము ఒంటరిగా ఉన్నాడు. దేవుడు లేచి అబ్రాహామును విడిచి వెళ్లిపోయాడు. 23 తన కుటుంబంలోని మగవాళ్లకు, బాలురకు సున్నతి చేయమని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు కనుక ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన సేవకులందరిని అబ్రాహాము సమావేశపర్చాడు. డబ్బుతో కొనబడిన సేవకులను గూడ అబ్రాహాము సమావేశపర్చాడు. అబ్రాహాము ఇంటిలోని ప్రతి పురుషుడు, బాలుడు ఒక చోట సమావేశ పర్చబడ్డారు. వారందరికి సున్నతి చేయబడింది. అబ్రాహాము దేవుడు చెప్పినట్లు వారందరికి సున్నతి చేశాడు.

24 అబ్రాహాముకు సున్నతి జరిగినప్పుడు అతని వయస్సు 99 సంవత్సరాలు. 25 అతని కుమారుడు ఇష్మాయేలుకి సున్నతి జరిగినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. 26 అబ్రాహాము, అతని కుమారుడు ఇష్మాయేలు ఇద్దరును ఒకే రోజున సున్నతి చేయబడ్డారు. 27 ఆ రోజునే అబ్రాహాము ఇంటిలోని మగవాళ్లందరికి గూడ సున్నతి జరిగింది. అతని ఇంట పుట్టిన సేవకులందరికి, అతడు కొన్న సేవకులందరికి సున్నతి జరిగింది.

హెబ్రీయులకు 10:11-25

11 ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే మళ్ళీ మళ్ళీ యిస్తూ ఉంటాడు. ఈ బలులు పాపపరిహారం చెయ్యలేవు. 12 కాని క్రీస్తు మన పాపపరిహారార్థం ఒకే ఒక బలి యిచ్చి దేవుని కుడిచేతి వైపు శాశ్వతంగా కూర్చుండిపొయ్యాడు. 13 అప్పటినుండి, ఆయన శత్రువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా చెయ్యాలని కాచుకొని ఉన్నాడు. 14 ఆయన ఒకే ఒక అర్పణ చేసి పరిశుద్ధులలో శాశ్వతమైన పరిపూర్ణత కలిగించాడు.

15 ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ మనకు యిలా ప్రకటిస్తున్నాడు:

16 “ఆ తర్వాత నేను వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.
నా నియమాల్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుతాను.
    వాటిని వాళ్ళ మనస్సులపై వ్రాస్తాను.”(A)

17 పరిశుద్ధాత్మ ఇంకా యిలా అన్నాడు:

“వాళ్ళ పాపాల్ని,
    దుర్మార్గాల్ని నేను మరిచిపోతాను!”(B)

18 వాళ్ళ పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి, పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం తీరిపోయింది.

విశ్వాసాన్ని వదులుకోకండి

19 సోదరులారా! యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది. 20 ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు. 21 అంతేకాక, ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు. 22 తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్ళతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకొందాం. 23 మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం.

ఒకరికొకరు సహాయం చేసుకొంటూ బలవంతులై యుండండి

24 ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం. 25 సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం[a] సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహపరచుకొంటూ ఉందాం.

యోహాను 6:1-15

యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం

(మత్తయి 14:13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17)

ఇది జరిగిన కొద్ది రోజులకు, యేసు గలిలయ సముద్రం (తిబెరియ సముద్రం) దాటి వెళ్ళాడు. ఆయన అద్భుతమైన మహిమలతో రోగులకు బాగుచెయ్యటం చూసి, పెద్ద ప్రజల గుంపు ఒకటి ఆయన్ని అనుసరిస్తూవచ్చింది. యేసు తన శిష్యులతో కలిసి కొండ మీదికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అవి పస్కా పండుగకు ముందు రోజులు. పస్కా యూదల పండుగ.

యేసు తలెత్తి పెద్ద ప్రజలగుంపు తన వైపు రావటం చూసి, ఫిలిప్పుతో, “వీళ్ళు తినటానికి ఆహారం ఎక్కడ కొందాం?” అని అడిగాడు. అతణ్ణి పరీక్షించటానికి మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏమి చెయ్యాలో ముందే ఆలోచించుకొన్నాడు.

ప్రతి ఒక్కనికి ఒక్కొక్క ముక్క దొరకాలన్నా, రెండువందల దేనారాలు ఖర్చు చేయవలసి వస్తుంది. అయినా అది చాలదు.

యేసు శిష్యుల్లో ఒకడైన అంద్రెయ అక్కడున్నాడు. యితడు సీమోను పేతురు సోదరుడు. “ఇక్కడ ఒక బాలుని దగ్గర యవలతో చేసిన ఐదు రొట్టెలు, రెండు కాల్చిన చేపలు ఉన్నాయి. కాని యింతమందికి అవి ఎట్లా సరిపోతాయి?” అని అన్నాడు.

10 యేసు, “ప్రజల్ని కూర్చోపెట్టండి!” అని అన్నాడు. అక్కడ చక్కటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ప్రజలందరూ కూర్చున్నారు. అక్కడున్న పురుషుల సంఖ్య ఐదువేలు. 11 యేసు ఆ రొట్టెల్ని తీసుకొని, దేవునికి కృతజ్ఞత చెప్పి, అక్కడ కూర్చున్నవాళ్ళకు పంచిపెట్టాడు. అదే విధంగా చేపల్ని కూడా పంచి పెట్టాడు. అందరూ కావలసినంత తిన్నారు.

12 వాళ్ళు తృప్తిగాతిన్నాక, తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా వాళ్ళు తినగా మిగిలిన ముక్కల్ని ఎత్తి పెట్టండి!” అని అన్నాడు. 13 ఐదు బార్లీ రొట్టెల్ని పంచగా మిగిలిన ముక్కల్ని శిష్యులు పండ్రెండు గంపలనిండా నింపారు.

14 ప్రజలు యేసు చేసిన ఆ మహాకార్యాన్ని చూసి, “లోకానికి రానున్న ప్రవక్త ఈయనే!” అని అనటం మొదలు పెట్టారు.

15 యేసు వాళ్ళు తనను బలవంతంగా రాజును చెయ్యాలనుకుంటున్నారని గ్రహించాడు. కనుక ఆయన ఏకాంతంగా కొండకు వెళ్ళిపోయ్యాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International