Book of Common Prayer
సంగీత నాయకునికి: “శోషనీము” రాగం. కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరియు ఒక ప్రేమగీతం.
45 రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా
అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి.
నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా
నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.
2 నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!
నీ పెదవులనుండి దయ వెలువడుతుంది
కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.
3 నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరునివలె, మహిమను, ఘనతను ధరించుము.
4 నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము.
అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.
5 నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి
అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.
6 దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
నీ నీతి రాజదండము.
7 నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
నీ దేవుడు కోరుకొన్నాడు.
8 నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
9 నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.
10 కుమారీ, నా మాట వినుము.
నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11 రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.
13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.
16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల గీతం.
47 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి.
సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
భూలోకమంతటికీ ఆయన రాజు.
3 ఆయన ప్రజలను మనకు లోబరిచాడు.
ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
4 దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.
5 బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే
యెహోవా దేవుడు లేచాడు.
6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
7 దేవుడు సర్వలోకానికి రాజు.
స్తుతిగీతాలు పాడండి.
8 దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు.
దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు.
9 రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు.
దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
దేవుడు మహోన్నతుడు.
కోరహు కుమారుల స్తుతి పాట.
48 యెహోవా గొప్పవాడు.
మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
2 దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది.
అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది.
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.[a]
అది మహారాజు పట్టణం.
3 ఇక్కడ ఆ పట్టణంలోని
భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
4 ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు.
వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు.
వారంతా కలసి ముందుకు వచ్చారు.
5 ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,
వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
6 ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.
ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
7 దేవా, బలమైన తూర్పుగాలితో
తర్షీషు ఓడలను బ్రద్దలు చేశావు.
8 మేము ఏమి విన్నామో, దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో
మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో చూశాము.
దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.
9 దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.
భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.
మరియు యూదా నగరాలు ఆనందంగా ఉన్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
12 సీయోను చుట్టూ తిరుగుతూ
ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
13 ఎత్తైన గోడలు చూడండి.
సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి.
అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
14 ఈ విషయాలు దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి:
ఆయన ఎప్పటికీ మన దేవుడు, ఆయన ఎల్లప్పుడు మనలను కాపాడుతాడు.
అబ్రాముతో దేవుని ఒడంబడిక
15 ఈ సంగతులన్నీ జరిగాక, ఒక దర్శనంలో అబ్రాముకు యెహోవా వాక్కు వచ్చి, “అబ్రామా, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. నేను నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాను” అని దేవుడు అన్నాడు.
2 అయితే అబ్రాము అన్నాడు: “యెహోవా దేవా, నన్ను సంతోష పెట్టగలిగేందుకు నీవు ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎందుచేతనంటే నాకు కుమారుడు లేడు. కనుక నేను చనిపోయిన తర్వాత, నా సేవకుడును దమస్కువాడైన ఎలీయెజెరు నా ఆస్తి అంతటికి వారసుడు అవుతాడు. 3 చూడు దేవా, నాకు నీవు కుమారుణ్ణి ఇవ్వలేదు. కనుక నా ఇంటిలో పుట్టిన సేవకుడు నాకు ఉన్న ఆస్తి అంతా దక్కించుకొంటాడు,”
4 అప్పుడు అబ్రాముతో యెహోవా మాట్లాడాడు: “నీకు ఉన్నవాటన్నింటిని పొందేవాడు నీ సేవకుడు కాదు. నీకు ఒక కుమారుడు కలుగుతాడు. నీకు ఉన్నవాటన్నింటిని నీ కుమారుడు పొందుతాడు.”
5 అంతట దేవుడు అబ్రామును గుడారము బయటకు తీసుకొని వెళ్లి, ఇలా చెప్పాడు: “ఆకాశం చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు. అవి చాలా ఉన్నాయి. నీవు లెక్కపెట్టలేవు. భవిష్యత్తులో నీ కుటుంబం అలాగే ఉంటుంది.”
6 అబ్రాము దేవుణ్ణి నమ్మాడు, అబ్రాముయొక్క విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించాడు. 7 అబ్రాముతో దేవుడు ఇలా అన్నాడు, “కల్దీయుల ఊరు అను పట్టణము నుండి నిన్ను బయటకు నడిపించిన యెహోవాను నేనే. ఈ దేశాన్ని నీకు ఇచ్చేందుకు నేను అలా చేశాను. ఈ దేశం నీ స్వంతం అవుతుంది.”
8 అయితే అబ్రాము, “యెహోవా, నా ప్రభువా, ఈ దేశం నాదే అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
9 అబ్రాముతో దేవుడు అన్నాడు: “మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. మూడు సంవత్సరాల ఆవు ఒకటి, మూడు సంవత్సరాల మేక ఒకటి, మూడు సంవత్సరాల పొట్టేలు ఒకటి తీసుకురా. ఇంకా నా కోసం ఒక పావురాన్ని, ఒక చిన్న పావురాన్ని తీసుకురా.”
10 దేవుని కోసం వీటన్నిటిని అబ్రాము తెచ్చాడు. ఆ జంతువులన్నింటిని చంపి ఒక్కోదాన్ని రెండేసి ముక్కలు చేశాడు, తర్వాత అబ్రాము ఈ భాగాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వేశాడు. పక్షులను రెండు భాగాలుగా అబ్రాము ఖండించలేదు. 11 తర్వాత ఈ జంతువులను తినటానికి పెద్ద పక్షులు వచ్చి వాలాయి. కాని అబ్రాము వాటిని వెళ్లగొట్టేశాడు.
17 సూర్యుడు అస్తమించాక, చాలా చీకటి పడింది, చచ్చిన జంతువులు రెండేసి ముక్కలుగా ఖండించబడి, ఇంకా అక్కడే నేలమీద పడి ఉన్నాయి. ఆ సమయంలో పొగమంటల వరుస[a] చచ్చిన జంతువుల రెండేసి ముక్కల మధ్యగా సాగిపోయింది. దేవుడు అబ్రాముతో చేసుకొన్న ఒప్పందానికి ఇది ఒక “ముద్ర” లేక “సంతకం.” ఆ రోజుల్లో, కోయబడ్డ జంతువుల ముక్కల మధ్య నడవడం అనే ఒడంబడిక ఆ మనిషి యొక్క నిజాయితీని తెలుపుతుంది. “నేను ఈ ఒడంబడికను అనుసరించకపోతే ఇదే నాకు జరుగనీ” అన్నది దీని అర్థం.
18 కనుక ఆనాడు ఒక వాగ్దానాన్ని, ఒక ఒడంబడికను అబ్రాముతో యెహోవా చేశాడు. యెహోవా అన్నాడు: “ఈ దేశాన్ని నీ సంతానమునకు నేను ఇస్తాను. ఈజిప్టు నదికి, యూఫ్రటీసు నదికి మధ్య ఉన్న దేశాన్ని నేను వారికి ఇస్తాను. 19 కేనీయులు, కెనిజ్జీయులు, కద్మానీయులు, 20 హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీమీయులు, 21 అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయుల దేశమిది.”
భూలోక గుడారములో సేవ
9 సేవా నియమాలను గురించి, మానవ నిర్మితమైన గుడారమును గురించి మొదటి ఒడంబడికలో వ్రాయబడి ఉంది. 2 గుడారం వేసి మొదటి గదిని సిద్ధం చేసేవాళ్ళు. ఆ గదిలో ఒక దీప స్థంభం, ఒక బల్ల, ప్రతిష్ఠించబడిన రొట్టె ఉంచేవాళ్ళు. ఈ గదిని పవిత్రస్థానమని పిలిచేవాళ్ళు. 3 మరొక తెరవేసి రెండవ గదిని సిద్ధం చేసేవాళ్ళు. దీన్ని అతి పవిత్ర స్థానమని పిలిచేవాళ్ళు. 4 ఇక్కడ బంగారు ధూప వేదిక, మరియు బంగారు రేకుచేత కప్పబడిన ఒడంబడిక మందసము ఉండేవి. ఈ మందసంలో మన్నా[a] ఉంచబడిన బంగారుగిన్నె, చిగురు వేసిన అహరోను చేతికర్ర, ఒడంబడిక పలకలు ఉండేవి. 5 ఈ మందసం మీద కరుణాపీఠం ఉండేది. దానికి యిరువైపులా దేవదూతలు ఉండేవారు. వారి రెక్కలు ఆ కరుణాపీఠాన్ని కప్పి ఉంచేవి. కాని వీటిని గురించి ప్రస్తుతం వివరంగా చర్చించలేము.
6 అన్నీ ఈ విధంగా అమర్చబడిన తర్వాత, యాజకులు నియమానుసారం ముందున్న గదిలోకి ప్రవేశించి సేవ చేసేవాళ్ళు. 7 కాని ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తంతో ప్రవేశించేవాడు. తన పక్షాన, అజ్ఞానంతో పాపాలు చేసిన ప్రజల పక్షాన తప్పకుండా రక్తాన్ని తెచ్చి దేవునికి అర్పించేవాడు.
8 అంటే మొదటి గది ఉన్నంతకాలం అతి పవిత్ర స్థానానికి ప్రవేశం కలుగదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. 9 ఇది ప్రస్తుత కాలాన్ని సూచిస్తోంది. అంటే కానుకలు, బలులు అర్పించటం వల్ల యాజకుని అంతరాత్మ పరిశుద్ధం కాదని పరిశుద్ధాత్మ సూచిస్తున్నాడు. 10 ఇవి కేవలం అన్నపానాలకు పలురకాల పరిశుద్ద స్నానాలకు సంబంధించిన ఆచారాలు. క్రొత్త క్రమం వచ్చేదాకా ఈ బాహ్య నియమాలు వర్తిస్తాయి.
యేసు రక్తం
11 దేవుడు చేసిన మంచి పనులు సాగించటానికి క్రీస్తు ప్రధాన యాజకుడై పరలోకంలోని గుడారానికి వెళ్ళాడు. ఆ గుడారం చాలా పెద్దది. శ్రేష్ఠమైనది. అది మానవుడు నిర్మించింది కాదు. 12 ఆయన మేకల రక్తం ద్వారా, దూడల రక్తం ద్వారా ఆ గుడారంలోకి వెళ్ళలేదు. తన స్వంత రక్తంతో అతి పవిత్రమైన ఆ స్థలాన్ని శాశ్వతంగా ప్రవేశించి, మనకు శాశ్వతమైన రక్షణ కలిగించాడు.
13 మేకల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని, దూడలను కాల్చిన బూడిదను, అపవిత్రంగా ఉన్నవాళ్ళపై ప్రోక్షించి, వాళ్ళను పవిత్రం చేసేవాళ్ళు. ఇలా చేయటం వల్ల వాళ్ళు బాహ్యంగా మాత్రమే పవిత్రులౌతారు. 14 కాని, నిష్కళంకుడైన యేసు శాశ్వతమైన తన ఆత్మను దేవునికి అర్పించుకొన్నాడు. తద్వారా క్రీస్తు రక్తం మన చెడు అంతరాత్మల్ని కూడా పరిశుద్ధం చేస్తోంది. మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలని ఆయనీవిధంగా చేసాడు.
చిన్న కొలను దగ్గర నయం చేయటం
5 కొద్ది రోజుల తర్వాత యూదుల పండుగ వచ్చింది. యేసు యెరూషలేముకు వెళ్ళాడు. 2 అక్కడ యెరూషలేములో గొఱ్ఱెల ద్వారం దగ్గర ఒక కొలను ఉండేది. దీన్ని హీబ్రూ భాషలో బేతెస్థ అని అంటారు. దీని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి. 3 చాలామంది వికలాంగులు, గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు. 4 [a] 5 అక్కడున్న వాళ్ళలో ఒకడు ముప్పైఎనిమిది సంవత్సరాల నుండి రోగంతో బాధ పడ్తూ ఉన్నాడు. 6 యేసు అతడక్కడ ఉండటం చూసాడు. చాలాకాలం నుండి అతడాస్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో, “నీకు నయం కావాలని ఉందా?” అని అడిగాడు.
7 ఆ వికలాంగుడు, “అయ్యా! నీళ్ళు కదిలినప్పుడు ఆ కోనేరులోకి దించటానికి ఎవరూ లేరు: అయినా వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే, ఇంకొకడు నాకన్నా ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు” అని అన్నాడు.
8 అప్పుడు యేసు అతనితో, “లే! నీ చాప తీసుకొని నడువు!” అని అన్నాడు. 9 అతనికి వెంటనే నయమైపోయింది. అతడు తన చాపతీసుకొని వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది. 10 తత్కారణంగా యూదులు కోలుకున్న వానితో, “ఇది విశ్రాంతి రోజు, ధర్మశాస్త్రం ప్రకారం నీవు చాపమోసుక వెళ్ళటానికి వీల్లేదు” అని అన్నారు.
11 కాని అతడు, “నాకు నయం చేసిన వ్యక్తి, ‘నీ చాప పట్టుకొని వెళ్ళు’ అని అన్నాడు” అని సమాధానం చెప్పాడు.
12 వాళ్ళు, “నీ చాప తీసుకొని నడవమన్న వాడెవడు?” అని అడిగారు.
13 ప్రజల గుంపు ఉండటంవల్ల యేసు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కనుక తనకు నయం చేసిన వాడెవరో అతడు చూపలేక పోయాడు.
14 ఆ తర్వాత యేసు అతణ్ణి మందిరంలో కలుసుకొని, “చూడు! నీవు తిరిగి ఆరోగ్యవంతుడవు అయ్యావు. పాపాలు చెయ్యటం మానేయి. లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కీడు సంభవించవచ్చు!” అని అన్నాడు.
15 ఆ తర్వాత వాడు వెళ్ళి, తనకు నయం చేసిన వ్యక్తి యేసు అని చెప్పాడు.
16 యేసు విశ్రాంతి రోజున యివన్నీ చెశాడని తెలియటం వల్ల యూదులు ఆయన్ని పీడించటం మొదలు పెట్టారు. 17 యేసు వాళ్ళతో, “నా తండ్రి అన్ని వేళలా పని చేస్తాడు. అందువల్ల నేనుకూడా పని చేస్తున్నాను” అని సమాధానం చెప్పాడు.
18 ఈ కారణంగా యూదులాయన్ని చంపటానికి యింకా గట్టిగా ప్రయత్నించారు. వాళ్ళు, “అతడు విశ్రాంతి రోజును పాటించక పోవటమే కాకుండా, దేవుడు తన తండ్రి అని కూడా అంటున్నాడు. అలా చేసి తనను దేవునితో సమానం చేసుకొంటున్నాడు” అని అన్నారు.
© 1997 Bible League International